AADIVAVRAM - Others

రామాయణం - మీరే డిటెక్టివ్ 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్నాడు ఉదయం ఓ పడవలో రామలక్ష్మణులు, విశ్వామిత్రుడితో కలిసి సరయూ నదిని దాటారు. అకస్మాత్తుగా వారికి నది మధ్యలోంచి పెద్ద నీటి శబ్దం వినిపించడంతో రాముడు దాని గురించి విశ్వామిత్రుడ్ని అడిగాడు.
‘రామా! బ్రహ్మదేవుడు పూర్వం కైలాస పర్వతం మీద ఓ సరస్సుని సృష్టించాడు. మనోసంకల్పంతో ఏర్పడ్డ దానికి మానస సరోవరం అనే పేరు వచ్చింది. ఆ సరస్సు నించే పుట్టిన సరయూ నది అయోధ్య చుట్టూ ఉంది. అది గంగలో ప్రవేశించే శబ్దానే్న మీరు విన్నది’ ఆ ముని చెప్పాడు.
వారిద్దరూ ఆ నదికి భక్తితో నమస్కరించారు.
పడవలోంచి ఉత్తర తీరంలో దిగాక పెద్దపులులు, సింహాలు, ఏనుగులు, అడవి పందులు, వివిధ పక్షులు గల భయం కలిగించే ఓ అడవిని దూరం నించి చూశారు. విశ్వామిత్రుడు ఆ అడవి చరిత్రని వివరించాడు.
‘రామా! పూర్వం ఈ ప్రాంతంలో దేవతలు మలదము, కరూశము అనే రెండు దేశాలని స్థాపించారు. అంతకు పూర్వం మహాకాయుడు అనే రాక్షసుడ్ని చంపడంతో ఆవహించిన బ్రహ్మ హత్యాపాపం ఇంద్రుడ్ని ఆకలి, అశుభ్రతలతో పీడించసాగింది. దేవతలు, మహర్షులు మంత్రించిన నీటితో ఇంద్రుడికి స్నానం చేయించి ఆ పాపాన్ని పోగొట్టారు. ఇంద్రుడిని పీడించిన ఆ ఆకలి, అశుభ్రతలు బయటకి రాగానే వాటిని ఈ ప్రదేశానికి ఇచ్చేశారు. అవే మలదము, కరూశ దేశాలు. చాలాకాలం ఆ దేశాలు ధనధాన్యాలతో సమృద్ధిగా ఉన్నాయి. కొంతకాలానికి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగల, పది వేల ఏనుగుల బలం గల తాటక అనే యక్షిణి ఇక్కడికి వచ్చింది. ఆమె ఈ దేశ పౌరులని పీడించి నాశనం చేసి చివరకి ఈ రెండు దేశాలని నశింపజేసింది. ఆ దేశాలు పాడుబడటంతో ఈ ప్రాంతమంతా పెద్ద అడవిగా మారింది. దీనికి తాటక వనం అని పేరు. తన వనంలోకి ఎవరూ రాకుండా ఆమె ఒకటిన్నర ఆమడల దూరంలో మార్గమధ్యంలో నివసిస్తోంది. ఎవరూ దీంట్లోకి వెళ్లరు. నువ్వు ఆ దుర్మార్గురాలిని చంపు’
‘యక్షులకి అంత పరాక్రమం ఉండదు అని విన్నాను. మరి ఈ తాటక యక్షిణికి అంత బలం ఎలా వచ్చింది?’ రాముడు సందేహంగా ప్రశ్నించాడు.
‘ఆమెకి వరదానం వల్ల ఆ బలం వచ్చింది. ఆ వివరాలు చెప్తాను విను. పూర్వం సంతానం లేని సుకేతుడు అనే యక్షుడు సంతానం కోసం శివుడి గురించి గొప్ప తపస్సు చేసి, ఆయన్ని మెప్పించి తాటకని కన్నాడు. ఆమె పెద్దయ్యాక బర్జుడి కొడుకు సుందుడికి భార్య అయింది. వారికి మారీచుడు అనే కొడుకు పుట్టాడు. శాపంతో మారీచుడు రాక్షసుడిగా మారాడు. అగస్త్య మహర్షి తాటక భర్త సుందుని శాపంతో చంపాడు. వెంటనే తాటక, మారీచులు ఆయన్ని తినాలని వికృత రూపంతో వస్తే, ‘రాక్షసివై మనుషులని తింటూ జీవించు’ అని ఆయన వారిని శపించాడు. ఆ తర్వాత ఆమె ఈ రెండు దేశాలని నాశనం చేసింది. ఆమెని చంపు. ఆడదాన్ని చంపకూడదని అనుకోకు. ప్రజాహితం కోసం రాజకుమారుడు నాలుగు కులాల్లోని ఎవర్నయినా చంపచ్చు. రాజు ప్రజా రక్షణకి పాపమైనా, కాకపోయినా, క్రూరమైన పనైనా సరే చెయ్యాల్సిందే. బ్రాహ్మణులని రక్షించడానికి అధర్మపరురాలైన తాటకని చంపు. పూర్వం విరోచనుడి కూతురు కుసుమాలి భూమాతని చంపాలని అనుకున్నప్పుడు దేవేంద్రుడు ఆమెని చంపాడు కదా? విష్ణువు కూడా ఇంద్రుడి నాశనం కోసం తీవ్ర తపస్సు చేసే భృగమహర్షి భార్య. శుక్రాచార్యుడి తల్లిని చంపాడు. ఇలా చాలామంది ఉన్నతమైన పురుషులు అధర్మపరులైన స్ర్తిలని చంపారు’
‘నా తండ్రి మీరు చెప్పింది చేయమని నన్ను ఆజ్ఞాపించారు. ఆయన చెప్పినట్లుగా, ప్రజాహితం కోసం నేను తాటకని చంపుతాను’
రాముడు చెప్పి అడవిలోని క్రూరమృగాలన్నీ భయపడేలా బాణం వింటిని లాగి పెద్ద టంకార శబ్దం చేశాడు. వెంటనే పిరికివాళ్లు చూస్తే గుండె ఆగిపోయే భయంకర రూపం గల తాటక ఉగ్రంగా రామలక్ష్మణుల దగ్గరికి వచ్చింది.
ఆమెని అన్నదమ్ములు ఇద్దరూ బాణాలతో ఎదుర్కొన్నారు. ఆమె తన మీదకి రాళ్ల వానని కురిపిస్తూంటే రాముడు శబ్దవేది (శబ్దం చేసే వ్యక్తి కనపడకపోయినా శబ్దాన్నిబట్టి బాణంతో ఆ వ్యక్తిని కొట్టే) అనే విలువిద్యతో తాటకని నిలువరించాడు. తన బాణాలతో ఆమె రెండు చేతులని ఖండించాడు. లక్ష్మణుడు కూడా తమ మీద మాయా విద్యని ప్రదర్శించే ఆమె ముక్కు చెవులని కత్తితో కోశాడు.
‘రామా! సంధ్యాకాలంలో దీని మాయాశక్తి పెరుగుతుంది. ఆమె స్ర్తి అని ఉపేక్షించద్దు’ విశ్వామిత్రుడు హెచ్చరించాడు.
రాముడు గర్జిస్తూ తన మీదకి వచ్చిన తాటక వక్షస్థలం మీద బాణాలతో కొట్టాడు. తాటక మరణించడంతో ఇంద్రుడు, ఇతర దేవతలు సంతోషించి, రాముడికి అస్తవ్రిద్యని ఉపదేశించమని విశ్వామిత్రుడ్ని కోరారు. తాటక సంహారంతో విశ్వామిత్రుడు సంతోషించాడు. ఆ వనానికి కూడా ఆ రోజే శాపవిముక్తి కలిగింది.
ఆ రాత్రి వారు తాటక వనంలో నిద్రించారు. మర్నాడు ఉదయం విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి తీసుకెళ్లడానికి అన్నదమ్ములు ఇద్దర్నీ నిద్ర లేపాడు. (సర్గ 24-26)
ఆశే్లష హరికథ విన్నాక బస్‌స్టాప్‌కి చేరుకునేసరికి అక్కడ తన తల్లి కనిపించింది. ఎప్పటిలా ఆవిడకి తను విన్న కథని చెప్పాడు. పక్కనే ఉన్న ఓ సాధువు నవ్వి చెప్పాడు.
‘ఈ వయసులో నువ్వు రామాయణ హరికథకి వెళ్లడం నీ కుటుంబ ఉత్తమ సంస్కారాన్ని తెలియజేస్తోంది. కాని బాబూ! నువ్వు చెప్పిన కథలో ఏడు తప్పులు ఉన్నాయి. అవేవిటో చెప్తా విను’
అవి ఏమిటో మీరు కనుక్కోగలరా?

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.వశిష్ఠుడి అనుమతితో పంపమన్నాడు కాని సుమంత్రుడి అనుమతితో కాదు.
2.విశ్వామిత్రుడు పంపమని అడిగింది పదహారేళ్ల రాముడ్ని కాని పదిహేనేళ్ల రాముడ్ని కాదు.
3.సుప్రభ కన్నది ఏభై మంది కూతుళ్లని కాదు. కొడుకులనే.
4.వారు చేరుకుంది సింధూ నదీ తీరానికి కాదు. సరయూ నదీ తీరానికి చేరుకున్నారు.
5.సింధూ, గంగానదుల సంగమం కాదు. సరయు, గంగానది సంగమం.
6.ఆ ఋషులంతా శివుడి శిష్యుల పరంపర. విష్ణువు శిష్యుల పరంపర కాదు.
7.వంగ దేశం కాదు. అంగదేశం అనే పేరు వచ్చింది.

గత వారం మీ ప్రశ్నకి జవాబు
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో.

మీకో ప్రశ్న
శ్రీమద్రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి?

-మల్లాది వెంకట కృష్ణమూర్తి