Others

‘వ’కార పంచకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంఘజీవి మానవుడు. సమాజంలో తాను గౌరవం పొందాలనుకోవడం, తాను ఆధిక్యునిగా ఉండాలనుకోవడం చాలా సహజం. ఇలా గౌరవం పొందాలనుకుంటే కొన్ని లక్షణాలను అలవర్చుకోవాలి. వాటిని చూద్దాం.
‘వస్త్రేణ వపుషా, వాచా, విద్యయా, వినయేనచ
వకారైః పంచనిర్హీనో నరో నాయాతి గౌరవమ్
వస్త్రం, వపువు అంటే శరీరం, వాక్కు, విద్య వినయం.. ఈ ఐదు వకారాలు సమపాళ్లల్లో ఉంటే తప్ప లోకంలో వ్యక్తులకు గౌరవం లభించదని ఆరోక్తి. ఇది అన్ని కాలాల్లో, అన్నీ ప్రాంతాలలోఅందరి మానవులకూ వర్తించే సార్వత్రిక సత్యం. ఒక్కొక్క అంశాన్ని పరిశీలిద్దాం. మొదటిది వస్త్రం: దేహానికి అందాన్నిచ్చేది అచ్చాదన వస్త్రం. ఆడంబరమైన దుస్తులు డాంభికతను సూచిస్తాయి. ఉన్నంతలో తగిన శుభ్ర వస్తధ్రారణ వ్యక్తి సంస్కారానికి తెలుపుతాయి. మురికి బట్టలు వ్యక్తి సోమరితనాన్ని, సంస్కార హీనతను సూచిస్తాయి. అందుకే ఆంగ్ల నాటక రచయిత షేక్స్పియర్ తన హామ్లెట్ నాటకంలో ఒక పాత్రతో అప్పెరల్ ఆఫెన్ ప్రొక్లెయిమ్స్ ద మ్యాన్ అని అనిపిస్తారు.
జగత్తు అంతా ఒక వస్తమ్రట. వక్తిత్వములే ఇందలి తంతువులట. ఈ తంతువుల చిత్ర విచిత్ర విన్యాస రూపమైన ఈ జగత్పటమును ధరించిన ఆ జగదీశుని స్తుతి రూపమైన శ్లోకం
సంస్మరణీయం సూక్ష్మాయ శుచయే
తస్మైనమో వాక్తత్త్వ తంతవే
విచిత్రో యస్య విన్యాసో విదధాతి జగత్పటమ్
మనం మన దుస్తులను ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో లోకసంరక్షకుడైన భగవంతుని వస్తమ్రైన ఆయన సృష్టిని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచాలి. శుభ్ర వస్తధ్రారణ వలన మనిషి ఆరోగ్యం , మానసిక ఉల్లాసం, చురుకుదనం పెరిగి, సమాజంలో వ్యక్తికి గౌరవం కలుతుంది. అయితే కేవలం మంచి దుస్తులు ధరించినంతనే లోకంలో గౌరవం కలుగుతుంది. అనుకోవడం పొరబాటు. వస్త్రంతో బాటు రెండవ వ కారం పట్ల కూడా శ్రద్ధ వహించాలి.
అది ఏమిటంటే ‘వ’పువు అనగా శరీరం. మనిషి తన దేహాన్ని కూడా శుభ్రంగా, ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవాలి. మురికి దుస్తులతో మలిన దేహాంతో ఉన్న వానిని అతని భార్య కూడా అసహ్యించుకుంటుంది.
తలమాసిన నొలుమాసిన
వలువలు మాసినను ప్రాణ వల్లభునైనన్
కుల కాంతలైన రోతురు
తిలకింపగ భూమిలోన తిరముగ సుమతీ॥
తన కట్టు జుట్టు, దేహాన్ని శుభ్రంగా ఉంచుకోలేకపోవడం సోమరితనానికి పరాకాష్ఠ. సోమరి ఒళ్లు వంచి పనిచేయడు. పని చేయకుంటే ధనం లభించదు. డబ్బులేనివాడు దుడ్డుకు కూడా కొరగాడని సామెత. అందుకే దుస్తులు, దేహము, గౌరవ హేతువులు. అయితే కేవలం మంచి దుస్తులు, అందమైన శుభ్రమైన దేహం మాత్రం ఉంటే సరిపోదు
దీనికి తోడు ముఖ్యమైనది అందరికీ ఉండవలసింది 3వ వకారం అదే వాక్కు మాట్లాడే మాట , దాని తీరుకూడా గౌరవ కారణం అవుతుంది. దూరత శ్శోభతే మూర్ఖో లంబ శాట పటావృతః తావచ్చశోభతే మూర్ఖో భూవత్కించిన్నభాషతే చక్కని వస్త్రా ద్యలంకారాలతో శోభించు మూర్ఖుని శోభ వాడు నోరు విప్పనంత వరకే అని పెద్దల మాట.
సంస్కారహీనంగా మాట్లాడే వానికి సంఘంలో గౌరవముండదు. మనిషికి అసలైన ఆభరణం వాక్కేనంటాడు భర్తృహరి.
చెలిమియు, పగయును... స్నేహం మైనా, వైరమైనా, దుర్మార్గమైనా, మాటలవలనే కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త తీసుకొని మాట్లాడాలి.
ఎలా మాట్లాడాలి అంటే ఎదిరికి హితమును ప్రియమును మదికింపుగా పలుకుమాటలు పెక్కై /యొదవినను లెస్స యటుగా/ కిది యది యన కూనికి యెంతయు నొప్పున్
ఎదుటివారికి మేలు కలిగించేటట్లు సంతోషం కలిగేటట్లు మనోహరంగా మాట్లాడే మాటలు ఎన్ని పలికినా మేలే. ఎదుటివారికి కష్టం కలిగించే మాటలు మాత్రం పలుకకూడదని మహాభారతం చెబుతుంది. అనవసరంగా మాట్లాడి వాక్శక్తిని వృథాచేసుకోవద్దంటాయి వేదాలు.
వాక్కును తపస్సులగా సాధించాలంటుంది భగవద్గీత.
నాలుగవ వకారం విద్య. మనిషికి విద్యవలన మంచి గుర్తింపు గౌరవం లభిస్తాయంటాయి శాస్త్రాలు.
కురూపం వా , నిర్ధనంవా, జీర్ణం వా,జీరణ వాసనమ్
సురూపం కురుతే తం హివిద్యా ప్రజ్ఞా గుణైర్యుతా
ఇతర విషయాలెలా ఉన్నా విద్య అనే ఒక్క అలంకారం. దానికి ప్రజ్ఞ సుగుణముల మేళవింపు ఉంటే ఆ వ్యక్తి గౌరవం పొందుతాడు. సర్వత్రా పూజనీయుడు విద్వాంసుడే ఒక్కడే. విద్యలేనివాడు, వింతపశువంటాడు భర్తృహరి. విద్యాధనం ఉంటే ఇతర సంపదలతో పనిలేని ధీమాను వ్యక్తపరుస్తాడు విద్యాసంపన్నుడు.
ఐదవ వకారం వినయం. వాక్కు వలె వినయం అందరికీ ఉండవలసిన వకారం. విద్యవలన శ్రమలేకుండా అలవడే సంస్కారం వినయం. కానీ కొందరికి ఇది అలవడదు. వారు మణి ఉన్న పాముతో సమానమని శతకాకారులంటారు. వినయంతోనే ఎంత పెద్దవాళ్లనైనా ఒప్పించవచ్చు. వారి ఆశీస్సులు పొందుతారు.
ఫలవంతములైన చెట్లు, సద్గుణ వంతులైన మానవులు, నమ్రులై వంగి ఒదిగి ఉంటారు. ఎండిన కట్టెలు, మూర్ఖులు వంచబడరు. సరికదావంచాలని ప్రయత్నిస్తే కర్రలు విరుగుతాయి. మూర్ఖులు మరింతగా పెట్రేగుతారు.
వస్త్ర , శరీర , వాక్కు,జ్ఞాన మనస్సుల శుద్ధితో పాటు వాసశుద్ధి అంటే పరిసరాల శుభ్రత మనం అలవర్చుకుని మానవ లోకానికి దివ్యలోకంగా మార్చుకుందాం,.

- గొల్లాపిన్ని సీతారామ శాస్ర్తీ 9440781236