Others

అభినవ బుద్ధుడు ‘సంత్ గాడ్గేబాబా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాడ్గేబాబా అసలు పేరు దేవీదాస్ దేబూజీ. ఆయన 1876 ఫిబ్రవరి 23న మహారాష్టల్రోని అమరావతి జిల్లాకు చెందిన అంజన్గావ్ తాలూకాకు చెందిన షేన్గావ్ గ్రామంలోని రజక కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జింగ్రాజీ, సక్కుబాయిలు. వారు రజక కులంలో జన్మించినా తండ్రి తాతల కాలంనుంచే ఉన్న భూమిని సాగుచేసుకుంటూ జీవించేవారు. తండ్రి దేబూజీ చిన్నతనంలోనే మద్యపానానికి బానిసై మరణించడంతో దేబూజీ మేనమామ ఇంట్లో ఆశ్రయం పొందారు. మేనమామ కూడా మంచి భూవసతి కలిగినవాడు కావడంతో దేబూజీ ఆయన పశువుల్ని చూసుకుంటూ, పొలం పనులుచేస్తూ కుటుంబంలో మంచిపేరు తెచ్చుకున్నారు. చిన్నతనంనుంచీ భజన మండళ్ళలో కీర్తనలు, పాటలు పాడుతూ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ప్రఖ్యాతి పొందారు. ఆయన సన్యాసాశ్రమ పూర్వపు జీవితంలో ఒక ముఖ్యమైన ఘటన జరిగింది. షావుకారు తన ఆస్తిని అన్యాయంగా ఆక్రమించుకోబోగా దానిని సహించలేక ఎదురు తిరిగారు. షావుకారు గూండాలను పంపితే దేబూజీ అక్కడే వారందరినీ తన్ని తరిమేశారు. దేబూజీ తన 29వ ఏట ఫిబ్రవరి 5, 1904న కుటుంబాన్ని అర్థరాత్రివేళ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆయనకు తల్లి, తాత, భార్య, పిల్లలు ఉన్నారు. అప్పటికే ఆయన ఇద్దరు బిడ్డల తండ్రి కావడంతోపాటుగా భార్య గర్భవతిగా ఉంది. అనంతర కాలంలో ఆయన సన్యాసం స్వీకరించి, గాడ్గేబాబాగా సుప్రసిద్ధులయ్యారు. తర్వాతి కాలంలో ఆయన కుటుంబం అనుసరించగా వారు ఎప్పటిలాగానే సామాన్యమైన పూరిల్లులో జీవించారు. దేబూజీ సన్యాసాశ్రమాన్ని స్వీకరించాక రంగురంగుల పీలికలను కలిపికట్టుకునేవారు. ఆయన భిక్షను స్వీకరించే మట్టిపాత్ర (మరాఠీలో గాడ్గే) తలపై పెట్టుకుని తిరుగుతూండడంతో ఆయనను గాడ్గే బాబాగానూ, గాడ్గే మహరాజ్‌గానూ పిలిచేవారు. గ్రామాల్లో సంచరిస్తూ భిక్షను స్వీకరించడమేకాక వారికి స్వయంగా రచించిన కీర్తనలను ఆలపిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక సాంఘిక విషయాల పట్ల చైతన్యం రేకెత్తించేవారు. గాడ్గేబాబా ఆధ్యాత్మిక విషయాలను బోధించడంతోపాటుగా సాంఘిక సమస్యల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం, సేవాకార్యక్రమాలు చేపట్టడం వంటివి చేసేవారు. ఆకలితో వున్నవారికి ఆహారం, దాహంతో అలమటిస్తున్న వారికి నీరు, దుస్తులు లేనివారికి వస్త్రాలు, పేదలకు నాణ్యమైన విద్య, రోగులకు వైద్యం, తల దాచుకునేందుకు నివాసం, జంతువులకు రక్షణ, నిరుద్యోగులకు ఉపాధి, నిస్సహాయులకు ఆలంబన, పేద యువతీయువకులకు వివాహం జరగాలని ఆశించి, అందుకోసం జీవితమంతా కృషిచేశారు. భక్తులను ప్రోత్సహించి, వారి విరాళాలతో మహారాష్ట్ర వ్యాప్తంగా 150 పాఠశాలలు, ధర్మశాలలు, శరణాలయాలు, గోశాలలు, ఆస్పత్రులు, విద్యార్థినుల వసతి గృహాలు నిర్మించారు. వందలాది సేవాసంస్థలను, ట్రస్టులను నిర్మించిన బాబా తన కుటుంబ సభ్యులను, బంధువులను ఆయా ట్రస్టుల్లోని పదవుల్లో నియమించకుండా సేవాభిలాష ఉన్న సహచరులనే ఎంపిక చేసి నియమించడం విశేషం. సంచార సన్యాసిగా ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలోని మురికిని, చెత్తను చీపురుతో శుభ్రపరిచేవారు. ఆయన పరిశుభ్రతకే తన జీవితాన్ని అంకితంచేసిన వ్యక్తిగా పేరుపొందారు. తన భక్తులకు పరిశుభ్రత ద్వారానే భగవత్సేవ చేయమని ప్రబోధం చేసేవారు. కొనే్నళ్లు గడిచాకా గ్రామగ్రామాలలో అపరిశుభ్రతను రూపుమాపి, శుభ్రపరిచేందుకు చీపురు దండును నెలకొల్పాడు. బాబా స్థాపించిన చీపురుదండులో కృషిచేసిన వారిలో ఎందరో తదనంతర కాలంలో రచయితలుగా, పత్రికా సంపాదకులుగా, రాజకీయ నాయకులుగా ఎదిగి ఆయన భావజాలానికి ప్రత్యక్ష పరోక్షవ్యాప్తిని కల్పించారు. గాడ్గేబాబా గాంధీజీ సేవాశ్రమానికి దగ్గరలోని వార్ధాకు విచ్చేసిన సమయంలో వారిని తన ఆశ్రమానికి ఆహ్వానించి కలిశారు. గాంధీజీని కలిసినప్పుడు వారిద్దరూ సమాజంలోని అవిద్యను, అంటరానితనాన్ని, దుర్వ్ససనాలను రూపుమాపడం వంటి విషయాలపై చర్చించారు. అలాగే అప్పటికే గాడ్గేబాబా ఆయా విషయాలలో చేసిన విశేషమైన కృషిని తెలుసుకున్న గాంధీ వారిని మెచ్చుకున్నారు. 1956 డిసెంబర్ 20న అమరావతి వెళుతుండగా పేధీ నదీ తీరాన వలగాన్ దగ్గర తనువు చాలించారు. మహారాష్టల్రోని అమరావతిలో ఆయన పేరుమీదుగా మే 1, 1983న సంత్ గాడ్గేబాబా అమరావతి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. 1999లో భారత ప్రభుత్వం గాడ్గేబాబా గౌరవార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. 2001లో వాజపేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా గ్రామస్థాయి పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు సంత్ గాడ్గేబాబా అండ్ గ్రామ్ స్వచ్ఛతా అభియాన్ పేరిట పథకాన్ని తయారుచేసి అమలుపరిచింది.

- వాసిలి సురేష్, 9494615360