Others

ప్లాస్టిక్.. భౌగోళిక సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాలలో కుప్పలుకుప్పలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు నేడు ‘‘్భగోళిక సంక్షోభం’’గా పరిగణింపబడుతోంది. ఈ సంక్షోభం భౌగోళిక వాతావరణంపై, వివిధ పనితీరుపై అవాంఛనీయ ప్రభావాన్ని చూపబోతోందని పర్యావరణ శాస్తవ్రేత్తలు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముంబయి పశ్చిమ తీరాన వెర్సోవా బీచ్ ఉంది. ఒకప్పుడు ముంబాయిలోని ప్లాస్టిక్ చెత్తంతా అక్కడే తాండవిస్తుండేది. మితిమీరిన కాలుష్యంవల్ల కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఏ జీవజాలమూ సంచరించలేదు. ఇటీవలి కాలంలో ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసాక పిల్ల తాబేళ్ళు కొన్ని తిరుగాడటం మొదలయ్యింది.
‘చాలా ఏళ్ళ తరువాత వెర్నోవా బీచ్‌లో పిల్ల తాబేళ్ళు తిరుగాడటం చూశాక ఆనందంతో, భావోద్వేగంతో నా కళ్ళు చెమర్చాయి. ఇక్కడి మురికివాడలలో 55వేల మంది తమ నివాసాలను ఏర్పరచుకుని ఉంటున్నారు. ఇక్కడ 12వేల టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాం. ఈ కార్యక్రమంలో వెయ్యి మంది స్వచ్ఛందంగా పాల్గొని తమ సహకారాన్ని అందించారు’ అని అప్రోజ్‌షా అంటారు. ఈయన న్యాయవాది, పర్యావరణ ఉద్యమకారుడు. వెర్సోవా బీచ్ శుభ్రం చేసే కార్యానికి శ్రీకారం చుట్టింది ఈయనే. ఈయన చేపట్టిన కార్యాన్ని ‘‘ప్రపంచంలో సాగర తీరాలను శుభ్రం చేసే పెద్ద కార్యక్రమం’’ అని ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ప్రశంసించింది.
ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలలో ఎంతగా ప్లాస్టిక్ చెత్త పేరుకుపోతోందో చెప్పడానికి వెర్సోనా బీచ్ ఒక ఉదాహరణ మాత్రమే. భూగోళంపై సముద్ర తీరాలలో, సముద్రాలలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ కాలుష్యం ఎవరో కొద్దిమంది స్వచ్ఛంద కార్యకర్తలవల్ల పరిష్కారం అయ్యే సమస్య కాదు. మన కళ్ళకు కనిపించే సముద్ర తీరాలు, సముద్ర ఉపరితలాలలోనే కాదు; సముద్రపుటట్టడుగున కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు టన్నులకొద్దీ పేరుకుపోయాయి. ధ్రువ ప్రాంతాలైన ఆర్కిటిక్, అట్లాంటిక్‌లలో కూడా పెద్దఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. ఇలా పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్త తీర ప్రాంతాల పర్యావరణ వ్యవస్థను శాసిస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా పర్యావరణవేత్తలు, విధాన నిర్ణేతలు, సాధారణ ప్రజలు కూడా ప్లాస్టిక్ కాలుష్యాన్ని గ్లోబల్ సమస్యగా గుర్తిస్తున్నారు.
‘‘ప్లాస్టిక్ కాలుష్యం అన్నది ఒక పెద్ద భౌగోళిక సంక్షోభంగా మారింది. ఈ సంక్షోభాన్ని నివారించే బాధ్యత వివిధ దేశాల ప్రభుత్వాలది మాత్రమే కాదు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్థులు, సాధారణ ప్రజలు కూడా ఈ విషయంలో తమవంతు బాధ్యతను నిర్వర్తించాలి’’ అని లీసా స్వెన్సాన్ అంటారు. ఈమె ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగంలో సముద్రాల అధ్యయన విభాగానికి గ్లోబల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి జూన్ 2017లో ఓషన్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ప్రపంచ మానవాళి యొక్క సర్వాంగీణ శ్రేయోదాయక అభివృద్ధి గురించి ఆ సదస్సులో 17 లక్ష్యాలను నిర్దేశించారు. అందులో 14వ లక్ష్యం (గోల్ 14) సముద్ర గర్భ జీవ పరిరక్షణ గురించినది. నిజానికి నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అసలు సమస్య ప్లాస్టిక్ కాదు. ఆధునిక మానవ జీవితంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం, ప్లాస్టిక్ వ్యర్థాలను విచక్షణా రహితంగా ఎక్కడబడితే అక్కడ డంప్ చేయడం పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ వ్యర్థాలు జంతువులు, పక్షుల గర్భాలలోకి చేరడం మాత్రమే మనకి తెలుసు. వీటి ఆందోళనకర పర్యవసానాల గురించి కూడా శాస్తవ్రేత్తలు మనల్ని హెచ్చరిస్తున్నారు. కానీ వీటన్నింటికీ మించిన పెను ఉపద్రవం భవిష్యత్తులో ముంచుకురానున్నది.
భూమి, భూమిపైన గల వివిధ పర్యావరణ వ్యవస్థల పనితీరును ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు నిర్దేశించనున్నాయా? స్టాక్ హోమ్ రెజిలియెన్స్ సెంటర్ (స్టాక్ హోమ్ యూనివర్సిటీ, పబ్లిషర్ ఆఫ్ రీథింక్), ఐక్యరాజ్యసమితి పర్యావరణం విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్న గ్లోబల్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ డాటాబేస్ (నార్వే)లకు చెందిన శాస్తవ్రేత్తలు ప్లాస్టిక్ వ్యర్థాల నుండి వెలువడే వివిధ రసాయనాలు వివిధ భౌగోళిక వ్యవస్థల పరిథులకు లోబడే ప్రభావాన్ని చూపుతున్నాయా లేక ఆ పరిథులను అతిక్రమించి ఆ రసాయనాలు తమ విష ప్రభావాన్ని చూపనున్నాయా అన్న విషయంపై పరిశోధనలు చేస్తున్నారు.
అసలు ప్లాస్టిక్‌తో వచ్చిన సమస్యేమిటి?
భౌగోళమంతటా, సాగర జలాల ఉపరితలాలలో, సాగరగర్భంలో కూడా ఎక్కడపడితే అక్కడ చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వివిధ రకాల వస్తువుల వినియోగంవల్ల వెలువడిన వ్యర్థాలే. ఇవన్నీ సముద్ర జలాలలో కరిగిపోవు, సముద్రం అట్టడుగున ఉన్న భూమిలోనూ కలిసిపోవు. ఎనే్నళ్ళయినా అలాగే ఉండిపోతాయి. ప్లాస్టిక్ కాలుష్యంవల్ల దాదాపు 700 జాతుల సముద్ర జీవాలకు ముప్పు వాటిల్లనున్నదని ప్లైవౌత్ యూనివర్సిటీ (ఇంగ్లాండ్) చెందిన పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ ముప్పు మన కంటికి కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కాక మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలవల్లనే ఎక్కువగా ఉంది. భూమిలో, జలవనరులలో, గాలిలో పేరుకుపోతున్న ఈ మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలను గుర్తించి, తొలగించే సాంకేతిక పరిజ్ఞానం నేడు ప్రపంచంలో లేదు. ప్లాస్టిక్ వ్యర్థాలలో ఉండే బిష్పెనాల్ ఎ, ఫ్తాలెట్స్ వంటి విష రసాయనాలు జలచరాల హార్మోన్ల వ్యవస్థనే దెబ్బతీస్తుంది. ఫలితంగా జల చరాల పునరుత్పత్తి దెబ్బతింటుంది.
అసలెక్కడి నుంచి వస్తోంది ఈ ప్లాస్టిక్?
1950ల నుండి చూసినట్లయితే ప్లాస్టిక్ ఉత్పత్తులు ఏడాదికి 2 లక్షల టన్నుల చొప్పున పెరుగుతూ 2015లో 38 కోట్ల టన్నులకు చేరుకుంది. ఇలా ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 80 లక్షల టన్నులు వ్యర్థాలుగా ప్రతి యేటా డంప్ చేయబడుతోంది. అదనంగా 15 లక్షల టన్నుల మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో ప్రతి యేటా పేరుకున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో కొనసాగుతున్న ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగం, రీసైక్లింగ్ తీరులో పెనుమార్పులు రానట్లయితే 2050 వచ్చేనాటికి అదనంగా 3,300కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిపై డంప్ కానున్నాయి. వీటిలో అధిక శాతం వ్యర్థాలు వివిధ వస్తువుల ప్యాకింగ్‌కోసం ఉపయోగించిన, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులే ఉంటాయి. వీటిలో మహాఅయితే 9 శాతం మాత్రమే రీసైకిల్ అవుతాయి.
ఇప్పటికే చాలా అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్‌కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు తరలిస్తున్నాయి. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యర్థాలను రీసైకిల్ చేయడానికి తగిన వ్యవస్థ లేదు. అందువల్ల ఆ దేశాలు అగ్రరాజ్యాలు తమ దేశాలకు ప్లాస్టిక్ వ్యర్థాలను తరలించకుండా నిషేధం విధిస్తున్నాయి. ఫలితంగా ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్, డంపింగ్ విషయంలో మరింతగా వత్తిడి పెరుగుతోంది.
భూగోళంపై ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంతగా పెరిగిపోతున్నాయో, ఆ వ్యర్థాల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం కూడా అంతగా పెరిగిపోతోంది. ‘‘్భగోళిక వ్యవస్థల పనితీరుపై ప్లాస్టిక్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఆ ప్రభావాన్ని తట్టుకోవడంలో ఆ వ్యవస్థల పరిమితులు ఏమిటి?’’ అన్న విషయంపై పరిశోధకులు దృష్టిసారిస్తున్నారు. ఈ వ్యవస్థల పరిమితులే భౌగోళం యొక్క స్థిరత్వాన్ని నిర్దేశిస్తాయి. వాతావరణంలోని మార్పులు, ఓజోన్ పొర క్షీణత, సముద్ర జలాల ఆలీకరణ మొదలైనవి భౌగోళిక వ్యవస్థల పరిమితులను ప్రభావితం చేస్తాయి. సముద్రాలలో ప్లాస్టిక్ కాలుష్యం గాఢత పెరిగినట్లయితే వివిధ భౌగోళిక వ్యవస్థలు అదుపు తప్పుతాయా? భవిష్యత్తులో భౌగోళిక వ్యవస్థల పరిమితులను నిర్దేశించడంలో ప్లాస్టిక్ కాలుష్యం కీలక పాత్ర వహించనున్నదా? మొదలైన ప్రశ్నలు పరిశోధకులలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
స్టాక్ హోమ్ రెజిలియెన్స్ సెంటర్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్న గ్లోబల్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ డాటాబేస్‌లకు చెందిన తీర ప్రాంత ప్లాస్టిక్ కాలుష్యం భౌగోళిక వ్యవస్థలపై చూపే ప్రభావాన్ని గురించి అధ్యయనం చేసారు. పెద్ద పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ వ్యర్థాల నుండి కంటికి కనబడని మైక్రోప్లాస్టిక్ వ్యర్థాల వరకు పర్యావరణంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ విధమైన ప్రభావం చూపుతాయో, ప్రాంతాల వారీగా, కాలానుగుణంగా ఎలాంటి మార్పులకు కారణవౌతాయోనన్న విషయాలపై వీరు పరిశోధనలు చేసారు.
సముద్ర జలాలలో ఉండే చిన్న చిన్న ప్రాణులు, సముద్రం అడుగున ఉండే మొక్కలు సముద్ర జలాలలోని కార్బన్ శాతాన్ని నియంత్రించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. మైక్రో ప్లాస్టిక్ కాలుష్యంవల్ల ఈ ప్రాణులు, మొక్కల మనుగడ దెబ్బతిని సముద్ర జలాలలో కార్బన్ కాలుష్యం పెరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే భవిష్యత్తులో భౌగోళం మొత్తానికి పెద్ద నష్టమే వాటిల్లుతుంది.
‘‘సాగర తీరాలలోని ప్లాస్టిక్ కాలుష్య సమస్య వివిధ భౌగోళిక వ్యవస్థల పరిమితులను అధిగమించడం సంగతి ఎలా ఉన్నా ఒకటి మాత్రం స్పష్టం. అదేమిటంటే ఇప్పటికే పలు సముద్ర తీరాలలో పెద్దయెత్తున పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచ దేశాలపై చూపే దుష్ప్రభావంపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని సారా కార్నెల్ అంటారు. ఈమె స్టాక్‌హోమ్ రెజిలియెన్స్ సెంటర్‌లో పరిశోధకురాలు.

- ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్, 8008264690