Others

జ్ఞానమే మోక్ష స్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సకల శాస్త్ర నిధి మన సనాతన వాఙ్మయము. మహిమాన్వితమైన యోగవాశిష్ఠమను వశిష్ఠగీత మకుటాయమానమైనది. వాసనాక్షయము నొందని మనసులు ఆత్మయందు లయమవ్వక తిరిగి ఈ సంసార చక్రములో పడి అనేక జన్మలెత్తుట గురించి అద్భుతమైన రీతిలో విశే్లషించిన తీరు విజ్ఞానదాయకం. వశిష్ఠ మహర్షికి మానవావతారుడైన శ్రీరామచంద్రమూర్తికి జరిగిన అత్యద్భుత చర్చయే యోగవాశిష్ఠము.
ఉపశమ ప్రకరణములో మోక్షమును గూర్చి వివరించిన తీరు జ్ఞానదాయకము. మోక్షమనగా మరణానంతరము లభించునది అత్యధికుల భావన. ఆకాశము, పాతాళము, భూతలములోని పర్వతములలో లభించు ఒక వస్తువని భావించువారునూ ఉన్నారు. కానీ మోక్షమనునది జ్ఞానముచే కలుగునని యోగవాశిష్ఠము విశదపరచినది.
ఆహారము, నిద్ర, భయము, మైథునము ఈ సృష్టిలోని ప్రతి జీవికి సహజము. కాని మానవునికి జ్ఞానమను గొప్ప శక్తి కలదు. అందువలననే మానవ జన్మను చూసి దేవగణములే ఈర్ష్యనొందును. పై నాలుగు అల్పకర్మలను పట్టుకొని వ్రేలాడు మానవులు అజ్ఞానులుగానే లోకములో తిరుగాడుచుందురు. ఎవరైతే జ్ఞానమును పొంది మోక్షమునకు ప్రయత్నించుదురో వారు విజ్ఞులు. ఉత్తమమైన జ్ఞానమును పొందినవారు దూదిపింజవలె తమ చిత్తమునుంచుకొని నిర్మలాకారులై నిరంతర సచ్చిదానంద స్వరూపులై ఉందురని వారే మోక్ష స్వరూపులని తెలియజేసినది. మనోబుధ్యహంకార దశలను దాటి చిత్తమున ఎవరు నిలిచియుందురో వారు జ్ఞాన స్వరూపులని, అదియే మోక్షస్థితియని ప్రతిపాదించినది. అరిషడ్వర్గములైన కామక్రోథ లోభ మోహ మద మాత్సర్యములను జయించి, ఏవిధమైన ఆశలులేని శూన్యము కాని శూన్యమైన చిత్తము నిర్మలమై వెలుగొందును. అదియే మోక్షము. కోరికలను జయించిన గౌతమబుద్ధుడు ఆత్మజ్ఞానమును పొందగలిగెను. ఆ జ్ఞానమే మోక్ష స్థితియందు నిలిపినది.
జితేంద్రియములకు మోక్షము అతి సమీపమున ఓలలాడుచుండును. మనోనిగ్రహము కలవారు జన్మ సాఫల్యము నొంది మోక్ష స్థితియందు స్థిరముగా నుండునని వశిష్ఠులు నుడివిరి. మరి ఈ మర్కట సమాన మనసును జయించి జితేంద్రియుడగుట ఎటుల సంభవమను చర్చా మథనమే యోగవాశిష్ఠము. మధించిన ఏనుగును అంకుశముతో జయించునట్లు, శాస్త్ర జ్ఞానమను యుక్తిచే మనస్సును జయించవచ్చునని వశిష్ఠులు శ్రీరామచంద్రునకు బోధించిరి.
ఆధ్యాత్మిక జీవిత సాధన, సాధుజన సాంగత్యము, వాసనాక్షయము ప్రాణాయామము ఈ నాలుగు మనోనిగ్రహమునకు ఉపాయ మార్గములు. ప్రతి మనిషికి తనకు తెలియకుండగనే అనేక చిత్రాతి చిత్రమైన కోరికలు కలుగుచుండును. అవి ప్రారబ్దవశమున కలుగు గత జన్మ వాసనలని తెలిసికొనవలెను. అసలు మనసనగ ఆవాసనలు, సంస్కారములు, సంకల్ప వికల్పములు మొదలైనవి ఒక చోట చేరి ఏర్పడిన పదార్థము. పంచప్రాణములు ఉన్నంతవరకే ఈ పదార్థము మనుగడ సాగించును. అనేక సూక్ష్మజల బిందువుల సమూహమే మేఘము. అది స్థిరముగా నుండక అనేక రూపములు సంతరించుకొన్నట్లు మనసు కూడా చంచలమై అనేక రూపములను భావించుకొనును. జన్మాంతర వాసనలు మనస్సునందు ఒక ప్రత్యేక జ్ఞాపికలై తృప్తినొందుటకు ప్రయత్నించుచుండును.
అనేక జన్మలనుండి పునరావృతమగు వాసనల వలన మనోనాశనము జన్మరాహిత్యత కలగక మోక్షమునకు జీవుడు ఆమడదూరములో నుండును. వాసనాక్షయము, సంకల్ప వికల్ప రాహిత్యము వలన మనోనాశనము కలిగి ఆత్మస్థితుడై జ్ఞానముదయించి మోక్షమును పొందును. మోక్షమనునది ఒక స్థితి. అనేక వేల సంవత్సరములు తపస్సు చేసిననూ, త్రిమూర్తులు స్వయముగా బోధించిననూ, ఊర్థ్వ అధో లోకములు తిరిగిననూ మోక్షమును పొందలేరు. సంకల్ప క్షయమును పొందినగాని మోక్షస్థితి కలుగదని వశిష్ఠగీత తెలియజేస్తోంది.
అనేక జన్మల యందలి కోరికలు, అలవాట్లు, అభ్యాసములు, సంస్కారములు ఒకదానికొకటి చేరి వాసనా గొలుసుగా నేర్పడి ఈ జనన మరణ చక్రములో జీవుని త్రిప్పుచుండును. ఇది అత్యంత దుఃఖదాయకము. వాసనలన్నియూ పదార్థమును అంటియుండును. మానవుని భ్రమకు ఈ వాసనలే కారణము. వాసనలకు వశీభూతుడైన జీవుడు భయము, దీనముతో సంసారమున పడి కొట్టుకొనును. కావున వాసనాక్షయమే మోక్షస్థితి.
గురువాక్యమే శిరోధార్యమై నిలుపుకొన్న శ్రీరామచంద్రుడు తన జీవితమంతయూ వాసనలను త్యజించి ధర్మమనే ఆత్మజ్ఞానమును మనకు అందించినాడు. పట్ట్భాషిక్తుడగు క్షణమున సింహాసనమును త్యజించినాడు. ప్రజల మాటయే తనమాటగా అనేక ఇక్కట్లు అనుభవించినాడు. సుఖములు త్యజించి ప్రజారంజనయే పరమావధిగా భావించినాడు. ధర్మమనే వాసనాక్షయమునకు ప్రతీకగా మోక్షప్రదాతయై నిలిచిన శ్రీరామచంద్రుని సేవించినవారికి మోక్షస్థితి కలుగుననుటలో సందేహమేమున్నది.

-వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు