Others

భారీకాయంతో బాల్యంలోనే ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం మన దేశంలో భారీకాయులు ఎక్కువవుతున్నారని వైద్య నిపుణుల చెబుతున్నారు. గణాంకాల ప్రకారం కోటి నలభై లక్షలమందికి బాల్యంలోనే భారీకాయం వుందని అంచనా. ఈ చిన్నారులు కొద్ది సంవత్సరాల్లో యువతగా రూపాంతరం చెందుతారు. అపుడు ఎక్కువమంది యువకులు భారీకాయులై ఉంటారనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికే భారతదేశంలో షుగర్ వ్యాధితో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతుంది. ఇపుడు భారీకాయులుగా వున్న బాల బాలికలు యవ్వనంలోకి అడుగుపెడుతూనే డయాబెటిస్‌కి గురయ్యే ప్రమాదం వుంది. ఇదే పరిస్థితి కొనసాగితే మన దేశం అనారోగ్య దేశమవుతుంది. యువత అనారోగ్యంతో కూడినదైతే ఏం ప్రయోజనం. కాబట్టి బాల్యంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది.
ఆరోగ్యంతో హుషారుగా వ్యవహరిస్తూ చక్కని రూపంగల పిల్లల్ని చూస్తే ముద్దొస్తుంటుంది. కొంతమంది పిల్లలు బొద్దుగా కనిపిస్తారు. అలాంటి పిల్లల్ని చూసి తల్లిదండ్రులు సంతోషపడుతుంటారు. అయితే బొద్దుగా వుండటానికి, భారీకాయం అనిపించుకోవటానికి మధ్యనున్న తేడా తల్లిదండ్రులకు తెలియదు. వయసు, ఎత్తు పరిగణలోకి తీసుకుని ఇంత బరువు వుండాలని ఒక పట్టిక వైద్య బృందం తయారుచేసింది. ఆ పరిమితిని దాటివుంటే ఓవర్‌వెయిట్ అంటారు. అలా కాకుండా అధికంగా కొవ్వు మాత్రమే పెరిగిపోయి, శరీర రూపం వికారంగా తయారైనవారిని భారీకాయులు అంటారు. బొద్దుగా వుండటానికి, బూదరవొళ్ళు రావటానికి వున్న తేడా ఇది.
తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు తక్కువగా, క్యాలరీలు అధికంగా వున్నప్పుడు, శారీరక శ్రమ లేనప్పుడు శరీరంలోకి అదనంగా చేరిన క్యాలరీలు కొవ్వులుగా పొట్ట దగ్గర ముందుగా పేరుకుంటాయి. క్రమంగా శరీరమంతా వ్యాప్తి చెంది భారీకాయంగా మారుతుంది. ప్రస్తుతం చిన్నారుల్లో కనిపిస్తున్న ఇబ్బంది ఇదే.
భారీకాయపు పిల్లల్లో తక్షణం కనిపించే ఇబ్బందులు కొన్నయితే, దీర్ఘకాలంలో తలెత్తే ఇబ్బందులు మరికొన్ని. చిన్నతనంలోనే భారీకాయం వచ్చిందంటే, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బాల్యదశలోనే అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొనే దుస్థితి వస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం వుంది. ఈ దశలో రక్తంలో చక్కెరల స్థాయి అధికంగా వుండి డయాబెటిక్‌కి గురయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇంకా కీళ్ళ ఇబ్బందులు, సరిగా నిద్రలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బాల్యంలో భారీకాయంలో వున్నవారు పెద్దయిన తర్వాత సన్నబడే అవకాశం బాగా తక్కువ. యవ్వనంలోకి ప్రవేశించిన తర్వాత కూడా భారీకాయం నిలిచివుంటే గుండె జబ్బు, డయాబెటిస్, పక్షవాతం, ఎముకల బలహీనత లాంటివి వస్తాయి.
భారీకాయంవలన అనేక ఇతర రోగాలు వచ్చే అవకాశం వుంటుందంటున్నారు పరిశోధకులు. స్ర్తిలలో సంతానలేమి సంభవిస్తుంది. రొమ్ము కాన్సర్, గర్భాశయ సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ గ్రంథిలో మార్పులు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణనాళ క్యాన్సర్, అండాశయ సమస్యలు వస్తాయి.
భారీకాయపు బాల్యం మానసిక సమస్యల్ని తెస్తుంది. చిన్నతనంలో భారీగా కనిపించేవారిని తోటివారంతా వింతగా చూస్తూ రకరకాల మాటలతో అవహేళన చేస్తుంటారు. స్కూలు స్థాయిలో స్నేహం చేసేందుకు ముందుకు రారు. చురుగ్గా ఉండలేదన్న కారణంగా ఆటల్లో కలుపుకోరు. దీనివలన ఒంటరిననే భావం ఏర్పడుతుంది. తమ రూపం మీద తమకే అసహ్యం వేస్తుంటుంది. మానసిక ఆందోళన పెంచుకుంటారు. ఆలోచనలు శరీరంమీద వున్నందున చదువులో వెనకబడతారు. ఇటువంటి వారిని తోటివారు ఏడిపిస్తుంటారు.
డిప్రెషన్‌కు గురై అధికంగా తిండి తింటారు. ఇలా ఒకదానిపై ప్రభావం మరొకదానిపై ఉంటుంది. భారీకాయం వంశపారంపర్య లక్షణాలు కూడా. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు వంటివి పరీక్షించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలుగుతారు.
ఏమైనా ఆహారపు అలవాట్లు మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వుంటుంది. ఆరోగ్యానిచ్చే పోషక పదార్థాలకు ప్రాధాన్యత పెంచి, క్యాలరీలు అధికంగా ఇచ్చేవాటిని తగ్గించుకోవాలి. ఏవో కొన్ని ఆహార పదార్థాల్ని ఇష్టంగా తీసుకుని మిగిలినవాటిని కాదనకూడదు. బియ్యం, గోధుమలు మన ముఖ్య ఆహారం. దీంతోపాటు పప్పుదినుసులు అవసరం. పాలు, పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, అన్నం సమపాళ్ళలో తీసుకోవాలి.
అతిగా తినటంవల్ల శరీరం దెబ్బతింటుంది. జీర్ణక్రియ సామర్థ్యం తగ్గుతుంది. తిన్నది సరిగా ఒంటపట్టదు. ఫలితంగా క్యాలరీలు పేరుకుంటాయి. క్రమంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. అది మొదలైతే తగ్గడం చాలా కష్టం. కాబట్టి ట్రిమ్‌గా ఎదిగేలా పిల్లల్ని పెంచండి. ఆరోగ్యవంతమైన సంతానాన్ని సమాజానికి అందించాలి.

-పి.ఎం.సుందరరావు