Others

‘వ్యతిరేక భావన’ వద్దే వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నవనాగరిక రోజుల్లో చాలామంది ఎప్పుడు, ఎక్కడ, ఏం మాట్లాడినా ఎంతోకొంత వ్యతిరేక భావంతో ప్రవర్తించడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. అలా మాట్లాడడమే ఆధునిక జీవనశైలిలో ఓ భాగమైపోయింది. ‘ఇద్దరు తెలుగువాళ్లు ఒక దగ్గర కలిస్తే ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటార’న్నది తరచూ చెప్పే ఒక నానుడి. ఎవరైనా ఏ భాషలోనైనా మాట్లాడుకోవచ్చు. అంత మాత్రాన మాతృభాష అయిన తెలుగును ‘ఐ డోంట్ లైక్ తెలుగు’, ‘ఐ హేట్ తెలుగు’ అని కించపరిచి అవమానించడం సరికాదు. ‘ఐ డోంట్ నో తెలుగు’ అని అబద్ధమాడి గొప్పగా పోజు కొట్టకూడదు. కానె్వంట్లలో ఇంగ్లీషులోనే మాట్లాడాలన్న రూల్ ఉంటే ఉండొచ్చుగానీ, అంతమాత్రాన తెలుగులో మాట్లడిన పిల్లాడి వంటిమీద వాతలు తేలేలా కొట్టమని రూల్ ఏమీ
లేదు. తెలుగువాడికి ఇతర భాషలు ఎన్ని వచ్చినా ‘నా మాతృభాష తెలుగు’ అని చెప్పుకోవటంలో గర్వం వుంది.. గౌరవం వుంది. కానీ, తెలుగు భాష గురించి వ్యతిరేకంగా
మాట్లాడుతూ ఇంగ్లీష్‌ని నెత్తికెక్కించుకోవటం ఇప్పుడు యువతకే కాదు, పెద్దలకూ ఒక ఫ్యాషన్ అయిపోయింది.
‘నేను భారతీయుడ్ని’ అని చెప్పుకోవటానికి చాలామంది చిన్నతనంగా భావిస్తూ వుండటం విడ్డూరం అనిపించే ఒక వ్యతిరేక భావన. ‘ఐయామ్ యాన్ ఇండియన్’ అని కనీసం ఇంగ్లీషులోనైనా చెప్పడానికి నీళ్ళు నములుతూ కొందరు తటపటాయిస్తూ ఉంటారు. డాలర్ల సంపాదన కోసం అమెరికా వెళ్లి ఎలాగోలా ఒకలా అక్కడ గ్రీన్‌కార్డ్ సంపాదించి అప్పుడు మాత్రం ‘ఐయామ్ ఎ అమెరికన్ సిటిజన్’ అని గొప్పగా చెబుతారు. ఐదారేళ్లు అమెరికాలో వుండి.. అక్కడి డబ్బుకు, సౌకర్యాలకు అలవాటుపడి.. ఏ నెల, రెండు నెలలకోసమో ఒకసారి ఇండియాకు చుట్టపు చూపుగా వచ్చేవాళ్ళు మాతృదేశమైన భారతదేశం గురించి ఎన్ని అవాకులు, చెవాకులు పేలుతారో ఎంతగా అవమానిస్తారో వాళ్ళ మాటల్లోనే విని తరించాలి గాని చెబితే అంత ‘ఇది’గా ఉండదు. ‘డర్టీ ఇండియా’.. ‘కంట్రీ కల్చర్’.. ‘మ్యానర్‌లెస్ పీపుల్’, ‘సెంటిమెంట్ ఫూల్స్’ అంటూ కొందరు నానా మాటలు అంటారు. ఎంతసేపూ పరస్తుతి, ఆత్మనిందే కానీ కనీసం సమన్వయ ధోరణితోనైనా ‘ఇక్కడ ఉన్నది.. అక్కడ లేదు’, ‘అక్కడ ఉన్నది ఇక్కడ లేదు’ అని విశే్లషించడం గానీ.. మానవ సంబంధాల గురించి, కుటుంబ వ్యవస్థ గురించి, త్యాగగుణం గురించి ఒక్కటంటే ఒక్క ముక్క అయినా అనటంగానీ చేయరు. బుర్రనిండా వ్యతిరేకతను నింపుకున్న వాళ్ళకు స్పందించే మనసు, భావుకత ఎక్కడనుంచి వస్తాయి? నడమంత్రపు సిరితో మాతృదేశం మీద వ్యతిరేకతను వ్యక్తీకరించే వాళ్ళ గురించే ఈ బాధ అంతా! ఇలాంటి వ్యతిరేకత ఒక రకంగా దేశద్రోహమే కదూ?
‘దేవుడు ఉన్నాడా? లేడా? దైవారాధన చేయాలా? వద్దా!’ అన్నది ఎవరి నమ్మకాలను బట్టి, మత విశ్వాసాలను బట్టి వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకునే విషయం. కానీ, కావాలని పని గట్టుకుని అదొక మోడ్రన్ థింకింగ్ అన్నట్లుగా ‘దేవుడు లేడు, విగ్రహారాధనను నమ్మను.. ఆ బాబా దేవుడే కాదు’ అంటూ ఎగతాళి చేయటం.. బహిరంగంగా వ్యతిరేకపు స్వంత అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఈ రోజుల్లో చాలామందికి ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. దేవుడ్ని నమ్మేవాళ్లకు, పూజలు చేసేవాళ్ళకు ఆ రకం భావజాలం బాధను కలిగిస్తుందన్న విషయం గురించి వాళ్ళు ఆలోచించరు. ఎంతసేపూ తాము నమ్మిందే సత్యం, తమకు తెలిసిందే నిజం అన్న అహంభావపు ధోరణి ఈ తరహా వ్యక్తులది. నిజం చెప్పాలంటే ఏదో ఒక సిద్ధాంతాన్ని గట్టిగా నేమ్మేవాళ్ళు.. ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఏకాగ్రతతో నిజాయితీగా తమ పని ఏదో తాము చేసుకుంటూ పోతారు. కచ్చితమైన అభిప్రాయాలను స్వంతం చేసుకోలేని డోలాయమాన మనసులతో, గోడమీది పిల్లుల్లాంటి మనుషులతోనే వస్తుంది తంటా! జీవితం హాయిగా జరిగిపోతున్నపుడు ‘దేవుడ్ని నేను చస్తే నమ్మను!’ అన్నవాడే తనకు ఏదైనా కష్టం, నష్టం వచ్చినపుడు ఆగమేఘాలమీద గుడికి పరుగెత్తి ‘ఈ గండం గడిస్తే ఒక బస్తా కొబ్బరికాయలు కొడతా’ననో.. లేక ‘నీ కొండకు వచ్చి గుండు గీయించుకుంటా’ననో ఆ దేవుడ్ని మొక్కుకుంటాడు. మిడిమిడి జ్ఞానంతో వ్యతిరేకపు మాటలు మాట్లాడటం ఎవరికీ మంచిదికాదు. నమ్మకాలతో కూడుకున్న వ్యవహారాలలో అనవసరంగా తలదూర్చి ఎవరినీ అవమానించ కూడదు. ఇలా మన భాష గురించి, మన దేశం గురించి, మన విశ్వాసాల గురించే కాదు. చాలా విషయాలలో నోరు తెరిస్తే వ్యతిరేకపు మాటలు మాట్లాడేవాళ్ళు నిత్యం మన చుట్టూనే ఎంతోమంది వుంటారు. వాళ్ళను భరిస్తూ పంటికింద కోపాన్ని అదిమిపెట్టి, సహనంతో, ఓపికతో ముందుకు నడుస్తూ జీవనయాత్రను సాగించటమే మనం చేయగలిగింది. కాకుంటే ‘ప్రతి విషయం గురించీ.. అస్తమానం అలా వ్యతిరేకపు మాటలు మాట్లాడేకన్నా ప్రయత్నించి ఒక సానుకూల దృక్పథాన్ని అలవరచుకోమని.. మన సన్నిహితులకు, మన కన్నా చిన్నవాళ్ళకు ఒక సలహా ఇచ్చి చూడవచ్చు. ఇందులో ఎలాంటి తప్పులేదు!

-కొఠారి వాణీచలపతిరావు