AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఓ బ్రహ్మర్షీ! హిమవంతుడి పెద్ద కూతురు, లోకపావని ఐన గంగ మూడు మార్గాల్లో ఎందుకు ప్రవహిస్తోంది? గంగ మూడు లోకాల్లో ఎందుకని ఉత్తమమైంది? దయచేసి చెప్పు’ రాముడు ప్రశ్నించాడు.
విశ్వామిత్రుడు దానికి ఇలా జవాబు చెప్పాడు.
‘రామా! కుమార సంభవం కథని చెప్తాను విను. ఈశ్వరుడు పెళ్లి చేసుకున్నాక తన భార్యతో ఏడాది క్రీడించినా ఆమెకి కొడుకు పుట్టలేదు. అప్పుడు దేవతలు ఈశ్వరుడి దగ్గరికి వెళ్లి ఇలా కోరారు. ‘నీ రేతస్సుని, తేజస్సుని ఎవరూ ధరించలేరు. కాబట్టి నీ భార్యతో కలిసి లోక హితం కోసం వేదోక్తంగా తపస్సు చేసి నీ తేజస్సుని నీ తేజస్సుతోనే ధరించు’ దానికి ఈశ్వరుడు ఇలా ప్రశ్నించాడు. ‘అలాగే, కాని భయపడకుండా నా రేతస్సుని ఎవరు ధరించగలరు?’
భూమి ధరించగలదని దేవతలు చెప్పారు. వెంటనే ఈశ్వరుడు తన రేతస్సుని భూమి మీద వదిలాడు. అది భూమంతా వ్యాపించింది. అది చూసి దేవతలు అగ్నిదేవుడ్ని ఇలా కోరారు. ‘వాయువుతో కలిసి నువ్వు ఆ ఈశ్వర రేతస్సులోకి వెళ్లు’ అలా అగ్ని ఆ రేతస్సుని ధరించాడు. ఈశ్వరుడి భార్య ఉమాదేవి కోపంతో దేవతలని ‘కొడుకు కోసం చేసే మా సంభోగానికి అడ్డుపడ్డారు. కాబట్టి మీకు సంతానం కలగకుండు గాక!’ అని శపించింది. భూమిని కూడా ఇలా శపించింది. ‘అనేక రూపాలు గలదానివై, అనేకులకి భార్యవి అవుతావు. చాలా చెడ్డబుద్ధితో నాకు కొడుకు జన్మించడం ఇష్టపడని నువ్వు నా కోప ఫలితంగా పుత్రానందాన్ని పొందవు’ తర్వాత ఈశ్వరుడు హిమాలయానికి వెళ్లి ఉమాదేవితో కలిసి తీవ్ర తపస్సుని ఆరంభించాడు.
‘ఈ విధంగా పరమేశ్వరుడు తపస్సు చేసే సమయంలో దేవతలు, ఋషులు బ్రహ్మ దేవుడి దగ్గరికి వెళ్లి ‘మా సేనాపతి మహేశ్వరుడు ఉమాదేవితో కలిసి తపస్సులో మునిగాడు. మాకు ఇప్పుడు సేనా నాయకుడు కావాలి’ అని కోరారు. ‘సరే. ఉమాదేవి శాపంవల్ల మీకు మీ భార్యల ద్వారా సంతానం కలగదు. ప్రస్తుతం అగ్ని దేవుడి దగ్గర ఉన్న ఈశ్వర రేతస్సుని స్వర్గంలోని గంగ ఆ ఉమాదేవి అంగీకారంతో తీసుకుని, మీకు సేనాపతిగా ఓ కొడుకుని కంటుంది’ అని బ్రహ్మ వారికి చెప్పాడు. ఆ ప్రకారం అగ్నిదేవుడు తనలోని ఈశ్వర రేతస్సుని గంగలో వదిలితే, ఆమెకి ధరించడానికి శక్యం కాక దాన్ని హిమవత్ పర్వతాల్లోని ఓ పర్వతం మీద వదిలింది.
‘రామా! భూమి మీదకి వచ్చి పడ్డ ఆ రేతస్సు నించి మిరుమిట్లు గొలిపే బంగారం, వెండి, ఇంకా ఆ రేతస్సులోని క్షారం నించి రాగి, ఇనుము పుట్టాయి. ఆ పర్వతం మీది అడవి మొత్తం బంగారంగా మారింది. పుట్టిన ఆ కొడుక్కి కృత్తికలు పాలు ఇచ్చే ఏర్పాటుని దేవతలు చేశారు. అందువల్ల అతనికి కార్తికేయుడు (కృత్తికల కొడుకు) అనే పేరు వచ్చింది. గర్భస్రావం అవడం వల్ల ఆ బిడ్డకి స్కందుడు (జారిపడినవాడు) అనే పేరు కూడా పెట్టారు. ఆరు ముఖాలతో స్కందుడు ఆరరుగురి నించి ఒకేసారి పాలు తాగేవాడు కాబట్టి షణ్ముఖుడు అనే పేరు, మహేశ్వరుడి రేతస్సుని అగ్ని ధరించడంతో పుట్టినందున అగ్ని సంభవుడు అనే పేరు కూడా వచ్చాయి. అతన్ని దేవతలకి సేనా నాయకుడిగా చేశారు. ఒక్కరోజులోనే కార్తికేయుడు తన పరాక్రమంతో రాక్షససేనలని జయించాడు. భూలోకంలో కుమారస్వామి మీద భక్తి గలవారు ఎక్కువ ఆయుష్షు గలవారై, చక్కటి సంతానంతో, మనవలతో సుఖాలని అనుభవించి మరణించాక స్వర్గలోకానికి వెళ్తారు.
‘రామా! పూర్వం అయోధ్యని సగరుడు పాలించేవాడు. అతని భార్య విదర్భ రాజు కూతురు కేశి. సగరుని రెండో భార్య అరిష్టనేమి కూతురు, గరుత్మంతుడి సోదరి సుమతి. సంతానం లేకపోవడంతో సగరుడు తన భార్యలతో కలిసి హిమాలయాలకి వెళ్లి భృగుశ్రవణం అనే పర్వతం మీద వందేళ్లు భృగు మహర్షి కోసం తపస్సు చేశాడు. ఆయనకి ఆ తపస్సుకి మెచ్చి వంశాన్ని నిలిపే ఒక్కడే కొడుకుని లేదా అరవై వేల మంది కొడుకుల్ని ఇస్తానని చెప్పాడు. వారి ఎంపిక ప్రకారం కేశి వంశాన్ని నిలిపే అసమంజుడు అనే కొడుకుని కంటే, ఆయన రెండో భార్య సుమతి సొరకాయని పోలిన పిండాన్ని కన్నది. అది పగిలి అరవై వేల మంది కొడుకులు బయటకి వచ్చారు. పెంపుడు తల్లులు వారిని నేతి పాత్రల్లో ఉంచి పెంచారు. అసమంజుడు చిన్న పిల్లల్ని పట్టుకుని సరయూ నదిలోకి విసిరి, వారు మునిగిపోతూంటే చూసి ఆనందించేవాడు. అతను చేసే దుర్మార్గాల గురించి తెలిసిన సగరుడు వెంటనే కొడుకుని పట్టణంలోంచి వెళ్లగొట్టాడు. అసమంజుడి కొడుకు అంశుమంతుడు మాత్రం మంచి వాడు.
‘ఓ రామా! ఓసారి సగరుడు హిమాలయాలు, వింధ్య పర్వతం మధ్య ఓ చోట యజ్ఞం ఆరంభించాడు. ఆయన మనవడు అంశుమంతుడిని ఏమార్చి దేవేంద్రుడు రాక్షస రూపంలో ఆ యజ్ఞాశ్వాన్ని దొంగిలించాడు. ఋత్విక్కులు సగరుడికి అది చెప్పి యజ్ఞాశ్వాన్ని రక్షించమని కోరారు. వెంటనే సగరుడు తన అరవై వేల మంది కొడుకులతో ఇలా చెప్పాడు.
‘రాక్షసులు మంత్ర ప్రభావం వల్ల ఇక్కడికి రాలేరు. సముద్రంతో చుట్టబడ్డ భూమినంతా మీరు ఒక్కొక్కరూ ఒక్కో యోజనం చొప్పున, గుర్రం కనపడేదాకా తవ్వుతూ వెతకండి. అంత దాకా నేను యజ్ఞశాలని వదిలి వెళ్లను’
వెంటనే వారంతా ఒకో నలుచదరపు యోజనాన్ని ఒకరు చొప్పున వెదుకుతూ వజ్రాల్లాంటి గోళ్లతో, శూలాలు, గొడ్డళ్లతో భూమిని తవ్వుతూంటే రాక్షసులు, అనేక జంతువులు, పాములు నలిగిపోతూ బాధగా అరవసాగాయి. అలా వారంతా పర్వతాల చేత ఇరుకుగా వున్న జంబూ ద్వీప భూమిని పాతాళం దాకా తవ్వారు. దేవతలు, పాములు, గంధర్వులు, అసురులు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్లి జరిగేది వివరించి ప్రార్థించారు.
‘సగర కుమారులు కనపడ్డ ప్రతీ ప్రాణిని గుర్రపు దొంగ అని భావించి చంపుతున్నారు. ఎందరో మహాత్ములని అలా చంపారు’ (బాలకాండ సర్గ 36-39)
హరికథ విన్న ఆశే్లష ఇంటికి రాగానే అమ్మమ్మ మీనమ్మ దాన్ని చెప్పమంది. ఈసారి ఆశే్లష రామాయణం దగ్గర ఉంచుకుని చూసుకుంటూ సరిగ్గా చెప్పాడు.
‘ఇవాళ కూడా హరికథలో ఏడు తప్పులు దొర్లాయి’ చెప్పాడు.
అవేమిటో మీరు కనుక్కోగలరా?
**

మీకో ప్రశ్నకి జవాబు
నదికి, నదానికి గల తేడా - తూర్పుగా ప్రవహించి, తూర్పు సముద్రంలో కలిసేది నది. పశ్చిమంగా ప్రవహించి, పశ్చిమ సముద్రంలో కలిసేది నదం. ఈ రెంటికీ భర్త సముద్రుడు.
**
కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.గిరివ్రజపురం చుట్టూ ఐదు పర్వతాలు ఉన్నాయి అని విశ్వామిత్రుడు చెప్పడం వదిలేశాడు.
2.ఘృతాచి గంధర్వ స్ర్తి కాదు. అప్సరస స్ర్తి.
3.వంద మంది కూతుళ్లు ఉద్యానవనంలో విహరించింది వర్షాకాలంలో. ఇది వదిలేశాడు.
4.సోమద అప్సరస కూతురు కాదు. గంధర్వ స్ర్తి కూతురు.
5.చుళిని సోమద తనని పెళ్లి చేసుకోమని కోరలేదు. ‘నేను కన్యని. ఎవర్నీ పెళ్లి చేసుకోను కూడా. నీ తపోబలంతో నాకో కొడుకుని ఇవ్వు’ అని సోమద కోరింది.
6.అగ్నిదోషం కాదు. వాయు దోషం తొలగి వారి గూనితనం మాయం అయింది.
7.మంగ కాదు. పర్వత రాజు కూతురి పేరు ఉమ.
**
మీకో ప్రశ్న
సగరుడి తండ్రి పేరేమిటి?

మల్లాది వెంకట కృష్ణమూర్తి