AADIVAVRAM - Others

మనుషులు - మనస్తత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పైకి కన్పించే మనిషి కంటే లోపల మనిషి భిన్నంగా ఉండవచ్చు. లోపలి మనిషి అంతర్ముఖమే మనిషి వ్యక్తిత్వానికి ప్రతిబింబం. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి వ్యక్తిత్వానికి మరొకరి వ్యక్తిత్వానికి పోలిక ఉండదు. పరిస్థితులు, పరిసరాలు, మనిషి వ్యక్తిత్వాన్ని మార్చేస్తూ ఉంటాయి. ఫలానా వ్యక్తిత్వంగల వ్యక్తి ఫలానాగా ప్రవర్తిస్తాడని కచ్చితంగా చెప్పడం సాధ్యంకాదు.
మనిషి మనస్తత్వాలు ఆరు రకాలుగా ఉంటాయి. బుద్ధిపూర్వక మనస్తత్వం, ఆలోచనాత్మక మనస్తత్వం, సమాచారాత్మక మనస్తత్వం, భావాత్మక మనస్తత్వం ఇవిగాక బహిర్వర్తన మనస్తత్వం, అంతర్వర్తన మనస్తత్వం కూడా ఉంటాయి.
బహిర్వర్తన మనస్తత్వం
ఇటువంటి మనస్తత్వం గలవారు ఖాళీగా ఉండటానికి ఇష్టపడరు. ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. నలుగురితో కలిసి ముందుకు వెళ్లిపోతూ ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరికి ప్రపంచమే ఇల్లు. దేనినీ విపరీతంగా పట్టించుకోరు. బాధ్యతలు తీసుకుంటారు. వీరు తక్కువగా విశ్రాంతి తీసుకుంటారు.
అంతర్వర్తన మనస్తత్వం
వీరు ఎక్కువగా ఒంటరితనం ఇష్టపడతారు. మనసులోని ఆలోచనలు, చిత్రాలు, స్పందనలకు ఎక్కువ శక్తిని పుంజుకుని తమ ప్రతిభను చూపుతారు. ఎంతో అవసరమైతేగాని మాట్లాడరు. ఏ విషయంలోను చురుగ్గా నిర్ణయం తీసుకోరు. ప్రతి మాట ఆచితూచి మాట్లాడతారు. చురుకుగా ఉండక నిరాశావాదంతో ఉంటారు. ఇతరులను సులువుగా ఆమోదించరు. మార్పు వీరికి ఇష్టం ఉండదు. సులువుగా నమ్మకస్థులుగా ముద్ర వేసుకుంటారు.
బుద్ధిపూర్వక మనస్తత్వం
వీరు ఎప్పుడూ సమకాలీన అంశాలు, యధార్థాలు పరిగణనలోకి తీసుకుని, నిజానిజాలు సరిచూసుకుని చర్యకు ఉపక్రమిస్తారు. ముఖ్యంగా తమ ఆలోచనలు ఆచరణకు పనికి వస్తాయో రావో అంచనా వేసుకుంటారు. ఆచరణ వల్ల అనుభవం వీరికి సొంతం అవుతూ ఉంటుంది. వీరికి మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది. ఎట్టి పరిస్థితులలోను ఎదుటివారి మాటలను నమ్మరు. ఏ పని ప్రారంభించాలన్నా ఆలస్యంగానే ప్రారంభిస్తారు.
ఆలోచనాత్మక మనస్తత్వం
వీరు తమ అంతర్ దృష్టికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. అనుభవాలను పరిగణనలోకి తీసుకోక ఆలోచనల ఆధారంగా స్పందిస్తారు. ఏ విషయంలోనైనా సాధ్యాసాధ్యాలు, నూతనత్వంతో పాటు భవిష్యత్ గురించి కూడా తర్కించుకుంటారు.
వీరికి సిద్ధాంతాలు, అమూర్త విషయాలపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కొత్త ఆలోచనలను ఎవ్వరూ ఆమోదించకపోయినా వీరు ఆమోదిస్తారు. ఆదరిస్తారు. సంఘటనల వలన కలిగిన అనుభవాలు వీరికి జ్ఞాపకంలో ఉండిపోతాయి. వీరికి సమస్యా పరిష్కార శక్తి ఎక్కువగా ఉంటుంది.
సమాచారాత్మక మనస్తత్వం
వీరు ఏ విషయానికి కంగారుపడరు. సందర్భాన్నిబట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయం తేలిగ్గా తీసుకునే ధోరణి ఉంటుంది. ప్రపంచానికి అనుగుణంగా తమని తాము మలచుకుంటారు. వీరికి కొత్తదనం అంటే ఇష్టం. వీరికి చాలా తక్కువగా ప్రణాళికలు ఉంటాయి. ఏ పని అయినా సులువుగా తీసుకుని చేస్తారు. ఆఖరి నిమిషంలో పనులు హడావిడిగా పూర్తి చేస్తూ ఉంటారు.
ఏ పని చేయాలన్నా దానికి సంబంధించిన సమాచారం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. సాధారణంగా వీరు గడువులోపులో నిర్ణయాలు తీసుకోలేరు. వీరు జీవితానికి ఒక దిశను ఏర్పరచుకోరు.
భావాత్మక మనస్తత్వం
ఇతరులు తీసుకునే నిర్ణయాలు ఆధారంగా వారిని అంచనా వేస్తారు ఈ వ్యక్తులు. తాము చాలా గొప్ప నిర్ణయాలు తీసుకోగలమని భావిస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి వ్యక్తిగత విలువలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఇతరులతో స్నేహ వాతావరణం సృష్టించుకుని వారితో కలిసిపోతారు. ఎదుటి వారికి ఏమి కావాలో అది ఆలోచిస్తారు.
వీరు ఎదుటి వారిని గౌరవిస్తారు. వీరికి దయ, కరుణ ఎక్కువగా ఉంటాయి. మితిమీరిన ఆదర్శవాదుల్లా ఉంటారు. ఒక్కొక్కప్పుడు సంఘటనలలోని యధార్థాలను పసిగట్టలేరు.

-సి.వి.సర్వేశ్వరశర్మ