AADIVAVRAM - Others

ఆదా (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాజావారి సంస్థానంలో కొడుకు శివయ్యకి ఉద్యోగం అయిందని తెలిసి తెగ సంబరపడిపోయాడు సాంబయ్య.
శివయ్య మొదట్లో కొన్నాళ్లు నిజాయితీగా విధులు నిర్వర్తించాడు. రాన్రాను లంచాలకు అలవాటుపడ్డాడు. చేయి తడిపితే తప్ప ఎవరి పనీ చేసేవాడు కాదు. కొడుకు ప్రతిదానికి చేయి చాపడం అలవాటు చేసుకున్నాడని తెలిసి ఎంతగానో కలత చెందాడు సాంబయ్య. విషయం రాజుగారి దృష్టికొస్తే వాడి ఉద్యోగం ఎక్కడ పోతుందోనని భయపడిపోయాడు. బిడ్డ ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కోసం ‘బాబూ! ఉన్నదాంతో మనం తృప్తి పడాలే తప్ప అతిగా ఆశించకూడదు. లంచం పుచ్చుకోవడం నేరమే కాదు పాపం కూడా. రాజుగారికి విషయం తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకో. నా మాట విని ఇకనుంచైనా ప్రతిదానికి చేయి చాపడం మానుకో. నీ కర్తవ్యాన్ని నిజాయితీగా నెరవేరుస్తూ మంచి పేరు తెచ్చుకోడానికి ప్రయత్నించు’ అంటూ హితవు చెప్పాడు. అయితే అతడి సూక్తులు చెవిటివాడి ముందు శంఖనాదమైంది.
ఇలా ఉండగా ఒకమారు ఓ స్వామీజీ దేశాటన చేస్తూ ఆ రాజ్యంలోకి అడుగుపెట్టాడు. ఆయన రాకకు సంతసించిన ప్రభువులు స్వామీజీని సాదరంగా దర్బారుకు ఆహ్వానించారు.
రాజుగారి కోరిక మేరకు ప్రజాహితం కోసం శివాలయంలో తొమ్మిది దినాలపాటు ఆధ్యాత్మిక ప్రసంగాల్ని చేయడానికి అంగీకరించారు స్వామీజీ. వెనువెంటనే ఆయన బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి.
స్వామీజీ ప్రసంగాన్ని ఆలకించేందుకు ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. అందరితోపాటు సాంబయ్య కూడా విధిగా హాజరయ్యేవాడు. ఆయన పలుకులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే రానంటున్నా వినకుండా ఒకరోజు కొడుకును బలవంతంగా అక్కడికి తీసుకెళ్లాడు.
శివయ్య స్వామీజీ ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నాడు.
‘వర్షాకాలం నాలుగు నెలలు ఎక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందోనని మానవుడు ముందుగానే వంట చెరకును, నిత్యావసర సరుకుల్ని నిల్వ చేకుంటాడు. అలాగే మూన్నాళ్ల వృద్ధాప్యంలో ఎక్కడ కష్టపడవలసి వస్తుందోనని యవ్వనమంతా శ్రమించి డబ్బు కూడబెడతాడు. అయితే నూరేళ్ల పునర్జన్మ కోసం నేనెంత ఆదా చేసానని మాత్రం ఆలోచించడు. మనం చేసుకున్న సుకృతాన్ని బట్టే మనకు మరుజన్మ ఉంటుంది. అందువల్ల అందరూ ఆధ్యాత్మిక చింతనను అలవరచుకోవాలి’ అంటూ ఉపన్యాసాన్ని ముగించాడు స్వామీజీ.
శివయ్య ఆ రాత్రంతా స్వామీజీ మాటల్ని మననం చేసుకున్నాడు. మరునాడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు కలుసుకుని ‘నిన్న మీ ప్రసంగాన్ని విన్న మీదట నాకు కనువిప్పు కలిగింది. మనం చేసుకున్నదే మనతో వస్తుందన్నారు. అయితే దైవాన్ని ధ్యానిద్దామంటే నాకు ఏ ప్రార్థనా రాదు. పూజా విధానం అంతకన్నా తలీదు. ఉత్కృష్టమైన జన్మను పొందాలంటే నేనేం చేయాలో సెలవివ్వండి’ అంటూ వినమ్రుడై చేతులు జోడించాడు.
శివయ్య మాటలకు స్వామీజీ చిరునవ్వు నవ్వుతూ ‘నాయనా! మంచి జన్మ కోసం పూజలే చేయనక్కర్లేదు. పాపం చేయకుండా ఉంటే చాలు. దుర్‌వ్యసనాలకు లోనుగావడం, లంచాలు పుచ్చుకోవడం, పేదవారిని తృణీకరించడం వంటి పాపపు పనులకు దూరంగా ఉండాలి. మనవల్ల మన చుట్టూ ఉన్న వారికి రవ్వంత మేలు జరిగితే చాలు మన జీవితం ధన్యమైనట్లే’ అన్నాడు అనునయంగా.
అంతే, ఆ రోజు లగాయితు శివయ్య లంచాల జోలికి పోతే ఒట్టు.
కొడుకులో కలిగిన పరివర్తనకు ఎంతగానో సంతోషించాడు సాంబయ్య. అందుకు కారణభూతుడైన స్వామీజీకి మనసులో వేనవేల కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

-దూరి వెంకటరావు