Others

చెంచులక్ష్మి -- ఫ్లాష్‌బ్యాక్@ 50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ, మాటలు: సదాశివ బ్రహ్మం
పాటలు: ఆరుద్ర
ఫొటోగ్రఫి: సి నాగేశ్వరరావు
ఎడిటింగ్: కెఎ మార్తాండ
కళ: వాలి
సంగీతం: ఎస్ రాజేశ్వరరావు
సహాయ దర్శకుడు: కెఎస్ ప్రకాశరావు.
నిర్మాత, దర్శకుడు: బిఏ సుబ్బారావు

జానపద వాజ్మయంలోనిది చెంచులక్ష్మి వృత్తాంతము. దీన్ని 1943లో తమిళనాడు టాకీస్ సారథ్యంలో ఎస్ సౌందర రాజన్ స్వీయ దర్శకత్వంలో ‘చెంచులక్ష్మి’ చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. దీనికి కథ, మాటలు సముద్రాల రాఘవాచార్య అందిస్తే, ఛాయాగ్రహణాన్ని జితిన్ బెనర్జీ సమకూర్చారు. హెచ్‌ఎంవి సంస్థలో ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్న సిఆర్ సుబ్బరామన్, ఆర్‌ఎస్ చిన్నయ్య సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో చెంచులక్ష్మిగా కమలాకొట్నీస్ నటించగా, ఆమెపై చిత్రీకరించిన అండర్ వాటర్ స్విమ్మింగ్ సీను అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దక్షిణాదిన తొలిసారిగా ఈవిధంగా చిత్రీకరించటం, అలాగే చిత్రంలోని ‘టైటిల్ మ్యూజిక్’, ‘నృత్య సంగీతం’ రికార్డుగా విడుదల కావటం, తొలివాద్య సంగీతపు రికార్డు ఇదే కావటం విశేషం. ఈ చిత్రంలో మహావిష్ణువుగా సిహెచ్ నారాయణరావు, ఆదిలక్ష్మిగా ఋష్యేంద్రమణి, చెంచు నాయకునిగా నాగయ్య, నారదునిగా గరుడాచారి ఇంకా లంక సత్యం తదితరులు నటించారు. చిత్రంలోని పాటలు, నటన ప్రేక్షకులను అలరించాయి. చిత్రం విజయం సాధించింది.
1958లో బిఎఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత, దర్శకుడు బిఎ సుబ్బారావుచే తెలుగు, తమిళ భాషల్లో మరోసారి చెంచులక్ష్మి చిత్రం నిర్మించారు. చిత్రంలో ప్రహ్లాద చరిత్రకు చెంచులక్ష్మి వృత్తాంతాన్ని జోడించి చిత్ర కథగా రూపొందించారు.
చిత్ర కథ
సముద్రరాజు తన కుమార్తె ఆదిలక్ష్మి (అంజలీదేవి)ని శ్రీమహావిష్ణువు (అక్కినేని)కు ఇచ్చి వివాహం జరిపిస్తుండగా, తనకు ఆహ్వానం అందలేదంటూ దుర్వాస మహర్షి (గుమ్మడి) అక్కడికి వస్తాడు. ఆగ్రహోదగ్రుడై సముద్రరాజును చెంచుకులంలో జన్మించమని శాపమిస్తాడు. విచారిస్తున్న అతనికి మరు జన్మలోనూ ఆదిలక్ష్మియే కుమార్తె అవుతుందని ఉపశమనమిస్తాడు. హిరణ్యాక్షుని సంహరించిన శ్రీహరిపై ఆగ్రహించిన అతని సోదరుడు హిరణ్యకశపుడు (ఎస్‌వి రంగారావు) బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపమొనర్చి వరబలంతో స్వర్గంపైకి, వైకుంఠంపైకి దాడి చేస్తాడు. మహావిష్ణువు అతని హృదయంలో స్థానం ఏర్పరచుకుని, మహాలక్ష్మిలోని లక్ష్మీకళను గరుడాద్రిపై ఓ చెట్టు ఫలంలో దాస్తాడు. అజ్ఞాతంగా శ్రీలక్ష్మి హిరణ్యకశపుని భవనంలో చేరుతుంది. నారదుడు ఆ చెట్టు ఫలం చెంచు నాయకునిగావున్న (ఎవి సుబ్బారావు, సంధ్య) సముద్ర రాజు దంపతులచే ఆరగింపజేస్తాడు. వారికి జన్మించిన చెంచులక్ష్మి సాహస యువతిగా ఎదుగుతుంది. హిరణ్యకశపునికి జన్మించిన ప్రహ్లాదుడు (మాస్టర్ బాబ్జీ) విష్ణ్భుక్తుడై తండ్రికి ఆగ్రహం, ఆవేదన కలిగిస్తాడు. నారదుడు (రేలంగి) సూచనతో హిరణ్యకశపుడు ఓ స్తంభంలో హరిని చూపమని ప్రహ్లాదుడిని ఆదేశించటంతో, ప్రహ్లాదుని కోరికపై మహావిష్ణువు నరహరి అవతారంలో స్తంభం నుంచి వెలువడి హిరణ్యకశపుని సంహరిస్తాడు. ఉగ్రరూపంతో బయటకు వచ్చిన శ్రీహరిని బ్రహ్మాది దేవతలు, శ్రీమహాలక్ష్మి శాంతింపజేయలేకపోతారు. అడవిలో తారసపడిన చెంచులక్ష్మిని చూసి శాంతించి, అవతరం చాలించి నరహరి ఓ యువకునిగా ఆమెను ఆకర్షించి వివాహం చేసుకుంటాడు. గరుడాద్రిపై ఓ భవనంలో నివశిస్తున్న మహాలక్ష్మి ఈ విషయం తెలుసుకుని భర్తపై ఆగ్రహిస్తుంది. నారదుని సాయంతో ఆమె తన యొక్క లక్ష్మికళయని, అందుచేతనే మహావిష్ణువును ఆకర్షించిందని గ్రహించి, ఆమెను తనలో ఐక్యం చేసుకుంటుంది. పాలకడలిపై వైకుంఠంలో శ్రీహరి, లక్ష్మీ సమేతుడై వుండగా చిత్రం శుభంగా ముగుస్తుంది. భక్తప్రహ్లాద చరిత్రను, అహోబిల నారసింహ, చెంచులక్ష్మిల వృత్తాంతాలను చక్కని మాటల కూర్పుతో అలరించేలా రచన సాగించారు సదాశివ బ్రహ్మం. సమయానికి తగిన చురుకైన సంభాషణలు నారద పాత్రకు, భక్తియుతమైన పలుకులు ప్రహ్లాదునికి, అదేవిధంగా మహాలక్ష్మికి, మహావిష్ణువుకు, చెంచులక్ష్మికి శోభస్కరంగా అలరించటం విశేషం.
ఈ చిత్రంలో హిరణ్యకశపుని భార్య లీలావతిగా పుష్పవల్లి, చండామార్కులుగా వంగర, శివునిగా నాగభూషణం నటించగా, ఉగ్ర నారసింహునిగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని విస్సాకోడేరుకు చెందిన పహిల్వాన్ ‘వస్తాదు రాజు’ నటించారు. ఆదిలక్ష్మి పాత్రకు మొదట భానుమతిని ఎంపికచేసి కొంత షూటింగ్ జరిపాక, కారణాంతరాలవల్ల ఆమెను తొలగించి తదుపరి పద్మినితో నటింపజేయాలనుకొని చివరకు అంజలీదేవిని నిశ్చయించారు. అంజలీదేవి మహాలక్ష్మిగా శాంత సాధు స్వభావాన్ని, చెంచులక్ష్మిగా దుడుకుతనాన్ని ఎంతో సమర్థవంతంగా పోషించింది. మహావిష్ణువుగా, నరహరిగా అక్కినేని నాగేశ్వరరావు చక్కని సంయమనంతో నటించి అలరించారు. ఇక హిరణ్యకశపునిగా ఎస్‌వి రంగారావు, ప్రహ్లాదునిగా మాస్టర్ బాబ్జీ ప్రశంసనీయమైన నటన చూపారు. ప్రతిభగల నటులచే సన్నివేశాలకు అనుగుణమైన చక్కని నటనను తనకు కావలసిన రీతిలో నటుడు, దర్శకుడు, నిర్మాతయైన సుబ్బారావు రాబట్టుకోవటం విశేషం. మొదట రేలంగి ఈ చిత్రంలో నారదునిగా నటించటానికి ఇష్టపడలేదు. బిఏ సుబ్బారావు ఒప్పించటంతో నటించారు. అది సక్సెస్ కావటంతో, తరువాత వీరిదే ‘్భష్మ’ చిత్రంలోనూ రేలంగి నారదునిగా నటించారు.
ప్రహ్లాదుని హిరణ్యకశపుడు పలు హింసలపాలు చేయించటం, శ్రీహరి వాటినుండి భక్తుని రక్షించటం, గురుకులంలో ప్రహ్లాదుని భక్తి, విద్యార్థులను భక్తులుగా మార్చటం వంటి పలు సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా చిత్రీకరించి తరువాతి చిత్రాలకు మార్గదర్శకులైనారు దర్శకులు.
ఇక ఈ చిత్రంలోని ఎస్ రాజేశ్వరరావు స్వరపరచిన గీతాలు నేటికీ శ్రోతలను అలరిస్తున్నాయి. ‘చెట్టులెక్కగలవా’, ‘చిలకా గోరింక’ గీతాలను తొలుత పి సుశీల, పిబి శ్రీనివాస్‌లచే పాడించి రికార్డు విడుదల చేశారు. కాని తరువాత జిక్కి, ఘంటసాలచే పాడించి వాటినే చిత్రంలో వాడుకున్నారు. పి సుశీల గానం చేయగా ప్రహ్లాదునిపై చిత్రీకరించిన భాగవతంలోని పద్యాలు ‘కంజాక్షునకుగాని కాయంబు’, ‘మందార మకరంద’, ‘ఇందుగలడందులేడని’ సదాశివబ్రహ్మం రచన.
అలాగే అద్భుతం అనిపించే ‘ఆదిమధ్యాంతరహితుడైనట్టి’, ‘కనలేరా కమలాకాంతుని’, ‘పాలకడలిపై శేషతల్పమున’, లీలావతిపై చిత్రీకరించిన జోలపాట ‘మా చిన్ని పాపాయి’ (జిక్కి) గీతాలు ఆరుద్ర రచన.
ఘంటసాల గానం చేయగా నారదునిపై చిత్రీకరించిన ‘నీల గగన ఘనశ్యామా’, ‘కరుణాలవాల ఇది నీదు లీల’ గీతాలు చరణాల మార్పులతో చిత్రంలో పలుమార్లు రావటం గమనార్హం. వీటికి ఎస్ రాజేశ్వర రావు అందించిన అలరించే స్వరాలు మరో విశేషమనే చెప్పుకోవాలి. కాగా ఏఎన్‌ఆర్, అంజలీదేవిలపై వైకుంఠంలో చిత్రీకరించిన ఆహ్లాదగీతం ‘ఆనందమాయే అలినీలవేణి’ (ఘంటశాల, జిక్కి బృందం), అడవిలో చెంచులక్ష్మితో ‘చెట్టులెక్కగలవా ఓ నరహరి’, ‘చిలకా గోరింక కులికే పకాపకా’, ఆదిలక్ష్మి చెంచులక్ష్మి నరహరిలపై చిత్రీకరించిన విరహగీతం ‘కానగరావా ఓ శ్రీహరి రావా’ ఇక ఎస్‌వి రంగారావుపై ‘ఎవడురా విష్ణుండు, ఎవడురా జిష్ణుండురా’ (మాధవపెద్ది) గీతాలు, పద్యం ఆరుద్ర కలం నుంచి జాలువారిన అద్భుతాలుగా చెప్పుకోవాలి.
ఆహ్లాదకమైన, మానసోల్లాసాన్ని కలిగించే యుగళగీతాలు, కరుణ, భక్తిరస పూర్వకమైన నారద ప్రహ్లాద గీతాలు చిత్రాన్ని సంగీతపరంగా విజయవంతం చేశాయి. తమిళంలో రూపొందించిన చిత్రం 1958 మే 28న, తెలుగులో రూపొందించిన చెంచులక్ష్మి 1958 ఏప్రిల్ 9న విడుదలయ్యాయి.
చెంచులక్ష్మి చిత్రం ఐదు కేంద్రాల్లో 100 రోజులు నడిచి శతదినోత్సవ సంబరాలు జరుపుకుంది. ఆ విజయోత్సవాల్లో చిత్రంలోని ప్రముఖ నటీనటులు పాల్గొనటం, ప్రేక్షకులు అభిమానులు వారిని చూసి ఆనందించటం జరిగింది. ఈ చిత్రం స్ఫూర్తితో 1967లో ఎవిఎం వారు 'భక్తి ప్రహ్లాద' రూపొందించటం మరో విశేషం.

-సివిఆర్ మాణికేశ్వరి