AADIVAVRAM - Others

శృంఖలాలు ( సిసింద్రి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక గ్రామంలో ఒక పెద్ద బావి ఉంది. అది పాడుబడిపోయింది. అందుకని గ్రామస్థులు ఆ బావిలోని నీటిని వాడుకునేవారు కాదు.
దానిలో ఒక పెద్ద బోదురు కప్ప జీవించసాగింది. ఆ బావిని తన ప్రపంచంగా మలచుకుంది. ఆ ప్రపంచానికి తనే మహారాజు. రాత్రి అయితే తన కోసం చంద్రుడు, చుక్కలు వచ్చేవారు. పగలైతే సూర్యుడు ఎండను ప్రసాదించేవాడు. అప్పుడప్పుడు వరుణదేవుడు కనికరించి వర్షాలు కురిపించేవాడు.
ఇలా ఉండగా పరాయి రాజ్యం నుండి పారిపోయి వచ్చిన గోవిందుడు తనను భటులు తరుముతూంటే తలదాచుకోవడానికి ఆ బావిలోకి దూకాడు. చీకటి పడింది. భటులు ఆ చుట్టుపక్కల వెతికి అతను కనపడకపోతే వెళ్లిపోయారు. గోవిందుడు అప్పటిదాకా బావిలోకి పొడుచుకు వచ్చిన ఒక రాయిని పట్టుకుని మునిగిపోకుండా తన ప్రాణాల్ని కాపాడుకున్నాడు.
భటులు వెళ్లిపోయిన తరువాత అతికష్టం మీద పాక్కుంటూ రాళ్లను ఆసరా చేసుకుని బయటకు వచ్చి పడ్డాడు.
బోదురుకప్ప తన రాజ్యాన్ని ఆక్రమించినవాడిని శిక్షిద్దామని అతని కాలు గట్టిగా పట్టుకుంది. వాడితోపాటు అది కూడా బయటకొచ్చి పడింది.
పున్నమి వెనె్నలలో బావి బయట ప్రపంచాన్ని చూసి విస్తుపోయింది బోదురుకప్ప.
‘ఇదేంటి ప్రపంచం ఇంత విశాలంగా ఉంది’ అంటూ అరిచింది.
గోవిందుడు దాన్ని చూశాడు. అది బెకబెక అంటూంటే ఆకలితో అరుస్తున్నదనుకున్నాడు.
‘చూడు కప్పా! ప్రపంచం గొడ్డుపోలేదు. నీకు ఇక్కడ ఆహారం దొరక్కపోతే ఇంకెక్కడన్నా దొరుకుతుంది. మా రాజ్యంలో నాకు తిండి దొరకడం కష్టమయింది. పొరుగు రాజ్యానికి వచ్చాను. ఇక్కడ దొరక్కపోతే ఇంకో రాజ్యానికి పోతాను. అంతేగాని బావిలో కప్పలా ఒకచోటే కూర్చుని అన్నీ మనకి సమకూరాలని అనుకోకూడదు. పద పోదాం!’
కప్ప ఇంకా విశాల ఆకాశాన్ని చూస్తోంది. బావిలో తనకి చిన్న ఆకాశం కనిపించేది. బయటకు వస్తే అస్సలు ఈ ఆకాశానికి, ఆ ఆకాశానికి పోలికే లేదు.
‘ఇది భలే ఉంది. ప్రపంచానికి అంతం లేదులా ఉంది. నాలుగు గోడలు మధ్యలోనే ప్రపంచం అనుకున్నాను. కానే కాదు. అలాగే ఆకాశానికి కూడా అంతం లేదు’ కప్ప అరిచి చెప్పింది.
‘చూడు కప్పా! ప్రపంచంలో అవకాశాలకు అంతులేదు. వెతికితే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. అవకాశాలు వెతుక్కుంటూ మనం వెళ్లాలి. అప్పుడే మనకి అదృష్టం పడుతుంది’ గోవిందుడు చకచక గ్రామం వైపు నడక సాగించాడు.
బోదురు కప్ప కొంచెం దూరం ముందుకు పోయిందో లేదో అక్కడొక పిల్లకాలువ అడ్డు వచ్చింది. దాని నిండా కప్పలు బెకబెకలాడుతూండటం చూసి ఆశ్చర్యపోయింది.
తను ఇన్నాళ్లు నాలుగు గోడల మధ్య బందీ అయిపోయి, అదే గొప్ప ప్రపంచమన్న భ్రమలో పడిపోయి ఎంత నష్టపోయిందీ బోదురుకప్పకు అర్థమయింది.
మన ఆలోచనలే మనకు సంకెళ్లు అని అవగతం చేసుకుంది. మన ఆలోచనా శృంఖలాలను తెంపుకుని ముందుకు అడుగు వేస్తే కొత్త బంగారు లోకం మనకోసం ఎదురుచూస్తూ ఉంటుందని అర్థమైంది బోదురు కప్పకు.

-కోపల్లె విజయప్రసాద్