Others

పెద్దమనసుతో ఆదుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఉరుము లేని పిడుగులా జనాన్ని తాకింది. గత నెలరోజులుగా ఎక్కడ చూసినా నగదు కోసం ప్రజలకు నరకయాతనే. పరిమితికి లోబడి ఇచ్చే కాస్తంత నగదు కోసం బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద పడిగాపులు. పాతనోట్లు చెల్లక, ఆశించిన నగదు లభించక- ‘డబ్బులేనివాడు ఎందుకూ కొరగాడు’ అంటే ఏమిటో అందరికీ తెలిసొచ్చింది. ‘డబ్బుకు లోకం దాసోహం’ అనుకుంటూ పెద్ద నోట్లు భారీగా దాచుకుని మురిసిపోయేవాళ్ళు అవి చెల్లని చిత్తుకాగితాలే అని తెలుసుకుని తెల్లబోయారు. వాటిని వదిలించుకోవటానికి గుట్టుచప్పుడు కాకుండా తంటాలు పడుతూనే ఉన్నారు. పోపుల పెట్టెలోను, చీరల మడతల మధ్య దాగిన డబ్బులు మెల్లమెల్లగా బయటికి వచ్చేశాయి. కిడ్డీ బ్యాంకులు ఓపెన్ అయిపోయి పిల్లల ఆమోదంతో ఆ చిల్లర ఉపయోగపడింది. పేదల ఇళ్లలో మట్టిముంతలు బద్దలై సమయానికి ఆదుకుంటున్నాయి.
ఇప్పుడు కరెన్సీ కష్టాలను చూస్తుంటే పాతరోజులే నయం అనిపిస్తోంది. ఒకప్పుడు వస్తుమార్పిడి విధానంలో- ప్రజలు తమ దగ్గర ఉన్న వస్తువులను ఇచ్చి వారికి కావలసిన వస్తువులు తెచ్చుకునేవారు. నాణాలు, నోట్లు లేని ఆ రోజులు పోయి ‘్ధనమూలమిదం జగత్’ అన్నట్లు ఇప్పుడు అంతా డబ్బుతోనే పని. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు కొంతవరకే ఉపయోగపడుతున్నాయి. అన్నిచోట్లా ఆ వ్యవస్థ లేక జనాల అవస్థలు వర్ణనాతీతం. ‘జీవితంలో ఆటుపోట్లు తప్పవు.. సర్దుకుపోవాలి’ అంటారు పెద్దలు. ఇప్పుడు నోటు పాట్లు వచ్చాయి. ఎన్నడూ బ్యాంకు ముఖం చూడని వాళ్ళు, మూలనున్న ముసలమ్మలు సైతం పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవటానికి బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడ్డారు. నగదు తీసుకునేందుకు వచ్చేవారితో ఈ క్యూలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. హడావుడిగా చేసే పనుల్లో కొన్ని లోపాలు దొర్లటం సహజం అన్నట్లు పెద్దనోట్లు రద్దు చేసినా- తగినంత చిన్న నోట్లను అందుబాటులో ఉంచకపోవటం, కొత్త కరెన్సీని తగినంతగా సరఫరా చేయకపోవడంతో ఇపుడు ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది. పెద్దనోట్లు రద్దుచేశామంటూనే 2,000 రూపాయల నోటు విడుదల చేయడం మరో విడ్డూరం. చిల్లర కొరతతో 2వేల నోటు ఎందుకూ కొరగాకుండా పోతోంది.
ఏది జరిగినా ‘అంతా మనమంచికే’ అని అన్నివేళలా అనుకోలేం. అవినీతి, నల్లధనం అంతరించడం సంగతేమో కానీ- కాయకష్టం చేసుకుని ఏరోజుకారోజు సంపాదనతో కడుపునింపుకునే నిరుపేదలకు చిల్లర దొరక్క, పాత నోట్లు చెల్లుబాటుకాక పస్తులు ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే- పేదవారు ఇబ్బంది పడుతున్న వేళ మనం కొంత పెద్దమనసుతో వ్యవహరించాలి. బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద ‘క్యూ’లో నిలబడే పేదవర్గాల వారికి ముందుగా నగదు అందేలా మనం చేతనైనంత సహాయం అందించాలి. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి నగదు తీసుకునే అవకాశం ముందుగా ఇవ్వాలి. మన ఇంట్లో పనిచేసేవాళ్ళ అవసరాలు తెలుసుకుని వాళ్ళకు మన దగ్గర ఉన్న చిల్లర నోట్లు ఇవ్వటం కాని, పాత నోట్లు మార్చి ఇవ్వటం కాని చేయవచ్చు. క్యూలో నిలబడి నీరసించిపోయే వారికి మంచినీళ్లు, మజ్జిగ వంటివి ఇస్తే ఎంతో మేలు చేసినట్టవుతుంది. ఇలాంటి సహాయ, సేవా కార్యక్రమాలకు యువత చొరవ చూపాలి. ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవోయ్’ అన్న మాటలను సార్థకం చేద్దాం. నోట్లకష్టాలు తీరేవరకు మానవత్వంతో మనకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు, రోగులకు సహకరిస్తూ వారిని ఆదుకుందాం. క్యూలో సొమ్మసిల్లి పడిపోయే వారిలో ఒక్కరిని కాపాడినా మనం ధన్యులమే కదా!

- అబ్బరాజు జయలక్ష్మి