AADIVAVRAM - Others

చిన్న ప్రయత్నం (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నప్పుడు ప్రపంచమంతా మన ముందు వున్నట్టుగా అన్పించేది. ప్రతిదీ తాజాగా కొత్తగా అన్పించేది. తెలియకుండానే మనలో ఏవో కోరికలు కలిగేవి. పైకి చెప్పడానికి బిడియంగా అన్పించేది. కానీ ఎన్నో కోరికలు కలిగేవి.
మా ఇంటి నుంచి బడికి వెళ్తున్నప్పుడు పోలీసుస్టేషన్ కన్పించేది. అక్కడ కన్పించే జనాలను చూసి మా మిత్రులు ఆశ్చర్యపోయేవారు. అమీన్ సాబ్ (ఎస్.ఐ.) రోడ్డు మీదకు వస్తే అందరూ ఎంతో గౌరవం ఇచ్చేవాళ్లు. భయభక్తులతో మెలిగేవారు. అది చూసి ఓ మిత్రుడు తనకి ఎస్.ఐ కావాలని ఉందని చెప్పేవాడు.
మా ఊర్లో పెద్ద గుడి ఉంది. రాజరాజేశ్వరుని గుడి. జెండా వందనం రోజు బడికి వెళ్లి ఊరంతా తిరిగి గుడి దగ్గరకు వచ్చేవాళ్లం. కార్యనిర్వహణాధికారి వచ్చి అందరికీ చాక్లెట్లు పంచేవాడు. అది చూసి మరో మిత్రుడు గుడిలో కార్యనిర్వహణాధికారి కావాలన్న కోరిక ఉందని చెప్పేవాడు.
మా బాపు డాక్టర్. అందరికీ వైద్యం చేసేవాడు. మా ఊరి ప్రజలే కాదు చుట్టుపక్కల వున్న గ్రామాల ప్రజలు ఆయన దగ్గరికి వచ్చేవాళ్లు. డాక్టర్ సాబ్ అంటే మా ప్రాంతంలో ఎనలేని గౌరవం ఉండేది. కొంతమంది మిత్రులకి మా బాపులా డాక్టర్ కావాలని కోరిక ఉండేదని చెప్పేవాళ్లు. కానీ నాకు డాక్టర్ కావాలని గానీ, కార్యనిర్వహణాధికారి కావాలని గానీ, పోలీసు ఉద్యోగం చేయాలని గానీ ఎప్పుడూ అన్పించలేదు.
మా ఊరి దగ్గర్లోని సిరిసిల్లలో మా పెద్దనాయన (పెద్దనాన్న) ఉండేవాడు. ఆయన ఇల్లు చాలా ఎత్తు మీద ఉండి గంభీరంగా కన్పించేది. కచేరీ నిండా పుస్తకాలు, గోడ మీద ఆయన నిలువెత్తు ఫొటో. దాని పక్కన తోటి న్యాయవాదులతో, న్యాయమూర్తులతో దిగిన ఫొటోలు ఉండేవి. ఆయన అక్కడ ఓ పేరున్న న్యాయవాది. అక్కడికి వెళ్లినప్పుడల్లా న్యాయవాది కావాలన్న కోరిక నాకు కలిగేది. మా మిత్రులతో ఆ కోరిక చెప్పినట్టు గుర్తులేదు కానీ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వ్యక్తపరిచాను కూడా.
మనం పిల్లలుగా వున్నప్పుడు తల్లిదండ్రులు ఏవో కలలు కంటారు. మనమూ ఎన్నో కలలు కంటాం. కొంతమంది అమెరికా వెళ్లాలని, అంతరిక్షయానకుడు కావాలని, సైంటిస్టు కావాలని, పెద్ద ఇల్లు కొనుక్కోవాలని ఇట్లా ఎన్నో కలలు కంటాం. మరి కొంతమంది కవి కావాలని, రచయిత కావాలని, నటుడు కావాలని కలలు కంటారు. జీవితం జీవితమే. మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. మనం మరో దారిలో ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
పెద్దవాళ్లం అయిన తరువాత కూడా ఆ కలలని సాఫల్యం చేసుకునే అవకాశం ఉంది. మనం కలగన్న వాటి పట్ల వ్యామోహం పెంచుకోవడానికి అవకాశమూ ఉంది. వయస్సు దాటినా కూడా ఆ కలలని నిజం చేసుకునే అవకాశమూ ఉంది. గుడిలో కార్యనిర్వహణాధికారిగా కాకపోయినా ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గానో, సభ్యుడిగానో మారే అవకాశం ఉంది. పోలీస్ అధికారి కాకపోయినా అంతకన్నా పెద్ద పదవి చేపట్టే అవకాశం ఉంది. ప్రయత్నిస్తే కవి అయ్యే అవకాశం ఉంది. రచయిత అయ్యే అవకాశం ఉంది. కళాకారుడు అయ్యే అవకాశం ఉంది. వాటిని సాధించే లక్ష్యం ఏర్పరచుకోవాలి. ప్రజల ప్రేమని, గౌరవాన్ని పొందడానికి ఎన్నో పనులు చేపట్టవచ్చు అంతే!
ఈ ప్రపంచంలో అవకాశాలు అనంతం. చిన్నప్పటి కోరికలు, కలలు ధ్వంసం అయిపోలేదు. మన జీవన పరుగుతో మరుగున పడిపోయాయి. ఓ చిన్న ప్రయత్నం వల్ల మన కలలు సాఫల్యం అయ్యే అవకాశం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా కోల్పోయిన కలలు నిజం అవుతాయి. మన జీవితానికి సార్థకత కలుగజేస్తాయి.