AADIVAVRAM - Others

గట్టి పాఠం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజయ్య ఆ ఊరిలో అంతో ఇంతో ఉన్నవాడు. మంచి మనసున్నవాడు అని పేరుంది. అందరూ అతడిని గౌరవిస్తారు. అతనికి లేకలేక కలిగిన ఒకే ఒక్క కొడుకు శ్రీహరి అంటే ప్రాణం. అల్లారుముద్దుగా పెంచుకొన్నాడు. గారాబం చేశాడు కూడా. దీంతో శ్రీహరికి ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. శ్రీహరి పెరిగి పెద్దవాడవుతూనే.. ఇంట్లో గారాబం కారణంగా చెడు వాసాల వైపు మళ్లాడు. చదువు వొంటబట్టలేదు. ఏదైనా పని చెయ్యాలన్న ధ్యాస లేదు. ఎంతసేపూ స్నేహితులను వెంటేసుకొని తిరుగుతూ, చెడు అలవాట్లకు బానిసై, ఇంట్లోంచి దొంగతనంగా డబ్బు పట్టుకుపోవడం, జల్సాలు చేయడం మితిమీరిపోయింది. తల్లిదండ్రులు చెప్పే హితబోధలు తలకెక్కకపోవటం, వారి మాటలను లెక్క చేయకపోవడంతో రాజయ్యకు డబ్బుతోపాటు, గౌరవ మర్యాదలూ పరువూ పోయాయి.
ఒకరోజు రాజయ్య ‘నాయనా! నువ్విలా డబ్బు తగలేస్తూ స్నేహితులను వెంటేసుకొని తిరగడం ఏమీ బాగోలేదు. నలుగురూ నవ్వుతున్నారు. ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవడం లేదు. సంపాదన లేకుండా, ఉన్నది ఖర్చు పెట్టేస్తుంటే డబ్బు ఎంతకాలం ఉంటుంది? తరువాత మనం తిండికి, బట్టకి నానా అవస్థలు పడాల్సి వస్తుంది. నాకు వయసు పైబడింది. సంపాదించే స్థితిలో లేను. డబ్బు ఉన్నంతకాలం స్నేహితులు నీ చుట్టూ తిరుగుతారు. నీ దగ్గర డబ్బు లేనినాడు ఒక్కరూ నీ ముఖం చూడరు. ఇకనైనా తెలివి తెచ్చుకుని, చెడు తిరుగుళ్లు మాని ఇంటి పట్టున ఉండు’ అని తల్లి మంచి మాటలు చెప్పింది.
కాని శ్రీహరికి ఆ మాటలు చెవికెక్కలేదు. ఆ రాత్రే తనకు కావలసినంత డబ్బు మూట గట్టుకొని, స్నేహితులను వెంటేసుకొని పదిరోజుల దాకా రానంటూ వెల్లిపోయాడు. వీడికేదైనా ‘గట్టి పాఠం’ చెప్పాలని తల్లిదండ్రులు నిర్ణయించుకొని ఓ పథకం వేశారు.
* * *
కొడుకు తిరిగి వచ్చేసరికి రాజయ్య కుటుంబం బికారులుగా మారింది. కొడుకును చూట్టంతోనే తల్లి లబోదిబోమని ఏడుపు మొదలుపెట్టింది. ‘నువ్వు వెళ్లిన మర్నాడే ఇంట్లో దొంగలు పడి అంతా ఊడ్చుకుపోయారురా, కట్టుబట్టలతో మిగిలాం. తిండి కూడా లేదు’ అంటూ తండ్రి దిగులుగా ముఖం పెట్టాడు.
‘మేమేమీ చెయ్యగలిగే స్థితిలో లేము. ఏ కూలోనాలో చేద్దామంటే డబ్బు పోయిన బెంగతో నాన్న ఆరోగ్యం పాడైంది. నువ్వే ఏదో పని చేసో, స్నేహితుల నడిగో డబ్బు తెస్తే ఆకలి తీరుతుందిరా’ అని బోరుమంది తల్లి.
జరిగిన సంఘటనకు శ్రీహరి అవాక్కయ్యాడు. తల్లిదండ్రులను చూస్తే మనసు కరిగిపోయింది. జాలేసింది. అలా వీధిలోకి వెళ్లాడు. స్నేహితులను పలకరించబోతే ప్రతి ఒక్కరూ ముఖం చాటేశారు. పరిస్థితి అర్థమైంది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకపోవటం వల్ల జరిగిన అనర్థం ఏమిటో శ్రీహరికి తెలిసి వచ్చింది. డబ్బు ఉన్నప్పుడు కన్నూ మిన్నూ గానక ఖర్చు పెట్టినప్పుడు స్నేహితులు చుట్టూ ఉన్నారు. తనతో తిరిగి తన డబ్బుతో జల్సాలు చేశారు. ఇప్పుడు ఒక్కడు కూడా ఆదుకోవటానికి రావటంలేదన్న బెంగ అతణ్ణి ఆవరించింది.
* * *
శ్రీహరి శ్రమ విలువ, డబ్బు విలువ తెలిసి వచ్చింది. దాంతో కష్టించి తల్లిదండ్రులను పోషించటం ప్రారంభించాడు. తన సంపాదనతో తల్లిదండ్రుల ఆకలిని తీర్చటంలో ఉన్న తృప్తిని అనుభవించాడు. ఇన్నాళ్లూ తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టినందుకు తనలో తానే కుమిలిపోయాడు. కాలం కలిసివస్తే పూర్వ వైభవానికి తల్లిదండ్రులను తీసుకొని వెళ్లాలనుకున్నాడు. కొడుకులోని మార్పుని గమనించిన తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. చెడు వాసాలకు దూరంగా ఉంటూన్న కొడుకు పట్ల వారి ప్రేమ మరింత పెరిగింది. దీంతో - అసలు విషయం చెప్పారు. తమ ఆస్తి ఎక్కడికీ పోలేదనీ, నీలో మార్పు కోసమే ఈ పథకం వేశామని చెప్పారు. తల్లిదండ్రులు తన మార్పు కోసం ఇన్నాళ్లూ ఎంత కష్టపడ్డారో తెలుసుకొన్న శ్రీహరి ఆనాటి నుంచీ కష్టించి ఆస్తిని మరింత పెంచాడు. ఒక శుభ ముహూర్తాన పెళ్లి చేసుకొని హాయిగా కాలం గడపసాగాడు - తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ.
*

రేవతి