AADIVAVRAM - Others

ఆశల ముంగిళ్లు..అవకాశాల తోరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత నీరుపోయి కొత్త నీరురావాల్సిందే! పాత జ్ఞాపకాల దొంతరలకు మరొ కొత్త పొర చేరాల్సిందే! అందుకే కొత్త ఎప్పుడైనా కొత్తేననడం నానుడి. కొత్తదనంలో ఉన్నంత తీయదనం, రుచిచూసిన పాతదనంలో ఉండదు. కొత్త రుచులు, కొత్త సినిమాలు, కొత్త ప్రపంచం, విశ్వ గతిని మార్చే కొత్త ఆవిష్కరణలు, మనిషి ఆలోచనలను రోదసీ లోతుల్లోకి తీసుకెళ్లే సరికొత్త పరిశోధనలు.. ఇలా దేనిపైనైనా ఆసక్తి పెరగాలంటే, అనురక్తి ఇనుమడించాలంటే.. అది కచ్చితంగా నవ్యతకు ప్రతిబింబం కావాలి. గతం ఆలంబనగా కొత్త పుంతలు తొక్కించే బలమైన పునాదులే మన ఆలోచనలు. అలాంటి ఆలోచనలను ప్రొదిచేసుకుని.. సరికొత్త అడుగులు వేసేందుకు దోహదం చేసేదే కొత్త సంవత్సరం. కొత్త తరగతి, కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం.. ఇలా ప్రతి వ్యక్తిజీవితంలో ఇలాంటి ‘కొత్త’పుంతలెన్నో..ఎనె్నన్నో..! జ్ఞాపకాలు, అనుభవాలు, అనుబంధాలు, విజయాలు, పరాజయాలు ఇలాంటి ఎన్నింటి కలయికగానో మన జీవితాల్ని భిన్నకోణాల్లో ప్రభావితం చేసిన, మలిచిన, మైమరిపించిన 2016 కాలగర్భంలో కలిసిపోయింది. స్వాగతం.. సుస్వాగతం అంటూ తన పరంపరలో పుట్టిన 2017కు ఆహ్వానం పలికింది. గతాన్ని వెనక్కి తీసుకురాలేం. కానీ ఆ గతానుభవాల నుంచి వెలుగుబాటలు వేసుకోవచ్చు. జీవితాల్ని, జీవనాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. మనం అనుకున్న రీతిలో, అనుకున్న విధంగా జీవన గమనాన్ని ఆదర్శనీయంగా, మధురంగా, కమనీయంగానూ మార్చుకోవచ్చు. కానీ, ఇందుకు ఏమి చేయాలి.. 2016లాగే 2017 గడిచిపోకుండా.. మరపురాని జ్ఞాపకాల భాండాగారంలా నిలిచిపోయేలా ఏం చేయాలి? ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మంది కొత్త వత్సరానికి స్వాగతం పలుకుతూ మరో వసంతంలోకి అడుగుపెట్టాలన్న తహతహతో అడుగులు వేసేవారే. అయితే ఆ అడుగు ఎలా వెయ్యాలి? ఎంత బలంగా ఉండాలి? మన విలువలను కాపాడుకుంటూ, మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ అంతా మనంగా, మనమే అంతా అనుకుంటూ ముందుకు వెళ్లడంలోనే విలువలకు ఉద్దీపన. వ్యక్తుల సమూహమే సమాజం. సామాజిక మార్పులన్నవి వ్యక్తుల ఆలోచనల్లో వచ్చే మార్పుల ఆలంబనగానే ఉంటాయి. అంటే ఎవరికి వారుగా ‘నా ఒక్కడితో ఏమవుతుంది?’ అని అనుకుంటే మొత్తం సమాజ కదలికే ఆగిపోతుంది. ప్రతి అడుగూ కూడా సమాజాన్ని ఉన్నత భావాల దిశగా, విలువల దిశగా పరుగులు పెట్టించగలగాలి. ప్రతి వ్యక్తి ఓ వ్యవస్థగా మారితేనే అనుకున్న స్థాయిలో సంస్కరణలను తేవడానికి, వాటిని ఆచరణలోనూ చూపడానికి ఆస్కారం ఉంటుంది. ఇందుకు నిబద్ధత కావాలి. అంకితభావం పదునెక్కాలి. మనం చేసే ప్రతి పని మీదా ఓ స్పష్టమైన ఆలోచన, అవగాహన ఉండాలి. వేటివల్ల మనం విఫలమయ్యామో అవి పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పటడుగులకు ఆస్కారం లేకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలేమిటన్నది తదుపరి అడుగును నిర్దేశిస్తాయి. అలాంటి అడుగు వేసే అవకాశాన్ని కొత్త సంవత్సరం మరోసారి మనకు అందిస్తోంది. ఈ సువర్ణావకాశాన్ని మనం ఏవిధంగా అందిపుచుకుంటామో, ఎంతగా సద్వినియోగం చేసుకుంటామో, ఎంతగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటామన్న దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. కేవలం ఆలోచనలు ఉన్నంత మాత్రాన సరిపోదు. వాటిని ఆచరణాత్మకం చేయగలగాలి. ఈ విషయంలో వ్యక్తి అయినా, సమాజమైనా, దేశమైనా, నాయకులైనా, నాయకత్వమైనా ఒక్కటే. నిబద్ధత లోపిస్తే ఏదీ ముందుకు సాగదు. ఎంతటి ఘనమైన ఆలోచన అయినా పేలవంగా మారిపోతుంది. వ్యవస్థను నీరుగార్చేస్తుంది. ఆలోచనల్లో స్పష్టత ఉంటేనే లక్ష్యాన్ని నిర్దేశించుకోగలిగే బాటలు ఏర్పడతాయి. అలాంటి ఆలోచనలకు కొత్త సంవత్సరం దారులు తీయాలి. అనుకున్న ధ్యేయం దిశగా ముందుకు సాగే మార్గాంతరాన్ని కూడా ప్రతి ఒక్కరికీ అందించగలగాలి. అందుకు ప్రధానంగా ప్రతి ఒక్కరూ చేయాల్సింది తమనితాము తీర్చిదిద్దుకోవడం. వ్యక్తి వ్యవస్థగా వ్యవస్థ సమాజంగా ఈ రకమైన గుణాత్మక మార్పును సంతరించుకుంటే ఆ దిశగానే ప్రపంచమంతా ఒక్కటిగా ముందుకు సాగగలుగుతుంది. భారతావని విషయానికొస్తే..గడచిన ఏడాది చివరి వారాలు రానున్న భవితకు బలమైన బాటనే అందించాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇనే్నళ్లుగా చూడని పరిణామాలు ఇటీవల చోటుచేసుకున్నాయి. నిన్నటి భారతం వేరు...రేపటి భారతం వేరు అన్నట్టుగా చాలా స్పష్టమైన గీత బలంగానే ఏర్పడింది. ఈ నవభారతానికి ప్రతి ఒక్కరం సమాయత్తం కావాలి. ఉపాధి, ఉత్పాదకత, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్‌లు ఇలా ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నట్టుగా ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరినీ కొత్త అవకాశాలు పలుకరిస్తున్నాయి. అందిపుచ్చుకుంటే ఆశించిన అందలాలను అందుకోవడం అసాధ్యమేమీ కాదు. మంచి చెడుల విశే్లషణే జీవితం. లక్ష్య సాధనకు పట్టుదల ఎంత ముఖ్యమో...ఆ లక్ష్యం చేకూరాలంటే అందుకు దోహదం చేసే దారులూ అంతే ముఖ్యం. మనం ఏదారిలో వెళుతున్నాం..మనది సరైన దారేనా లేక తప్పుదోవా అనే ఇంగితమే విచక్షణ పెంచుతుంది. ఆ విచక్షణే ఆశయ సిద్ధికి బాటలు వేస్తుంది. తప్పటడుగులకు ఆస్కారం ఇవ్వకుండా సరైన మార్గంలోనే ముందుకెళ్లేందుకు తోడ్పడుతుంది. గతాన్ని విశే్లషించుకుంటూ..్భవితను నిర్మించుకోవడానికి అవకాశాల దొంతరలకో కొత్త ఏడాది మన ముందుకొచ్చింది. ఆశల తోరణాలు తొడిగిన అవకాశాల లొగిలిలోకి అడుగు పెడుతున్నాం. ఆ అడుగు ఎలా ఉండాలి..ఎంత హాయిగా, ఆనందంగా, చీకూచింతా లేకుండా సాఫీగా జీవితం, జీవనం సాగడానికి దోహదం చేయాలన్నది మనం తీసుకునే నిర్ణయంపైనే ఆధార పడి ఉంటుంది. ఆ నిర్ణయం వెనుక మన వ్యక్తిత్వం, అలవాట్లు, నిబద్ధత, పట్టుదల ఇలా ఎన్నో ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. అలాంటి బలమైన నిర్ణయంతోనే కొత్త సంవత్సరంలో అడుగు పెడదాం.

- బి. రాజేశ్వర ప్రసాద్