Others

సంకల్ప బలంతో ‘స్వచ్ఛత’ సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొద్దున్న లేవగానే పేపర్ చదవకపోతే నాకు ఏదో లోటుగా ఉంటుంది. ఆమాటే మా ఆవిడతో అంటే- ‘ఆ.. మీకు పనా, పాటా?’ అంటుంది. అది ఓ పని కానట్లు! ఆవిడ దృష్టిలో- ఇల్లూ, వాకిలీ ఊడ్చుకోవటం.. ఆపైన గినె్నలు కడుక్కోవడం.. ఇవే పనులు అంటే! ఊడ్చుకోవడం అనగానే నాకు ‘స్వచ్ఛ్భారత్’ గుర్తుకొస్తోంది, ఆ వెంటనే ప్రధాని మోదీ కూడా గుర్తుకొస్తారు కదా. ‘స్వచ్ఛ్భారత్’కి పొడిగింపుగా ఈ ఏడాది ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ను ఆయన ప్రవేశపెట్టబోతున్నారట. దాని కార్యాచరణకు సంబంధించిన సభ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిందట, ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో ర్యాంకు సాధించాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఆశయమట! అని అనుకుంటూ ఉంటే- నా మనసు అదేపనిగా స్పందించి ‘వావ్...హైదరాబాద్’ అన్న మాటలు నా నోటి నుంచి వచ్చాయి. ఇంతలో కాంపౌండ్‌వాల్ గేటు పెద్దశబ్దంతో తెరుచుకోవటంతో అటుచూసాను. మా ఆవిడ హడావుడిగా లోపలికి వస్తోంది. ఆమె ముఖంలో ఆనందం తాండవం ఆడుతోంది. ఒక చేతిలో ప్లాస్టిక్ చేట, మరో చేతిలో చీపురు ఉన్నాయి. మెళ్ళో పూలదండ వేళ్ళాడుతోంది. ‘ఏమండోయ్..’ అంటూ ఆరాటంగా ఏదో చెప్పాలని నావైపే వస్తోంది.
‘ఏంటే.. ఈ అవతారం.. ఊరేగింపునకు వెళ్ళివస్తున్నట్లు మెళ్ళో ఆ దండేంటి?!’అన్నాను ఆశ్చర్యంగా.
‘వాళ్ళెవరో నాకు సన్మానం చేసారండీ..’ అని అంటూ దండను చేత్తో పైకెత్తి చూపించింది.
‘అది కనబడుతూనే ఉంది.. నడిరోడ్డుమీద సన్మానం ఏమిటి? నువ్వేం ఘనకార్యం చేశావని?’ అడిగాను.
‘అదే అర్థం కాలేదండీ!’ అంది అమాయకంగా.
‘వాళ్ళను అడగలేదా..?’
‘వాళ్ళేదో చెప్పబోతుంటే.. నేనే ఆనందం ఆపుకోలేక ఈ దండను మీకు చూపిద్దామని వచ్చాను. బహుశ ‘ఉత్తమ ఇల్లాలి’నని దండ వేశారేమోనండీ!’ అంది అమాయకంగా. నేను ఆలోచనలో పడ్డాను. అప్పుడు నిన్న పేపర్లో చదివిన వార్త ఒకటి గుర్తుకొచ్చింది. రోడ్డుపక్కన ఎక్కడపడితే అక్కడ చెత్తవేసే వాళ్ళను ‘గాంధీమార్గంలో మందలించటానికి కొంతమంది స్వచ్ఛంద సమాజ సేవకులు వాళ్ళ మెళ్ళో దండవేసి నిరసన సత్కారం చేస్తున్నారని!
వెంటనే- ‘నువ్వు రోడ్డుమీద చెత్తవేశావా?’ అని అడిగాను మా ఆవిడను.
‘రోడ్డుమీద ఎందుకు వేస్తానూ.. రోడ్డుపక్కన వేశా..’
‘అదేం పని? మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన రెండు చెత్తబుట్టలు ఇంట్లో ఉన్నాయిగా. తడి, పొడి చెత్తను విడివిడిగా అందులో వేయాలని వాళ్ళు చెప్పారు కదా’ అని అడిగితే, ఆమె నిర్లక్ష్యంగా- ‘ఆ... అలా ఎవరు వేస్తారు పనిగట్టుకొని .. ఇది దగ్గర కదా అని రోడ్డువైపు వెళ్ళాను!’ అని సమాధానం ఇచ్చింది.
‘అందుకే నీకు మెళ్ళో దండవేసారు.. అది నీకు జరిగిన అవమానం, సత్కారం కాదు!’ అన్నాను.
‘అలా చెత్తవెయ్యకూడదని చెబితే సరిపోతుందిగా.. ఇలా దండవేయటం ఏంటి..?’ అంటూ దండ తీసి పక్కకు విసిరేసి- ‘ఈ జనం ఏమిటో.. కొత్త కొత్త నిరసనలు మొదలుపెట్టారు. నాలుగు బజార్ల కూడలిలో చెత్తకుండీ చుట్టూ ఉన్న చెత్తను మున్సిపాలిటీ బండి వచ్చి తీసుకెళ్ళాక ఎవరో దాని చుట్టూ నీళ్ళు చల్లి.. ముగ్గులు వేస్తే.. ఓహో... సంక్రాంతి పండుగకు ఇప్పుడు ఇలాంటిచోట కూడా ముగ్గులు పెడుతున్నారా..? అని ఆశ్చర్యపోయాను. అదీ ఇలాంటిదేనా..?’ ‘అవును.. చెత్తను చెత్తకుండీలో మాత్రమే వెయ్యాలని దాని పరిసరాలు ఇలా పరిశుభ్రంగా, అందంగా ఉండాలని’ ఆ విధంగా వాళ్ళు నీలాంటి వాళ్ళకు తెలియచెప్పారు.’ అన్నాను. నేను అలా అనగానే మా ఆవిడ రోషంతో రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది.
‘ఒక్కోసారి డైరెక్ట్‌గా నిందించటం కన్నా.. ఇలా ఇన్‌డైరెక్ట్‌గా.. వ్యంగ్యంగా... వెరైటీగా తెలిపే నిరసనలే మనసుకు సూటిగా తగిలి బాగా పనిచేస్తాయని మా ఆవిడను చూసాక నాకు అర్థమైంది. అలాంటి ఆలోచనలు వచ్చిన మెదళ్ళను మనసులోనే అభినందిస్తూ అప్పుడే వచ్చిన పేపర్‌ను చేతిలోకి తీసుకుని కుర్చీలో సెటిలయిపోయాను. ‘స్వచ్ఛ’ అంటే మనస్సు ఆలోచనల్లోని మంచి మార్పు.. అందరి మనస్సులు పరిశుభ్రం కావాలి.. ఆలోచనల్లో మార్పువస్తే ఇంటాబయటా స్వచ్ఛత వస్తుంది. ప్రతి ఒక్కరూ- ‘సంస్కరించు, ఆచరించు, మార్పుచేయి’ అని మూడు సూత్రాలను పాటించాలి. ప్రజల భాగస్వామ్యం లేనిదే ‘స్వచ్ఛ్భారత్’ కానీ, ‘స్వచ్ఛ సర్వేక్షణ్’గానీ, మరే కార్యక్రమం గానీ ముందుకుసాగవు. ఆ భాగస్వామ్యం కూడా ఏదో మొక్కుబడిగా గాక త్రికరణ శుద్ధిగా కాలుష్య రహిత పర్యావరణమే లక్ష్యసాధనగా ఉండాలి. ఇప్పటికే చెత్త వల్ల నేల, నీరు, గాలి కలుషితమైపోయాయి. ఇకనైనా మనలో మార్పు రావాలని ప్రకృతి ప్రమాద ఘంటిక మోగించి మరీ చెబుతోంది’ అనుకున్నాను.
‘దేశంలో ఉన్న చెత్తచెదారాన్నంతా ఒకదగ్గర కుప్పపోయాలంటే జనావాసాలన్నీ డంపింగ్ యార్డ్‌లుగా మారిపోతాయి. అందుకే ప్రభుత్వం రీ సైక్లింగ్ విధానాన్ని చేపట్టి వస్తుతయారీ చేయటం, విద్యుదుత్పత్తికి చెత్తను ఉపయోగించటం, కాగితం తయారీకి వ్యర్థాలను వాడటం వంటి బృహత్తరమైన పనులు చేబడుతోంది. ‘వేస్ట్ ఈజ్ ఎనర్జీ’ అంటూ చెత్తలో ‘పనికొచ్చే చెత్త’ను వేరుచేయమని ప్రజలను ఆ దిశగా మోదీ కార్యోన్ముఖులను చేస్తున్నారని అనిపించింది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్’పై కొత్త సంవత్సరంలో ప్రజలకు స్పష్టమైన అవగాహన కలిగించాలి. అందుకు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలు విస్తృత ప్రచారం చేయవలసి ఉంది. ప్లాస్టిక్, మెటల్, కాగితం, గాజు తదితర వ్యర్థాల నుంచి ఇతర వస్తువులను తయారు చేసే పనులను హైదరాబాద్ నగర పాలక సంస్థ ఐ.టి.సి. సంస్థకు అప్పగించింది. ‘చెత్తపై సమరం’, ‘ప్లాస్టిక్‌ని తరిమి కొడదాం’ వంటి నినాదాలు మన నగర ప్రజలను చైతన్యపరచటమేగాక దేశవ్యాప్తమై కాలుష్య రహిత సమాజం రావాలని నా మనసు ఉవ్విళ్ళూరింది. కానీ, ఆ ప్రచారంలో భాగంగా ‘ఉమ్మడి కుటుంబాలు విడిపోవటాన్ని- తడి, పొడి చెత్త వేరుచేయటాన్ని’ పోల్చిచెప్పటంలో సామ్యం కుదరలేదని అనిపించింది. ‘కుటుంబంగా కలిసుందాం.. చెత్తను విడదీద్దాం..!’, ‘ఉమ్మడి కుటుంబాలే ముక్కలుచెక్కలవుతున్నాయి. చెత్త ఎందుకు తడి, పొడిగా వేరు కాదు’ వంటి నినాదాలు అయోమయానికి, గందరగోళానికి గురిచేసేవిగా ఉన్నాయి.
ఏదైతేనేం విషయం అర్థమైందిగా. ఇక నగర పౌరులుగా మనం చేయాల్సిన పని ఏమిటంటే- ‘స్వచ్ఛ్భారత్ మిషన్‌వాళ్ళు మనకు ఫోన్‌చేసి, మీ నగరం స్వచ్ఛ సర్వేక్షణ్- 2017 పోటీలో ఉందా...?’ అని అడిగితే ‘ఉంది’ అని చెప్పటం.. క్షేత్రస్థాయి సర్వేకి వచ్చినప్పుడు ఆరు అంశాలపై వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం...! అప్పుడు పోటీలో నెగ్గి ‘వావ్ హైదరాబాద్’ అని అందరి ప్రశంసలనూ అందుకోవటం ఖాయం! ఈ విషయం మా ఆవిడకు కూడా చెప్పి ఆమెనూ కాస్త ఎడ్యుకేట్ చేద్దామని వంటింట్లోకి వెళితే.. అక్కడ కనిపించలేదు. ఇంటి వెనకవైపు తొంగి చూస్తే.. రెండు చెత్తబుట్టల్లో తడి, పొడి చెత్తను వేరువేరుగా వేస్తూ కనిపించింది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రారంభమైంది’ అనుకున్నాను చిరునవ్వుతో.

- కొఠారి వాణీచలపతిరావు