AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకో ప్రశ్న

పరశురాముడు తపస్సు చేసిన స్థలం ఎక్కడ ఉంది?

గత వారం ప్రశ్నకి జవాబు

ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్,
కజకిస్థాన్, దాటి ఇరాన్ దాకా.

విశ్వామిత్రుడి అస్త్రాలకి వారంతా ఓడిపోవడం చూసి వశిష్ఠుడు చెప్పాడు.
‘శబలా! యోగశక్తితో ఇంకా సైన్యాన్ని సృష్టించు’
మళ్లీ కామధేనువు చేసిన అంబా అనే ధ్వనికి దాన్నించి సూర్యతేజం గల కాంభోజులు, పొదుగు నించి ఆయుధాలతో పప్లవులు, యోని నించి శకులు, మలమూత్ర ద్వారాల నించి యవనులు, వెంట్రుల రంధ్రాల నించి మ్లేచ్ఛులు, హారీతులు, కిరాతులు పుట్టారు. వారంతా విశ్వామిత్రుడి సైన్యాన్ని క్షణంలో మట్టుపెట్టారు. అది చూసిన విశ్వామిత్రుడి ఏభై మంది కొడుకులు కోపంతో వివిధ ఆయుధాలతో వశిష్ఠుడి మీదకి వెళ్లారు. ఆయన హూంకారం చేసి వారి రథాలతో సహా వారిని బూడిద చేశాడు. ఇది చూసి విశ్వామిత్రుడు సిగ్గుపడి దుఃఖించాడు. కోరలు తీసిన పాములా, వేగం లేని సముద్రంలా, రాహువు మింగిన సూర్యుడిలా కాంతిని కోల్పోయాడు. అతని అహంకారం అణిగింది.
ఆయన తన భార్యకి రాజ్యాన్ని అప్పగించి కిన్నరులు, ఉరగులు గల హిమాలయానికి చేరి శివుడి కోసం తపస్సు చేశాడు. కొద్దికాలానికి శివుడు ప్రత్యక్షమయ్యాడు.
‘అన్ని రహస్యాలతో ధనుర్వేదాన్ని నాకు అనుగ్రహించు. దేవతలకి, రాక్షసులకి, మహర్షులకి, గంధర్వ, యక్షులకి తెలిసిన అన్ని అస్త్రాలని నాకు ప్రసాదించు’ విశ్వామిత్రుడు కోరాడు.
శివుడు వాటిని ఇచ్చాడు. స్వతహాగా అహంకారి ఐన విశ్వామిత్రుడికి అవి లభించడంతో అహం పెరిగింది. వశిష్ఠాశ్రమానికి వెళ్లి వశిష్ఠుడి మీద ఆ అస్త్రాలని ప్రయోగించగానే ఆ తపోవనం కాలిపోయింది. ‘సూర్యుడు మంచుని నశింప జేసినట్లుగా నేను శత్రువుని నశింపచేస్తాను’ అని వశిష్ఠుడు ధైర్యం చెప్పినా వేల కొద్దీ మృగాలు, పక్షులతో పాటు ఆయన శిష్యులు కూడా భయంతో పారిపోయారు. దాంతో తపోవనం నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా మారింది.
‘మూర్ఖుడా! చాలాకాలంగా పెంచిన నా ఆశ్రమాన్ని నాశనం చేసావు. ఇక నువ్వు ప్రాణాలతో ఉండవు’ వశిష్ఠుడు కోపంగా చెప్పి విశ్వామిత్రుడి మీద ఓ అస్త్రాన్ని ప్రయోగించాడు.
వశిష్ఠుడు పొగలేని నిప్పులా, రెండో యమదండంలా ఉన్న తన దండాన్ని తీసుకున్నాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు.
‘ఓ దుర్మార్గపు క్షత్రియుడా! నీ క్షత్రియ బలం ఎక్కడ? నా బ్రహ్మ బలం ఎక్కడ? నా బ్రహ్మ బలాన్ని చూడు’ చెప్పి వశిష్ఠుడు ఆ ఆగ్నేయాస్త్రాన్ని తన బ్రహ్మదండంతో శాంతింపజేశాడు.
వెంటనే విశ్వామిత్రుడు వారుణ, రౌద్ర, ఇంద్ర, పాశుపత, ఐషికాస్త్రాలని ప్రయోగించాడు. రామా! ఇంకా విశ్వామిత్రుడు మానవ, వౌహన, గాంధర్వ, స్వాపన, జృంభణ, మదన, సంతాపన, విలాపన, శోషణ, ధారణ, వజ్రాస్త్రాలని; బ్రహ్మ, వరుణ పాశాలని; పైనాక, దైతాస్త్రాలని; సుష్కం, ఆద్రం అనే రెండు వజ్రాలని; దండ, పైశాచ, క్రౌంచ అస్త్రాలని; ధర్మచక్ర, కాలచక్ర, విష్ణు చక్రాలని; వాయవ్య, మథన, హయ, శిరోస్త్రాలని; కంకాళం, ముసలం అనే రెండు శక్తులని; వైద్యాధర, కాల, త్రిశూల, కాపాల, కంకణాస్త్రాలని ప్రయోగించాడు. వశిష్ఠుడి దండం వాటన్నింటినీ మింగేసింది. దాంతో విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.
అది చూసి అగ్ని మొదలైన దేవతలు, దేవర్షులు, గంధర్వులు, మహోరగులు భయపడ్డారు. బ్రహ్మాస్త్రం మూడు లోకాలని బాధించింది. ఐతే వశిష్ఠుడు బ్రహ్మ తేజ ప్రభావంతో బ్రహ్మ దండంతో బ్రహ్మాస్త్రాన్ని కూడా మింగేశాడు. ఉగ్రంగా ఉన్న వశిష్ఠుడి వెంట్రుకల రంధ్రాల నించి మూడు లోకాలు మూర్ఛ చెందేలా పొగతో కూడిన అగ్ని కిరణాలు బయటకి వచ్చినట్లుగా కనిపించాడు. ఆయన చేతిలోని బ్రహ్మదండం పొగలేని ప్రళయాగ్నిలా, రెండో యమదండంలా వెలిగిపోసాగింది.
వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి వశిష్ఠుడితో చెప్పాడు.
‘మహామునీ! నీ బలం అడ్డులేనిది. నీ తేజస్సుని నీ తేజస్సులోనే నిగ్రహించి లోకాల బాధని తొలగించు. నువ్వు విశ్వామిత్రుడ్ని ఓడించావు’
వారి మాటలకి వశిష్ఠుడు శాంతించాడు. విశ్వామిత్రుడ్ని మునులంతా ఓదార్చారు.
‘్ఛ! క్షత్రియ బలం ఏముంది? బ్రహ్మ తేజో బలమైన నిజమైన బలం. ఒక్క బ్రహ్మదండం నా అస్త్రాలన్నిటినీ మింగేసింది. కాబట్టి నాకు బ్రాహ్మణత్వం వచ్చేలా ఇంద్రియాలని, మనసుని నిగ్రహించి తపస్సు చేస్తాను’ అని అలా గర్వభంగం చెందిన విశ్వామిత్రుడు నిశ్చయించుకున్నాడు. (బాలకాండ సర్గ 55-56)

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.ఆ కామధేనువు వశిష్టుడికి ఎవరికి ఏది ఇష్టమో అది ఇస్తుంది అని చెప్పటం తప్పు. ఎవరికి ఏది ఇష్టమో వారికి అది ఇస్తుంది.
2.శబల గోధుమ రొట్టెలని, కూరగాయలని ఇచ్చిందని వాల్మీకి రాయలేదు. బహుశ హరిదాసుకి అవి ఇష్టం కాబట్టి వాటిని కలిపి ఉంటాడు.
3.నీకు కోరినన్ని ఆవులు ఇస్తాను అని విశ్వామిత్రుడు అనలేదు. నీకు లక్ష ఆవులని ఇస్తాను’ అన్నాడు.
4.‘ఇంకా పదకొండు వేల మేలుజాతి గుర్రాలని ఇస్తాను’ అని కూడా చెప్పాడు. ఈ సంఖ్యని చెప్పడం హరిదాసు వదిలేశాడు.
5.వశిష్ఠుడు విధిలేక శబలని ఇవ్వడం తప్పు. విశ్వామిత్రుడు ఆ ఆవుని బలవంతంగా లాక్కుని వెళ్లాడు.
6.శబల తనంతట తానే సైన్యాన్ని సృష్టిస్తానని చెప్పలేదు. వశిష్ఠుడి ఆజ్ఞ మేరకి సృష్టించింది.
7.విశ్వామిత్రుడి సైన్యం పప్లవులని నాశనం చేయడం తప్పు. పప్లవులే విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేశారు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి