Others

దొరకునా ఇటువంటి సేవ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంజావూరు జిల్లాలో కావేరీ నదీ తీరంలో తిరువారూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే ప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగరాజు 1767లో జన్మించాడు. ఆయన తండ్రి రామబ్రహ్మం. తల్లి సీతమ్మ. రామబ్రహ్మం రామభక్తుడు. గంటల తరబడి శ్రీరామ పూజ చేసేవాడు. త్యాగరాజుకు కూడా తండ్రి చేసే రామపూజ అంటే చాలా ఇష్టంగా ఉండేది. తండ్రితోపాటు తానూ పూజాగృహ సమీపంలో కూర్చునేవాడు. తండ్రికి అవసరమయ్యే పూజాద్రవ్యాన్ని అందించేవాడు.
అలాగే తల్లి సీతమ్మ పురందరదాసు కీర్తనల్ని, జయదేవుని అష్టపదుల్ని శ్రావ్యంగా పాడుతుంటే తన్మయత్వంతో కళ్ళుమూసుకొని ధ్యానిస్తూ ఆనంద భాష్పాలు రాల్చేవాడు.. త్యాగరాజుకి ఏడేళ్ళు దాటాయి. ఆనాటి ఆచారం ప్రకారం రామబ్రహ్మం కుమారునికి ఉపనయనం చేశాడు. తానే గురువై విద్యాభ్యాసం చేయించాడు. ఆ ఏడేళ్ళ వయసులోనే త్యాగరాజు పూజచేస్తూ ఒకరోజు భక్తి తన్మయత్వంతో ‘నమో నమో రాఘవాయ’అనే దివ్య సంకీర్తన గానం చేశాడు.
అప్పట్లో ముద్రణాలయాలు, కాగితాలు లేనందున త్యాగరాజు ఇంటి గోడలపై కీర్తనలు రాసేవాడట. రామబ్రహ్మం ఒక రోజు గోడమీద రాతలు చూశాడు. అవేవో పిచ్చిగీతలని ముందు అనుకున్నాడు. కాని ఒకింత సేపు ఆలోచించి, పండితులకు వాటిని చూపించాడు. ఆ కీర్తనలలోని సంగీత సాహిత్యాలను గుర్తించిన పండితులు త్యాగరాజును మెచ్చుకొని, అతనికి సంగీతం నేర్పించమని రామబ్రహ్మానికి చెప్పారు.
దాంతో ఆ గ్రామంలోవున్న ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు శొంఠి వెంకట రమణయ్యకు త్యాగరాజును అప్పగించాడు రామబ్రహ్మం. రొట్టె విరిగి చేతిలో పడిందనుకున్నాడు త్యాగరాజు.. అతి తక్కువ కాలంలోనే గురువు మెచ్చుకునే శిష్యుడయ్యాడు. ఒకసారి శొంఠి వెంకట రమణయ్య విద్వత్సభ ఏర్పాటుచేశాడు. ఎందరో గాయకులు, పండితులు ఆ సభకు విచ్చేశారు. ఆ సందర్భంలో త్యాగరాజును కూడా పాడమని ఆదేశించాడు వెంకట రమణయ్య. త్యాగరాజు గురువుకు నమస్కరించి, సభా సదులకు వందనాలు అర్పించి బిలహరి రాగంలో ‘దొరుకునా ఇటువంటి సేవ...’ అనే పాట పాడాడు. ఆ కీర్తనలో సాహిత్యానికి, పాడిన పద్ధతికి అందరూ ముగ్ధులయ్యారు. సుప్రసిద్ధ గాయకులు కొందరు త్యాగరాజును, అతనికి విద్యనేర్పిన రమణయ్యను మనసారా పొగిడారు. అప్పుడు తన పాదాలకు నమస్కరించిన త్యాగరాజును లేవనెత్తి ఆలింగనం చేసుకుని వెంకటరమణయ్య ‘దొరకునా ఇటువంటి శిష్యుడు’ అంటూ ఆనందభాష్పాలు రాల్చాడు.
త్యాగరాజు యుక్తవయస్కుడయ్యాడు. గురువుగారి వద్ద నేర్చుకోవాల్సిందల్లా నేర్చుకున్నాడు. త్యాగరాజు మేనమామ వీణాకాళహస్తయ్య. ప్రసిద్ధ వైణికుడైన ఆయన ఇంట్లో ఎన్నో సంగీత గ్రంథాలు ఉండేవి. ఆ గ్రంథాలన్నింటినీ పరిశీలించినప్పటికీ త్యాగరాజుకు సంగీతానికి సంబంధించిన కొన్ని సందేహాలు అలాగే ఉండిపోయాయి. తన సందేహాలు ఎలా తీరుతాయా అని నిత్యం ఆలోచించేవాడు త్యాగరాజు.
ఓరోజు అనుకోకుండా ఓ సన్యాసి త్యాగరాజు ఇంటికి వచ్చాడు. ఆ సన్యాసిని సగౌరవంగా ఆహ్వానించి, తన ఆతిధ్యాన్ని స్వీకరించమని కోరాడు. సన్యాసి అందుకు అంగీకరించి తన వెంట తెచ్చుకున్న పుస్తకాలను అక్కడే వుంచి, కావేరీ నదిలో సాన్నంచేసి భోజన సమయానికి వస్తానని చెప్పాడు. త్యాగరాజు అలాగేనన్నాడు.
మధ్యాహ్నమైంది గాని సన్యాసి జాడలేదు. భోజనానికి ఆహ్వానించిన తర్వాత అతిథిని వదలి తాను భుజించడం ధర్మంకాదని త్యాగరాజు ఎంతోసేపు ఎదురుచూశాడు. చివరకు నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడా సన్యాసి కనబడలేదు. ఇక ఆ రోజంతా త్యాగరాజు ఉపవసించి, రాత్రి రామనామస్మరణ చేసుకొంటూ నిద్రపోయాడు. దాదాపు అర్ధరాత్రి దాటాక నారద మహర్షి కలలో కనబడి ‘త్యాగయ్యా! నేనే ఈ రోజు సన్యాసి వేషంలో నీ ఇంటికి వచ్చాను. నీవు అవతార పురుషుడివి. నీ సందేహాలను తీర్చడంకోసం సంగీత గ్రంథాలను తెచ్చాను. వాటిని చదివి నీ సందేహాలను నివృత్తిచేసుకో. నీవల్ల సంగీతానికి అనంత ప్రచారం కలుగబోతోంది’అని చెప్పాడు.
త్యాగరాజు మేల్కొన్నాడు. సన్యాసి వదలివెళ్ళిన మూట విప్పాడు. ఆ మూటలో ‘స్వరార్ణవ నారదీయ’మనే సంగీత గ్రంథాలు వున్నాయి. త్యాగరాజు ఎంతో మురిసిపోయాడు. వాటిని చదివిన తర్వాత అతని సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. తన సందేహాలు తీర్చిన నారదుణ్ణి ఎన్నో కీర్తనలతో స్తుతించాడు. త్యాగరాజు భక్తికి ప్రాధాన్యం ఇచ్చిన వాగ్గేయకారుడు. డాంబికాచారాలను, రాజుల కుటిల వర్తనాన్ని శిష్ట వ్యావహారికంలో సూటిగా విమర్శిస్తూ ఆవేశాత్మకంగా కీర్తనలు రాసినవాడు. ఆశ్రీతులన్నా, పండితులన్నా, శిష్యులన్నా త్యాగరాజుకు ఎంతో గౌరవం, ఆదరం అభిమానం ఉండేవి. పరమహంస బ్రహ్మానందేంద్రస్వామి ఆధ్వర్యంలో సన్యాసాశ్రమం స్వీకరించిన త్యాగరాజు, నాద బ్రహ్మానందస్వామిగా పిలువబడ్డాడు. తను కోరుకున్న విధంగా 1847లో శ్రీరాముని సాయుజ్యం పొందాడు.
త్యాగరాజు సిద్ధిపొందిన తర్వాత ఆనాటినుండీ కొందరు శిష్యులు పూజ చేసి ఇంటివద్ద ఆరాధన జరిపేవారట. ఒక శిష్యురాలు ఎంతో డబ్బు ఖర్చుపెట్టి 1925లో త్యాగరాజు సమాధిపైన ఆలయం కూడా నిర్మించిందని చెబుతారు. 1940 నుండి త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవ సభ ఏర్పాటుచేయబడింది. ఏటేటా జరిగే ఆరాధనోత్సవాలకు వేలకొద్దీ జనం ఇప్పటికీ హాజరవుతుంటారని ప్రతీతి. తమిళ దేశంలో జన్మించి తెలుగులో కీర్తనలు రాసి, కర్ణాటక సంగీతంలో కృతుల్ని వెలువరించిన నాద బ్రహ్మానందస్వామి త్యాగరాజు ధన్యజీవి.

- చోడిశెట్టి శ్రీనివాసరావు