AADIVAVRAM - Others

మంచి గురువు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతాపురం ఒక చిన్న గ్రామం. అందులో ఒక పాఠశాల ‘విజ్ఞాన మందిరం’. ఆ ఊరికి అది ఒక్కటే పాఠశాల. అందులో రామారావు ఒక మాస్టారు మాత్రమే. అయితే అతనికి పాఠశాలే ప్రపంచం. అందులోని విద్యార్థులే తన సొంత పిల్లలుగా భావించేవాడు. వారిలోని లోటుపాట్లను గమనించి, సరిదిద్ది, వారిని ఉత్తమ విద్యార్థులుగా మార్చటానికి ఎంతో కృషి చేసేవాడు. ఇతర గురువులు ‘నీకెందుకీ హైరానా?’ అని అన్నా వినేవాడు కాదు.
భవానీ చురుకైన, తెలివైన విద్యార్థిని. అన్నింటిలోనూ ముందుండేది. తరగతి ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్‌లో ఉండేది. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేది.
అయితే భవానీలో ఒకటే లోపం. అది స్కూల్‌కి ఆలస్యంగా రావటం. ఎన్నిసార్లు చెప్పినా అదే పద్ధతి. కానీ గట్టిగా మందలించటమో, దండించటమో చేయలేక పోయేవారు ప్రధానోపాధ్యాయులు కూడా. ఎందుకంటే ఆమె కమిటీ మెంబర్ కూతురు. పైనించి డబ్బుండటం వల్ల, ఇంట్లో గారాబంగా పెరగటంవల్ల, కొంచెం మొండితనం ఎక్కువే. త్వరగా రమ్మని చెప్పినా వినేది కాదు. ఆమెని చూసి మిగతా విద్యార్థులు ఆలస్యంగా రావటం మొదలుపెడతారేమోనని ప్రధానోపాధ్యాయునికి భయం. కానీ ఏమనలేక ఊరకుండిపోయాడు.
రామారావు మాస్టారు కూడా ఆమె ఆలస్యంగా రావటాన్ని గమనించాడు. అలాగే ప్రధానోపాధ్యాయుడు ఏమీ అనలేక పోవటం కూడా గ్రహించాడు. కానీ రామారావు మాస్టారుకి అది నచ్చేది కాదు. విద్యార్థులలో బేధ భావం చూపించకూడదు కదా అనుకొనేవాడు.
అంతేకాదు. విద్యార్థులకి చదువుతోపాటు క్రమశిక్షణా అవసరమేనని అతని భావం. అదీగాక అన్ని మంచి లక్షణాలున్న ఆమెలో చంద్రునిపై మచ్చలకి మల్లే ఆ ఒక్క లోటు కొట్టొచ్చినట్టు కనపడుతోంది.
భవానీని అందరూ ‘లేట్ భవాని’ అనటం విన్నాడు. ‘నీకేమమ్మా ఎప్పుడొచ్చినా ఎవరూ ఏమీ అనరు. కమిటీ మెంబరు కూతురివి కదా’ అని దెప్పేవారు ఇంకొందరు.
ఇవన్నీ విని, చూసి రామారావు మాస్టారుకి బాధ కలిగింది. పిల్లల్లో బేధభావం, ఈర్ష్య, అసహనం మొదలైనట్లు గమనించాడు.
ఈ రోజుల్లో పబ్లిక్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి రానివ్వటం లేదు. ఈమెలోని ఈ అలవాటును మార్చకపోతే ఇదే పద్ధతిలో పరీక్షలకు వెలితే, ఆలస్యం కారణంగా లోపలికి రానీయకపోతే సంవత్సరం వృధా అవుతుంది. ఎలాగైనా ఈ ‘లేట్’ అలవాటును భవానీతో మాన్పించాలని అనుకున్నాడు రామారావు మాస్టారు.
ఓ ఉపాయం తట్టింది.
మరునాడు భవానీతో ఇలా చెప్పాడు.
‘గంటలు కొట్టే గరటయ్య కాలు విరగటంతో ఆరు వారాలు సెలవు పెట్టాడు. పని మనిషి గోగులమ్మకి టైం తెలియదు కాబట్టి ఆ సమయానికి ఆమె చేత నువ్వు గంటలు కొట్టించు. స్కూల్ లీడర్‌గా అందరినీ సమయానికి హాజరు పరచటం నీ బాధ్యత’
నిజానికి ఆ పని తను చేయించగలడు. కానీ..
భవానీలో మార్పు రావటం కోసం అలా ప్లాన్ చేశాడు.
ఇక భవానీ ఏం చేస్తుంది? టైంకి మొదటి గంట కొట్టించాలంటే తను స్కూల్ టైం కంటే ముందర రావాలి. అలాగే చివరి వరకు ఉండాలి.
దాంతో స్కూల్‌కి అందరి కంటే ముందు రాసాగింది. భవానీలోని లేటు అలవాటుకు ఇలా పరిష్కారాన్ని సూచించారు మాస్టారు.
*

- ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి