AADIVAVRAM - Others

చరిత్ర చీకటి కోణాలపై ప్రసరించిన కాంతిరేఖ (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగత్‌సింగ్
రచన : ఎం.వి.ఆర్.శాస్ర్తి
పుటలు: 280 - వెల: రు.200
దుర్గా పబ్లికేషన్స్
జి-1, సాయకృష్ణ మాన్షన్,
1-1-230/9, వివేక్‌నగర్, చిక్కడపల్లి,
హైదరాబాద్ - 500 020
ఫోన్ : 040-27632824
9441257962
www.supatha.in
**
చరిత్ర మన గతకాలపు ఔన్నత్యాన్ని చాటేలా ఉండాలి. మన పూర్వీకులు చేసిన పోరాటాలను, వారి ధైర్య సాహసాలను కథలుగా చెప్పాలి. వాస్తవాలను దృశ్యరూపంలోకి మళ్లించాలి. హృదయానికి హత్తుకునేలా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న గ్రంథం ఎం.వి.ఆర్.శాస్ర్తీ రచించిన ‘్భగత్‌సింగ్’. దేశ స్వాతంత్య్ర సమరాన్ని ఆకర్షణీయంగా చెప్పిన గ్రంథమిది. నలభై ఏడు వ్యాసాల్లో భగత్‌సింగ్ జీవిత విశేషాలను ఎం.వి.ఆర్. శాస్ర్తీ చెప్పిన తీరు అపూర్వం.
ఈ గ్రంథాన్ని చదువుతుంటే చరిత్ర కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. దృశ్యం అనంతరం దృశ్యంగా దృశ్యాలు మారుతుంటాయి. దృశ్యాల సమాహారంగా స్వాతంత్య్ర సమరం మనోఫలకం ముందు చిగురిస్తుంది. చలనచిత్రాన్ని చూస్తున్న అనుభూతికి లోనయ్యేలా చేస్తుంది. చీకటి కోణాల్లో మగ్గిపోయిన సత్యాలపై కాంతిరేఖ ప్రసరింపజేశారు ఎం.వి.ఆర్.శాస్ర్తీ.
భగత్‌సింగ్ ఉరితీత విషయంలో గాంధీ ఉదాసీనతను, గాంధీ నిర్వహించిన పాత్రను ఐదు అధ్యాయాల్లో సవివరంగా విశే్లషించారు. భగత్‌సింగ్‌ను ఉరి తీయాల్సిందేనని ఢిల్లీ చర్చల్లో వైస్రాయ్ ఇర్విన్, గాంధీజీల మధ్య అంగీకారం కుదిరిందని స్పష్టంగా వెల్లడి చేశారు శాస్ర్తీ. స్వాతంత్య్ర సమరాన్ని ఒకే కోణంలో చూస్తూ, మితవాదుల వల్లే స్వాతంత్య్రం వచ్చిందని భావిస్తోన్న వారందరికీ షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. నాణేనికి మరోవైపూ చూపించారు. ఆధారం లేని విమర్శలు, నిరాధార కథనాలు ఎక్కడా వినిపించలేదు శాస్ర్తీ. ఏ చర్చ జరిపినా, ఏ అభిప్రాయానికి, నిర్ధారణకు వచ్చినా ఆధారం ఉండాల్సిందే. భగత్‌సింగ్ విషయంలో గాంధీ పాత్రపైనా అంతే! భగత్‌సింగ్ ఉరితీత నిర్ణయం తీసుకున్న తేదీపై సహేతుకంగా పరిశోధన నిర్వహించారు ఈ గ్రంథ రచయిత. ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారో ఈ గ్రంథం చదివాక ఎవరైనా ఒక అవగాహనకు రావడం ఖాయం. ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారనే విషయంలో సందిగ్ధత పోయి స్పష్టత వస్తుంది.
ఈ గ్రంథంలో మొత్తం 47 అధ్యాయాలున్నాయి. వీటిలో మొదటి అధ్యాయం ‘మట్టి మీద ఒట్టు’. ఈ అధ్యాయం భగత్‌సింగ్‌ను పరిచయం చేయడానికి ఉద్దేశించింది. జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని ఈ అధ్యాయంలో వివరించారు రచయిత. ఈ ఘటన విని, వేదన అనుభవించి ‘విలవిలలాడిన వేలూ లక్షల జనంలో పనె్నండేళ్ల లాహోర్ బాలుడి’గా భగత్‌సింగ్‌ను పరిచయం చేస్తారు. జలియన్ వాలాబాగ్ ఘటనలో మృతుల నెత్తురుతో తడిసిన మట్టిని భగత్‌సింగ్ చిన్న గాజు సీసాలో నింపుకుంటాడు. ఆ రక్తంతో ప్రేరణ పొందుతాడు. తన మాతృభూమిని విదేశీ చెర నుండి విడిపించడానికి తన ప్రాణాలను ధారపోయడానికి సిద్ధమవుతాడు. అంత పనీ చేశాడని పేర్కొని, భగత్‌సింగ్ బాల్య ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారని చెప్పడంతో మొదటి అధ్యాయం ముగుస్తుంది (పేజీ నెం.5)
మరి రెండో అధ్యాయంలో ఏం ఉంటుంది? ఏ అంశాన్ని రెండో అధ్యాయంలో రచయిత స్పృశించి ఉంటారు? ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకునే దిశగా వివిధ ఉద్యమాల్లో భగత్ పాల్గొన్న తీరును రెండో అధ్యాయం వివరిస్తుందనుకుంటాం. కానీ శాస్ర్తీ తీరే వేరు. మొదటి అధ్యాయంలో పేర్కొన్న ప్రతిజ్ఞకు సీక్వెల్ ఈ అధ్యాయం. తన శపథాన్ని భగత్ నెరవేర్చుకున్న తీరును ఈ అధ్యాయం వివరిస్తుంది. భగత్, రాజగురు, సుఖదేవ్‌ల ఉరితీతను వివరిస్తుందీ అధ్యాయం. ‘1931 మార్చి 237. అతడు అమరుడై ప్రజల గుండెల్లో చిరంజీవిగా మారిన తీరును వివరిస్తుంది. ఉరికంబానికీ వెరవకుండా ఆత్మస్థైర్యంతో ‘సర్ఫరోషి కీ తమన్నా అబ్ హమారే దిల్ మే హై’ అంటూ పాట పాడుతూ ఉరికంబం వైపు సాగిన తీరును ఈ అధ్యాయం అద్భుతంగా చిత్రీకరిస్తుంది (పేజీ నెం.11).
ఇక ఇక్కడితో ఆగిపోయి, భగత్ బాల్యంలోకి పరుగెడుతుంది మూడో అధ్యాయం ‘తుపాకులను నాటించిన వంశం’. ఈ అధ్యాయం భగత్‌సింగ్ వంశంలోని ముత్తాత, తాత, తండ్రి, బాబాయిల గొప్పదనాన్ని వివరిస్తుంది (పేజీ నెం.13)
నాలుగో అధ్యాయం ‘ఇంకో దారి ఉందా అమ్మా?’. ఫతేసింగ్ మునిమనవడిగా, అర్జున్‌సింగ్ మనవడిగా, కిషన్‌సింగ్ కొడుకుగా, అజిత్‌సింగ్ అన్న కుమారుడిగా సర్కారుకు ఎదురుతిరిగి ఉద్యమంలో పాల్గొనడం మినహా మరో దారి లేనివాడిగా భగత్‌సింగ్‌ను చూపడం ఈ అధ్యాయం ఉద్దేశం (పేజీ నెం.23).
ఇదీ శాస్ర్తీ కథానిర్మాణ పద్ధతి. మొదటి అధ్యాయంలో భగత్ పరిచయం. రెండో అధ్యాయంలో ఉరి, మూడో అధ్యాయంలో వంశ చరిత్ర, నాలుగో అధ్యాయంలో వంశానుగతంగా సంక్రమించిన పోరాట పటిమకు భిన్నంగా భగత్‌సింగ్ ఉండబోడన్న సందేశం ఇవ్వడం - ఈ విధంగా ఒక చక్కని నిర్మాణ రీతి ఈ గ్రంథంలో కనబడుతుంది. ఈ విధంగా క్రమక్రమంగా, అంచెలంచెలుగా కథలోకి పాఠకుడిని తీసుకువెళ్తారు రచయిత.
భాషను ఉపయోగించడంలో సారళ్యతకే పెద్దపీట వేశారు శాస్ర్తీ. చదువరులకు అందరికీ అర్థం కావడమనే ఉద్దేశం నెరవేరింది. భాష వినియోగపరంగా ఉత్తమ స్థాయి గ్రంథం ‘్భగత్‌సింగ్’.
‘డిఫెన్సు’ అనే పదానికి రెండర్థాలున్నాయి. కోర్టులో ‘డిఫెన్సు పక్షం’ ప్రాసిక్యూషన్ అభియోగాలను ఖండిస్తుంది. క్రికెట్ ఆటలో ‘డిఫెన్సు’ అంటే తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేయడమని అర్థం. ఈ రెండర్థాలను కలిపేసి, అద్భుతం చేశారు శాస్ర్తీ. కోర్టు హాలును విప్లవయోధులు తమ ప్రచారానికి ఉపయోగించుకున్నారు. విప్లవకారులతో ఉండి, వివిధ విప్లవ కార్యకలాపాల్లో పాల్గొని, అప్రూవర్లుగా మారిన జయపాల్, హన్స్‌రాజ్ వోరా వంటి సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌ను భగత్‌సింగ్, సుఖదేవ్‌లే ఎక్కువగా చేసేవారు. తద్వారా విప్లవ విధానాలను ప్రజలకు తెలియజెప్పడం వారి ఉద్దేశం. కోర్టు వేదికను వారు తెలివిగా వాడుకొని ప్రభుత్వంతో ఆటాడుకున్నారు. అందుకే ఈ సందర్భంలో రచయిత ప్రయోగించిన వాక్యం ‘దానికి తగ్గట్టే డిఫెన్సు ఆడారు’ (పేజీ నెం.211). ఈ వాక్యం ప్రయోగించడం ద్వారా వారు డిఫెన్స్ నిర్వహించారని చెప్పడంతో పాటు కోర్టుతో ఆడుకున్నారని కూడా చెప్పడం రచయిత ఉద్దేశం.
రచయితలనేకులు బ్రిటిషు వారిని ‘సీమ దొరలు’గా పేర్కొనడం వివిధ గ్రంథాల్లో కనిపిస్తుంది. ఈ గ్రంథంలో వారిని ‘సీమ సాములు’ (పేజీ నెం.103) అనడం గమనించవచ్చు.
పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మృతికి కారణమైన పోలీసు సూపరింటెండెంట్ స్కాట్‌ను హత్య చేసేందుకు ‘హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్’ (హెచ్.ఎస్.ఆర్.ఎ.) వల పన్నింది. ఆ సంస్థ కమాండర్ ఇన్ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలో ప్రణాళిక రూపొందించింది. ఈ సందర్భంగా శాస్ర్తీ రాసిన ఒక వాక్యం చదువరులను ఆకర్షించక మానదు. ఆ వాక్యం ‘స్కాట్‌కి స్పాట్ పెట్టాలి’ (పేజీ నెం.113). ఆధునిక వ్యావహారిక భాషా వినియోగంలో చంపడానికి పర్యాయపదంగా ‘స్పాట్ పెట్టడా’న్ని ఉపయోగిస్తున్నాం. ఇక్కడ హతుడవ్వాల్సిన వాడు స్కాట్. ‘స్కాట్’ అనే పదానికీ ‘స్పాట్’ అనే పదానికీ మధ్య భాషాపరంగా లంకె ఉంది. ఒకే హల్లుల జత పునరావృతమైంది. కాకపోతే వేర్వేరు ఒత్తులతో. ఈ వాక్యమూ శాస్ర్తీ రచనల్లో పరిపుష్టమైన ఆలంకారిక ప్రయోగాలకు ఉదాహరణగా చెప్పవచ్చు.
అందరూ ప్రయోగించే భాషకు వైవిధ్యంగా భాషను ప్రయోగించడం, పడికట్టు పదాలను పరిహరించడం ఈ గ్రంథంలో కనిపిస్తుందనేందుకు అనేక ఉదాహరణలు పేర్కొనవచ్చు.
స్కాట్ హత్య ప్రణాళిక సందర్భంలో ఈ హత్యలో పాల్గొనబోయే జట్టును ‘చంపుడు జట్టు’గా పేర్కొంటారు శాస్ర్తీ (పేజీ నెం.114). 1915లో, 1930లో స్పెషల్ ట్రిబ్యునళ్లను బ్రిటిషు ప్రభుత్వం నియమించింది. ఈ రెండు ట్రిబ్యునళ్ల మధ్య తేడాను చెప్పే సందర్భంలో ‘పీటల మీద కూర్చునేది హైకోర్టు జడ్జీలు’ అనడాన్ని గమనించవచ్చు (పేజీ నెం.225). ఇదే పేజీలో ‘విశేషాధికారాన్ని ఆవాహన చేయడం’, ‘ట్రిబ్యునల్ అవతారం చాలించింది’ మొదలైన ప్రయోగాలు కనబడతాయి.
వైవిధ్యభరిత భాషా ప్రయోగాలకు చిరునామా ఎం.వి.ఆర్. శాస్ర్తీ. భాషా చమత్కారాలనేకం ఆయన రచనల్లో కనబడతాయి. 1919లో బైశాఖీ పర్వదినమైన ఏప్రిల్ 13న జరిగిన హృదయవిదారక ఘటన జలియన్ వాలాబాగ్ ఊచకోత. ఈ ఊచకోతకు జనరల్ డయ్యర్ ఆదేశించిన సందర్భంగా శాస్ర్తీ ప్రయోగించిన వాక్యం ‘డయ్యరాసురుడు అసుర సంధ్య వేళ ‘ఫైర్’ అన్నాడు.’ (పేజీ నెం.2). భాషా ప్రయోగపరంగా అద్భుతమైన వాక్యమిది. జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హెన్రీ డయ్యర్‌ను రాక్షసుడితో పోల్చారు శాస్ర్తీ. డయ్యర్ అసురుడు. ఆ సమయమూ అసుర సంధ్యాసమయం. ఈ రెంటి మధ్యా చక్కని లంకె కుదిర్చి రాసిన వాక్యమిది.
‘ఇంక్విలాబ్ జిందాబాద్’ విప్లవకారులకు రణన్నినాదం. ఈ ఎనిమిది అక్షరాలను ‘విప్లవ అష్టాక్షరి’గా పేర్కొన్నారు రచయిత (పేజీ నెం.168).
‘ఈ కాలపు ‘గురు’్భక్తులు మతి చెడ్డ మేధావులు. కల్తీలేని జాతి వ్యతిరేక శక్తులు’ అని ప్రకటించడంలో అఫ్జల్‌గురును అనుసరించే వాళ్లను నిశితంగా విమర్శించడం కనిపిస్తుంది (పేజీ నెం.175).
ఈ గ్రంథ రచయిత గొప్ప అనువాదకుడు కూడా. ఈ విషయం అనేక సందర్భాల్లో ఈ అనువాద కళ బహిర్గతమవుతుంది.
సాధారణంగా ‘హంగర్ స్ట్రైక్’ అనే పదానికి తెలుగులో కనపడే అనువాదం ‘నిరాహారదీక్ష’. కానీ ఈ పదానికి శాస్ర్తీ అందజేసిన అనువాదం ‘ఆకలి సమ్మె’. చాలా బలంగా భావాన్ని తెలియజేసే అనువాదమిది.
భగత్, దత్‌లను జైలు నుండి విడిపించే ప్రణాళికలో భాగంగా నిర్వహించిన బాంబు పరీక్ష ఘటనలో భగవతీ చరణ్ హతుడౌతాడు. ఈ సందర్భంలో రచయిత రాసిన వాక్యాలు అభినందనీయం. ‘విప్లవపు లేత మొక్క వీరుడి రక్తంతోటే పెరుగుతుంది’ అన్న తొలి వాక్యంతో విప్లవ పార్టీ మేనిఫెస్టోను.. ‘బాంబు మార్గం’ (్ఫలాసఫీ ఆఫ్ బాంబ్) అనే గాంధీగారి ఆక్షేపణ వ్యాసానికి జవాబుగా ‘బాంబు తత్వం’ అనే ప్రసిద్ధ సమాధానాన్ని రాసిన భగవతీ చరణ్ జీవితం అలా బాంబు ప్రమాదంలో రక్త తర్పణంతో ముగిసింది’ అన్న వాక్యాలు భగవతీ చరణ్ గొప్పదనాన్ని వెల్లడిస్తాయి (పేజీ నెం.238).
భగత్‌సింగ్ చివరి ఘడియల్లో భోఘాతో సంభాషణ కళ్ళనీళ్లు తెప్పిస్తుంది (పేజీ నెం.280). భగత్ చివరి కోరికగా కోరిన భోఘా చేతి భోజనం తినకుండానే, భోఘా తిరిగి వచ్చేసరికి భగత్‌సింగ్‌ను ఉరి తీయడం పాఠకుడి హృదయాన్ని ద్రవింపజేస్తుంది. ఈ సందర్భంలోనూ, భగత్ అంత్యక్రియల సందర్భంలోనూ శాస్ర్తీ రచనా శైలి మనసును కదిలించి వేస్తుంది (పేజీ నెం.282).
ఒక చారిత్రక అంశంపై రచన చేసే రచయిత కేవలం వాస్తవాలను ఉన్నదున్నట్టుగా చెప్తే సరిపోదు. వివిధ అంశాలపై వ్యాఖ్యానాలు చేయాలి. వివిధ చిత్తవృత్తులను సరిగ్గా పట్టుకోగలగాలి. పరిశోధక పాత్ర నిర్వర్తించాలి. ఈ బాధ్యత నుండి ఈ రచయిత దూరంగా జరగలేదు. భగత్‌సింగ్ నాస్తికుడు. ఈ విషయం అనేక సందర్భాల్లో బహిర్గతమైంది. చివరికి ఉరి సందర్భంలోనూ. అయితే తన మిత్రుడు అమర్‌చంద్‌కు భగత్ రాసిన లేఖలో విధి రాత చిత్రం ఉందని పేర్కొనడం విచిత్రం. ఇక్కడే శాస్ర్తీ పరిశోధక పాత్ర నిర్వర్తించారు. తలరాతను భగత్ ప్రస్తావించడాన్ని పసిగట్టారు. ‘దేవుణ్ణి నమ్మే ఆస్తికుడిగానే ఇందులో భగత్ పొడగడతాడ’ని వ్యాఖ్యానించారు (పేజీ నెం.89).
సాండర్స్ హత్య కేసులో భగత్‌సింగ్ పట్టుబడడానికి అతని అలసత్వమే కారణమని చాలామంది రచయితలు పేర్కొంటారు. దాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు శాస్ర్తీ. పోలీసులకు పట్టుబడడం కోసమే భగత్‌సింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు (పేజీ నెం.187). ‘అజాగ్రత్త వల్ల గుట్టు బయట పెట్టుకుని ఉరికంబం ఎక్కడం కాదు. ఉరికంబం ఎక్కడం కోసమే అజాగ్రత్తగా మెలగి తన గుట్టును తానే బుద్ధిపూర్వకంగా రట్టు చేసుకున్నాడ’ని వివరించారు.
వివిధ ఛాయాచిత్రాలను కూడా ఈ గ్రంథంలో సందర్భానుసారం ఆయా పుటల్లో ఇవ్వడం ఈ గ్రంథానికి బలాన్ని చేకూరుస్తుంది.
పార్లమెంటు దాడి సందర్భంలో హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ (హెచ్.ఎస్.ఆర్.ఎ) రూపొందించిన కరపత్రం ఒక అద్భుతం. ఈ ముసాయిదాను భగత్‌సింగ్ విలక్షణంగా తయారుచేశాడు. ఈ కాపీని ఈ గ్రంథంలో అందించడం బాగుంది (పేజీ నెం.167).
భగత్‌సింగ్ రైల్వే లాకప్‌లో ఉండగా తీసిన చిత్రాన్ని ఈ గ్రంథంలో ప్రచురించారు. ఈ చిత్రంలో మంచంపై భగత్ కూర్చుని ఉండగా సి.ఐ.డి. డి.ఎస్.పి. గోపాల్‌సింగ్ అతన్ని విచారిస్తుంటాడు. ఇది అరుదైన చిత్రం (పేజీ నెం.87).
భగత్‌సింగ్ నేషనల్ కాలేజీలో చదువుతున్నప్పటి గ్రూపు ఫొటో (పేజీ నెం.39), రాంప్రసాద్ బిస్మిల్ ఫొటో (పేజీ నెం.81), పోలీసుల లాఠీ దెబ్బలకు గాయపడిన లాలా లజపత్‌రాయ్ ఫొటో (పేజీ నెం.108), లాహోర్‌లో అప్పటి పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం ఫొటో (పేజీ నెం.115), కుమారుడు శచీంద్రతో దుర్గాదేవి, భగవతీ చరణ్ దంపతుల ఫొటో (పేజీ నెం.127), రాజ్‌గురు ఫొటో (పేజీ నెం.145), యతీంద్రనాథ్ దాస్ ఫొటో (పేజీ నెం.207) ఈ గ్రంథంలో ప్రచురితమైన అరుదైన చిత్రాలు.
అనేక చారిత్రక అంశాలను స్పృశించిన ఉత్తమ గ్రంథం ‘్భగత్‌సింగ్’. జనం మరిచిపోయిన, జనానికి తెలియని వివిధ చారిత్రక సత్యాలను తేటతెల్లం చేసిన గ్రంథం ‘్భగత్‌సింగ్’. భాష పరంగా, శైలి పరంగా, కథా నిర్మాణ పరంగా ఉత్తమ ప్రమాణాలను కలిగి ఉన్న గ్రంథమిది.

- డా. రాయారావు సూర్యప్రకాశ్‌రావు