తెలంగాణ

ఓయూ ధగధగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపటినుంచి అట్టహాసంగా శతాబ్ది ఉత్సవాలు

27న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏడాది పొడవునా వేడుకలు

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఈనెల 26 నుంచి మూడు రోజులపాటు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం వరంగల్ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని, డిజిపిని ఆరా తీశారు. ఏర్పాట్లులో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మూడు రోజుల్లో ప్రారంభ వేడుకలు జరుగుతాయని, తర్వాత ఏడాదిపాటు ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు కొనసాగుతాయని కడియం శ్రీహరి మీడియాకు తెలిపారు. ఉస్మానియా వర్శిటీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణ- భద్రతా ఏర్పాట్లపై నగర కమిషనర్ సోమవారం వర్శిటీ దూరవిద్యా కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా
విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యంత పురాతన వర్శిటీల్లో ఏడోదని, దక్షిణాదిలో మూడోదని, ఈ యూనివర్శిటీలో మేధావులు, రాజకీయ నాయకులు, అనేకమందికి తన ఒడిలో చదువులు నేర్పి ప్రపంచానికి అందించిందని కడియం శ్రీహరి గుర్తుచేశారు. ముఖ్యంగా తెలంగాణలోని యాస, భాష, సంప్రదాయాలతో ఉస్మానియాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఉస్మానియా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లోనే 200 కోట్ల కేటాయించిందన్నారు. ఈ బడ్జెట్‌తో ఉస్మానియా యూనివర్శిటీతో పాటు అనుబంధ కాలేజీల్లోనూ హాస్టళ్ల కొత్త భవనాలు నిర్మించడం, ఉన్నవాటికి మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు.
ఉస్మానియా వర్శిటీలో కొత్త సెంటినరీ బ్లాకులు, అకాడమిక్ బ్లాకులు, హాస్టళ్లు, వౌలిక వసతులు రానున్నాయన్నారు. ఈ కొత్త నిర్మాణాలకు ఈ నెల26న ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా శంకుస్థాపన చేస్తామన్నారు. శతాబ్ది వేడుకలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతోపాటు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అతిథులుగా హాజరుకానున్నారని అన్నారు. 27న జరిగే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారన్నారు. 28న జరిగే అఖిల భారత విసిల సమావేశానికి కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. మూడు రోజులపాటు జరిగే ప్రారంభ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ జనజీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటాయని అన్నారు.
భారీఎత్తున కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాలు రవీంద్రభారతిలో నిర్వహిస్తారు, ప్రధాన కార్యక్రమం, సాహిత్య , విద్యాత్మక కార్యక్రమాలు ఉస్మానియా యూనివర్శిటీలో మూడుచోట్ల నిర్వహిస్తారు. 26న వర్శిటీ ‘ఎ’ గ్రౌండ్‌లో ఉదయం 10.30 నుండి సాంస్కృతిక కార్యక్రమాలతో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఒయు డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు, మధ్యాహ్నం 12.30 నుండి 1.30 వరకూ జరిగే ప్రధాన కార్యక్రమానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ హాజరవుతారు. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అధ్యక్షత వహిస్తారని, సభకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, బండారు దత్తాత్రేయ, కడియం శ్రీహరి, డాక్టర్ కె కేశవరావు, బొంతు రామమోహన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని విసి ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం అన్నారు.
రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐదు వరకూ జరుగుతుందని, అందులో ‘తెలంగాణ- దేశ పునర్నిర్మాణంలో ఉస్మానియా యూనివర్శిటీ పాత్ర’ పేరిట సెమినార్ జరుగుతుందని చెప్పారు. కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా వస్తారని, ఎంపి కె కేశవరావు అధ్యక్షత వహిస్తారని అన్నారు. ఇందులో ఆరుగురు ప్రముఖులు ఆరు అంశాలపై ప్రసంగిస్తారని చెప్పారు. సాయంత్రం 6.30 నుండి 9.30 గంటల వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు.
27న మూడు సెషన్స్ జరుగుతాయని, సెషన్-1లో నోబెల్ గ్రహీత అబ్దెసత్తార్ బెన్ వౌసా కీలక ప్రసంగం చేస్తారని, రెండో ప్రసంగం ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ చేస్తారని, ఇక రెండో సెషన్‌లో మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు హాజరవుతారని వివరించారు. కార్యక్రమం ఎ గ్రౌండ్‌లో జరుగుతుందని, తొలి సెషన్ మాత్రం టాగోర్ ఆడిటోరియంలో జరుగుతుందని చెప్పారు.
ఇక మూడో సెషన్‌లో అఖిల భారత వైస్ చాన్సలర్ల సదస్సు జరుగుతుందని, దీనికి కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. సాయంత్రం 6.30 నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 28న తొలి సెషన్‌లో అఖిల భారత విసిల సదస్సు సాంకేతిక అంశాలపై ఐఐసిటి ఆడిటోరియంలో కొనసాగుతుందని, ఉస్మానియా దిశ అంశంపై చర్చ జరుగుతుందని, కార్యక్రమానికి డాక్టర్ కె కేశవరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని, సాయంత్రం 6 తర్వాత ముగింపు కార్యక్రమం ఆర్ట్సు కాలేజీలో జరుగుతుందని పేర్కొన్నారు.