సబ్ ఫీచర్

అటు జ్ఞానపథం.. ఇటు జానపదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉస్మానియా యూనివర్శిటీ భవన నిర్మాణం గమనించారా? లోపల మెట్లు ఎక్కేచోట ఒక శిల్పి ‘ఓం’కారాన్ని చెక్కి ఉన్నారు చూడండి.. ఇది నూరేండ్ల నాటిమాట! 1940 దశకంలో నిజాం కళాశాలలో తెలుగు ఉండేది. ఎం.ఏ. తెలుగు 1944 ప్రాంతంలో యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రారంభమైంది.
శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారు బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ వద్దనుండి ఆశీస్సులు తీసుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులుగా చేరారు. వారి రాకతో ఉస్మానియా తెలుగు శాఖ భావ కవితా పరీమళంతో గుబాళించింది. 1948 ప్రాంతంలో తెలుగు ఎం.ఎ. ప్రారంభమైంది. మొదట్లో ఎక్కువమంది విద్యార్థులు లేరు. శ్రీ బిరుదురాజు రామరాజు, శ్రీ పల్లా దుర్గయ్య, కె.గోపాలకృష్ణారావు వంటివారు తొలితరం విద్యార్థులు. వారు తర్వాత వర్శిటీలో లెక్చరర్లుగా చేరారు. అప్పుడు ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్‌మీడియెట్, డిగ్రీ తరగతులు కూడా నడుస్తూ ఉండేవి. 1960వ దశకం తర్వాత కేవలం ఎం.ఏ, ఎం.ఎస్‌సి, ఎం.కాం విద్యాబోధనకే ఆర్ట్స్ కాలేజీ పరిమితమైంది.
పోలీసు చర్య తర్వాత తెలంగాణలో ఎన్నో పరిణామాలు వచ్చాయి. అందులో తెలుగు భాషకు ప్రాధాన్యం లభించడం ఒకటి. ఆదాబ్, ఖైరియత్ స్థానంలో నమస్కారం, బాగున్నారా? వంటి పలకరింపులు మొదలైనాయి. అంతకుపూర్వం తాలీమ్ ఉర్దూ మాధ్యమంలోనే ఉండేది. నిజాం కళాశాలలో సి.నారాయణరెడ్డి, ఇరివెంటి కృష్ణమూర్తులు ఉర్దూ మాథ్యమంలో విద్యాభ్యాసం చేశారు. వీరిద్దరూ సహ విద్యార్థులు.
1960కి ముందు బి.రామరాజు అమరేశం, రాజేశ్వర శర్మ ప్రభృతులు తెలుగు శాఖలో ఉండేవారు. తర్వాత శ్రీ కోవెల సుప్రసన్నాచార్య, శ్రీ మాదిరాజు రంగారావు, కె.నరసింహారెడ్డి, దివాకర్ల వెంకటావధాని, ఖండవల్లి లక్ష్మీరంజనం, చలంచర్ల రంగాచార్యులు, సి.నారాయణరెడ్డి, తిరుపతయ్య, పేర్వారం జగన్నాథం, జి.వి.సుబ్రహ్మణ్యం, యం.కులశేఖరరావు ప్రభృతులు తెలుగు శాఖలో చేరారు. 1970లో నేను ఆ తర్వాత ఎస్.వి.రామారావు, ఎల్లూరి శివారెడ్డి, హరి శివకుమార్ యూనివర్శిటీ సర్వీసులో చేరారు.
తెలుగుతోబాటు సంస్కృతం ఎం.ఏ కూడా శ్రీమతి యశోదారెడ్డి, ఎన్.కృష్ణకుమారి, వి.రామరాజు గార్లు అభ్యసించారు. 1970 దశకంలో శ్రీరుక్నుద్దీన్, కసిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీహరి శివకుమార్ ప్రభృతులు తెలుగు శాఖలో చేరారు. అప్పటికి ఇంకా కాకతీయ విశ్వవిద్యాలయం ఆవిర్భవించలేదు. ఆ కారణంవల్ల వరంగల్ (సుబేదారి) ఆర్ట్స్ కళాశాలకు సిటీ నుండి ట్రాన్సఫర్లు ఉండేవి. వేటూరి ప్రభాకర శాస్ర్తీగారి సుపుత్రులు శ్రీ ఆనందమూర్తిగారు హైదరాబాద్ వివేకవర్థిని కళాశాల తర్వాత యూనివర్శిటీ సర్వీసులోకి వచ్చారు. శ్రీ తంగిరాల నారాయణ శాస్ర్తీ తీవ్ర స్వభావి. శ్రీమతి వి.సీతా కళ్యాణి, రవ్వా శ్రీహరి, కె.రాజన్న శాస్ర్తీ కూడా తెలుగు భాషకు వనె్న తెచ్చారు. ఆ రోజుల్లో సుప్రసన్న, వీరభద్రయ్య, పేర్వారం జగన్నాథం, వే.న.రెడ్డి కలిసి చేతనార్తం కవుల పేరుతో ఒక ఉద్యమం నడిపారు. ఇది 1960 దశకంలో జరిగింది.
వేదికలపై మంచి వక్తృత్వ శక్తిని దివాకర్ల వేంకటావధాని మాస్టారు ప్రదర్శించారు. సంప్రదాయ సాహిత్యంపై విద్యార్థులకు ఎక్కువ మక్కువ కలిగించాలనే కోరికతో వారు శ్రీకృష్ణదేవరాయల వారి దర్బారును ‘్భవనవిజయము’ పేరుతో వందసార్లు ప్రదర్శించారు.
మొదటి దశలో శ్రీ రాయప్రోలువారు, శ్రీ ఖండవల్లివారు, శ్రీ దివాకర్ల వారు, శ్రీ రామరాజుగారు పదవీ విరమణ చేసేవరకు శాఖాధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత రెండేళ్లకొకరు మారే శాఖా చంక్రమణం (రొటేషన్) సిస్టం వచ్చింది. ఇది అందరికీ సంతృప్తిని కలిగించింది. 1970లో నేను తెలుగు శాఖలో చేరాను. సికిందరాబాద్ తర్వాత వరంగల్ బదిలీ చేశారు. అందుకు గుర్తుగా వేయి స్తంభాల ఇతివృత్తంతో ‘అవాహన’ నవల రచించాను. తర్వాత నిజాం సాయం కళాశాలలో పనిచేశాను. తర్వాతికాలంలో వరుసగా జి.వి.ఎస్.ఎస్ సినారె, శ్రీమతి నాయిని కృష్ణకుమారి, పేర్వారం జగన్నాథం, ఎన్.గోపి, ఎల్లూరి శివారెడ్డి, ఎస్.వి.సత్యనారాయణ ప్రభృతులు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉప కులపతులుగా వెళ్లారు. రవ్వా శ్రీహరి ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. 1960లో ఉస్మానియా యూనివర్శిటీలో ఇంగ్లీషు శాఖలో పనిచేసే ఎన్.కుమార్ సంస్కృతంలో శ్రీ ఆర్యేంద్ర శర్మ, గౌతమ మధూర్‌ల పేర్లు అంతర్జాతీయంగా ప్రసిద్ధిచెందాయి. వక్తగా దివాకర్ల పరిశోధనాచార్యులుగా రామరాజు గారి పేర్లు ఆంధ్రప్రదేశ్ అంతా సుప్రసిద్ధమైనాయి. ఎవరు ఎన్ని పరిశోధనలు చేసినా ఆద్యుడు, పూజ్యుడు మాత్రం ఉస్మానియాలో బి.రామరాజుగారే. ఆధునికాంధ్ర సాహిత్యంపై ఉద్యమం ప్రభావం అనే అంశంపై దాదాపు ఆరు సంవత్సరాలు అవిరళకృషి చేసి సిద్ధాంత గ్రంథం రచించాను. నాకు పర్యవేక్షకులు శ్రీ సి.నారాయణరెడ్డిగారే. వారి పర్యవేక్షణలో పట్టం పొందిన ప్రథమ విద్యార్థిని కావడం విశేషం. నేను 1970 యూనివర్శిటీ సర్వీసులో చేరినప్పుడు శ్రీ రావాడ సత్యనారాయణ, వి.సిగా శ్రీ ఆర్యేంద్ర శర్మ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఇంటర్వ్యూ నిర్వహించారు. 2000 డిసెంబర్‌లో కోఠీ ఉమెన్స్ కాలేజీలో ప్రమదాదేవి ప్రిన్సిపాల్‌గా ఉండగా పదవీ విరమణ చేశాను.
60వ దశకంలో తెలుగు శాఖకు ఆనుకుని కన్నడ శాఖ ఉండేది. అవతల సంస్కృత శాఖ ఉండేది. ఆ రోజుల్లో యూనివర్శిటీ సెలక్షను అఖిల భారత స్థాయిలో ఉండేవి. అందుకే యు.పి, గుజరాత్ రాష్ట్రాలనుండి వచ్చిన విద్వాంసులు కూడా ఉస్మానియా యూనివర్శిటీ సర్వీసులో ఉండేవారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాభివృద్ధివలన మొత్తం తెలంగాణలో తెలుగుకు వెలుగువచ్చిందనే నిస్సంశయమైన అంశం. 1947కు ముందు నిజాం రాష్ట్రంలో అరబ్బీ, పర్షియన్, మహారాష్ట్ర భాషలకు ఉన్న గౌరవం తెలుగుకు లేదు. ఆనాటి రాజ్యంలో కొన్ని కన్నడ, మహారాష్ట్ర ప్రాంతాలు కూడా కలిసి ఉండేవి. బి.రామరాజుగారు ఎం.ఏ తెలుగు చదువుకోవడానికి ఉస్మానియా యూనివర్శిటీలో చేరారు. అప్పుడు ఆయనను కొందరు చిన్నచూపు చూచినట్లు స్వయంగా బిరుదురాజు రామరాజు నాతో చెప్పారు. తెలుగు చదువుకుంటే ఉద్యోగాలు రావు అని రాయప్రోలు విద్యార్థులతో అన్నట్లు అనేది చారిత్రక సత్యం.
ఇక పిహెచ్‌డి ఒత్తిడి పెరగడంతో ఎం.ఎల్ ప్రవేశపెట్టబడింది. ఇది 1970 తర్వాతి పరిణామం. దూరవిద్య ఆ తర్వాత మొదలైంది. నేను ఎం.ఏ విద్యార్థులకు చాలా ఏండ్లు శాసనాలు బోధించాను. ఫలితంగా కొందరు విద్యార్థులు పర్యటన చేసి కొన్ని తెలంగాణ శాసనాలు నూతనంగా సేకరించి ఆర్కియాలజీ డిపార్టుమెంటువారిని అబ్బురపరిచారు.
సికిందరాబాద్‌లో నేనూ ఇరివెంటి కృష్ణమూర్తి ఒకప్పుడు ఆరుబయట పున్నాగచెట్ల కింద పాఠాలు చెప్పేవాళ్లం. నేటి చిలుకూరి బాలాజీ దేవాలయ నిర్వాహకుడు సౌందరరాజన్ అప్పుడు మా కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. ఆయన తమిళ పద్ధతిలో తలపాగాతో యూనివర్శిటీకి వచ్చేవారు. పదిహేను గంటలు పనిచేసేవారు.
1975లో ఎమర్జెన్సీలో నన్ను కొన్నాళ్లు ముషీరాబాద్‌లో సెంట్రల్ జైలులో ఇందిరాగాంధీ ప్రభుత్వం పెట్టించింది. ఇరివెంటి కృష్ణమూర్తి తెలంగాణ విమోచనోద్యమంలో 1948లో కొంతకాలం నిజామాబాద్ జైలులో ఉన్నారు. స్వామి రామానంద తీర్థ నేతృత్వంలో వీరు సత్యాగ్రహం చేశారు. ఇవి మాకు పాఠాలు, గుణపాఠాలు నేర్పాయి.
1965లో ఉస్మానియా యూనివర్శిటీ అటానమీకి సంబంధించి విద్యార్థి ఉద్యమం నడిచింది. 1969లో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు బలిదానాలు చేశారు. దాదాపు సంవత్సరంపాటు విద్యాలయాలు నడవలేదు.
బి.రామరాజుగారి కాలంలో తాళపత్ర పరిశోధన విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. శ్రీ విశ్వనాథ, శేషేంద్ర, దాశరథి వంటి ఎందరో ప్రముఖులు తెలుగు శాఖకు వచ్చి సాహిత్యోపన్యాసాలు ఇవ్వటం నాకు గుర్తుంది. తొలినాళ్ళలో వ్యాకరణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సంప్రదాయ సాహిత్య స్థానంలో జానపద సాహిత్యం క్రమంగా బోధించారు. దివాకర్లవారు, అమరేశం రాజేశ్వర శర్మగారు వ్యాకరణం చెప్పేవారు. శ్రీమతి నాయిని కృష్ణకుమారి, కసిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీమతి యశోదారెడ్డి, వి.రామరాజుగార్లు జానపద సాహిత్యం చెప్పారు. తెలుగు శాఖలోని విద్యార్థులకు కొమ్ములు లేని గోవులు అనే పేర పాఠం ఉండేది. కారణం ఏమైనా ఉద్యమాలు జరిగినపుడు ఒకరిద్దరు తప్ప తక్కినవారు దూరంగా ఉండేవారు. నేను సకాలంలో సిలబస్ ముగించేవాడిని. కాని ఇరివెంటి గారి బోధనా పద్ధతి వేరుగా ఉండేది. పాఠంతోపాటు ఆయన వ్యక్తిత్వ వికాసం బోధించేవారు. ఇవ్వాళ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అని దీనిని అందరూ అధిక ప్రాధాన్యమిచ్చి బోధిస్తున్నారు.
‘ఏ దేశమేగినా, ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా పొగడరా నీ తల్లి భూమి భారతిని- నిలుపరా నీ జాతి నిండు గౌరవము’- ఇది ఉస్మానియా యూనివర్సిటీ విన్పించిన పాటయే. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీకి ఎంతో ఉజ్వల చరిత్ర ఉంది. ఇది నూరేండ్ల చరిత్ర. గతం కాదు నాస్తి అది అనుభవాల ఆస్తి అనే వే.న.రెడ్డి వాక్యంతో ముగిస్తున్నాను.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్