కడప
కడప, మే 6: జిల్లాలో జరుగుతున్న పోలీసు సంఘం అధ్యక్ష ఎన్నికలు శాసన సభ, మండల, పంచాయతీ స్థాయి ఎన్నికలకు మించి పోటాపోటీగా జరుగుతున్నాయి. డివిజనల్ స్థాయి పోలీసు స్టేషన్లలో దాదాపు ఓటుకు ఒక దశలో 10 వేల నుండి లక్ష రూపాయల వరకు పెట్టే అవకాశం ఉన్నట్లు ఆయా డివిజన్లలో ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రస్తుతం పోటీలో ఉన్న శర్మకు, మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డికి గెలుపు విషయంలో నువ్వా నేనా అనే విధంగా ఎన్నికలు జరిగాయి. చివరకు కొందరు డబ్బుల విషయంలో చంద్రశేఖర్‌రెడ్డి గూటికి పోవడంతో ఆయన విజయం సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో శర్మ, జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా కొందరు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎఆర్‌లో ఉన్న వ్యక్తుల మధ్యే తీవ్ర స్థాయిలో పోటీ ఉండగా సివిల్ పోలీసులు మాత్రం ఈ సారి ఎలాగైనా అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవాలని జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లల్లో అధికారులు, సిబ్బంది ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాగా ఎఆర్ పోలీసుల కన్న జిల్లాలో సివిల్ పోలీసుల సంఖ్య ఎక్కువుగా ఉంది. దీనివల్ల ఈ సారి సివిల్‌లో ఉన్న వారికే అధ్యక్ష పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఎఆర్ సిబ్బంది కూడా ఈ సంవత్సరం జిల్లా అధ్యక్షత పదవి సివిల్ వారికే దక్కేటట్లు ఉందని చెప్పడం గమనార్హం. ఎఆర్‌లో ఉన్న కొంత మంది సిబ్బంది మాత్రం సివిల్ వారికి మద్దతు పలికే అవకాశం ఉన్నట్లు వారే చెబుతున్నారు. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న ఒంటిమిట్ట డివిజన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు దాదాపు 10 నుండి 12 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ డివిజన్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక సివిల్ పోలీసులకు సంబంధించి జిల్లాలో అన్ని డివిజన్లలో శర్మకు సంబంధించి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నట్లు తెలిసింది. మొత్తానికి సివిల్ పోలీసుల, ఎఆర్ పోలీసులకు మధ్య జరుగుతున్న జిల్లా అధ్యక్ష ఎన్నికల పోరులో మొత్తానికి 20 నుండి 25 మంది అటు ఇటు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని కొనడానికి లక్షలకు పైగా వెచ్చించడానికి అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న అభ్యర్థులు పోటా పోటీగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా, ఎఆర్ కానిస్టేబుళ్ల అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా శాఖా పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం. ఎస్పీ మాత్రం ఎన్నికలు నిపక్షపాతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అనుకున్న సమయానికి ఈనెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఈ ఎన్నికలు గతంలో మాదిరిగా రాజకీయాలకు సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా జరిగేటట్లు ఎస్పీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది
Add new comment