రాష్ట్రీయం

ప్రాజెక్టులపై సిగపట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రధాన సమస్యగా మారిన గోదావరి జలాల వినియోగంపై గురువారం హైదరాబాద్‌లో జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాడిగా, వేడిగా జరిగింది. బోర్డు చైర్మన్ రామ్‌శరణ్ అధ్యక్షతన జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాలు తమకున్న హక్కులు, అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టుకు చెందిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను తమకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం మొదట చర్చను లేవనెత్తింది. పట్టిసీమ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదని, అది పోలవరం ప్రాజెక్టు అథారిటీలో భాగమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలంగా వాదించింది. మమ్మల్ని పట్టిసీమ డిపిఆర్ అడుగుతున్నారు, మరి మీ రాష్ట్రంలో (తెలంగాణ) నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టుల డిపిఆర్‌ల సంగతేమిటనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం లేవనెత్తింది. తాము చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులకు ఇంకా డిపిఆర్‌లు సిద్థం కాలేదని, అవీ పూర్తి అయిన తర్వాత తప్పకుండా అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ డిపిఆర్‌లు తమకు చూపిస్తే పట్టిసీమ డిపిఆర్‌ను చూపెట్టడానికి తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వివాదాలను పక్కన పెట్టి ఇరు రాష్ట్రాలు గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిసారించాలని గోదావరి యాజమాన్య బోర్డు హితవు పలకింది. వివాదస్పద అంశాలను పక్కన పెట్టి గోదావరి జలాలు వృధగా సముద్రం పాలు కాకుండా వినియోగించుకుంటూ పరస్పరం సహకరించుకుందామని ఇరు రాష్ట్రాల అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే గోదావరి యాజమాన్య బోర్టు కార్యకలాపాల కోసం రూ. 8 కోట్లు అవసరం అవుతాయని బోర్డు సూచించగా, ఇరు రాష్ట్రాలు సమానంగా చెరో రూ. 4 కోట్లు భరించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి. విభజన చట్టం ప్రకారం గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల సమాచారాన్ని ఇరు రాష్ట్రాలు పంచుకునేందుకు కూడా అంగీకరించాయి.
బోర్డు సమావేశం అనంతరం చైర్మన్ రామ్‌శరణ్ మాట్లాడుతూ, సాంకేతిక, పరిపాలనా పరమైన అంశాలతో పాటు ఆర్థిక విషయాలపై బోర్డు సమావేశంలో చర్చ జరిగిందని తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా బోర్డు నడుచుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మీదుగా ప్రవహించే నదులు వర్షాధారంపై ఆధారపడేవే కావడంతో ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. గోదావరి జలాలు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయని, ఒక్క చుక్క నీరు కూడా వృధా కానీయవద్దని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల రంగ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.