అనంతపురం

పెనుకొండ డిఎస్పీ ఎన్.సుబ్బారావుకు ఇండియన్ పోలీసు మెడల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం/పెనుకొండ, జనవరి 25:పెనుకొండ డిఎస్పీగా పనిచేస్తున్న ఎన్.సుబ్బారావు ఇండియన్ పోలీసు మెడల్‌కు ఎంపికయ్యారు. జిల్లాలో పోలీసు అధికారుల్లో ఇండియన్ పోలీసు మెడల్‌కు ఎంపికైన ఏకైక వ్యక్తి సుబ్బారావు. ఈయనకు ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పతకం అందచేయనున్నారు. సుబ్బారావు 1989వ బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో ఎస్‌ఐగా రామగిరి, గుత్తి, పుట్టపర్తి పోలీసుస్టేషన్‌లలో సిఐగా మడకశిర, సిఐడి, పిటిసి కళాశాలలో పనిచేశారు. గత 2011 జూన్ నెలలో డిఎస్పీగా పదోన్నతి పొంది తాడిపత్రి, కళ్యాణదుర్గం, అనంతపురం పిటిసిలలో పనిచేశారు. పెనుకొండలో గత 2013 నవంబర్ 28వ తేదీ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. వివిధ కేసుల్లో తనదైన శైలిలో వ్యవహరించి పరిష్కారానికి చొరవ చూపారు. ప్రధానంగా పెనుకొండ డివిజన్ పరిధిలోని హిందూపురంలో సున్నితమైన అంశాల్లో ప్రత్యేక చొరవ చూపి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తన శైలిని ప్రదర్శించారు. దీనికి తోడు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు కిందిస్థాయి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కట్టడి చేసేందుకు తన వంతు సహకారం అందించారు. ఇకపోతే ఉత్తరాంధ్రలో చోటు చేసుకున్న హు ధూద్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విరాళాలను సేకరించి ఎమ్మె ల్యే నందమూరి బాలకృష్ణ ద్వారా సిఎం సహాయ నిధికి అందించడంలో డిఎస్పీ సుబ్బారావు ప్రత్యేక భూమిక పోషించారు. సుబ్బారావు ఇండియన్ పోలీసు మెడల్‌కు ఎంపిక కావడం పట్ల డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్‌ఐలు హర్షం వ్యక్తం చేశారు.
పదోతరగతి విద్యార్థులంతా
పాస్ కావాల్సిందే..
* లేకుంటే ప్రధానోపాధ్యాయులకు ఉద్వాసన * కలెక్టర్
అనంతపురం సిటీ, జనవరి 25: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులంతా పాస్ కావాలని కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. ఎక్కడైనా వంద శాతం ఉత్తీర్ణత రాకుంటే అందుకు బాధ్యులైన ప్రధానోపాధ్యాయులకు ఉద్వాసన తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఎంఇఓలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదవ తగరతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే సంకల్పంతో రూ. 19 లక్షలు ఖర్చు చేసి మెటీరియల్ తయారుచేసి పంపిణీ చేశామన్నారు. ఆ మెటీరియల్ ఎంతో సరళంగా, బాగా అర్థమయ్యే రీతిలో తయారుచేశామన్నారు. సి, డి గ్రేడ్ విద్యార్థులు సైతం ఆ మెటీరియల్ సహాయంతో పదవ తరగతి పాస్ కావచ్చునన్నారు. టీచర్లు చిత్తశుద్ధితో కృషి చేసి విద్యార్థులందరూ బాగా చదివేలా, పరీక్షల్లో పాస్ అయ్యేలా తీర్చిదిద్దాలన్నారు. పదవ తరగతి పాస్ కాకపోతే విద్యార్థుల భవిష్యత్ పాడవుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపరని ఆయన స్పష్టం చేశారు. ఏ ఉద్యోగానికైనా కనీస అర్హత పదవ తరగతి అని, అందుకు ప్రతి విద్యార్థి భవిష్యత్ హెచ్‌ఎం, ఉపాధ్యాయునిపై ఉందని తెలిపారు. పదవ తరగతి ఉపాధ్యాయులు డిఇఓ అనుమతి లేకుండా సెలవులు పెట్టరాదన్నారు. రాబోయే గురుపూజోత్సవానికి పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలోని ఉపాధ్యాయులకు అవార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి నుండి ఒక యజ్ఞంలా విద్యార్థులను చదివిస్తే తప్పకుండా వంద శాతం సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఓ అంజయ్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గుట్టుగా..గుప్తనిధుల వేట!
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, జనవరి 25:జిల్లాలో గుప్త నిధుల వేట గుట్టుగా కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు చెందిన స్థానిక వ్యక్తులతోపాటు పలువురు కర్ణాటకకు చెందిన వ్యక్తులు ఈ వ్యవహారంలోపాలు పంచుకుంటున్నారు. ఇలా జిల్లాలో గడచిన కొద్ది కాలంగా వీరి వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూనే ఉంది. దీంతోపాటు అడపాదడపా పట్టుబడిన వారిని సైతం పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టకుండా అలా పట్టుబడిన పలువురిని గుట్టుగా తహసీల్దారు ఎదుట ప్రవేశపెట్టడం లేదా గుట్టుగానే కోర్టుకు తరలిస్తున్నారు. ఇలా పట్టుబడిన గుప్తనిధుల వేటగాళ్లను గుట్టుగా కోర్టుకు లేదా తహసీల్దారు ఎదుట ప్రవేశపెట్టడం వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. ఇలా పట్టుబడిన వారిలో సైతం అధికార పార్టీకి చెందిన వ్యక్తుల ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం ఉండడం కానీ వారి ఒత్తిడి కానీ ఉండడం మూలంగానే ఇలా వారిని గుట్టుగా తరలిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఇటుకలపల్లి సర్కిల్ పరిధిలోని ఒక పోలీసుస్టేషన్‌లో ఏడుమంది గుప్తనిధుల వేటగాళ్లు పట్టుబడగా వారిని గుట్టుచప్పుడు కాకుండా కోర్టుకు తరలించినట్లు తెలిసింది. ఇందులో అధికార పార్టీకి చెందిన ఒక వ్యక్తి కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన ఆరు మంది వ్యక్తులను ద్రాక్ష తోటలో పని ఉందని చెప్పి కూలీ పనికి పిలిపించుకుని వచ్చినట్లు తెలిసింది. ఇలా కూలీ పనికి వచ్చిన వారిని మాటలతో మాయ చేసి గుప్త నిధుల తవ్వకాలకు పురమాయించినట్లు తెలిసింది. ఇలా వీరందరూ ఒక పురాతన గుడి వద్ద తవ్వకాలు చేస్తూ ఉండగా స్థానికులు గమనించి వారిపై దాడికి యత్నించగా వారందరూ గ్రామస్థులకు పట్టుబడకుండా తప్పించుకుని వెళ్లినట్లు తెలిసింది. అక్కడ ఉన్న గుడి పురాతమైనది కాగా ఒక చెరువుకట్ట మీద వీరు తవ్వకాలకు పాల్పడినట్లు తెలిసింది. అనంతరం అక్కడ వీరు ఒక ద్విచక్ర వాహనాన్ని వదలి వెళ్లగా దాని ఆధారంగా ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. అయితే వీరిని పట్టుకోవడంతోనే అధికార పార్టీ నాయకులు రంగప్రవేశం చేసి విషయం మీడియాలోకి రాకుండా చూసి కోర్టుకు హాజరుపరచినట్లు తెలిసింది. ఇక గడచిన నెల రోజుల క్రితం ధర్మవరం రూరల్ సర్కిల్ పరిధిలోని ఒక పోలీసుస్టేషన్ పరిధిలోసైతం కర్ణాటకకు చెందిన తొమ్మిది మంది వ్యక్తులతోపాటు స్థానికుడైన ఒక వ్యక్తిని మొత్తంగా పదిమంది వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు తెలిసింది. వీరిని సైతం తహసీల్దారు వద్ద బౌండోవర్ చేసిన పోలీసులు అక్కడితో చేతులు దులుపుకున్నారు. ఇందులో కూడా అధికారపార్టీకి చెందిన నాయకుల ఒత్తిడితోనే గుట్టుచప్పుడు కాకుండా వీరందరినీ బౌండోవర్ చేసినట్లు తెలిసింది. ఇక ఇందులోసైతం కర్ణాటకకు చెందిన తొమ్మిది మంది వ్యక్తులు భాగస్వాములయి ఉండడం గమనార్హం. ఇలా పట్టుబడుతున్న పలువురిని పోలీసులు మీడియా ముందుకు ప్రవేశపెట్టకుండా గుట్టు చప్పుడు కాకుండా కోర్టుకు కానీ తహసీల్దారు ముందు కానీ ప్రవేశపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వాటి వెనుక స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉండడమో లేక వారి ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉండడం వల్లనే గుప్త నిధుల వేటగాళ్లను గుట్టు చప్పుడు కాకుండా కోర్టు ముందు ప్రవేశపెడుతుండడం గమనార్హం.
గణతంత్ర వేడుకలకు
పరేడ్ గ్రౌండ్ సిద్ధం
* జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న కలెక్టర్
అనంతపురం కల్చరల్, జనవరి 25: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 7.45గం.లకు కలెక్టర్ కోన శశిధర్ జాతీయ జెండా ఎగుర వేసి జెండా వందనం చేస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు అందరూ మంగళవారం ఉదయం 7.15 గం.లకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ చేరుకోవాలని డిఆర్‌ఓ హేమసాగర్ కోరారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జెసి-2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, ఎఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్, డిఎస్పీ చిన్నికృష్ణ, ఆర్‌డిఓ హుస్సేన్ సాబ్, సమాచార శాఖ ఎడి తిమ్మప్పలతో కలసి పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం పరిశీలించారు. జెండావందనం ఏర్పాట్లు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖులు, అవార్డుగ్రహీతలు, మీడియా, విద్యార్థుల సిటింగ్ ఏర్పాట్లు, పోలీసుల కవాతు ఏర్పాట్లు, ప్రభుత్వ పథకాల ఫొటో ప్రదర్శనలు, శకటాలు, లబ్దిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగేవిధంగా అందరూ సహకరించాలని, సాయంత్రం లలిత కళాపరిషత్‌లో జరిగే కార్యక్రమాలకు నగర ప్రజలు హాజరుకావాలని జెసి-2 కోరారు.
బాహ్య ప్రపంచంలోకి....
బుక్కరాయసముద్రం, జనవరి 25: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం వచ్చింది. క్షణికావేశంతో చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తూ కుటుంబాలకు దూరంగా క్షణమొకయుగంగా గడిపిన ఖైదీలు మంగళవారం ఉదయించే సూరీడితో కలిసి స్వేచ్ఛావాయువులు పీల్చుకోనున్నారు. అనంతపురం వ్యవసాయ ఆరుబయలు కారాగారం నుండి 146 మంది జీవిత ఖైదీలు విడుదల కానున్నారు. దీంతో జీవిత ఖైదీల కోరిక ఎట్టకేలకు ఫలించనుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది జీవిత ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా జైలులోని 146 మందికి స్వేచ్ఛ లభించింది. వీరంతా మంగళవారం జైలునుంచి బయటకు రానున్నారు. గత 3 సంవత్సరాలుగా వాయిదాపడుతూ వచ్చిన జీవిత ఖైదీల విడుదల ప్రక్రియ నేటికి నెరవేరింది. అనంతపురం వ్యవసాయ ఆరుబయలు కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న 230 మంది జీవిత ఖైదీలకు గాను 146 మందిని విడుదల చేసేందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందినట్లు జైలు సూపరింటెండెంట్ కె.యల్.శ్రీనివాసరావు తెలిపారు. ఖైదీలు విడుదలవుతున్నట్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తమ వారికి స్వాగతం పలికేందుకు జైలు వద్దకు రావడంతో ప్రాంగణం కోలాహలంగా మారింది. సోమవారం రాత్రి 10:10 గంటలకు జీవో ఉత్తర్వులు రావడంతో విడుదలకు సిద్ధంగా ఉన్న ఖైదీలకు ఉత్తర్వులను సూపరింటెండెంట్ అందజేశారు. వీటితోపాటు వారి నుండి రూ. 50,000 స్వంత పూచికతు, ప్రతి మూడు నెలలకొకసారి స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయాల్సి ఉంటుందని, జిల్లా ప్రొహిబిషన్ అధికారి వద్ద సంతకాలు చేయాల్సి వస్తుందని తెలిపారు. అంతేకాకుండా వీరు ఎలాంటి గొడవలకు దిగకుండా ఉండాలని షరతులపై విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

సంతోషంగా ఉంది
- శరత్‌రెడ్డి, పెద్దవడుగూరు

ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షతో విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రభుత్వం నుండి జీవో వచ్చిన సమయానికి ఖచ్చితంగా 7 సంవత్సరాలు శిక్ష, 3 సంవత్సరాల రిమిషన్ పూర్తికావడం నిజంగా నా అదృష్టం.

ప్రశాంత జీవితం గడుపుతాం
శ్రీనివాసరెడ్డి పులివెందుల, కడప జిల్లా

ప్రభుత్వం ప్రకటించిన జీవో నెం.163తో ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న 146మంది ఖైదీలు విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇకపై ఎలాంటి గొడవలకు వెళ్ళకుండా కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితాన్ని గడుపుతానని అన్నారు.

అధికారుల మేలు మరువలేం
రవి నంద్యాల, బీరడోలు గ్రామం, కర్నూలు జిల్లా
సత్ప్రవర్తన కలిగిన మమ్మల్ని విడుదల చేయడం కోసం సూపరింటెండెంట్ కె.యల్.శ్రీనివాసరావు మా పట్ల చూపించిన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మరువబోము. మంచి ప్రవర్తనతో కుటుంబ సభ్యులతో కలసి మంచి జీవితాన్ని గడుపుతాం.

సాఫ్ట్‌బాల్ ఇండియా టీమ్‌కు
బెళుగుప్ప విద్యార్థి శివాజీనాయక్
* 29 నుండి భూటాన్‌లో క్రీడాపోటీలు
బెళుగుప్ప, జనవరి 25:కృషి, పట్టుదల ఉంటే ఏ క్రీడలోనైనా రాణినంచవచ్చని బెళుగుప్ప తండాకు చెందిన శివాజీనాయక్ అనే డిగ్రీ విద్యార్థి నిరూపించారు. ఈ విద్యార్థి సాఫ్ట్‌బాల్ క్రీడలో ఇండియా టీంలో చోటు సంపాదించుకుని ఈ నెల 29 నుండి భూటాన్‌లోని టింపులో జరిగే సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఇండియా తరపున పాల్గొంటున్నాడు. సోమవారం శివాజీనాయక్ విలేఖరులతో మాట్లాడుతూ బెళుగుప్ప తండాకు చెందిన తమ తల్లిదండ్రులు లక్ష్మీపతినాయక్, శాంతిబాయి సహకారంతో చిన్నప్పటి నుండి చదువుతో పాటు క్రీడల్లో మంచి ప్రతిభను చాటానన్నాడు. సాఫ్ట్‌బాల్‌పై ఇష్టం ఉండడంతో పట్టుదలతో సాధన చేసి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభను కనపరిచాడు. ముఖ్యంగా ఆర్డీటి సంస్థ సాఫ్ట్‌బాల్ క్రీడల్లో తోడ్పాటు, సహకారం అందించిందన్నారు. ఆంధ్ర సాఫ్ట్‌బాల్ అసోషియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఇండియా సాఫ్ట్‌బాల్ అసోషియేషర్ కార్యదర్శి ప్రవీణ్ అనౌకర్ క్రీడల్లో మెళకువలు నేర్పించి, తనను ఈ స్థాయికి తీసుకొచ్చారన్నారు. కడప జిల్లా జమ్ములమడుగలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతూ సాఫ్ట్‌బాల్‌లో ప్రతిభను కనపరించేందుకు కళాశాల కూడ తోడ్పాటు నందించిందన్నారు. ఇండియా టీంలో ఆడేందుకు అవకాశం వచ్చిందన్నారు. ఈ నెల 29 నుండి ఫిబ్రవరి వరకూ జరిగే సాఫ్ట్‌బాల్ క్రీడల్లో కూడ రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉచిత సామూహిక వివాహాల
నిర్వహణకు స్థలం పరిశీలన
రామగిరి, జనవరి 25: పరిటాల రవి 11వ వర్ధంతి సందర్భంగా ప్రకటించిన ఉచిత సామూహిక వివాహాల నిర్వహణ కోసం తిరుమల దేవర ఆలయ ప్రాంగణంలోని స్థలాన్ని సోమవారం మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్‌లు వారి కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. గతంలో పరిటాల రవీంద్ర పెళ్లిళ్లు నిర్వహణ ఏ విధంగా చేపట్టారు, భోజన వసతులు, వాహనాల పార్కింగ్, హెలీప్యాడ్ స్థలాన్ని అన్నింటిని పరిశీలించారు. అంతేకాకుండా పరిటాల రవీంద్ర విగ్రహాన్ని తిరుమల దేవర ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుకై స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తిరుమల దేవర ఆలయ ప్రాంగణంలోకి వచ్చే సమయంలో దారిలో వున్న వెంకటాపురం స్టాప్ వద్ద నిర్మిస్తున్న బస్ షెల్టర్ పనులను పరిశీలించారు. పనుల నాణ్యతపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉచిత సామూహిక వివాహాలు ఏప్రిల్ 20, 21వ తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని, పెళ్లిళ్లు చేసుకునే యువతీ యువకులు తమ పేర్ల నమోదుకు ఫిబ్రవరి 24నుండి వెంకటాపురంలో చేసుకోవచ్చునని తెలిపారు. మంత్రి వెంట ఎల్.నారాయణచౌదరి, కొండన్న, బాలాజి పాల్గొన్నారు.
కలెక్టర్‌కు ఉత్తమ ఎన్నికల అధికారి పురస్కారం
అనంతపురం కల్చరల్, జనవరి 25: భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలను అమలుపరచడంలో, ఎలక్ట్రోరల్ రోల్స్‌ను, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాలను, 18సం.లు నిండిన యువ ఓటర్లను చైతన్యపరచి పకడ్బందీగా అన్ని కార్యక్రమాలను నిర్వహించినందుకు కలెక్టర్ కోన శశిధర్‌కు ఉత్తమ కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అవార్డును భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈమేరకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సోమవారం నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు. లోకాయుక్త చైర్మన్ జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చేతుల మీదుగా కలెక్టర్ తరపున జెసి బి.లక్ష్మీకాంతం అవార్డు అందుకున్నారు. గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ తరపున, తన తరపున ధన్యవాదాలు తెలిపారు.
తెలిపారు.
యువతే బాధ్యతగా ఓటర్లను నమోదు చేయించాలి

అనంతపురం సిటీ, జనవరి 25: జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను యువత తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక మెడికల్ కాలేజి ఆడిటోరియంలో 6వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా జడ్జి సుబ్రమణ్యకుమార్, ఎస్పీ రాజశేఖర్‌బాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సప్తగిరి సర్కిల్ నుండి తెలుగుతల్లి విగ్రహం వరకు జెసి-2 సయ్యద్ ఖాజామొహీద్దీన్, ఆర్‌డిఓ, ట్రైనీ కలెక్టర్ సుమిత్‌గాంధీ, ఇతర అధికారులు ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులతో ర్యాలీని నిర్వహించి, తెలుగుతల్లి విగ్రహం వద్ద ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, సమాజంలోని ప్రతి ఒక్కరిని కలుపుకుని వారందరికి ఓటుహక్కును కల్గించేందుకు ఓటరుగా నమోదు చేయించాలన్నారు. ఇందుకోసం మీ సేవా కేంద్రాలలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లాలో డూప్లికేట్ ఓటు కలిగి వున్న వారిని ఆధార్‌తో అనుసంధానం చేసి సరిచేయడం జరిగిందన్నారు. ఇందుకు ప్రతి ఎన్నికల అధికారి బూత్‌లెవల్ నుండి తహశీల్దార్, ఆర్‌డిఓలు, కలెక్టరు కార్యాలయ సిబ్బంది కృషి చేసారని, దీంతో రాష్ట్రంలోనే జిల్లాకు ప్రథమస్థానం లభించిందని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినదే భారతదేశమని, ఎన్నికల కమీషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహిస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో యువత ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పట్టిష్టపరిచే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా జడ్జి సుబ్రమణ్యకుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటుచేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ ఓటరు దినోత్సవంపై విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీలు, క్విజ్, డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలలో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో గెలుపొందించిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ హుస్సెన్‌సాబ్, డిఇఓ అంజయ్య, డిపిఆర్‌ఓ ఏడి తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
11 నుంచి పురంలో ఆయుత చండీయాగం
హిందూపురం టౌన్, జనవరి 25: హిందూపురం పట్టణంలోని ఎంజిఎం క్రీడా మైదానంలో ఫిబ్రవరి 11వ తేదీ నుండి 25 వరకు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణజ్యోతి స్వరూపానందస్వామిజీ ఆధ్వర్యంలో ఆయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 11వ తేదీ ఉదయం 5 గంటలకు గణపతి పూజ, యాగశాల ప్రవేశం, అఖండ జ్యోతి, అంకురార్పణ వంటి పూజలు జరుగుతాయన్నారు. ప్రతిరోజూ ఉదయం 7.30 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. 12న లక్ష్మీగణపతి, చండీ హోమం, విశేష కుంకుమార్చన, పుష్పార్చనలు, 13న నవగ్రహ, విష్ణుమూర్తికి విశేష పూజలు, సీతారామస్వామి కళ్యాణోత్సవం, 14న సూర్య, సరస్వతి పూజలు, సూర్య నమస్కారాలు, విశేష సరస్వతి పూజలు, 15న పాశుపతాస్త్ర సహిత శ్రీరుద్ర, చండీహోమం, విశేష రుద్రాభిషేకాలు, సహస్ర జ్యోతిర్లింగార్చన, 16న సుబ్రమణ్య అభిషేకాలు, అష్టలక్ష్మి దీపోత్సవం, 17న నక్షత్ర హోమం, కుమారి పూజలు, బాల పూజలు, 18న కుబేర లక్ష్మీహోమం, లక్ష్మీ హోమం, శ్రీరమ సహిత సత్యనారాయణస్వామి వ్రతాలు, రుక్మిణ, సత్యభావ సమేత వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం, 19న అష్టలక్ష్మీ హోమం, అమ్మవారి కుంకుమార్చన, లక్ష గాజులార్చన, 20న సుదర్శన హోమం, దంపతి పూజ, శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాస కల్యాణం, 21న శ్రీసూర్య, సరస్వతి, చండీహోమం, లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం, 22న రుద్ర పాశుపతాస్త్ర, ధన్వంతరీ, విశేష సహస్ర పార్థివ లింగార్జన, ఉమామహేశ్వరస్వామి కల్యాణోత్సవం, 23న హనుమత్‌హోమం, మన్యసూక్తపారాయం, తమలపాకుల పూజ, 24న శ్రీకృష్ణ కాలచక్ర లక్ష మాఘ దీపోత్సవం, 25న గురుపూజ, మహా పూర్ణహుతి, శ్రీకృష్ణ ఉట్టి కొట్టుట వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు.
నేడు కుల, ప్రజా సంఘాలతో సమావేశం
ఆయుత చండీ యాగం నిర్వహణపై మంగళవారం పట్టణంలోని వాసవీ ధర్మశాలలో అన్ని కుల, ప్రజా సంఘాల ప్రతినిధులతో స్వామిజీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని కుల, ప్రజా సంఘాల ప్రతినిధులతోపాటు వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి హాజరు కావాలని తెలిపారు.
చాగల్లు నుంచి నీటి విడుదల
పెద్దపప్పూరు, జనవరి 25: పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు రిజర్వాయర్ నుంచి సోమవారం నీరు విడుదల చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి సోమవారం చాగల్లు చేరుకుని గేట్లు ఎత్తి దిగువ నదిలోకి నీరు విడుదల చేశారు. దీంతో పెన్నానదికి జలకళ సంతరించుకుంది. మార్చి 1వ నీరు విడుదల చేస్తామని వారం రోజుల క్రితం ఎంపి ప్రకటించారు. అయితే ఆయన సోదరుడు జెసి ప్రభాకర్‌రెడ్డి సోమవారం హడావుడిగా చాగల్లు నుంచి నీరు విడుదల చేశారు. నదీపరవాహక ప్రాంతాల్లో నెలకొన్న నీటిఎద్దడి సమస్య పరిష్కారానికై నీరు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. పెన్నాకు నీరు రావడంతో అశ్వర్థం వద్ద చిన్నపప్పూరు, గార్లదినె్న, చింతరపల్లి తదితర గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి గంగమ్మకు పూజలు చేశారు.

అభివృద్ధికి పాటుపడండి.
* గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్
పామిడి, జనవరి 25: ప్రజల ఓట్లతో గెలిచిన కౌన్సిలర్లంతా వారి సంక్షేమంతోపాటు ప్రజల అభ్యున్నతికి పాటుపడాలని గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ పేర్కొన్నారు. కోఆప్షన్ ఎన్నికల నిర్వాహణలో భాగంగా సోమవారం నగర పంచాయతీ కార్యాలయం జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే జితేంత్రగౌడ్ కౌన్సిలర్లతో కొద్దిసేపు చర్చించారు. కౌన్సిలర్లంతా రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్దితోపాటు ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.
25పియండి 2:సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జితేంద్రగౌడ్.

వృద్ధుడి ఆత్మహత్య
అనంతపురం క్రైం, జనవరి 25: శింగనమల మండలం గుమ్మేపల్లి గ్రామానికి చెందిన రంగారెడ్డి(70) అనారోగ్యంతో బాధపడలేక సోమవారం స్వగ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. కాగా చికిత్స ప్రారంభ దశలోనే ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అప్పుల బాధతో రైతు మృతి
బ్రహ్మసముద్రం, జనవరి 25: మండల పరిధిలోని కనే్నపల్లి గ్రామానికి చెందిన చిత్తయ్య(56) అనే రైతు అప్పుల బాధతో మృతి చెందాడు. మృతుని బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిత్తయ్య నాలుగు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటు తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. తనకు బ్యాంకులో రూ.1 లక్ష దాకా, కర్ణాటకలో ప్రైవేటు వ్యక్తులతో రూ.60 వేలు, స్థానిక వ్యక్తులతో రూ.80వేలు, అదేవిధంగా ఇద్దరు కుమార్తెలు, కుమారుని వివాహానికి రూ.2 లక్షల మేర అప్పు చేశాడని తెలిపారు. తగిన సమయంలో పంట చేతికి రాకపోవడంతో తీసుకున్న అప్పుపై వడ్డీ అధికమవడంతో తీర్చలేమోనన్న బాధతో తన ఇంటి పైకప్పుకు సోమవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని మృతి చెందాడు. ఎఎస్‌ఐ ఇషాక్‌బాషా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
బ్రహ్మసముద్రం, జనవరి 25: మండల పరిధిలోని ఎరడికెర గ్రామానికి చెందిన గొల్ల నాగరాజు(26) అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు నాగరాజుకు తన స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం గత కొద్ది రోజులుగా కొనసాగుతోంది. ఆ విషయాన్ని తెలుసుకున్న తన స్నేహితుడు కాపుకాచి ఆదివారం రాత్రి మద్యం సేవిద్దామని ఊరి చివరకు చేరుకుని మద్యం సేవించి ఇంటికి కడపునొప్పి అని చెప్పడంతో తన భార్య హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు వారు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ ఇషాక్‌బాషా తెలిపారు.

పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
తాడిపత్రి, జనవరి 25: స్థానిక రూరల్ పోలీసు స్టేషన్ ఆవరణలో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సంఘటన సోమవారం పట్టణంలో చోటు చేసుకుంది. పుట్లూరు మం డలం బాలాపురం గ్రామానికి చెందిన సంజీవరాయుడు కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి నాపరాళ్ల పరిశ్రమలో 15 సంవత్సరాలుగా పనిచేస్తూ, లక్షా పది వేల రూపాయలను అడ్వాన్సుగా తీసుకున్నాడు. సంజీవరాయుడు కొద్ది రోజుల క్రితం వెంకటరామిరెడ్డి నాపరాళ్ల పరిశ్రమలో పని వదిలివేసి, తాడిపత్రి మండలంలోని సజ్జలదినె్న గ్రామానికి మకాం మార్చాడు. వెంకటరామిరెడ్డి తన వద్ద అడ్వాన్స్‌గా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని సంజీవరాయుడుపై తీవ్ర వత్తిడి తేవడంతో న్యాయం చేయాలని రూరల్ ఎస్‌ఐ నారాయణరెడ్డిని ఆశ్రయించాడు. యజమాని వెంకటరామిరెడ్డికి ఫోన్ చేసి పిలిపిస్తామని అంతవరకు వేచి ఉండమని ఎస్సై తెలుపగా, తీవ్ర మనస్థాపానికి గురైన సంజీవరాయుడు పోలీస్ స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగి పడిపోవడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం తరలించారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
యాడికి, జనవరి 25:మండలంలోని చందన గ్రామంలో ఆశా కార్యకర్తగా పని చేస్తున్న నాగేంద్ర భార్య నాగలక్ష్మి వాస్మోల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు యాడికి ప్రభుత్వాసుపత్రికి తరలించి, మెరుగైనా వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలను తెలియాల్సి ఉంది.
మరో నిందితుడి అరెస్ట్
యాడికి, జనవరి 25:మండలంలోని వేములపాడు గ్రామంలో శ్రీ చెన్నకేశవ దేవాలయంలో ఈనెల 13వ తేదీ శ్రీదేవి, భూదేవి, విష్ణు పంచలోహాల విగ్రహాల చోరీ జరిగిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 18న నలుగురు నిందితులను అరెస్టు చేయగా, సోమవారం మరో నిదింతుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతని గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఆదిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.
ఐదో రోడ్డులో స్నాచర్ల హల్‌చల్
అనంతపురం క్రైం, జనవరి 25: స్థానిక ఐదో రోడ్డులో స్నాచర్లు సోమవారం తెల్లవారుజామున హల్‌చల్ చేశారు. ఇంటి ముందు కల్లాపి చల్లుతున్న వృద్ధురాలిని పలకరించేలా దగ్గరకు వెళ్లిన వారు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని ఉడాయించారు. కాగా ఈ విషయాన్ని సంబంధిత త్రీ టౌన్ పోలీసులు వెల్లడించేందుకు నిరాకరించారు.
సారా విక్రేతల అరెస్టు
గుత్తి, జనవరి 25:గుత్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో సోమవారం ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో ముగ్గురు నాటు సారా విక్రేతలను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 25 లీటర్‌ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లు మండలం కదిరిపల్లి నుండి గుత్తికి నాటుసారా సరఫరా చేస్తున్న సోమ్లా నాయక్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి, వారి వద్దనుండి 10 లీటర్‌ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అందులో బాగంగానే పుల్లెటి ఎర్రగుడి గ్రామానికి చెందిన రామాంజినేయులును అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 15 లీటర్‌ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
రామగిరి, జనవరి 25: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలోని నాగసముద్రం బస్టాపు వద్ద సోమవారం రాత్రి జరిగింది. వివరాల మేరకు ధర్మవరం పట్టణానికి చెందిన శేఖరప్ప, ఆంజనేయులు, కుళ్లాయిరెడ్డిలు పనినిమిత్తమై రామగిరి నుంచి ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనం 407ను ఢీకొంది. ఒకరికి కాలు విరగ్గా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
యాడికి, జనవరి 25:మండలంలోని కొనుప్పులపాడు గ్రామంలో ప్రేమ్‌కుమార్ ద్విచక్రవాహనం అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. వీరికి వెంటనే కుటుంబ సభ్యులు యాడికి ప్రభుత్వాసుపత్రికి తరలించగా 108 సహాయంతో తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఎస్‌బిఐ పోలీసుల ఆకస్మిక దాడి
* అదుపులో పలువురు లాటరీ నిర్వాహకులు
ధర్మవరం రూరల్, జనవరి 25: ధర్మవరం పట్టణంలో స్పెషల్ బ్రాంచి పోలీసులు సోమవారం లాటరీ నిర్వాహక సంస్థలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. స్పెషల్ బ్రాంచి డిఎస్‌పి గంగయ్య ఆధ్వర్యంలో సిఐలు ఎల్‌ఎం.రాజు, రాజశేఖర్, ఎస్‌ఐలు శ్రీరాములు, ధరణికిషోర్‌లు దాడులు నిర్వహించి లాటరీ నిర్వాహకుల నుండి కంప్యూటర్లను, బిల్ బుక్కులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు లాటరీ కంపెనీల నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మిగిలిన వారిపై వేట కొనసాగిస్తున్నారు. దాడులు నిర్వహించిన అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు రికార్డులతోపాటు కంప్యూటర్లను, బిల్ బుక్కులను తరలించారు.