విజయనగరం

పేదరికం ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, ఫిబ్రవరి 5: పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని తెలిపారు. శుక్రవారం మండలంలోని వెలుగు కార్యాలయానికి ప్రభుత్వం మంజూరు చేసిన కుట్టుమిషన్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 22లక్షల వ్యయంతో ఒక్కో వెలుగు కార్యాలయానికి 25 కుట్టుమిషన్లు మంజూరు చేసామని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పార్టీలకతీతంగా పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. చంద్రన్నబాట కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. పంటసంజీవని కార్యక్రమం ద్వారా ఇంకుడు గుంతలు తీయించాలని చెప్పారు. ప్రతి రైతు ఇంకుడు గుంతలు తవ్వించాలని చెప్పారు. ప్రతి వేసవిలో నీటిఎద్దడి లేకుండా ఇంకుడు గుంతలు ఉపయోగపడతాయని అన్నారు. ఎన్‌టిఆర్ జలసిరి కింద ఒక్కో యూనిట్‌కు 1.27లక్షల వ్యయంతో రైతులకు బోర్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. 1995లో వంట ఇంటికి పరిమితమైన మహిళలలను పొదుపు సంఘాల ఏర్పాటు ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించిన ఘనత చంద్రబాబుకి దక్కిందని చెప్పారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రభుత్వం సమకూర్చిన పెట్టుబడి నిధి వడ్డీమొత్తం ద్వారా కోట్ల రూపాయల రుణం పొందగలిగారని చెప్పారు. తిరిగి చెల్లింపులు లేని కారణంగా ఎస్సీ, బిసి కార్పొరేషన్ ద్వారా పొందిన రుణాలను బ్యాంకులు ఇవ్వటం లేదని తెలిపారు. రాష్ట్రంలో పదిలక్షల మందికి 10వేల రూపాయల చొప్పున పెట్టుబడి నిధి కింద అందజేస్తామని వెల్లడించారు. రాష్టంలో పెట్టుబడి నిధికింద రూ.1200కోట్లు, వడ్డీమాఫీ కింద 3,700కోట్ల రూపాయలు వారివారి ఖాతాలలో జమచేసామని చెప్పారు. అన్న అభయహస్తం కింద జిల్లాలో 6,272మందికి రూ.72లక్షల ఉపకార వేతనాలు ఇచ్చామని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో మహిళలు ఆర్థికంగా ఉన్నతస్థాయికి ఎదగాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి పొందిన ఆర్థిక సహాయంతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని అన్నారు. కార్యక్రమంలో మంత్రి మృణాళిని మహిళా సంఘాలకు రుణాల చెక్కులను, వారి పిల్లలకు ఉపకార వేతనాల చెక్కులను అందచేసారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఢిల్లీరావు, మాజీ ఎమ్మెల్యే గణపతిరావు, ఎంపిపిపిలు కాంతమ్మ, సింహాచలం, సన్యాసినాయుడు, జడ్పీటిసి వరహాల నాయుడు, తహశీల్ధార్ పెంటయ్య, ఎంపిడిఓ ఇందిర తదితరులు పాల్గొన్నారు.

స్వతంత్ర వ్యవస్థగా
మెరైన్ పోలీసు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 5: రైల్వే పోలీసు విభాగం తరహాలో మెరైన్ పోలీసు విభాగాన్ని కూడా స్వతంత్ర వ్యవస్థగా మార్చాలనే ప్రతిపాదన రాష్ట్రప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర మెరైన్ పోలీసు విభాగం ఐజి సూర్యప్రకాశ్‌రావు తెలిపారు. 974కిలో మీటర్ల తీరప్రాంతం ఉన్న రాష్ట్రంలో సముద్రం ద్వారా తీవ్రవాదుల ప్రవేశాన్ని, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు రాష్ట్ర విభజన అనంతరం హైద్రాబాద్‌లో ఉన్న మెరైన్ పోలీసు విభాగాన్ని విశాఖపట్నంకు మార్చామని చెప్పారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లిలో నిర్మించిన కోస్టల్ సెక్యూరిటీ పోలీసు స్టేషన్‌ను, జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో కొత్తగా నిర్మించిన పోలీసు డిస్పెన్సరీని, రిజర్వ్ పోలీసు విభాగం ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ల క్వార్టర్లను ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో నిర్మించిన బ్యారక్‌లను, అధునాతన కిచెన్‌ను, మోటారు ట్రాన్స్‌పోర్టు సెక్షన్‌న్‌కు చెందిన భవనాలను ఐజి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతు తీరప్రాంత భద్రతకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మచిలీపట్నం సమీపంలోని పెద్దపట్నం వద్ద 250 ఎకరాలలో మెరైన్ పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మెరైన్ పోలీసు విభాగాన్ని పటిష్టపరచే చర్యల్లో భాగంగా శ్రీకాకుళం వద్ద ఒక ఇండియన్ మెరైన్ రిజర్వ్ పోలీసు బెటాలియన్‌ను, విజయవాడ-ఏలూరు మధ్య మరో బెటాలియన్ ఏర్పాటు చేస్తున్నామనివెల్లడించారు. మెరైన్ పోలీసు సిబ్బందికి 50శాతం సీ అలవెన్స్‌తోపాటు ఇతర అలవెన్సులు కల్పిస్తున్నామని, మెరైన్ పోలీసు సిబ్బందికి వారు పనిచేసే ప్రాంతాల్లో వసతి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. మెరైన్ పోలీసు విభాగానికి సిబ్బంది కొరత కారణంగా సముద్ర తీరప్రాంతంలో మత్స్యకారుల సహాయం తీసుకుని తీవ్రవాదులు చొరబడుకుండా, స్మగ్లింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్, పిటిసి వైస్ ప్రిన్సిపాల్ సత్తిరాజు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు

ఆరు నెలల్లో డిజిటల్ లైబ్రరీ
ఆంధ్రభూమి బ్యూరో,
విజయనగరం, ఫిబ్రవరి 5: జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని పుస్తకాలను ఆరునెలల్లో కంప్యూటరీకరించాలని జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ సూచించారు. కంప్యూటరీకరణ వల్ల అందుబాటులో ఉన్న పుస్తకాల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చునని చెప్పారు. బార్‌కోడింగ్ విధానం ద్వారా పాఠకులకు పుస్తకాలను అందించడం, తిరిగి తీసుకోవడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. జెసి సూచనను జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకవర్గ సమావేశం ఆమోదించింది. శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో జెసి శ్రీకేష్ లఠ్కర్ అధ్యక్షతన జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ పాఠకుల అభిరుచికి అనుగుణంగా అవసరమైన కొత్త పుస్తకాలను కొనుగోలు చేయాలని, అందులో ఇరవైశాతం వరకు లిటరేచర్, పోటీపరీక్షల పుస్తకాలు కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కొన్ని శాఖాగ్రంథాలయాల మరమ్మత్తులకు పదిలక్షలు, పుస్తకాల బైండింగ్‌కు రూ.1.50లక్షలు, పది మండలాల్లో గ్రామపంచాయితీ కేటాయించిన స్ధలంలో శాఖాగ్రంథాలయాల నిర్మాణానికి రూ.12లక్షలు చొప్పున, కేంద్ర గ్రంధాలయంలో మహిళావిభాగం, సమావేశ మందిరం నిర్మాణానికి 1.50కోట్లు , ఫర్నీచర్ కొనుగోలుకు ఐదులక్షలు, పుస్తకాలు కొనుగోలుకు 50లక్షలు, ఆఫీస్ ఆటోమేషన్‌కు ఐదులక్షలు, ఏసిల కొనుగోలుకు మూడు3లక్షల మంజూరుకు చేయాలని తీర్మాణించి, పౌర గ్రంథాలయ విభాగం డైరెక్టర్ పరిపాలనా ఆమోదం కోసం పంపించాలని సమావేశం నిర్ణయం తీసుకుంది. జనరేటర్ కొనుగోలుకు ఐదులక్షల రూపాయలు మంజూరు చేయాలని ప్రతిపాదించగా విద్యుత్‌శాఖ అధికారులతో అంచనాలు తయారు చేయించి ప్రతిపాదించాలని జెసి సూచించారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటును వేగవంతం చేయాలని జెసి ఆదేశిస్తూ ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ల మరమ్మతుకు అవసరమైన 14150రూపాయల కోసం సంబంధిత విభాగం డైరెక్టర్ ఆమోదానికి పంపించాలని తీర్మానించారు. గ్రంథాలయ సంస్ధ చైర్మన్, కార్యదర్శి ఛాంబర్లలో ఫర్నీచర్ కొనుగోలుకు కమిటీ ఆమోదించింది. సందర్శకుల వాహనాల పార్కింగ్‌కు షెడ్ నిర్మించేందుకు సమావేశం ఆమోదించింది. ఈసమావేశంలో కమిటీ సభ్యులు కుమార్‌రాజా, కృష్ణారావు, అమ్మాజీరావు, గోవిందరాజులు పాల్గొన్నారు.

‘ముద్ర’ రుణాల మంజూరులో
బ్యాంకర్ల నిర్లక్ష్యమేలా?

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 5: పేదలకు ఆర్థికంగా ఉపయోగపడేందుకు కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ముద్ర పథకం అమలులో జిల్లాలోని బ్యాంకర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని బిజెపి జిల్లా కమిటీ ఆరోపించింది. ఈ విషయంలో బ్యాంకర్లకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది. ఈ మేరకు బిజెపి నాయకులు శివప్రసాద్‌రెడ్డి, అశోక్, లక్ష్మినరసింహం తదితరులు శుక్రవారం జిల్లా లీడ్ మేనేజర్ గురవయ్యను కలిసి వినతిపత్రం అందచేసారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ చిరువ్యాపారులు ఎక్కువ మొత్తం వడ్డీతో ప్రైవేటు వ్యక్తుల నుంచి రుణాలు తీసుకుని వ్యాపారం చేయటం ద్వారా నష్టపోవటాన్ని గమనించిన నరేంద్రమోదీ ప్రభుత్వం ముద్ర పథకాన్ని అమలులోకి తెచ్చిందని, చిరువ్యాపారులకు, చిన్నచిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిచేందుకు ఈ పథకాన్ని అమలు చేయవలసి ఉండగా జిల్లాలోని చాలా బ్యాంకులు ఈ పథకాన్ని పట్టించుకోవటం లేదని, దరఖాస్తులు పెట్టుకున్న వారికి రుణాల మంజూరు విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ఫిర్యాదు చేసారు. జిల్లా మొత్తంలో వివిధ బ్యాంకులకు చెందిన 187శాఖలు ఉండగా కేవలం 6327మందికి మాత్రమే రుణాలు మంజూరు చేసాయని, అందులో కెనరా బ్యాంకు 14కోట్లు మంజూరు చేయగా, ఇండియన్ బ్యాంకు 10లక్షలు మాత్రమే ఇచ్చిందిన తెలిపారు. బ్యాంకర్లు ముద్ర పథకం కింద రుణాలు ఇవ్వకపోవటంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నిరుత్సాహానికి గురవుతున్నారని చెప్పారు. దీనిని గమనించి ప్రతి బ్యాంకు లక్ష్యం మేరకు రుణాలు ఇచ్చేలా, ప్రతి బ్యాంకులో ముద్ర రుణాల కోసం ప్రత్యేక కౌంటరు ఏర్పాటుచేసేలా చూడాలని కోరారు. దరఖాస్తులు అందిన వెంటనే ఫీల్డ్‌సిబ్బందితో విచారణ జరిపించి అర్హులకు రుణాలు మంజూరు చేసేలా చూడాలని అన్నారు.

రైతు బజార్లకు కొత్త రూపు
విజయనగరం(టౌన్),్ఫబ్రవరి 5: వినియోగ దారులకు సరసమైన ధరలకు కూరగాయలను విక్రయించేందుకు ప్రభుత్వం నెలకొల్పిన రైతు బజార్లు చాలా ఏళ్లతరువాత కొత్త హంగులతో కళ కళలాడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచలననుండి ఏర్పడిన ఈరైతు బజార్లను గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. కనీస సదుపాయాల మాట అటుంచితే రైతు బజార్లు ఆలనాపాలనా చూడలేదు. రంగులు వెలిసి పోయి వినియోగదారులకు దర్శనమిచ్చేవి. దాదాపు పదేళ్లతరువాత మరలా వీటి గురించి ఆలోచించడం మొదలైంది. రైతుబజార్లను , వాటిసేవలను మరింతగా అందుబాటులోకి తేవడం, కనీస సదుపాయాలు కల్పించి మరలా రైతు బజార్లు తలెత్తుకు నిలబడేలా చేయడంలో భాగంగా మార్కెటింగ్ శాఖ వీటికి కొత్తహంగులద్ది తీర్చిదిద్దుతోంది. గోడలు, రైతులు కూరగాయాలు విక్రయించే దిమ్మలు, షాపులు. అన్నీ రంగులతో కళకళ లాడుతున్నాయి. విజయనగరం పట్టణంలోని మూడు రైతుబజార్లు సరికొత్తగా వినియోగదారులకు దర్శనమిస్తున్నాయి.

పూడికతీతకు స్పెషల్‌డ్రైవ్
*నగర పాలక సంస్థ కమిషనర్ జి.నాగరాజు
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 5: నగరంలో పూడిక తీత తొలగింపునకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. సంవత్సరాల తరబడి ప్రధాన కాలువలలో పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను తొలగించాలని నిర్ణయించామని చెప్పారు. ఇందుకు ప్రైవేటు కార్మికులతోపాటు మున్సిపల్ కార్మికులను వినియోగిస్తున్నామని అన్నారు. నగరంలో 4, 12, 17 వార్డులతోపాటు పట్టణం నడిబొడ్డులో ఉన్న గంటస్తంభం జంక్షన్ వద్ద ప్రధాన కాలువలో కూడా శుక్రవారం పూడికతీత పనులను చేపట్టారు. ఈ పనులను పర్యవేక్షించిన కమిషనర్ నాగరాజు మాట్లాడుడూ నగరంలో ప్రధాన డ్రైనేజిలలో నిలిచిపోయిన పూడికను, వ్యర్థాలను జెసిబి సాయంతో లారీల ద్వారా తొలగిస్తామని తెలిపారు. సంవత్సరాల తరబడి ప్రధాన కాలువలలో పూడిక, వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల ఏమాత్రం వర్షం పడినా రోడ్లపై నీరు నిలిచిపోతోందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటిని దృష్టిలో పెట్టుకుని పూడిక తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, టౌన్ ప్లానింగ్ అధికారి రాజేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు హయాంలో
ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకం
* ఎమ్మెల్సీ కోలగట్ల విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 5: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆర్టీసి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. ఆర్టీసి ఆస్తులను అమ్మటం ద్వారా సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని చెప్పారు. ఆర్టీసి ఎన్నికలకు సంబంధించి పార్టీ అనుబంధ ఆర్టీసి యూనియన్ వాల్‌పోస్టర్‌ను శుక్రవారం తన కార్యాలయంలో కోలగట్ల విడుదల చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు ప్రైవేటు వాహనాల పోటీతో ఆర్టీసి మనుగడ దెబ్బతింటోందని, ప్రైవేటు వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడానికి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రమేయం ప్రధాన కారణమని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ఆర్టీసి చార్జీలు పెంచకుండానే ప్రజలకు సేవలు అందించగా, చంద్రబాబు అధికారంలోకి రాగానే చార్జీలు అమాంతంగా పెంచారని విమర్శించారు. జగన్ నాయకత్వంలో తమ ప్రభుత్వం ఏర్పడితే ఆర్టీసిని ప్రభుత్వం విలీనం చేసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెనుమత్స సాంబశివరాజు, నెక్కల నాయుడుబాబు, చనుమల్ల వెంకటరమణ, వైఎస్సార్ ఆర్టీసి మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి దిశగా కొత్తవలస
* ఆర్డీవో శ్రీనివాసమూర్తి
కొత్తవలస, ఫిబ్రవరి 5: కొత్తవలసలో పలు పరిశ్రమలు రానున్నాయని ఆర్డీవో శ్రీనివాసమూర్తి తెలిపారు. దీంతో కొత్తవలస రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని చెప్పారు. మండలంలోని చీపురువలస, చినరావుపల్లి, పెదరావుపల్లి గ్రామాల్లో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయని వాటిని గుర్తించి ఇప్పటికే ఏపి ఐ ఐసికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.రైతులకు ఇచ్చిన ప్రభుత్వ భూముల వివరాలు,రైతులు ఆక్రమించిన భూవివరాలు జిల్లాకలెక్టర్ వద్ద ఉన్నట్లు చెప్పారు.కొత్తవలసను ఆనుకుని విశాఖ-అరుకు రోడ్డు ఉండటం పలు పరిశ్రమలు ఇప్పటికే స్థాపించి ఉండటం, కెకెలైన్ విజయనగరం రైలు మార్గం ఉండటం వల్ల కొత్తవలస అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈపాస్ యంత్రాల ద్వారా సరుకులు ఆలస్యం అవడంపై ప్రశ్నించగా ఈబాధ్యత ఎన్ ఐసికి అప్పగించినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ ఆనందరావు, వి ఆర్వోలు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనబాట

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 5: ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఎపి పిఎసిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు హెచ్చరించారు. సంవత్సరాల తరబడి సహకార సంఘాల ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తుందని విమర్శించారు. రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకు శుక్రవారం ఇక్కడ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట సహకార సంఘాల ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ సహకార సంఘాల ఉద్యోగులను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగులుగా పరిగణించాలని తెలిపారు. ముఖ్యంగా వేతన సవరణ జరగకపోవడంతో సహకార సంఘాల ఉద్యోగులు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. గ్రాట్యూటీ పై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసి చట్టప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని అన్నారు.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో కేటగిరి-5లో ఏర్పడిన ఖాళీలలో ప్రస్తుతం ఉన్న 25 నుంచి 50 శాతానికి ఇన్‌సర్వీస్ సహకార సంఘాల ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిసిసి డిప్యూటీ జనరల్‌మేనేజర్ వెంకటేశ్వరరావువినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.రామునాయుడు, యూనియన్ నాయకులు అప్పలనాయుడు, పివి రమణ తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ పిజి కోర్సుల సౌకర్యాలపై పరిశీలన
విజయనగరం(టౌన్),్ఫబ్రవరి 5: వైద్యవిధానపరిషత్తులోని జిల్లా కేంద్ర ఆసుపత్రి, గోషాసుపత్రిలో మెడికల్ పిజి కోర్సుల ప్రవేశపెట్టేందుకు ఇక్కడ అనువైన పరిస్థితులపై హర్యానానుండి వచ్చిన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీవాస్తవ్ శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఐదు స్పెషాలిటీ విభాగాల్లో మెడికల్ పిజి కోర్సులను ప్రవేశపెట్టడానికి జిల్లా కేంద్ర ఆసుపత్రి పాలకమండలి ఇటీవల డైరెక్టర్ ఆఫ్‌నేషనల్ బోర్డు కు దరఖాస్తుచేసింది. దీనిపై బోర్డు ఆదేశాలతో హర్యానా మెడికల్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి డాక్టర్ శ్రీవాస్తవ్ జిల్లా కేంద్ర ఆసుపత్రి, గోషాసుపత్రిలలో పర్యటించి ఇక్కడి సౌకర్యాలను ఆసాంతం పరిశీలన చేసారు. ముందుగా జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకున్న శ్రీవాస్తవ్ జనరల్ వార్డు, అత్యవర వైద్యవిభాగం, ఇన్స్‌ంటివ్ యూనిట్, పిల్లల వార్డు, బరువుతక్కువగల పిల్లల ప్రత్యేక వార్డు, గైనిక్ విభాగాలు పరిశీలించారు. ఆయా వార్డులు, విభాగాల వైద్యసేవలు, అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది, ఇన్స్‌ంటివ్ యూనిట్ లో ఎన్ని పడకలు ఉన్నవి ఆరాతీసారు. ఇన్స్‌సెంటివ్ యూనిట్‌లోని మూడుపడకలలో ఎవరు పేషెంట్లు లేని విషయాన్ని ఆయన గమనించారు. నిపుణులైన వైద్యులు, కొరత ఉందని తెలుసుకున్నారు. ఉన్న వారితోనే సేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ ఆయనకు వివరించారు. రాష్ట్ర వైద్యవిధానపరిషత్తు జాయింట్ కమీషనర్ జయచంద్రారెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆయనతోకలిసి డయాలసిస్ వార్డులో పర్యటించారు. అనంతరం వారు గోషాసుపత్రికి చేరుకుని అక్కడ 150 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు, వార్డులు, అపరేషన్ ధియేటర్ ,అందుతున్న సేవలపై జాయింట్ కమీషనర్‌తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ సీతారామరాజు మీడియాతో మాట్లాడుతూ ఫ్యామిలీమెడిసిన్, ఎనస్థీషియా, గైనిక్, ఎమర్జెన్సీ, పిడియాట్రిషన్ విభాగాల్లో వైద్యపరమైన పిజి కోర్సులు ప్రవేశపెట్టేందుకు బోర్డుకు దరఖాస్తుచేసామని తెలిపారు. ఇక్కడ ఆయా కోర్సులకు సంబంధించి ఆసుపత్రిలో ఉన్న వసతులు, వౌళికసదుపాయాలు వంటివి పరిశీలించడానికి వచ్చారని తెలిపారు. ఫ్యామిలీ మెడిసిన్‌కు సంబంధించి అనువైన సౌకర్యాలపై డాక్టర్ శ్రీవాస్తవ్ పరిశీలించారని అన్నారు. ఈకోర్సులు ప్రవేశానికి బోర్డు అనుమతి లభిస్తే అదనంగా డాక్టర్లు అందుబాటులోకి వస్తారు. పిజి కోర్సులకు ధియరీ ,ప్రాక్టికల్స్ వంటివి ఉంటాయని ఎంపిక కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. జిల్లా కేంద్ర ఆసుపత్రికి ఐదు కోర్సులకు అనుమతి వస్తే సీట్ల సంఖ్య మేరకు పిజి కోర్సులోచేరే వైద్యులు అందుబాటులోకి వస్తే నిపుణులైన వైద్యుల కొరత తీరనుందని వైద్య వర్గాలు అంటున్నాయి.

రూ.490 కోట్ల రుణాల మంజూరు లక్ష్యం
గజపతినగరం, ఫిబ్రవరి 5: ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతం లోగా డ్వాక్రా, స్వయం సహాయక సంఘాలకు జిల్లా వ్యాప్తంగా 490 కోట్ల రూపాయల రుణాలను బ్యాంకుల ద్వారా అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించామని డిఆర్‌డిఎ ఎపిడి సుధాకరరావుచెప్పారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయానికి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇంతవరకు 290 కోట్ల రూపాయల రుణాలను అందజేశామని చెప్పారు.
రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని, స్వయం సహాయక సంఘాలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత వెలుగు సిబ్బందిపై ఉందని అన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతోందని చెప్పారు. ఇసుక రీచ్‌లకు సంబంధించి ఇసుక కోసం డిడిలు తీసిన 48 గంటలలోనే లబ్ధిదారుడికి ఇసుక చేరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
షోకాజ్ నోటీసుల జారీ
ఎపిడి కార్యాలయానికి వచ్చేసరికి కార్యాలయంలో సిసిలు సింగరాజు, లింగరాజు, ఆదినారాయణ ఉండటంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలోకి వెళ్లి సభ్యులకు అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామాలలోకి వెళితే ఏ పథకానికి అర్హులో, ఏ పథకం ఎవరికి మంజూరు చేయాలో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. ఈ మేరకు ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎపిఎం శ్రీనివాసరావును ఆదేశించారు. గ్రామాలలోకి ప్రతిరోజూ వెళ్లి సభ్యులకు అవగాహన కల్పించి పథకాల వివరాలు, అర్హతలు, రుణాల మంజూరు, రికవరీలపై అవగాహన కల్పించాలని తెలిపారు. అలా చేయకుండా కార్యాలయాలలో ఉంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం చేయకూడదని అన్నారు.
లింగాలవలస రీచ్‌లో ఎన్ని ట్రాక్టర్లు ఇసుక తరలింపునకు డిడిలు తీశారని ప్రశ్నించారు. తక్షణమే రిజిస్ట్రర్ చేయించుకున్నవారికి ఇసుక అప్పగించాలని ఆదేశించారు.