అంతర్జాతీయం

56మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, మార్చి 27: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రక్తపాతం సృష్టించారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారం లాహోర్ కిటకిటలాడిన ఓ పిల్లల పార్కునే లక్ష్యంగా చేసుకుని విరుచుకు పడ్డారు. భయానక విస్ఫోటనంతో రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఆత్మాహుతి దాడిలో అనేక మంది పిల్లలు, మహిళలు సహా 56మంది మరణించారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ 200 మందిలో చాలా మంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆత్మాహుతి దాడికి కొన్ని క్షణాల ముందు వరకూ పిల్లల ఆట పాటలు, కేరింతలతో హోరెత్తిన గుల్షన్ ఎ ఇక్బాల్ పార్క్ ఒక్కసారిగా శ్మశాన సదృశమైంది. చెల్లాచెదురుగా పడి ఉన్న మృత దేహాలతో, క్షతగాత్రుల ఆర్తనాదాలతో నిండిపోయింది. పార్కు ప్రధాన గేటు వద్దే ఆత్మాహుతి దాడి జరిగినట్టుగా తెలుస్తోందని, దాదాపు పది కిలోల వరకూ పేలుడు పదార్థాల్ని వినియోగించినట్టుగా విస్ఫోటన తీవ్రతను బట్టి తెలుస్తోందని లాహోర్ ఐజి హైదర్ అష్రాఫ్ తెలిపారు. ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టుగా భావించడానికి వీల్లేదని లాహోర్ జిల్లా సమన్వయ అధికారి ముహమ్మద్ ఉస్మాన్ తెలిపారు. ఇది క్రైస్తవ పార్కు ఎంత మాత్రం కాదని, అయితే మృతుల్లో క్రైస్తవులు కూడా ఉండవచ్చునని పేర్కొన్నారు. దాదాపు రెండు వందల మంది వరకూ ఈ దాడిలో గాయపడ్డారని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదన్నారు. పిల్లల్ని సామూహికంగా హతమార్చాలన్న ఉద్దేశంతోనే ఆత్మాహుతి బాంబర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తోందని పంజాబ్ రాష్ట్ర మంత్రి బిలాల్ యాసిన్ అన్నారు. బాంబర్‌కు 20సంవత్సరాల లోపు వయసే ఉంటుందని, ప్రధాన ద్వారం వద్దే ఉద్దేశ పూర్వకంగా ‘పేలి’పోయాడని తెలిపారు. పాకిస్తాన్‌లోని మిగతా పట్టణాలతో పోలిస్తే లాహోర్ ప్రశాతంగానే ఉంటుంది. పైగా ఇది ప్రధాని నవాజ్ షరీఫ్ సొంత పట్టణం కూడా. ఇదిలా ఉండగా, గుల్షన్ పార్కు నుంచి క్షతగాత్రుల్ని రక్షించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపి ముమ్మర ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. నగరంలోని అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేయడంతో పాటు క్షతగాత్రుల్ని రక్షించేందుకు రక్తదానం చేయాల్సిందిగా ప్రజలను అధికారులు కోరారు.
తెగిపోయిన శరీర భాగాలు
విస్ఫోటన తీవ్రతకు మృతి చెందిన వారి శరీర భాగాలు తెగిపోయి ఆ ప్రాంతమంతా విసిరేసినట్టుగా పడిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈస్టర్ కావడం వల్ల మామూలు రోజుల కంటే కూడా ఆదివారం భారీ సంఖ్యలోనే ప్రజలు ఈ పార్కుకు తరలి వచ్చారని, వీరిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారని చెబుతున్నారు. మృతులైన పిల్లల్ని చూసిన తల్లి దండ్రుల రోదనలు, గాయపడ్డవారిని చూసి తల్లడిల్లిన అమ్మానాన్నలు కన్నీటి పర్యంతం కావడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. పేలుడు తర్వాత అందరినీ బయటికి పంపేందుకు పోలీసులు ప్రయత్నించినా గల్లంతైన వారి కోసం వెతుకులాడుతున్న వారు మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. మృతులకు సంతాపంగా పంజాబ్ ప్రభుత్వం మూడు రోజుల సంతాపాన్ని ప్రకటించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, తహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సహా అనేక మంది రాజకీయ నాయకులు ఈ దాడిని ఖండించారు. క్రైస్తవ సంస్థలూ ఈ విఘాతక కృత్యాన్ని గర్హించాయి.

చిత్రం లాహోరులో బాంబు దాడి జరిగిన ప్రాంతం. ఇన్‌సెట్‌లో తీవ్రంగా గాయపడిన మహిళ