పర్యాటకం

దివ్యక్షేత్రం పెద్దకళ్ళేపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా జిల్లా దివిసీమలో వెలసిన శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వరస్వామివారి ఆలయం కృష్ణా నదీ తీరాన పెద్దకళ్ళేపల్లిలో దివ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. సాధారణంగా పవిత్ర నదీ తీరాల్లో సిద్ధపురుషులు, యోగులు, మహర్షులు చిరకాల తపస్సుచేసిన కారణంగా సమీప ఆలయాలు మహిమాన్వితమైన కారణంగా వేలాది మంది యాత్రికులు ఆ క్షేత్రమును దర్శించుకుంటారు. ప్రాచీనమైన ఈ క్షేత్రంలో విశ్వామిత్ర, వశిష్ఠ మహర్షులు తపస్సుచేశారని స్కాంధ పురాణంలో వివరించబడింది. పురాణ, ఇతిహాసాల ప్రకారం ఈ ప్రదేశాన్ని కదళీపురం, కడలుసపురి, రంభాపురి అని పిలిచేవారట! ఇచట కృష్ణానది దక్షిణంనుంచి తూర్పుగా ప్రవహించి ఉత్తర వాహినియై శ్రీ నాగేశ్వరస్వామి ఆలయం దరిదాపులవరకు సాగి, తిరిగి తూర్పుదిశలో సాగి హంసలదీవిలో సాగర సంగమం అవుతుంది. ఈ క్షేత్ర మహిమను అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునికి వివరించినట్లుగా పద్మపురాణం చెబుతోంది. కాశీలో గంగ ఉత్తర వాహినిగా ప్రవహించినట్లే కృష్ణానది కూడా ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహించి శ్రీ నాగేశ్వరస్వామి వారి దృష్టిచే పునీతమై తరింపచేస్తోంది. కావున ఇది దక్షిణ కాశిగా ప్రసిద్ధి.
ఈ స్థల మహాత్మ్యం చాలా విస్తారంగా వుండి అనేక మహర్షులు, మహారాజులు, శంకరులు, తీర్థాలు, గుండాలు, రంభ, నలకూబరుల కథ, విధాత, కశ్యప ప్రజాపతి, కద్రువ, వినతల వృత్తాంతం ముడిపడి వుంది. ఎన్నో ఉపాఖ్యానాలు వున్నాయి. ఈ క్షేత్ర చరిత్రలో ‘కదళీపురం’ అనడానికి ఒక పూర్వ గాథ వుంది.
కృతయుగంలో విశ్వామిత్రుడు ఒకసారి వశిష్ఠాశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు తన కామధేనువు సహాయ సంపత్తితో షడ్రసోపేతమైన విందు ఇచ్చాడు. విశ్వామిత్రుడు ఆ గోవుని కోరాడు. యుద్ధం అయింది. వశిష్ఠుని తపఃప్రభావంతో ఆ కామధేనువునుండి వచ్చిన శంబరాదులు విశ్వామిత్రుని శిక్షించారు. కోపంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని మించిపోవాలని ఘోర తపస్సుచేసి, మేనక సౌందర్యానికి లోబడి శకుంతలను కన్నాడు! పశ్చాత్తాపంతో ఘోర తపస్సుచేశాడు. త్రిశంకుడను రాజుకు విశ్వామిత్రుని తపఃప్రభావంతో అటు స్వర్గానికి ఇటు భూలోకానికి కాకుండా మధ్యలోనే త్రిశంకు స్వర్గం కల్పించాడు. దానికి తన తపస్సు ధారపోశాడు. తిరిగి తపస్సుకు స్థలంకోసం అనే్వషిస్తుంటే కృష్ణా తీరంలోని కదళీపురాన్ని చూశాడు. అక్కడి నాగకుండంలో స్నానం చేసి, పునీతుడై నాగేశ్వరస్వామిని దర్శించాడు. బ్రాహ్మణ రూపంలో సదాశివుడు ప్రత్యక్షమై అక్కడ తపస్సు చేయమన్నాడు. తపస్సుకు మెచ్చిన నాగేశ్వరస్వామి ప్రత్యక్షమై ‘ఇది శివక్షేత్రం కావున క్షేత్ర పాలకుడు మహావిష్ణువే వుండాలని చెబితే విశ్వామిత్రుడు రుక్మిణీ సత్యభామ సమేతుడైన గోపాలుని పూజించి, ప్రతిష్ఠించాడు.
ఈ క్షేత్రంలో శిలాలింగం కర్కోటకుడనే సర్ప రూపంలో వుంటుంది. కనుక దీనికి కర్కోటక క్షేత్రం అని విశ్వామిత్రుడు మదన గోపాలుని ప్రతిష్ఠించినందున విశ్వామిత్ర క్షేత్రమని కూడా పేరుపొందింది.
కృతయుగంలో కశ్యపప్రజాపతికి కద్రువ, వినత ఇద్దరు భార్యలుండేవారు. సముద్రతీరంలో వారు ఒక తెల్ల గుర్రం చూశారు. దానితోక గురించి ఇరువురికి వాగ్వివాదం జరిగింది. కద్రువ తన సర్పాలైన కుమారులను గుర్రంతోక నల్లగా కనిపించేటట్లు చేయమంది. వారు వినత మీదా తమ మాతృదేవతయే కాన ఆ పని చెయ్యమన్నారు. తల్లికి కోపం వచ్చి కుమారులను జనమేజయ సర్పయాగంలో పడి మరణించండి అని శాపమిచ్చింది. కర్కోటకుడు వాసుకి తక్షకుడు మొదలైన అష్ట్ఫణిరాజులు బ్రహ్మవద్దకు వెళ్ళి శాపవృత్తాంతం చెప్పి రక్షించమన్నారు. బ్రహ్మ వారిని శంకరుని గురించి తపస్సుచేయమని స్థలము బ్రహ్మమండలం వద్దకు వెళ్ళమని ఆదేశించాడు. అట్లేవారు ఆ మండలమునకు వెళ్ళి ఒక శిలా మంటపం నిర్మించుకొని, నాలుగువైపుల కదళీవృక్షాలు నాటి ఒక సరస్సును త్రవ్వి శివలింగ ప్రతిష్ఠచేసి పూజించారు. శివపార్వతులు లింగమధ్యమున ప్రత్యక్షమైతే వారు భయసంభ్రమాలతో ‘కదళీ’ అని అరిచారు.
శివుడు వారితో మీరు ‘కదళీ’, కదళీ అని కేక వేసారు కాబట్టి ఇక్కడ కదళీపురంతో ఒక గ్రామం, ఈ సరోవరం నాగమండలంగా సర్వతీర్థ సమాయుక్తమై పాపహరమై విరాజిల్లుతుంది. జనమేజయుని క్రతువునుండి మిమ్మల్ని ఆస్తీకుడు రక్షిస్తాడు అని చెబుతాడు. తాను ఆ శివలింగంలోనే అంతర్భూతుడనై వుంటానని శివుడు చెబుతాడు. ఇక్కడ ఎన్నో తీర్థాలు ఆవిర్భవిస్తాయనీ శివుడు చెప్పాడు. అలాగే పరికర్ణకాతీర్థం, తక్షక తీర్థం, శంఖపాలుని తీర్థం, కర్కటక తీర్థం, వాసుకీ తీర్థం, శంఖ చూడ తీర్థం వున్నాయి. సారంగుడనే రాజు ఒక తటాకంలో స్నానం చేస్తే స్ర్తిగా మారిపోతే శంఖతీర్థంలో స్నానం చేసి మరల పురుషాకృతి వచ్చింది. నారద మహర్షి ప్రత్యక్షమై ఇదంతా ఇంద్రుని మాయ అని చెబుతాడు. ఆయన నాగేశ్వరస్వామి గురించి తపస్సు చేసి పరమపదించాడు. అచటే ధనుంజయ గుండం, పింగళ తీర్థం వున్నాయి. బృహస్పతి భార్య తారతో చంద్రుడు సుఖించిన కారణంగా ఆమె గర్భవతియై శిశువును కంటుంది. పాప పరిహారార్థమై నారదుని సలహాతో చంద్రుడు కదళీపురానికి వచ్చి నాగేశ్వరస్వామిని పూజించాడు. అతడు తవ్విన గుండమే మముద్వతి గుండమని పేరుపొందింది. రంభా, నలకూబరుల కథలో రకరకాల వివాదాలు పోరాటాలు జరిగాయి. పర్యవసానంగా నలకూబరుడు ఒక గుండం త్రవ్వించాడు. ఈ పురాణ గాథలనుబట్టి పెదకళ్ళేపల్లిలో ఎన్నో గుండాలు వెలిసి పవిత్ర తీర్థమైనాయి. అదితి సూర్యుని ఆరాధించిన స్థలము సూర్యమండము అని ప్రసిద్ధి. శాప ఫలితంగా ఒక గంధర్వుడు రోదన చేస్తుంటే నారదుడు అతనిని కదళీపుర నాగేశ్వరస్వామిని దర్శించమని సలహా ఇస్తే అది పాటించితే పూర్వ రూపం వచ్చింది. ఆ గంధర్వుడు తవ్వినదే విమల సరోవరం. దక్షప్రజాపతి, దేవేంద్రుడు ఇచట తపస్సుచేసి ఇష్టకామ్యాలను పొందారు. ఇంద్రుడు తపస్సు ఆచరించినచోటే చక్రతీర్థం వెలిసింది. ఇచట కృష్ణానదిలో స్నానమాచరిస్తే పునర్జన్మ లేదని స్కాంధ పురాణం ఉద్ఘోషించింది. ఇచట దుర్గాపార్వతీ సమేత నాగేశ్వరాలయాన్ని తొలుత క్రీ.శ.1292లో సోమశివాచార్యులువారు కట్టించారు. ఆ తరువాత తిరిగి 1782లో శ్రీ శంకరస్వామివల్ల ప్రేరేపితులై చల్లపల్లి సంస్థానాధీశులు జీర్ణోద్ధరణగావించినట్లు శాసనాలు చెబుతున్నాయి. 1795లో గోపుర మంటపాలు కట్టించారు. అప్పటినుంచి చల్లపిల్ల జమిందారులే వంశపారంపర్య ధర్మకర్తలుగా వుంటున్నారు. ఈ క్షేత్రానికి తూర్పున కృష్ణానది, దక్షిణాన సీతారామక్షేత్రమైన అయోధ్య, పశ్చిమాన అగస్త్యుడు ప్రతిష్ఠించిన ‘‘తేమవన’’ (టేమపల్లి) అనే రామేశ్వరం, ఉత్తరాన కదళికా అరణ్యం, సరిహద్దులు దక్షిణ భాగంలో శ్రీ వీరభద్రాలయం, దుర్గాదేవి గుడి, కాలభైరవస్వామి గుడి, సుబ్రహ్మణేశ్వర ఆలయం, అయిదు అంతస్తుల ఉన్నత గోపురం, కళ్యాణ మంటపం వున్నాయి. దేవాలయానికి ఎదురుగా నాగగుండమనే విశాలమైన తటాకమున్నది. చుట్టుప్రక్కలనున్న ఆలయ తటాకాలలోకంటే ఇది చాలా పెద్దది. ఇక్కడే పంచముఖ గణపతిని చూడవచ్చును. పూర్వం జనమేజయుడు ఇక్కడనే సర్పయాగం చేసేడని పూజారులు చెబుతారు. ఆలయ ప్రశస్తి యుగయుగాలనాటిది.
ఈ ఆలయానికి బందరు విజయవాడ నుండి బస్సులలో, ఆటోలలో వచ్చి దర్శనానంతరం వెళ్ళాలి. ఇచట వసతి సౌకర్యాలు లేవు గనుక ఈ ఆలయ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలనుండి భక్తజనసందోహం వస్తారు. ఈ క్షేత్రం మహిమాన్వితం. స్వామిని ఒకసారి దర్శించుకుంటే కష్టాలు తొలగి సుఖశాంతులు సౌభాగ్యం కలుగుతుందని యాత్రికుల అనుభవం.

- బొడ్డపాటి రాజేశ్వరమూర్తి