పర్యాటకం

సృష్టి స్థితి లయం.. త్రయంబకేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరాత్పరుడు, పరమేశ్వరుడు, పార్వతీదేవి ప్రియుడు, కామేశుడు, హరుడు, రుద్రుడు, శివుడు, త్రినేత్రుడు, ముక్కంటి, కైలాసవాసుడు, అమరేశ్వరుడు, ముక్తిప్రదుడు ఇలా ఎన్ని పేర్లు అనంతంగా చెప్పినా వాటన్నింటికీ కారణభూతుడు సాక్షాత్తు ఈశ్వరొక్కడే. ఆ ఈశ్వరుని గూర్చి లిప్తపాటుకాలమైనా తలిస్తే చాలు కైలాసదర్శనాన్ని కలుగచేస్తాడు. అమరత్వాన్ని ఇచ్చే అమరనాథునిగా కీర్తిగడించినవాడు.
లోకాలన్నీ పాలసముద్రం నుంచి ఉద్భవించిన హాలాహలంతో అట్టుడికిపోగా ఆ హాలాహలాన్నంతా తన గొంతున బంధించి సర్వలోకాలను రక్షించిన నీలకంఠేశ్వరుడు ఆ పార్వతీవల్లభుడు. అటువంటి ఈశ్వరుడు భక్తసులభుడు. భక్తులకోరిక మేరకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఆవిర్భవించగల నేర్పరుడు. నిరాకారుడైన ఈశ్వరుడు అహంకారరూపులై పోబోతున్న బ్రహ్మవిష్ణువులకు లింగోద్భవ దర్శనం కావించి నిరహంకారులను చేసిన మహానుభావుడు ఆ సర్వేశ్వరుడు. అటువంటి ఈశ్వరుడే త్రయంబకేశ్వరుడుగా జ్యోతిర్లింగరూపంలో నాసిక్ రైల్వేస్టేషను రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో నెలకొని భక్తుల కోరికను ఈడేరుస్తున్నాడు.
ఈ ఆలయం అతి పురాతమైన ఆలయం. ఇక్కడి సహ్యాద్రికొండలపైన పుట్టిన గోదావరి గౌతమిగా ప్రవహిస్తోంది. ఈనది కుశావర్తి, కుశల మీదుగా ప్రవహిస్తూ కిందకు వస్తుంది. ఈ నదికి ప్రక్కగా గౌతమీలయం ఉంది. ఇక్కడ కొండపైకి సుమారుగా 750 మెట్లు ఎక్కి పైకి వెళ్లిన వారికి గౌతమీ జన్మస్థానం కనుల పంటగా కనబడుతుంది. ఈ గౌతమీ నదీ తటాన పిండప్రదానాలు చేస్తుంటారు. గౌతమీ నదీస్నానం అనేక జన్మల దారిద్య్రనాశనానికి హేతువని అంటారు.
ఈ నదీ పుణ్యపరివాహక ప్రదేశంలో వెలసిన ఈ త్రయంబకేశ్వరుని లింగం పైనుంచి ఉబికి వచ్చే గోదావరి ఇక్కడి ప్రత్యేకతల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో త్రయంబకేశ్వర లింగం చిన్నగుంట మాదిరిగా ఉన్న ప్రదేశంలో ఉంటుంది. పైగా ఈ చిన్ని గుంటలో సృష్టిస్థితి లయకారులైన త్రిమూర్తులు లింగకారంలో దర్శనమిస్తారు. కనుక ఈ త్రయంబకేశ్వరుడిని మృత్యుంజయునిగా కొనియాడుతారు. ఈ త్రయంబకేశ్వరుని దర్శనం సర్వపాపహరంగాను అకాల మృత్యుదోషనివారిణిగాను చెబుతారు. ఈ త్రయంబకేశ్వరుని దర్శించినవారికి పాపరాశులు భస్మీ పటలం అవుతాయి. అంతేకాక అప్పటి వరకు వేదించిన గ్రహపీడలు కాని శనిదోషాలు కాని పటాపంచలవుతాయి. ఈ ఆలయ నిర్మాణం మహాద్భుతంగా శివనామ ప్రతిధ్వనులతో అలరారుతూ చూపరులను ఆకర్షిస్తుంది. భక్తవశంకరునిగా, భోళాశంకరునిగా హరహర మహాదేవ శంభో శంకర, ఓమ్ నమఃశివాయ అంటూ తండోపతండాలుగా ఈ త్రయంబకేశ్వర దర్శనం కోసం ప్రతిరోజు దేశం నలుమూలల నుంచి భక్తులు తండోప తండాలుగా వస్తుంటారు.
ఇక్కడ 108 శివలింగాలున్న గుహ ఒకటి ఉంది. కపాలేశ్వరాలయం, జటాయువు మోక్ష ప్రదేశమని, పుష్కర్ ఘాట్, సీతా గుహ, పంచవటి అనే ప్రసిద్ధ ప్రదేశాలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. ఈ ప్రదేశంలో వనవాసం చేస్తున్న సీతారామలక్ష్మణులు వచ్చారని ఇక్కడే లక్ష్మణ స్వామి శూర్పణఖకు చెవి ముక్కు కోసి పరాభవించాడని అందుకే ఈ క్షేత్రానికి నాసిక్ అన్న పేరు వచ్చిందని ఇక్కడి నివాసితులు అంటారు.
అంతేకాక ఇక్కడ ఉన్న బ్రహ్మగిరి పై గౌతముడు తన ధర్మపత్ని అహల్యతోకలసి నివసించే కాలంలో ఒకనొకసారి ఇక్కడి ప్రదేశమంతా కరువుతో అల్లలాడిందట. లోకకల్యాణ కారుడైన గౌతముడు వరుణ దేవుని గూర్చి తీవ్రమైన తపస్సు చేసి వరుణుని మెప్పించి బ్రహ్మగిరిలో సరస్సు నిర్మించాడు. ఆ సరస్సు లోని ఉదకం అక్షయమై సదా పారుతుండేది. దానితో బ్రహ్మగిరి అంతా సస్యశ్యామలమైంది. అక్కడ పంటలు పండించి అందరినీ క్షామబాధనుంచి గౌతముడు రక్షించాడు. కాని కొన్నాళ్లకు స్పర్థతో బ్రాహ్మణుడు గౌతముణ్ణి అవస్థల పాలు చేయాలనుకొన్నారు. వారు ఇంద్రుని సహాయంతో ఒక మాయాగోవును సృష్టించారు. ఆ మాయాగోవు గౌతముని ఆశ్రమంలోకి వచ్చి అక్కడి పంటలను నాశనం చేయసాగింది. దాన్ని చూసిన గౌతముడు ఆవును అదలించడానికి ఓ దర్భను ఆవుపైకి విసిరాడు.
ఆ దర్భపుల్ల వల్ల ఆ ఆవు చనిపోయింది. అక్కడే కాచుకూర్చున్న బ్రాహ్మణులు నీవు బ్రహ్మహత్యా దోషం చేశావు కనుక నిన్ను చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అని గౌతముణ్ణి నిందించారు. గౌతముడు ఎంతో దుఃఖంతో ఈ గోహత్యా పాతకం నుంచి నేను విముక్తి పొందే దారి చూపివ్వమని వారినే వేడుకున్నాడు. వారంతా కలసి గౌతముని తపస్సు చేసి ఈశ్వరుణ్ణి మెప్పించి ఈ ఆవుశరీరంపైకి గంగా దేవి ప్రవహిస్తే అపుడు నీవు గోహత్యాపాతకనుంచి విడవడుతావు అని చెప్పారు. బ్రాహ్మణుల వాక్కును వేదవాక్కుగా భావించి దుఃఖభారాన్నంతా శివునిపై వేసి ఈశ్వరని తదేక ధ్యానంతో తపస్సుకు ఉపక్రమించాడు గౌతముడు. కొన్నాళ్లకు ఈశ్వరుడు మెచ్చి గౌతమునికి ప్రత్యక్షమై వర మేమి కావాలని అడిగితే ఈ గోవుకు ప్రాణ దానం చేయమని అడిగాడా గౌతమమహర్షి. శివుడు ఎంతో ఆనందించి తన జటాజూటం నుంచి గంగను ఈ బ్రహ్మగిరిపై పారించాడు. ఆ జల స్పర్శతోనే ప్రాణాలు విడిచిన గోవు తిరిగి బ్రతికింది. వాడిపోయిన పంట అంతా నవనవలాడుతూ చిగురించింది. కరువుకాటకాలన్నీ సమసిపోయాయి. నిత్య కల్యాణం పచ్చతోరణంలాగా ఆ ప్రదేశమంతా కళకళాలాడింది. ఇదంతా గౌతముని ప్రభావమే అని తెలుసుకున్న బ్రాహ్మణులు తమ తప్పును తెలుసుకొని తమను క్షమించమని వేడుకుంటూ గౌతముని పాదాలను ఆశ్రయించారు.
ఇంతటి మహిమాన్విత ప్రదేశమైన ఈ బ్రహ్మగిరి త్రయంబకేశ్వర ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉండడం ఇక్కడి యాత్రీకులకు మహదానందాన్ని కలిగిస్తోంది.
ఈ త్రయంబకేశ్వరుని దర్శనం కోసం దేశంలోని నలుమూలలనుంచి రైలు బస్సు సౌకార్యాలు నాసిక్ దాకా ఉన్నాయి. ఈ నాసిక్‌కు చేరుకున్న తర్వాత ఇక్కడ ఆటోలు, కార్లు , ఇతర వాహనాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఈ పురాతన ఆలయాన్ని వీక్షించడం యాత్రీకులకు మరుపురాని అనుభూతిని మిగులుస్తుంది.

- చివుకుల రామమోహన్