పర్యాటకం

క్షీరారామలింగేశ్వర దర్శనం.. సర్వ పాప హరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచారామాలలో ఒకటైన క్షీరారామం (పాలకొల్లు)లోని శివలింగం శ్రీ మహావిష్ణువుచే ప్రతిష్ఠింపబడి, పూజించబడినట్టిది కావున ఈ క్షేత్రం అత్యంత విశిష్ఠమైనది. భారతదేశంలో అత్యంత ప్రాచీన కాలంనుండి ఆది దేవుడు, మహాదేవుడు అయిన ఆ ఉమాపతిని భారతీయులు ఆరాధిస్తున్నారు. అందుకే ఆ పరమేశ్వరుని కాశ్మీరంనుండి కన్యాకుమారి వరకు పలు దేవాలయాలు వున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలోని పంచారామాలు పరమేశ్వరుని పంచముఖాల వలె భాసిల్లుతున్నాయి. క్షీరారామంలో శివాభిషేకంకోసం పాలుకోవాలని కోరుకున్న తన భక్తుని ప్రార్థనను ఆలకించిన శివుడు తన శూలంతో ఓ తటాకాన్ని నిర్మించి, పాల సముద్రంలోని పాలను ఆ సరస్సులో నింపాడని క్షేత్ర పురాణం చెబుతోంది. రావణ వధానంతరం బ్రహ్మహత్యా పాతకం పరిహారార్థమై శ్రీరామచంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని భక్తుల విశ్వాసం. కనుకనే ఈ శివుణ్ణి రామలింగేశ్వరుడని అంటారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణమే క్షీరపురి. ఈ పాలకొల్లు పట్టణం వేరువేరు కాలాల్లో దుగ్ధ (పాలు) వనపురము, ఉపమన్యుపురము, పాలకాలను అనే పేర్లతో వ్యవహరింపబడినది. ముని కుమారుడైన ‘ఉపమన్యు’యొక్క ఆకలిబాధను తీర్చడానికి పరమేశ్వరుడు తన త్రిశూలముతో నేలపై రంధ్రం చేయగా, దానినుండి పాలు పొంగి వచ్చాయట! ఆ పాలు ఒక కొలనువలె ఏర్పడటంతో ఈ ప్రాంతం పాలకొలను వాడుకలో పాలకొల్లు అయినది. క్షీరము, దుగ్ధము అనే సంస్కృత పదాలలో అర్ధం పాలు అని వచ్చింది. అదిగాక ఆ ప్రాంతంలో పాలు కారెడు చెట్టు వున్న కారణంగా పాలకొల్లుగా పిలవబడుతోందని ఇక్కడి పూజారులు చెప్పారు. స్థల పురాణం చదివితే ఈ ఆలయ చరిత్ర ప్రాచీన కాలంనాటిది అని తెలుస్తోంది. క్షీరసాగర మధనం సమయంలో ఉద్భవించిన అమృత లింగాన్ని తారకాసురుడు సంపాదించి మెడలో ధరించాడు. అమృత లింగం అతని మెడలో వున్నంతకాలం స్వయంగా ఆ పరమేశ్వరుడే అతన్ని రక్షిస్తూ వుంటాడు. అతణ్ణి ఏ వీరుడు ఏమీ చెయ్యలేడు. కనుక ప్రాణభీతిలేని ఆ దానవుడు ముల్లోకాలను కలవరపరుస్తూ అందరినీ గడగడలాడించాడు. అతని ఆగడాలకు హద్దూ పద్దూ లేని కారణంగా శాంతి లోపించింది. జగాలు కంపించాయి. ఇక్కడ ఒక ఐతిహ్యం కుతూహలం కల్గిస్తుంది. దక్షయజ్ఞంలో తనువు చాలించిన సతీదేవి మరుజన్మలో శ్రీమంతుని కూతురుగా, పార్వతీదేవిగా జన్మించి, తపస్సుచేసి, పరమేశ్వరుని మెప్పించి, ఆయన్ని పెనిమిటిగా పొంది కుమారస్వామికి జన్మనిచ్చింది. విధాత ఆ దానవునికి ఇచ్చిన వరం ప్రకారం అతని మరణం శివ కుమారుని చేతిలో సంభవిస్తుంది. కనుక దేవేంద్రుడు కుమారస్వామి సైన్యాధ్యక్షునిగా చేసుకొని తారకాసురునిపై యుద్ధం ప్రారంభించాడు. దేవ, దానవ సైన్యాలకు భీకర యుద్ధం జరిగింది. దానిలో కుమారస్వామి తన శక్తి ఆయుధంతో తారకుని మెడలోని అమృత లింగాన్ని ఛేదించగా అది అయిదు ముక్కలై ఆంధ్రదేశంలో ఐదుచోట్ల పడింది. ఆ అయిదు ప్రదేశాలు పంచారామాలు అనే దివ్యక్షేత్రాలుగా నేటికీ విలసిల్లుతున్నాయి. ఈ క్షేత్రాలలో శివుడు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆ పంచారామాలు 1) అమరారామము (నేటి అమరావతి), 2) దక్షారామము (తూర్పుగోదావరి జిల్లా), 3) కుమారారామం (తూర్పుగోదావరి జిల్లా) 4) సోమారామము (గునుపూడి, పశ్చిమగోదావరి జిల్లా), 5) క్షీరా రామము (పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా). ఈ ఐదు ఆరామాలు- అఘోర ముఖం, తత్పురుష వామదేవ, సద్యోజాత, ఈశానములుగా వ్యవహరింపబడుతున్నాయి. పశ్చిమ గోదావరికి పశ్చిమంగా పడిన అమృత లింగం శకలాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువు శ్రీ త్రిపుర సుందరీదేవి (పార్వతీ) సమేతంగా ప్రతిష్ఠించాడు. లక్ష్మీ సమేత జనార్ధనస్వామి క్షేత్ర పాలకుడుగా ఇక్కడ నెలకొన్నాడు. క్షీరారామానికి ఇంత చరిత్ర వుంది.
ఇక ఆలయ విశేషాలకు వస్తే గర్భాలయంలో నెలకొనివున్న శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామివారు పాలవలె స్వచ్ఛమైన శే్వతవర్ణంతో అలరారే రెండు అడుగుల ఎత్తు శివలింగ రూపంలో దర్శనమిస్తున్నాడు. ఈ శివలింగం శిరోభాగాన కొనదేలి ముడివలె వుంటుంది. దానిని ‘కొప్పు’గా భావిస్తారు. శివలింగంపై గల నొక్కులను, కుమారస్వామికి సంబంధించిన బాణపు మొన తగిలి ఏర్పడినవిగా చెబుతారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ దశమినాటి సూర్యోదయవేళ రాజగోపురంనుండి రెండు ప్రాకారాలు దాటి సూర్యకిరణాలు గర్భాలయంలోని క్షీరారామేశ్వరునిపైకి ప్రసరిస్తాయి. ప్రధాన ఆలయానికి కుడివైపు విఘ్నేశ్వరాలయం, దానిప్రక్క గోకర్ణేశ్వరాలయం వున్నాయి. ప్రధాన ఆలయానికి ఎడమవైపు సుబ్రహ్మణ్యేశ్వరాలయం, దానిప్రక్క క్షేత్ర పాలకుడైన జనార్ధనస్వామి వారి ఆలయమూ వున్నాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా కొంత దక్షిణంగా శ్రీ పార్వతీ అమ్మవారి ఆలయం, ఆ ప్రక్కనే లక్ష్మీదేవి ఆలయం, రామలింగేశ్వరుని ఆలయానికిగల రెండు ప్రాకారాలలో ఈ ఆలయాలన్నీ వున్నాయి. మొదటి ప్రాకారంలో ఒకప్రక్క ఆంజనేయస్వామివారి ఆలయం, మరొక దిశలో వీరభద్రేశ్వరాలయాలు వున్నాయి. ఈ రెండు ప్రాకారాలలో కల్యాణ మండపం, శనివార మండపం, సభా మండపం, పవళింపు సేవామండపం, పురాణ కాలక్షేప మండపాలున్నాయి. ధ్వజస్తంభం వద్దగల ధ్యాన శివమూర్తి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా పేర్కొనదగినది రాజగోపురం, తొమ్మిది అంతస్తులతో 20 అడుగుల ఎత్తయిన ఈ ఆలయ రాజగోపురం పాలకొల్లు పెద్ద గోపురంగా ప్రసిద్ధి చెందింది. మొదటి అంతస్తునుండి చివరి అంతస్తువరకు లోపల మెట్లు వున్నాయి. పంచముఖ పరమేశ్వరుడు, అష్టదిక్పాలకులు, నాట్యగణపతి, లక్ష్మీగణపతి, కాళీయ మర్దనం వంటి రమణీయ శిల్పాలతో ఈ రాజగోపురం శోభిల్లుతోంది. రెండవ ప్రాకారకుడ్యంపై ఆధునిక వర్ణముల దేవతామూర్తులు, ప్రతిమలు వున్నాయి. పురాణగాథల శిల్పాలు సుందరమైనవి. మంటపం స్తంభాలపై అనేక శాసనాలు చరిత్రక సాక్ష్యాలుగా వున్నాయి. ఈ ఆలయంలో పూజలు స్మార్తశైవాగమ ప్రకారం జరుగుతాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ దశమికి స్వామివారికి, పార్వతీదేవితో కల్యాణం జరుగుతుంది. మర్నాడు రథోత్సవం. శివరాత్రి సందర్భంలో స్వామివారు పార్వతీదేవితో రావణ వాహనంపై, శ్రీ లక్ష్మీజనార్ధనులు గరుడ వాహనంపై ఊరేగుతారు. అమ్మవారికి శరన్నవరాత్రులు ఉత్సవాలు జరుగుతాయి. రాష్ట్రం నలుమూలలనుండి భక్తులు తరలివచ్చి, దర్శించి తరిస్తున్నారు. పట్టణ నడిబొడ్డులో వున్న ఆలయం రాజగోపురం కొన్ని మైళ్ళదూరంవరకు నయన మనోహరంగా కన్పిస్తుంది. క్షీరారామ రామలింగేశ్వర దర్శనం సర్వపాప హరం సౌఖ్య ప్రదాయకం.
**

క్షీరపురి ఆలయ చరిత్ర చూస్తే క్రీ.శ.12-17 శతాబ్దాల శాసనాలు, వేంగీ సామ్రాజ్య అధినేతల పాలన, తూర్పుచాణుక్యుల సామ్రాజ్యంలో పంచారామాలు నిర్మించారని చరిత్ర. కాలుయవేముని మరణానంతరం అతని రెండవ కుమారుడు రెండవ కుమారగిరిని రాజమహేంద్రవర సింహాసనంపై నిలిపి అల్లాడరెడ్డి రాజ్యపాలన చేస్తూ క్రీ.శ.1415లో రాజగోపురాన్ని నిర్మించి కలశాలు స్థాపించాడట! 1385లో పుష్పవనాన్ని సమర్పించాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ పాలకొల్లు(క్షీరారామం) గొప్ప వ్యాపార కేంద్రం. శనివారం సంతలో పెద్ద టోకు వ్యాపారం, పశువుల సంత జరుగుతుంది.
**
క్షీరపురికి 8 మైళ్ళలో వున్న నర్సాపురంలో వశిష్ఠగోదావరి వుంది. అచటనుండి సాగర సంగమమైన స్థలంలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. నర్సాపురంలో ఎంచెరుమానారు సన్నిధి చాలా ప్రాచీనమైనది. దర్శించుకోవచ్చు. నర్సాపురం క్రోచెలేస్ అల్లిక పరిశ్రమకు ప్రసిద్ధి. ఈ జిల్లాలో రోడ్డు, రైలు పడవ సౌకర్యాలు బాగా వున్నాయి. భీమవరం పట్టణం ఇక్కడకు దగ్గరే. అచట గునుపూడి సోమేశ్వరాలయాన్ని దర్శించుకోవచ్చు. జిల్లాలోని పెనుగొండలో కన్యకాపరమేశ్వరీ ఆలయం, పట్టెసీమ వీరభద్రుణ్ణి, ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) ఆలయం దర్శించి తరించవచ్చు. జిల్లాలో ప్రాచీన బౌద్ధ, జైన అవశేషాలనూ చూడవచ్చు.

- బొడ్డపాటి రాజేశ్వరమూర్తి