పర్యాటకం

మంగళవాఠం ఇక్కడ పండగే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగమ శాస్త్రాలలో గ్రామదేవత ఆరాధనకు ఒక ప్రాశస్త్యం వుంది. గ్రామదేవతలంతా స్ర్తిమూర్తులే కావటం విశేషం. ఆదిపరాశక్తి కళాంశ రూపంగా గ్రామదేవతలు వెలిశారని వేదశాస్త్రాలు పేర్కొంటున్నాయి. స్ర్తిని శక్తిస్వరూపిణిగా భావించి ఆరాధించటం అనూచానంగా వస్తున్న సాంప్రదాయం. నాగరికత ఎంత అభివృద్ధి చెందినా గ్రామదేవతారాధన మాత్రం నిరంతరం కొనసాగుతూనే వుంది. పల్లెసీమల్లోని గ్రామదేవతల ఆలయాల్లో కొనసాగుతున్న తిరునాళ్ళు, కొలుపులు, జాతర్లే అందుకు నిదర్శనం. అసంఖ్యాకంగా వున్న గ్రామ దేవతలను ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ కొలుచుకుంటారు. పేరేదైనా రూపం ఎలా వున్నా ఆ అమ్మని మాత్రం ఆదిపరాశక్తి ప్రతిరూపంగా భావిస్తారు.
తూర్పు తీరమైన బంగాళా ఖాతానికి ఆనుకుని పధ్నాలుగు కిలోమీటర్ల దూరంలో కృష్ణా, పెన్నా నదుల మధ్య ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలో ఉన్న గ్రామం స్వర్ణ. ఒకనాటి పేరు సవరయపాలెం. అది కాలక్రమంలో స్వర్ణగా మారింది. ఇది కాకతీయుల కాలంలోని గ్రామం. స్వర్ణం అంటే బంగారం, కాంచనం, పసిడి అలా పేరుకు తగ్గట్టే నిజంగానే వూరు బంగారమే. ఆహారోత్పత్తికి, విజ్ఞానానికి, వినోదానికి కూడా పుట్టినిల్లు లాంటిది ఈ గ్రామం. కక్షలు, కార్పణ్యాలు లేని శాంతికి చిరునామా ఈ వూరు. పాడి పంటలలో ప్రకాశం జిల్లాలోనే మేటి స్వర్ణ. గ్రామానికి మూడువైపుల చెరువులు, నాలుగవ వైపు కృష్ణకాలువ. ఊరి నడిబొడ్డున గ్రామదేవత స్వర్ణమ్మ తల్లి. అన్ని కులాల, మతాల వారు సహజీవనం చేస్తూ కలిసిమెలిసి వుండే ఆదర్శ గ్రామం స్వర్ణ.
ఇక్కడ కొలువుదీరిన స్వర్ణమ్మ తల్లి గ్రామ ప్రజలంతా ఆరాధించే దేవత. గ్రామం నడిబొడ్డున ఒక పూరి పాకలో కొలువుదీరిన ఆరాధ్యదైవం. సహస్రాబ్ధి చరిత్ర కలిగిన స్వర్ణను కంటికి రెప్పలా కాపాడుతున్న తల్లి స్వర్ణమ్మ. ఆ తల్లికి దణ్ణం పెట్టుకుంటే కష్టాలనుండి గట్టెక్కుతామని తమ కష్టాలు, కోరికలు తీరితే మంగళవారం మొక్కులు చెల్లించుకుంటామని గ్రామ ప్రజలు స్వర్ణమ్మని వేడుకుంటారు.
కుల మతాలకు అతీతంగా అందరి దేవతగా స్వర్ణమ్మను ఆరాధిస్తారు. మంగళవారం అమ్మవారి జన్మదినంగా భావిస్తారు. ఆ ఊరికి ప్రతి మంగళవారం ఒక పండగ రోజే. మంగళవారం వచ్చిందంటే పొంగళ్ళు, పానకం, వడపప్పు, టెంకాయలతో ఆ ప్రదేశమంతా మొక్కులు తీర్చుకునే భక్తులతో కోలాహలంగా ఆహ్లాదకర వాతావరణం నెలకొని అందరి మనసులు ఆనందపరవశమవుతాయి. గ్రామానికి చెందిన రజక కుటుంబీకులు అనువంశికంగా గుడి ఆలనపాలన చూసుకుంటూ పూజారులుగా కూడా వ్యవహరిస్తారు.
స్వర్ణమ్మ తల్లికి ప్రతి యేడాది వైశాఖ బహుళంలో మూడు రోజులపాటు సోమ, మంగళ, బుధవారాలు కలిసివచ్చేలా తిరునాళ్ళు నిర్వహిస్తారు. తిరునాళ్ళు జరిగే మూడురోజులు ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో క్రీడల పోటీలు, ముగ్గుల పోటీలు, ఎడ్ల పందాలు వంటివి నిర్వహిస్తారు. హిందువులే కాకుండా ఇతర మతస్థులుకూడా కలసి అందరూ స్వర్ణమ్మకు టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఊరంతా ఆ మూడురోజుల పండగ వాతావరణం నెలకొని వుంటుంది. తిరునాళ్ళు సమయంలో విద్యుత్తు అలంకరణలు, విద్యుత్తు ప్రభలు, అలాగే భక్తులకు ప్రసాదాలు, భోజన సదుపాయాలు ఏర్పాటుచేస్తున్నారు. తిరునాళ్ళు మొదటిరోజునుంచే ఊరంతా సందడి మొదలవుతుంది. ఎక్కడ చూసినా అంగళ్ళు, ఇంటింటా బంధువులు గ్రామం కోలాహలంగా వుంటుంది. అత్యంత సుందరంగా, ఘనంగా నిర్వహించే ఈ తిరునాళ్ళకు ఇతర ఊళ్ళల్లో వుంటున్నా స్వర్ణ గ్రామానికి చెందిన వారంతా ఈ మూడు రోజులు గ్రామంలోనే వుండి అమ్మవారి సంబరాలలో పాలుపంచుకుంటారు. మూడు రోజులపాటు గ్రామ ప్రజలంతా అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందుతారు.
తిరునాళ్ళు మొదటిరోజున గ్రామానికి చెందిన ముతె్తైదువులు, యువతులు పెద్దఎత్తున అమ్మవారికి పూలు, పండ్లు, పసుపు కుంకుమలు, గాజులు, చీరలు, రవికలు సమర్పించుకుంటారు. తమ కుటుంబాలను చల్లగా చూడమని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించి వేడుకుంటారు. రెండవ రోజైన మంగళవారం తిరునాళ్ళలో ప్రధానమైన రోజు. భారీ సంఖ్యలో జనం అమ్మవారి దివ్య స్వరూపాన్ని వీక్షించి పులకితులయ్యేరోజు. గజ్జెకట్టి ఆడే పోతురాజుల వీరంగాలు, కనక తప్పెట్ల చప్పుళ్ళు, జానపద సౌరభాలు ఉట్టిపడుతుండగా స్వర్ణమ్మ కొలువులు ప్రారంభమవుతాయి. ఉదయంనుంచే గుడి దగ్గిర రద్దీ మొదలవుతుంది. వ్యవసాయదారులు తమ పశువులను అందంగా అలంకరించి స్వర్ణమ్మ గుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయించి కొబ్బరికాయలు కొడతారు. తమతమ వాహనాలను కూడా అమ్మవారి చుట్టూ తిప్పి చల్లంగా చూడమని వేడుకుంటారు. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు జోరందుకుంటాయి. ఇంకోవైపు ఎడ్లపందాలు జరుగుతాయి. అర్ధరాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే వుంటుంది. రాత్రి కొలుపులు మొదలవుతాయి. తెల్లవార్లు రజక కులస్తులు నిర్వహించే కొలుపుల దృశ్యాలను చూసేందుకు జనం భారీగా హాజరవుతారు.
మూడవ రోజు తిరునాళ్ళు ముగింపురోజైన బుధవారం గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకొని చద్ది నైవేద్యాలు, పొంగళ్ళు సమర్పించుకుంటారు. మొదటి రోజున అమ్మవారికి సమర్పించుకున్న పసుపుకుంకుమలు, గాజులు ముతె్తైదువులకు పంచిపెడతారు.
అమ్మవారికి పెట్టిన నైవేద్యాలను భక్తులకు వినియోగిస్తారు. ఈ కొలుపులకు ముగింపుగా పొట్టేలును బలిచ్చి కార్యక్రమానికి ముగింపు పలుకుతారు. అమ్మవారికి పొట్టేలును బలిచ్చాక ఆ రక్తంతో స్వర్ణమ్మ గుడి గోడలపై చేతి ముద్రలు వేస్తారు. ఆ తర్వాత కొద్దిసేపు గుడి తలుపులు మూసివేస్తారు. కొద్దిసేపటి తర్వాత ఆలయంముందు శుద్ధిచేసి తిరిగి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇదంతా ముగిశాక బైండ్లవాళ్ళు స్వర్ణమ్మతోపాటు వివిధ దేవతలను కొలిచే వారందరినీ పేరు పేరునా పలకరిస్తూ అందరి ఆమోదంతో అమ్మవారిని సెలవుకోరతారు. దీనితో మూడురోజుల తిరునాళ్ళ ఉత్సవం ముగుస్తుంది. ఏ ప్రాంతం వారైనా స్వర్ణమ్మ తల్లిని దర్శించుకోవాలంటే చీరాల రైల్వేస్టేషనుకు సమీపంలోని బస్టాండునుండి బస్సుద్వారా స్వర్ణ గ్రామానికి చేరుకొని ఆ తల్లిని దర్శించి తరించవచ్చు.

- కాకరపర్తి సుబ్రహ్మణ్యం