పర్యాటకం

అనంతసాగర్‌లోని శే్వతాచలం కలియుగ కల్పవృక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యా కుందేందు తుషార హార ధవళా యా
శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండ.....
అంటూ సరస్వతీ దేవిని పూజించని వారు అరుదు. ఈ జననమరణం చక్రంలో ఉన్న వారెవరైనా సరే సరస్వతీ దేవి అనుగ్రహంతోనే జీవిస్తుంటారు. బుద్ధిమాంద్యం ఉన్నవారినైనా సరస్వతీ దేవి అనుగ్రహించవలసిందే. అపుడే అతడు తన దినచర్యలనైనా సరిగా చేసుకొంటాడు. సర్వానికి కారణమైన అమ్మ శే్వతవస్త్రాలంకారంతో చేతిలో జపమాలను, పుస్తకాన్ని పట్టుకుని సర్వులను రక్షిస్తూ ఉంటుంది. ఆ తల్లి ముక్తికోరిన వారికి జ్ఞానభిక్ష పెడుతుంది. లౌకిక విద్యలనాశ్రయించి ఈ లోకవ్యాపారములను చేయువారికి కూడా ఆ తల్లి దయవలనే లౌకికవిద్యలు అబ్బుతాయి. విద్యార్థులందరికీ విద్యను ప్రసాదించే తల్లిగా సరస్వతీదేవిని కొలుస్తుంటాము. ఈ జీవనయాత్రను సాగించడానికి తల్లి దయే అవసరమనుకొన్న శ్రీ అష్టకాల నరసింహశర్మ అను నతడు తల్లి ని గూర్చి బాగా ఆలోచించి బాసర క్షేత్రానికి వెళ్లి తన్ను కాపాడమని వేయి విధాలుగా ప్రార్థించి తల్లికిష్టమైనది తపస్సు అని భావించి ధ్యానించడం ప్రారంభించాడట. దయామయి, కరుణామయి అయిన ఆ తల్లి తన్ను ప్రార్థించే నరసింహశర్మను అనుగ్రహించదలిచింది. ఆ తల్లి నరసింహశర్మ దగ్గరకు వచ్చి సిద్దిపేట దగ్గర తనకు ఓ ఆలయాన్ని నిర్మించమని కోరిందట.
ఆమె దయ ఉంటే ఆ సరస్వతీదేవి ఆలయం రూపుదిద్దుకుంటుందని న మ్మి తల్లినే అన్నింటికి మార్గదర్శకత్వం వహించమని కోరుకున్నాడట. తల్లి ని అనునిత్యం పూజించేవాడు. దుష్టప్రవృత్తిని వీడనివారికి శత్రుసంహారిణిగా రాక్షస సంహారిణిగా అవతరించిన నీవే నా చేత ఆలయనిర్మాణ పనులను చేయించుతల్లి అన్నింటికీ నీవే దిక్కు అని నమస్కారం చేసి తిరిగి తన లౌకిక వృత్తులలో పడిపోయాడు. కాని నిరంతరం ఆ తల్లి ఆదేశాన్ని స్మరించుకుంటూ ఉండేవాడు నరసింహశర్మ. అతడు తనస్నేహితులతోను , బంధువులతోను అమ్మ ఆదేశాన్ని వినిపించి తాను ఎలాగైనా ఓ చిన్న ఆలయనిర్మాణానికి అంకురార్పణ చేయాలని తలచాడు. అనతికాలంలోనే మెదక్‌జిల్లా సిద్దిపేటకు 20 కి.మీదూరంలో ఉన్న ప్రాంతంలో సరస్వతీదేవి ఆలయాన్ని 1980లో నిర్మించాలని తలపెట్టారట. ఆ తరువాత తనస్వార్జితం తోనే ఈ ఆలయనిర్మాణం పూర్తికావించారు నరసింహశర్మ. ఇపుడీ క్షేత్రాన్ని శే్వతాచలక్షేత్రంగా పిలుస్తున్నారు.
ఆ తరువాత కుర్తాళం సిద్దేశ్వరీ పీఠాధిపతులు ఆలయనిర్వహణ బాధ్యతలను తీసుకొన్నారు. నేడు ఆ సరస్వతీ ఆలయం అనంతసాగర్‌లో అలరారుతోంది. చుట్టూ ప్రకృతి అందాలతోను ఉండే ఈప్రదేశం యాత్రీకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడ దగ్గరలో కొన్ని గుహలు ఉన్నాయి.వీటిలో చిన్న చిన్న జలాశయాలు ఉన్నాయి. వీటిని రాగి , పాలు, చీకటి దొనె లను పిలుస్తారు. వీటిలో స్నానాదికాలు చేసినవారికి రోగాలు దూరమవుతాయని ఇక్కడి నివాసితులు చెబుతారు. అంతేకాక ఈ నీటిని ఇక్కడి రైతులు తీసుకొని వెళ్లి తమ పొలాలల్లో చల్లుకుంటారు.దానివల్ల వారికి అధిక దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం. ఇలా ఈ తల్లి ఈ ప్రాంతంవారిని ఒక్కవిద్యాసంపన్నులుగానే కాక సర్వతోముఖాభివృద్ధిని పొందేలాగా ఆశీర్వదిస్తున్నది. అందుకే ఈ అనంతసాగర్ లోని సరస్వతీ దేవాలయాన్ని తప్పక చూచితీరవలసిన క్షేత్రంగా చెబుతారు.
ఒకచేతిలో వీణను మరోచేతిలో జపమాలను పట్టుకుని నిల్చుని ఉండే ఈసరస్వతీదేవిని దర్శించినవారికి అంతులేని సంపదలు, అపార విద్యావైదుష్యాలు లభిస్తాయని సరస్వతీదేవీ భక్తులు చెబుతారు. ఒకసారి రాక్షససంహారం చేయాల్సి వచ్చింది. అపుడు వాగ్దేవి తన శరీరము నుండి ‘కౌశికి’ అనే శక్తిని సృజించింది. ఆ కౌశికియే- ‘కాళీమాత’. కాళీ శక్తితో శుంభనిశుంభరాక్షసులను సంహరించింది. ఆ కాళినే దక్షిణకాళిగా ఈ ఆలయంలోని ఒక ఉపాలయంలో కొలువైంది.
ఈ ఆలయం లోని మరోఉపాలయంలో సౌభాగ్యలక్ష్మి కొలువై భక్తులకు సౌభాగ్యాన్నిస్తూవారి కోరికలను ఈడేరుస్తున్నారు. ఈ ముగ్గురమ్మల ఈ అనంతసాగర్ కోరి కొలిచినవారికి కొంగుబంగారమై విలసిల్లుతూ ఉంది. హైదరాబాదునుండి 120కి.మీ దూరంలోను, సిద్ధిపేటకు 20కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయానికి కరీంనగర్ వయా శనిగారం వెళ్లేబస్సులోవెళ్లవచ్చు. ఈ శనిగారం నుండి సుమారుగా 2కి.మీ. దూరంగా ఉన్న ఈ ఆలయానికి ఆటోల సౌకర్యం కూడా ఉంది. హైదరాబాదుకు సమీపంలో ఉండే ఈ ఆలయాన్ని దర్శించి సరస్వతీ దేవి కటాక్షం పొందాలని విద్యార్థులంతా ఉవ్విళ్లూరుతారు. ప్రకృతిని చూస్తూ పరవశించే యాత్రీకులు కూడా ఈ ఆలయం, దీని చుట్టూ ఉండే చిన్నచిన్న గుహలు, జలాశయాలు, చెట్లు చేమలతో ప్రశాంతవాతావరణానికి ముగ్ధులవవలసిందే అంటారు. బుద్ధిని విద్యను, జ్ఞానమును, వివేచనాశక్తిని, కల్పనా నైపుణ్యాన్ని ధారణా శక్తిని, సత్వగుణాన్ని, సద్బుద్ధిని, విచక్షణాజ్ఞానాన్ని కలుగచేయమని ఈతల్లిని అందరూ వేడుకుంటారు. ఈ సరస్వతీదేవికి విశేషార్చనలతో పాటుగా పర్వదినాల్లో విశేషా లంకరణ పూజలు నిర్వ హిస్తారు.

- ఎస్.సి.వి.సాయి