పర్యాటకం

జలం.. సకల దేవతా రూపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలం సృష్టిలో జీవరాశికి ముఖ్యమైన ఆధారం. నీరు లేకపోతే మనుగడ లేదు. అందుకే జలం ప్రాముఖ్యాన్ని పలు ఉపనిషత్తులు, వైదిక మంత్రాలు బహుముఖీనంగా వర్ణించాయి.
పంచ భూతాలలో జలం శ్రేష్ఠమైనదని చెప్పబడింది. సృష్టికి పూర్వం జలం మాత్రమే ఉన్నది. ఆ సమయంలో జలమునందు ఒక తామరాకు మీద నారాయణుడు అవతరించాడు. అలా అవతరించిన నారాయణుడు సృష్టి రచన చేసాడు. ఆ విధంగా జలమే సృష్టికి ముందు సర్వ జగత్తు నిర్మాణానికి కారణమైంది. అందుకే జలమే సృష్టి కారణంగా చెప్పడం జరిగింది. జలం సకల దేవతా రూపమని, దేవతలకు ప్రీతి కలిగించేది జలమేనని వేదం ఉద్ఘోషిస్తున్నది. దేవతలే కాదు, మానవులు కూడా జలాన్ని దేవతా స్వరూపంగా ఆరాధిస్తున్నారు. భారతీయులు జలాన్ని దేవతగా ఆరాధించడమే కాకుండా వైదిక కర్మలు నిర్వర్తించేటప్పుడు పవిత్రతను పొందేందుకు మంత్రాలతో సంప్రోక్షణ చేయడానికి సంకల్పం చెప్పుకుంటూ నదీమ తల్లులను ఆవాహనం చేస్తుంటారు. సంకల్పంలో సప్త గంగలను ఆహ్వానించి తాము స్నానం ఆచరించడమే కాకుండా ఆ పవిత్ర నదుల తీర్థంతో దైవాన్నీ, పూజా ద్రవ్యాలనీ సంప్రోక్షించి పవిత్రతను చేకూరుస్తారు. మన నిత్య జీవితంలో లౌకికంగా ఆధ్యాత్మికంగా జలానికి అంతటి ప్రాముఖ్యం ఉంది.
జలం ప్రాణసమానం. జలం మానవునికి ఎనిమిది విధాలైన ప్రయోజనాలు కలిగిస్తుందని యజుర్వేదం చెబుతుంది. అవి-శుద్ధ జలం తేజస్సును, జలాశయాలలోని జలం వల్ల పుష్టి, సంతానోత్పత్తి శక్తి; అలలతో ప్రవహించే జలం బలాన్నీ, వీర్యాన్నీ; యజ్ఞానంతరం చేసే అవబృథ స్నానం వలన దీర్ఘాయువు, బ్రహ్మవర్చస్సు, ఆయుష్షు లభిస్తాయి. ప్రకృతి పరంగా కూడా జలం మానవుల మనుగడకు అనేక రూపాలలో అక్కరకు వస్తున్నది. భారతీయులు నదులను మాతృస్వరూపులుగా ఆరాధిస్తారు. నదీ దేవతలు పాపహరాలుగా కీర్తింపబడుతున్నాయి. నదుల మహాత్మ్యాన్ని పురాణాలు బహుదా శ్లాఘించాయి. భారతదేశంలో చాలా జీవనదులున్నాయి. కొన్ని నిత్యం ప్రవహించేవి, మరికొన్ని వర్షాకాలంలోనే ప్రవహించేవి. వీటిలో పనె్నండు నదులను ప్రముఖంగా పేర్కొన్నారు. అవన్నీ జీవనదులు. పశ్చిమోత్తరములలో జన్మించి ప్రాగ్దక్షిణ దిశలలో సముద్రంలో సంగమించేవాటిని మహానదులనీ, ప్రాగ్దక్షిణములలో జన్మించి పశ్చిమ దిశలో సముద్రంలో కలిసే నదులను మహానదములని చెప్పారు. ఈ నదీ నదములను ఒక్కొక్క పేరుతో పిలువబడుతు ప్రజలచే ఆరాధన లందుకుంటున్నాయి. ఈ నదీ దేవతలను ఆరాధిస్తూ ఆ తీరాలలో నివసించిన కారణంగా నాగరికతలు ఏర్పడ్డాయని చారిత్రకులు చెబుతున్నారు. నదీ పరీవాహ తీర ప్రాంతాల్లో నాగరికతను పెంపొందించిన మహానదులు గంగ, యమున, సింధు, గోదావరి, కృష్ణ, కావేరీ, నర్మద మున్నగునవి.
స్వతః పరిశుద్ధాలు, పరిశుద్ధికరాలు ఐన నదీ జలాలు పుష్కర సమయంలో మరింత పరిశుద్ధమై ఔషధీ విశేషాలతో పుష్కలంగా వుంటాయి. పుష్కరం అంటే ఒక పవిత్ర సమయం. పనె్నండు సంవత్సరాల కోసారి ఒక్కొక్క నదికి పనె్నండురోజులపాటు పుష్కర సమయం. హిందువులు పుష్కర సమయాన్ని అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో చేసే నదీ స్నానం, దానాలు, పితృకర్మలు విశేష ఫలాలు అందిస్తాయని పురాణాలు వచిస్తున్నాయి.
బృహస్పతి (గురుగ్రహం) ఒక రాశినుండి మరొక రాశిలోకి (మేషాది పనె్నండురాశులు) మారుతున్నప్పుడు పుష్కరునితో (మూడున్నర కోట్ల పుణ్య తీర్ధ్ధాపతి) బ్రహ్మాది సకల దేవతలతో కలిసి ఆ పుష్కర నదిలో స్నానం చేస్తాడు. ఆ కారణంవల్ల పుష్కర కాలంలో చేసే స్నాన, దాన, పితృ యజ్ఞాలు మహా మహిమాన్వితాలు.
ఈ సంవత్సరం 12-9-17 నుంచి 23-9-17 వరకు కావేరీ నదీ పుష్కర సమయం. ఆనాడు పుష్కరుడు బ్రహ్మతో కలిసి తులారాశిలో ప్రవేశిస్తాడు.
కావేరీ కధఇదీ
కావేరీ నది పుట్టుకకు సంబంధించి పలుకథలు ప్రచారంలో వున్నాయి. ఒక కథను అనుసరించి కవేరుడనే రాజర్షి ముక్తి కోరి బ్రహ్మను గురించి తపస్సు చేసాడు. ప్రత్యక్షమైన బ్రహ్మకు తన కోరిక చెప్పాడు. అంత బ్రహ్మ విష్ణు మాయను కుమార్తెగా ఇచ్చి ఆమె ద్వారా ముక్తి పొందుతావని వరమిచ్చాడు. కవేర కన్యక యుక్త వయస్కురాలైంది. తండ్రి అంతరంగాన్ని తెలుసుకుని శ్రీహరికై తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన శ్రీహరి ‘నా అంశతో పుట్టిన అగస్త్యముని బ్రహ్మవలన నిన్ను వివాహం చేసుకుంటాడు. ఆ క్షణమే నీవు నదిగా మారిపోతావు. అగస్త్యుడు నిన్ను తన కమండలంలో వుంచుకుని సహ్య పర్వత దిశగా పయనిస్తాడు. అటుపిమ్మట కొంత కాలానికి అటనుండి నదిగా ప్రవహిస్తావు‘ అన్న శ్రీహరి వాక్కును కవేర కన్య అనుసరించి అగస్త్యుని వివాహం చేసుకుని సహ్యాద్రి చేరింది.
ఒకానొక సమయంలో అగస్త్యుడు లేకుండా చూసి కవేర కన్య కమండలంనుంచి బయటపడి నదిగా ప్రవహించింది. కవేర తనయ కావడం చేత ఆ నదికి కావేరి అని ఖ్యాతి కలిగింది. దక్షిణ భారతదేశంలో ప్రవహించే ముఖ్యమైన నదుల్లో కావేరీ ఒకటి.దక్షిణ గంగగా పిలవబడుతున్నది.
కర్నాటక రాష్ట్రంలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో బ్రహ్మగిరిపై జన్మించింది. ఈ ప్రదేశం తలకావేరి 1276 మీటర్ల ఎత్తులో వుంది. జన్మస్థలంనుండి తమిళనాడులోని పూంపూరి వద్ద బంగాళాఖాతంలో సంగమించేవరకు 756 కిమీ ప్రవహిస్తూ 81,550 చకిమీ పరివాహక ప్రాంతాన్ని కలిగివుంది. సుమారు 50 ఉపనదులు కావేరీలో చేరుతున్నాయి. కర్నాటక, తమిళనాడు రాష్ట్ర ప్రజలకు జీవనాడి. కావేరి నదీ జలాలలో అరవై శాతానికి పైగా తాగునీటిని, సాగునీటికి వినియోగించడం జరుగుతోంది. పంటలు పుష్కలంగా పండుతుండడంతో తమిళులు కావేరీ నదిని ‘పొన్ని’ (బంగారు నది) అని పిలుస్తుంటారు. కావేరీ నదికి కర్నాటకలో కృష్ణసాగర్ ఆనకట్ట, తమిళనాడులో మెట్టూర్ ఆనకట్టలు ముఖ్యమైనవి.
ప్రాచీన సాహిత్యంలో కావేరీ నది ప్రస్తావన వుంది. మార్కండేయ, అగ్ని పురాణాల్లోనే కాక స్కంద పురాణంలో ప్రత్యేకంగా కావేరీ మహాత్మ్యం అనే ప్రకరణం ఉంది. తమిళ సాహిత్యంలో ప్రముఖమైన మణిమేఖలై కావేరీ నదిని గురించి విస్తారంగా చెప్పబడింది. అలాగే శైవ నాయనార్ల కథలను చెప్పే పెరియపురాణంలో కావేరీ నదీ ప్రస్తావన వుంది. కావేరీ నదీ తీరంలో నిర్మితమైన ఎన్నో దేవాలయాలు పల్లవుల, చోళుల కాలంలో శిల్ప కళా సౌందర్యానికి అంతర్జాతీయ ఖ్యాతి గడించిపెట్టాయి. కావేరీ నదీ తీరంలో ప్రసిద్ధి చెందిన ఎన్నో శైవ, వైష్ణవ, శక్తి క్షేత్రాలున్నాయి. కర్నాటకలో కావేరీ నది జన్మస్థానమైన తలకావేరిలో కావేరీ మాత ఆలయం ఉంది. అక్కడ విశ్వనాధ, పార్వతీ ఆలయాలు కూడా ఉన్నాయి. ఆదిరంగం, మధ్యరంగం, అంత్య రంగం అను మూడు శ్రీరంగనాధ దేవాలయాలలో మొదటి రెండూ కర్నాటకలో ఉన్నాయి. ఆదిరంగం శ్రీరంగ పట్టణంలో ఉంది. చరిత్ర ప్రసిద్ధి కల పట్టణం. రెండవది శివసముద్రవద్ద వుంది. ఇక్కడే శివసముద్రం జలపాతం ఉంది. కావేరీ రెండుగా చీలి మధ్య పెద్ద ద్వీపంగా వుంటుంది. ధర్మపురి వద్ద తమిళనాడులో ప్రవేశిస్తుంది.
మూడవ రంగనాధ క్షేత్రం శ్రీరంగం. ఏడు ప్రాకారాలు, 26 గోపురాలతో విశాలమైన ఆలయం, ఆలయ ప్రాంగణమే ఒక పట్టణం. వైష్ణవ మతానుయాయులకు ముఖ్యమైన కేంద్రం. శిల్ప సంపదతో అలరారుతు అందర్నీ ఆకర్షిస్తుంది. కుంభకోణంలో పల్లవులు, చోళులచే నిర్మించబడిన అనేక శైవ, వైష్ణవ ఆలయాలున్నాయి. ఇక్కడ కావేరీ నదికి పుష్కరసమయంలో ‘మక్కరకుండ’ అనే ఉత్సవం జరుగుతుంది. ఇది త్రివేణిలో జరిగే మహా కుంభమేళాను తలపిస్తుందని అంటారు. కావేరీ నదీ తీరంలో ఒకే ఒక శక్తిపీఠం మైసూరులో ఉంది. మహిషాసురుని మర్దించిన ఆదిపరాశక్తి ఇక్కడకు వచ్చి చాముండీ పర్వతంపై చాముండేశ్వరిగా కొలువుతీరింది. అష్టాదశ శక్తిపీఠాలలో చాముండేశ్వరి నాలుగవది.
కావేరీ నదీ పుష్కరాలకు వచ్చే తీర్థయాత్రికులు రెండు రాష్ట్రాలలో చూడదగిన ప్రదేశాలు: మైసూరులో ఒడయారు రాజులు నివసించిన పాలెస్, బృందావన్ గార్డెన్స్, కృష్ణరాజ సాగరం, శివసముద్ర జలపాతం, తమిళనాడులో మెట్టూరు ఆనకట్ట, తంజావూర్‌లో సరస్వతీ మహల్ గ్రంథాలయం, బంగారు మీనాక్షి దేవి ఆలయం చాలా ముఖ్యమైనవి.

- ఎ.సీతారామారావు