పర్యాటకం

సంగమస్థలిలో ముక్తిక్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూపమే లేని భగవంతుడు లింగాకారంలో ఉద్భవించి బ్రహ్మావిష్ణువులకే అహంకార నిర్మూలనం చేశాడు. ఆ శివయ్యనే కాళేశ్వర లింగంగాను, ముక్తేశ్వరలింగంగాను రూపు దాల్చి శ్రీ కాళేశ్వర క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు.
దక్షిణకాశిగా పేరొందిన క్షేత్రం కాళేశ్వరం. ప్రాణహిత, గోదావరి నదుల సంగమస్థలిలో కుదురుకున్న ముక్తి క్షేత్రం కాళేశ్వరం.. ముక్తినిచ్చే మూడు క్షేత్రరాజాల్లో అరుదైన క్షేత్రం కాళేశ్వరం. కాలుడే వచ్చి శివయ్యను ప్రతిష్టించిన కారణంగా పేర్గాంచిన క్షేత్రం కాళేశ్వరం.
స్థలపురాణం: ఇక్కడ అసలు ఒకే పానవట్టంపై రెండు లింగాలుండడానికి కారణమేమై ఉంటుందా అని ఆలోచించేవారికి స్థలపురాణం చెప్పే కథలివి.
మొట్టమొదట యముడు తాను చేసే వృత్తి పట్ల విముఖత కలిగి భూలోకంలో పాపపుణ్యాలార్జించుకునే శక్తి గల మానవులకు శివదర్శనం చేయించి వారిని పుణ్యమార్గంలో ప్రయాణింప చేయాలని అనుకొన్నాడు.
అట్లా అనుకొన్న వెంటనే విశ్వకర్మను పిలిచి భూలోకంలో అందమైన ప్రదేశంలో ఓ శివాలయాన్ని తాను నిర్మించాలనుకొంటున్నట్లు చెప్పాడు. విశ్వకర్మ ఈ ప్రాణహిత, గోదావరి నదుల సంగమస్థలి అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ ఉంటుందని చెప్పాడు. ఇక్కడ శివాలయం నిర్మిస్తే చాలా బాగుంటుందనీ చెప్పాడు. వెంటనే యముడు అక్కడ ఓ శివాలయాన్ని నిర్మించి శివుని ఆహ్వానించాడు. శివుడు ఈ సంగమస్థలిలో యముడు నిర్మించిన ఆలయాన్ని చూచి ముచ్చట పడి ఇక్కడ లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తూ నీ కోరికను తీరుస్తానను అని చెప్పాడట.
అలా శివుడు ముక్తేశ్వరుడుగా తన్ను దర్శించేవారికి ముక్తినిస్తూ కాలం గడుపుతున్నాడు. భూలోక వాసులంతా ఈకాళేశ్వరానికి వెళ్లి ముక్తేశ్వరుని దర్శించి తమ పాపాలను ప్రక్షాళనం చేసుకొని ముక్తిని పొంది శివసాయుజ్యాన్ని పొందుతున్నారు.
ఇలా కొంత కాలం గడిచినతర్వాత యమసదనానికి వచ్చే పాపుల సంఖ్య తగ్గిపోయిందట. దాంతోయమునికి పని తగ్గింది. ఎవరికైనా చేతినిండా పనిలేకపోతే బాగున్నట్లు ఉండదు కదా. పైగా ఆలోచనలు ఈరోజు ఉన్నట్టు రేపు ఉండవు. దాంతో మళ్లీ యముడు దీనికి కారణం ఏమిటా అని ఆలోచించి కనుగొన్నాడు. పాపుల సంఖ్య తగ్గిపోవడానికి ముక్తశ్వరుడే కారణం కనుక ఇలా కాదు. చేసిన పాపానికి శిక్ష అనుభవించి తీరాలని నిర్ణయించి శివునితో మొరపెట్టుకున్నాడట.
శివుడు కాలుని బాధ తగ్గించడానికి ఏం చేయాలో నీవే చెప్పమని అడిగాడట. దాంతో కాలుడు నేను నీ లింగాన్ని ప్రతిష్టిస్తాను. అపుడు ఇక్కడకు వచ్చే భక్తులు ముందుగా నేను ప్రతిష్టించిన ఈ కాళేశ్వర లింగానికి పూజలు చేసి తర్వాత ముక్తేశ్వర లింగాన్ని పూజించినట్లు అయితేనే వారి పాపాలను ప్రక్షాళన చేయమని కోరుకున్నాడట.
శివుడు చిరునవ్వుతో తథాస్తు అన్నాడట. దాంతో ఇక్కడ కాళేశ్వర క్షేత్రంలో ఒకే పానవట్టంపైన కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు నీవా నేనా అన్నట్టు దర్శనమిస్తుంటారు.
పిండప్రదానాలు:
ఇక్కడకు వచ్చిన భక్తులు ఈ త్రివేణి సంగమంలో తమ తమ పూర్వీకులు పిండ ప్రదానాలు చేస్తుంటారు. ఈ నదీసంగమంలో స్నానమాచరించి ఈ కాళేశ్వర ముక్తేశ్వర లింగ దర్శనం పూజ చేయించుకుని ముక్తిని పొందుతుంటారు.
సంగమేశ్వరాలయం:
ఈ నదీతీరంలోనే సంగమేశ్వరుడుగా కూడా శివుడు కొలువై ఉన్నాడు. ఈస్వామికి లింగాభిషేకం నిర్వర్తించడం వల్ల ఉదరసంబంధమైన వ్యాధులను దూరం చేస్తాడని ప్రఖ్యాతి పొందాడు.
కాళేశ్వర ఆలయంలో ధ్వజస్తంభం, నంది మండపం , ప్రధాన ఆలయం ముఖమండపం, గర్భాలయాలతో నిండి విశాలమైన ఆలయంగా భక్తులను ఆకర్షిస్తుంది. శృంగి, భృంగి ఇద్దరూ ద్వారపాలకులుగా ఉండి వచ్చిన భక్తులకు స్వామి దర్శనంలో ఆటంకాలు లేకుండా చూస్తుంటారు.
ఇతర దేవీ దేవతల విగ్రహాలు:
విఘ్నాలను హరించే విఘ్ననాయకుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. శివపరివారంలో ముఖ్యకథానాయకుడు వీర భద్రస్వామివారు, పార్వతీ మాత శ్రీశుభానంద అమ్మవారుగాను కొలువై ఉన్నారు. ఇంకా ఆలయంలోని ఉపాలయాల్లో సూర్యనారాయణ స్వామి, చతర్ముఖ లింగం, శ్రీకాశీవిశే్వశ్వర స్వామి, శ్రీసుబ్రహ్మణ్య స్వామి, శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతీదేవి దర్శనమిస్తారు. ముగ్గురమ్మలు కొలువైన ఈ క్షేత్రాన్ని మూలశక్తి క్షేత్రంగా కూడా భక్తులు భావిస్తుంటారు.
యమకోణం:
కాళేశ్వర ఆలయ ప్రాంగణంలో యమకోణం ఉంది. దీనిలో దూరిన వారికి యమలోక బాధలు తప్పుతాయని ఇక్కడకు వచ్చినవారంతా ఈ యమకోణంలో దూరి వస్తుంటారు.
చారిత్రికాధారాలు:
శాతవాహనుల కాలంలోనే ఈ కాళేశ్వరాలయం ఉన్నట్లు తెలుస్తుంది. చాళుక్య వంశజులు ఈ ఆలయనిర్మాణం చేసినట్లు కూడా చెప్తారు. ఆ తర్వాతి కాలంలో కాకతీయులు ఆలయనిర్మాణాభివృద్ధి పనులు చేపట్టినట్టు శాసనాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ కాళేశ్వరాన్ని దర్శినట్లు తెలుస్తోంది ఆతర్వాత జరిగిన గోదావరీ పుష్కరాల సందర్భంగా ఈ ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు.
పూజలు:
నిత్యోత్సవాలు ప్రతిరోజు జరిపినా విశేషదినాల్లో విశేష పూజలు చేస్తుంటారు. శివరాత్రి, మాసశివరాత్రి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతిరోజు లింగాభిషేకాలు జరుపుతారు.

- డా. ఎ.రాజమల్లమ్మ