పఠనీయం

చారిత్రక కథనంతో ప్రామాణిక రచనం‘మన్యం వీరుడు అల్లూరి గాథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- ఆకుపచ్చ సూర్యోదయం’ (నవల)
-డా.గోపరాజు నారాయణరావు
పుటలు: 312.. వెల: రూ.300
ప్రతులకు: రచయిత, జనప్రియ ఉటోపియా
3వ బ్లాక్, 4వ ఫ్లోర్, ఫ్లాట్ - 34006
అత్తాపూర్, హైదరాబాద్
9849325634
*
Breathes there the man
with soul so dead
who never to himself hath said
"This is My own, My Native Land' (ఇది నాది, నా సొంతం, నా పురిటిగడ్డ’ అని ఎప్పుడూ అనుకోనివాడు శవంతో సమానం’) అన్నాడు ఆంగ్లకవి వాల్టర్ స్కాట్ తన ‘పేట్రియాటిజం’ అనే కవితలో.
ఇదే ఉదాత్త స్పృహతో ఎందరో మహాపురుషులు తమ మాతృభూమి గురించిన భావనలో మమేకమై అదే తపన, ధ్యాస, త్యాగాలతో తమతమ తను మనః ప్రాణాలు ధారపోశారు జనత కోసం. అలాంటి మహనీయులలో, నిత్య ప్రాతఃస్మరణీయ ధన్యజీవులలో అల్లూరి శ్రీరామరాజు (సీతారామరాజు) ఒకడు.
ఆ ‘అల్లూరి’ చరిత్రను ఒక చారిత్రక నవలగా రచించారు డా.గోపరాజు నారాయణరావు ఇటీవల.
చారిత్రక నవలకు ముఖ్యాంగాలు మూడు. అవి: 1.చారిత్రక ప్రామాణికత (Historic Factual Foundation), 2.కథన శిల్ప రమ్యత (Beauty of Narrational art), 3.నిర్భీతితోడి నిక్కచ్చి (Bold candidness). ఈ నవలలో ఈ మూడు ముఖ్య లక్షణాలూ ముప్పేటలా ముడివేసుకున్నాయి.
రచయిత ఈ నవలను రూపొందించటానికి కీ.శే.అయ్యదేవర కాళేశ్వరరావు, డా.మురళి అట్లూరి, నదీరా, డా.పట్ట్భా, పడాల, మార్టిమర్ హీలర్, డేవిడ్ ఆర్నాల్డ్, ఓ స్పెన్సర్ మొదలైన ప్రముఖుల రచనలు - అన్నీ కలిసి సుమారు యాభైయ్యారింటిని అధ్యయనం చేయటమే కాకుండా, ‘అల్లూరి’ గురించి బాగా తెలిసిన కృష్ణదేవిపేట వారైన తామరపల్లి ఆదినారాయణ, చింతల సత్యనారాయణమ్మ, ‘లంబసింగి’కి చెందిన లోచిలి రామునాయుడు గారలతో ప్రత్యక్ష సంభాషణలు (ఇంటర్వ్యూలు) కూడా గావించారు. అందుచేత ఈ నవలకు చారిత్రక ప్రామాణికత కూడా ఉంది అని చెప్పాలి.
ఈ నవల చదువుతుంటే పాఠకుడి హృదయానికి మొట్టమొదటగా హత్తుకుపోయేది అల్లూరి శ్రీరామరాజు అమలోదాత్త వ్యక్తిత్వం, ఉన్నతాశయ మనస్తత్వమూను. అల్లూరి జీవిత యాత్రలోని ఆదర్శపూర్వక, ఉత్కంఠభరిత, ఉద్వేగ జ్వలిత, గంభీర, నిరాడంబర, సంస్కార హృదయావిష్కార సంఘటనలు, సందర్భాలు ఎన్నోఎన్నో పూసగుచ్చినట్టు ఆరోహణ క్రమంలో అద్భుతంగా చెప్పుకుంటూ పోయారు నారాయణరావు గారు. కథాకథన సంవిధానంలో చక్కని శిల్పం వుంది. అటు ఆ చారిత్రక వీర పురుషుని ధర్మవిప్లవ ప్రస్థానం 14 అధ్యాయాల్లో వివరిస్తూ పోతూనే ఇటు సమాంతరంగా అధ్యాయానికీ అధ్యాయానికీ మధ్య తెల్లదొరలు - పోలీసుల దురుసు, దుందుడుకు, పాశవిక చర్యలను, పరస్పరపు సంప్రతింపులను నాటకీయ శైలి (్ఫక్కీ)లో చిత్రీకరించటం చాలా బాగుంది.
అల్లూరి చరిత్రలోని చాలా సంఘటనల తేదీలు ఇందులో పెక్కులు కనిపించటం విశేషం. ఇది ఒక మంచి పరిశోధన. అల్లూరి జననం 4.7.1897వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాండ్రంగి గ్రామంలో అమ్మమ్మ గారింట అంటూ సమయంతో సహా చెప్పారు రచయిత.
రోహిణీకార్తెలో ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతమే అయినా ‘వడగాలి చెలరేగిపోతోంది. ఇసుక రేణువులు బరువుతో భారంగా కదులుతున్నాయి. ఎండుటాకులు (1వ పుటలో)’ అనటంలోని ప్రకృతి పరిశీలనా స్వభావ విశిష్టత, స్వభావోక్తి అలంకారం బాగున్నాయి. ‘దెబ్బతిన్న రెక్కలను చూస్తే కలిగే బాధకన్నా దెబ్బ తగలకున్నా నిరుపయోగంగా ఉండిపోతున్న రెండో రెక్కే ఆ పక్షిని ఎక్కువ బాధిస్తుందేమో! (269వ పుట) అన్న పంక్తులలోని అభివ్యక్తి, ఆర్ద్రత హృదయంగమంగా ఉన్నాయి.
లంబసింగి రోడ్డెక్కారు విప్లవకారులు. ‘వాళ్ల పాదముద్రలతో నిండిన తడి ఎర్రకంకర రోడ్డును చూస్తుంటే ఒక మహాగాయానికి అప్పుడే లేపనం పూసినట్టుంది’ (128వ పుట) అంటాడు రచయిత ఉపమాలంకార పూర్వక వివక్షితాన్య పర వాచ్య ధ్వనితో. ఇందులోని ఉపమ సుస్పష్టం. ఇక ధ్వని సంగతి. అంతకు ముందు తెల్లదొరల క్రౌర్యంతో ఆ మన్యంలోని రోడ్ల మీద నేలకొరికిన సాయుధ ధర్మపోరాట గిరిజనుల నెత్తుటి ఆనవాళ్లు మదిలో మెదులుతున్నాయి అని ధ్వనించటం సిసలైన ధ్వని శిల్పం.
‘కాలం తనను తాను కత్తిరించుకొని క్యాలెండర్లో ఎక్కడో ఉన్న ఆ తేదీల దిశగా పరుగెడుతున్నట్టు రోజులు వేగంగా గడిచిపోయాయి. చినుకు తగలగానే భూమిలో విత్తనం మొలకెత్తినట్టు పరిస్థితులనే చినుకులు తగలగానే రోజుల నుంచి ఘటనలు అంకురిస్తున్నాయి’ (77వ పుట) అనే వాక్యాలలోని ఉపమ, తాద్రూప్య రూపకాలంకారం, భావగాంభీర్యము కమ్ర కవిత్వ వచనాల రూపంలో అందగించాయి.
111వ పుటలోని ‘ఉద్యమం అంటే భవ్యమైన భవిష్యత్తును గర్భంలో మోస్తున్న సంక్షుభిత వర్తమానమే’ అనటంలోని అభేద రూపకం గాని, భావ సౌందర్యం గాని ప్రశంసార్హం. 110వ పుటలో ‘మనుషులు వినటం సాధ్యంకాని సంగీతమేదో అడవికి వినిపిస్తున్నట్టుంది వెనె్నల’; 129వ పుటలో ‘కష్ట్ఫలం మీద హక్కు ప్రకటించుకున్నట్టు ఆ నడకలో ధీమా’ అంటూ చింతపల్లి రోడ్డు మీద ‘అల్లూరి’ నడిపిస్తున్న అడవియోధుల ‘పదచలనం’ గురించి ఉన్న వాక్యం మొదలైనవి ‘వస్తూత్ప్రేక్ష’కు కస్తూరి లాంటి మచ్చలు.
ఇలా అసంఖ్యాకంగా ఇందులో ‘అలంకృత’ వాక్యాలు మెరుస్తుంటాయి.
119, 120వ పుటల్లో విప్లవవీరుడు ఎర్నేసు మీద పోలీసాఫీసర్ బాస్టియన్ చేసిన అమానుష, కర్కశ, క్రూర హింసను కనులకు కట్టినట్టు వివరించాడు. రచయిత - అన్నీ చారిత్రక ఆధారాలతోనే. ఆ ఆధారాలన్నీ 295, 296వ పుటలలో సూచితాలు.
209వ పుటలో గాంధీజీ అప్పటి స్వాతంత్య్ర సమరయోధుల సమ్యగుద్యమ స్ఫూర్తిని అర్థం లేని తన మొండి ఉపవాస దీక్షలతో ఎలా నీరుగార్చారో, కీ.శే.కట్టమంచి రామలింగారెడ్డి తన ఆంగ్ల రాజ్యభక్తిని ఎలా ప్రదర్శించారో; అల్లూరి బలైపోయినాక ఉద్యమం నీరుగారిపోవటమే కాకుండా పిచ్చి జనం తిరిగి ఆంగ్లేయులకు, వారి కుటిల భేదోపాయాలకు మానసికంగా ఎలా లొంగిపోయిందో, ఎలా ప్రలోభపడిందో 287, 289, 292వ పుటలలోను గోపరాజు వారు ఏ మోమాటమూ లేకుండా నిర్భీతితో నిక్కచ్చిగా వెలిబుచ్చారు. ఆ మూలాగ్ర అధ్యయన పూర్వకంగా.
మొత్తం మీద ఈ చారిత్రక కథనం ఒక ప్రామాణిక రమణీయ రచనం.
*

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం