పఠనీయం

పరిశోధనల నైపుణ్య మిశ్రమం - నవల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీ వనంలో ఒక మావి
ఒక అభినందన పూర్వక ఉపహార సంచిక
కూర్పు: డా.కొల్లోజు కనకాచారి;
పుటలు: 198;
మూల్యం: రూ.180/-;
ప్రచురణ: పంచానన ప్రపంచం, నల్లగొండ;
ప్రతులకు:
1) డా.యం.వి.వసంతరావు, ఇం.నెం.6-3-28/ఎ, రామగిరి,
నల్లగొండ- 508 001
2) డా.రాచకొండ లలిత, ఇం.నెం.6-3-376, కలలగూడు’, సావర్కార్‌నగర్,
నల్లగొండ- 508001
*

పాలమూరు జిల్లా పండిత కవులలో డా.కపిలవాయి లింగమూర్తి ప్రముఖులు, లబ్ధప్రతిష్ఠులు. వారి జీవిత విశేషాలను, సారస్వత ప్రస్థానాన్ని చక్కగా, దాదాపు ఆమూలాగ్రంగా తెలియజేసే వచన గ్రంథం ‘సాహితీవనంలో ఒక మావి’. రచయిత డా.కొల్లోజు కనకాచారి.
డా.లింగమూర్తిగారి జన్మస్థలం, జన్మదినం, విద్యాభ్యాసం, ఉద్యోగం, సాహిత్యప్రస్థానంలో వారు దాటిన మైలురాళ్ళు, వారి ఒక్క చెప్పుకోదగిన పెక్కు రచనల గీటురాళ్ళు, వారు పొందిన ఘన సన్మానాలు, ప్రభుత్వపు గుర్తింపులు, సమాజం చూపిన సమాదరణ, చేసిన సత్కారాలు, ఇతర పండితులు-కవులు వారిపై రాసిన అసంఖ్యాక ‘ప్రశంసల’లోని కొన్ని ఉదాహరణలు మొదలైన వివరణలు పుష్కలంగా లభిస్తాయి ఈ పుస్తకంలో.
ఒక సాహిత్య జీవిత పరిశోధనావ్యాసంగా కనిపించే ఈ పుస్తకాన్ని కొంతవఱకు ఒక చారిత్రక నవల రీతిలో పాఠకుడికి పఠనాసక్తి కలిగేలా, పెరిగేలా రాశారు రచయిత కనకాచారి. కానీ దీనికి తాను ‘ఒక కూర్పరిని మాత్రమే’అనే ఒక శీర్షికతో మరీ మొదటి రెండు పేజీలలోనే ప్రకటించుకోవటంలోని నమ్రత చెప్పుకోదగ్గది. ‘పేదోడికి చేయి అందిస్తే తోడొస్తాడు. పెద్దోడికి చేతులు జోడిస్తే దీవిస్తాడు’అని తన తండ్రిగారు అన్న అమృతవాక్కు గుర్తుచేసుకుంటూ కొల్లోజువారు ఆ మాటకు లక్ష్యప్రాయమైన ‘అభివ్యక్తి’పంథాలోనే పుస్తకం మొత్తం రాసుకుంటూ పోయారు.
రచన సరళతా రమ్యంగా ఉంది. అంతేకాదు కొన్ని వాక్యాలు ఉదాత్త్భావ వ్యక్తీకరణా శిల్పానల్పంగా ఉన్నాయి. 25వ పుటలోని ‘శిష్యుల యెడ వాత్సల్యం లేని గురువు లఘువవుతాడు. గురుకృపకు దూరమైన శిశువుకు చదువు బరువవుతుంది’అన్న రెండు పంక్తులు ఉదాహరణ.
లోక రీతి, నీతి జమిలిగాను, అందులో ఒక సందేశంకూడా ఉండేట్టుగాను చెప్పే సామెతల లాంటి చక్కని పద్యాలు ఇందులో ఉదాహృతాలు.
ఉదా: చేయరాకను సంసార జీవితమున/ సుఖములేదనుటే గాని చూరగొనెడి/ ఎడద లేకున్నదివియైన నిడునె సుఖము?/ ఏమిటీ వింత?జినుకుంట రామాబంట! (జినుకుంట రామాబంట’ శతకం)
కపిలవాయి యొక్క ఆలంకారిక రచనల్లోంచి మంచి మచ్చలు చాలా ఇచ్చారు డా.కొల్లోజు. ‘దృష్టాంత’అలంకారానికి ఉదాహరణ: ‘్భవన మందు పద్మములె కోమలమ్ములు/ వనములందు పల్ల
వము లె మృదువు/ అవనియందు నీదు హస్తంబు
లే సుకు/ మార మగును ప్రమిత మార దుర్గ! (దుర్గా శతకం). అరసి చూడనీదు హృదయం చె లేసుకు/ మార
మగును ప్రమిద మార దుర్గ! అనిగూడా ధ్వనిస్తుంది. కపిలవాయి యొక్క భావ, హృదయపు లోతులను గమనిస్తే. లింగమూర్తిగారి ‘ఆర్యాశతకం’లోంచి ఒక పద్య చమత్కార చిత్రానికి ఇచ్చిన మరో పద్యపు మచ్చు: ‘‘తలయుండినచో తలపులు/ తల లేకున్న పుడు పులు విధాత విధించెన్/ ఇలయందున ప్రాణులకున్/ కలగాదిది నిక్కువమ్ము గనుమా ఆర్యా!’’. తలపులు అంటే ఆలోచనలు. ఈ పదంలో తల లేకుంటే మిగిలేది ‘పులు’. పులు అంటే గడ్డి. ‘సృష్టికర్త తల ఉన్న జీవులకు తలపులు-అనగా- ఆలోచనలు; అది లేని జీవులకు- అనగా-పశువులకు ‘పులు’(గడ్డిని) ఆహారంగా ఇచ్చాడు’ అన్న కనకాచారిగారి వివరణ, సులభగ్రాహ్యసుందరంగా ఉంది. కపిలవాయి కవి ‘కంకణ గ్రహణ’కావ్యంలోంచి ‘కొల్లోజు’ ఎత్తిచూపిన ఈ పసందైన పద్యం 49వ పుటలో కనిపిస్తుంది-
‘‘మామిడులు కాయగా జూచి మనవలెనె
ఇతర ఫలా జాతి రుచి? దేనికెన్ననదియె;
పెద్దలు చేసిరి చాలనుచు మానిరే
కాపు రాలే నేటి మానవాళి?- అంటూ సత్తువను మింగే సంకోచంతో స్తబ్ధంగా, నిర్లిప్తంగా ఉండేవారికి ధైర్యము, ప్రోత్సహముఇచ్చే విషయం ఒకటి చెప్పటం చూస్తాం ఈ గ్రంథంలో’’అని కనకాచారిగారు అన్న విశే్లషణాత్మక వాక్యం విశిష్టమైనదే. మామిళ్ళ రుచి చూచినంత మాత్రాన ఇతర పండ్లను తినటం మాన్తామా? దేని రుచి దానిదే. మన పెద్దలంతా సంసారాలు చేశారు. మనంకూడా ఇంకా అదే పనా? అని అనుకుంటామా? మనోజ్ఞ భావచమత్కార పరిమళ పద్యం ఇది. ఈ పద్యం చదవగానే కవి సమ్రాట్ విశ్వనాథ తలపుకు వస్తాడు. ‘‘మఱలనదేల రామాయణంబన్నచో నీ ప్రపంచకమెల్ల చేసిన సంసారమే సేయుచున్నది తనదైన అనుభూతి తనది గాన’’అనే రామాయణ కల్పవృక్ష అవతారికలోని ఒక పద్యంతో. విశ్వనాథ పద్యానికి ఆమ్రాది వివిధ ఫలమాధుర్యం జతకూర్చింది. ఈ కపిలవాయు పద్యం సూక్ష్మంలో మోక్షంలా.
ఇలా ఈ వచన రచనాగ్రంథంలో సహమాన శతకం మొదలైన వివిధ శతకాలు, చక్రతీర్థ మహాత్మ్యం మున్నగు క్షేత్ర మాహాత్మ్యాలు, స్థలపురాణాలు, సాయత్రయి, శ్రీనివాస కల్యాణోదాహరణం, గేయ ఖండికలు, భాగవత కథాతత్త్వం, పద్యకథా పరిమళం, ఇంద్రేశ్వర చరిత్రం, పామర సంస్కృతం- ఇంకా పాలమూరు జిల్లా ఏర్పడిన విధానం, జిల్లా చారిత్రక విశేషాలు మొదలైన కపిలవాయివారి విస్తృత వాఙ్మయ సేవ- ఇలా ఎన్నో విశేషాలు చాలా ఓపిగ్గా, సవివరంగా అందించారు ‘కూర్పరి’నని చెప్పుకున్న రచయిత.
మొత్తంమీద ఇది పరిశోధనా సిద్ధాంత వ్యాస విన్యాసము, చారిత్రక నవాల రచనా సాదృశ్యము కలగలిసిన ఒక వినూత్న విశిష్టపు కూర్పుగా మంచి రూపుదిద్దుకున్నది.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం