పఠనీయం

చదివితేనే చూసిన అనుభూతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కనుచూపుమేర’’.
యాత్రా కథనం:
రచన: డా.కందేపి రాణీప్రసాద్,
వెల: రూ.80/-,
ప్రతులకు: రచయిత్రి,
స్వాప్నిక్ పబ్లికేషన్స్,
సృజన్ పిల్లల ఆసుపత్రి పాత బస్టాండ్ దగ్గర,
సిరిసిల్లా- 505301.
జిల్లా: రాజన్న సిరిసిల్లా, తెలంగాణ
*
వౌలిక వసతులైన కూడూ గుడ్డా సమకూరినాక మనసు వినోదంవేపు లాగుతుంది. ఈ వినోదాన్ని కడు‘పు’లో చల్ల కదలకుండా ఇంట్లోనే టీవి, రేడియో మరియు ఇండోర్ గేమ్స్ వల్ల పొందవచ్చు. లేదా 45 ఏళ్ళు తిరిగి రాహుల్ సాంకృత్యాయన్‌లా కొత్త విషయాలను కనుక్కోవచ్చు. ఆయన బౌద్ధసాహిత్యం లాంటి మరో కొత్త విజ్ఞానాన్ని అందించవచ్చును.
డా.కందేపి రాణీప్రసాద్‌గారు స్వతఃసృజనశీలి. తనకెదురైన ప్రతి సంఘటనలోను, వస్తువులోనూ చివరకు ఆసుపత్రి వ్యర్థ పదార్థాలతోనూ తన క్రియేటివిటీతో బొమ్మలు చేస్తారు. వచన కవిత్వం రాస్తారు. ఎన్నో ఏళ్ళుగా బాల సాహిత్యం రాస్తున్నారు.
ఎక్కడికి వెళ్ళినా ఏమి చూసినా, ఒక క్రమబద్ధమైన పద్ధతిలో నోట్సు, ఆల్బమ్స్ తయారుచేసుకుంటారు. దీనికితోడు వాళ్ళ అబ్బాయి స్వాప్నిక్ ఆ అనుభవాలను ఫొటోల రూపంలో భద్రపరుస్తాడు. భర్త బాలల వైద్య నిపుణులు. వారి వృత్తిలో భాగంగా ఏటా సెమినార్లు, సమావేశాలకు వెళ్తూ అర్ధాంగిని, ఒక్కోసారి పిల్లలనూ వెంట తీసుకెళ్తారు. ఇలాంటి వాటికి సామాన్య గృహిణి అయితే ‘‘నేను రాను బాబు! అక్కడ నాకెవరూ తెలిసినవారు ఉండరు. బోర్! అంటారు. కాని ఈ రచయిత్రి ఇలాంటి అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకుంది. కొత్తకొత్త ప్రదేశాలకు ఇలా భర్తవెంట వెళ్ళి, విద్య, విజ్ఞానం, హస్తకళలు, సంస్కృతి సాంప్రదాయాల మీద దృష్టిసారించటం తన అలవాటుగా చేసుకున్నారు. 15 రాష్ట్రాలు 9 దేశాలు తిరిగిన డా.రాణిగారు లోగడ ‘‘విహారం’’అన్న యాత్రా కథనం ప్రచురించారు. యాత్రా కథనంలో భాగంగా, ఇది వారి రెండో సంకలనం. ఇందులో వారు సందర్శించిన భారతదేశంలోని 16 ప్రదేశాలను, విదేశాల్లోని 5 ప్రదేశాల గురించి ఇచ్చారు. దక్షిణాన కేరళ రాష్ట్రంతో మొదలుపెట్టి ఉత్తరాన చండీఘర్ వరకు, థాయ్‌లాండ్ స్విడ్జర్లాండ్, యూరోప్‌లోని పేరిస్ నగరం, దక్షిణ ఆఫ్రికాలోని జొహనీస్‌బర్గ్ క్రూగర్ నేషనల్ పార్కు, చైనాలోని గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా (చైనా మహాకుడ్యం) లాంటి ముఖ్య ప్రదేశాల వివరాలు ఫొటోలతో సహా ఇచ్చారు.
క్లుప్తత, భాషాసారళ్యత, కళ్ళకు కట్టినట్లు వివరించగలిగే నేర్పు ఉన్న ఈ రచయిత్రి కలంనుండి వెలువడిన ఈ సంకలనం యాత్రాకథనాల మీద ఆసక్తి ఉన్న పాఠకులకు ఎంతో ఉపయుక్తం.
విమానంలో పయనిస్తున్న ఈ రచయిత్రికి...బయట, కిందనున్న మబ్బులు పరుపులాగా పైనున్న ఆకాశం నీలంగా, చక్కగా గీత కొట్టినట్టుగా విడగొట్టబడుతూ ముచ్చటైన కలర్ కాంబినేషన్‌లో కనిపిస్తున్నాయట! మబ్బుల్లాకాక సముద్ర జలాలపై పేరుకున్న మంచువలే కన్పిస్తూన్నాయట! (పే 24). ఉజ్జయిని పట్టణం గురించి రాస్తూ, ఆనాటి మేధావులు- బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్యులు, మహాకవి కాళిదాసు గురించి చెబుతూ ఆయన రాసిన కావ్యాలు, చాలామందికి తెలియని ఆయన భార్య పేరు విద్యావతి అని ఆమె ఓ రాజకుమారి అని (పే 39) చదివిన పాఠకుడు రచయిత్రి పరిజ్ఞానానికి ఆశ్చర్యపోతాడు.
స్విడ్జర్లాండ్‌లో ఓ కొండ కింది వాటర్‌పూల్‌లోకి అక్కడి ప్రజలు నాణేలు విసరటం చూసి ‘‘ఖండాలు దేశాలు వేరైనా, మనుష్యులంతా ఒక్కటే. అలవాట్లు ఒక్కటే’’(పే115) అనటం రచయిత్రికి గల తాత్త్విక భావాలకు ఉదాహరణ.
1838లో ప్రచురించబడిన ఏనుగుల వీరాస్వామిగారి ‘‘కాశీయాత్ర’’ను తొలి యాత్రాకథనంగా చెప్పుకుంటారు. వీరి తరువాత కోలా శేషాచలం (1846) చెళ్ళపిళ్ళ వెంకటశాస్ర్తీ (1959) జొన్నలగడ్డ సత్యనారాయణ, నాయిని కృష్ణకుమారి, కె.వి.సుబ్బయ్య, మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముమ్మనేని లక్ష్మీనారాయణ, సమకాలీన రచయితల్లో శ్రీ పరవస్తు లోకేశ్వర్‌గారలను చెప్పుకోవచ్చును.
దేశ విదేశ ప్రజల జీవన రీతుల్ని ఆర్థిక రాజకీయ సామాజిక, ధార్మిక పరిస్థితులపై యాత్రా కథనాలు అవగాహన కలిగిస్తాయి. డా.కందేపి రాణీప్రసాద్‌గారి ఈ పుస్తకం ఆ కోవకు చెందినదేనని నిశ్చయంగా చెప్పవచ్చును.

- కూర చిదంబరం