పఠనీయం

జీవితానుభవాల సారాన్ని తెలిపే సామెతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సామెతలు
-చైతన్యప్రకాశ్
పుటలు: 254.. వెల: లేదు
తెలంగాణ సాహిత్య
అకాడెమీ ప్రచురణ
కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్ నుంచి కాపీలను పొందవచ్చు.
*
సమాజాన్ని శోధించడమంటే సముద్రాన్ని అనే్వషించడం లాంటిదే! తరగతి గది విద్యకన్నా, సామాజిక విద్యనే ఎల్ల కాలాల్లో ముందంజలో వుంటూనే వుంటున్నది. విద్య నెంతగా ఆర్జించినా చివరికి సమాజంలోనే ఈదాలి. ఇట్టి సమాజానికి వర్తమానం తప్ప ఆరంభం, అంతం వుండవు. సామాజిక వర్తమానంలో నుంచి పుట్టినవే అనుభవాలు. ఈ అనుభవాల్ని, జీవిత సత్యాల్ని అతి తక్కువ మాటల్లో, సులభమైన వాడుక భాషలో, సున్నితంగా, సరసంగా, వ్యంగ్యంగా, భావోద్వేగంగా పద్య పంక్తుల్లా ఎదుటి వ్యక్తితో సంభాషించేవే సామెతలు. భాషకుండే అనేక ప్రక్రియల్లో సామెతలు కూడా ఒక రూపమే! సమయానుకూలంగా జనాలు ఇతరులకు చేసే హెచ్చరికలే!
ఇలా జనాల నాలుక నుండి జాలువారిన సామెతల్ని సేకరించడం ఓ సరదానే అయినా, శ్రమతో కూడుకున్న పనే! ఈ పనిని చైతన్య ప్రకాశ్ తన భుజాలపై వేసుకొని, దాదాపు ఆరువేల సామెతల్ని సేకరించి తెలుగు అక్షర మాల క్రమంలో పొందుపర్చడం అభినందనీయం. ఈ సామెతలు ఏ వర్గానికో, సమూహాలకో, జాతులకో, గణాలకో పరిమితం కావు. అన్ని ప్రాంతాలలో, స్థాయిలలో ప్రజలు ఈ సామెతల్ని వాడడం జరుగుతున్నది. ఇట్టి సామెతలు ఆయా ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవహారాల, వృత్తి సంబంధాల నేపథ్యంలో వుండడం గమనార్హం. సామెతనుబట్టి, వాడిన భాషనుబట్టి అవి ఏ ప్రజా సమూహానికి, ఏ ప్రాంతానికి చెందినవో సులభంగా గుర్తించవచ్చు! అత్యధిక సామెతలు హాస్యభరితంగా, బూతు సంబంధంగా ఉండడం చూస్తాం. ముఖ్యంగా మహిళల్ని ఉపమానంగా వాడుతూ, కొన్ని కింది కులాల్ని ప్రస్తావిస్తూ, కించపరిచే విధంగా అత్యధికంగా ఉండడం విచిత్రం!
ఈ విషయంగా స్వయంగా సేకరణకర్తనే గుర్తించి, తక్కువ బూతును స్ఫురించే వాటిని మాత్రమే సంకలనం చేయడం జరిగిందని ముందు మాటగా చెప్పడం గమనించాలి.
ఇలా సేకరించిన సామెతలు అత్యధికంగా సిరిసిల్ల ప్రాంత వాసులు వాడుకునే సామెతలే అయినా, దాదాపు తెలంగాణ ప్రాంత, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజల సామెతలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. పోతే, సేకరించిన ఆరు వేల సామెతలలో పదుల సంఖ్యల్లో (ఉదా. పేజీలు 10/158, 41, 43/176, 101/108, 127/130, 147/148, 204/205లు) తిరిగి ప్రస్తావించడం జరిగింది. అలాగే బూతుకు సంబంధించిన సామెతల పట్ల సేకరణకర్త తగు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ప్రకటించినా మహిళల సాధికారితను దెబ్బతీసేవి, అవమానపరిచేవి పదుల సంఖ్యలో చేర్చడం జరిగింది. (ఉదా. పేజీ నెం. 12, 14, 17, 18, 23, 28, 29, 31, 37, 38, 91, 97, 127, 137, 140, 142, 149, 205, 224లు) ఇలాంటి సామెతలు జనాలు ఎంతగా వినియోగించినా, రికార్డు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! ఒకప్పుడు ఆడవారిని ఉపమానంగా వాడుతూ ఇతరులను నిందించడం జరిగేది. కాని ఫెమినిస్టు ఉద్యమాల తర్వాత వీటిని ‘అబ్యూస్’గా చట్టం గుర్తించింది. (ఉదా. క్ర.సం. 689, 729, 2003, 2181, 2379 మొ. తీవ్ర ఆక్షేపణీయమే?) కుల దూషణ కూడా చట్టవిరుద్ధంగా మారినప్పుడు క్ర.సం. 2370 లాంటి వాటిని చేర్చాల్సింది కాదు.
కొన్ని సామెతల్లో తప్పులు దొర్లాయి. క్ర.సం. 1448లో ఒంటెత్తుగా వుండాలి. అందరూ భావించినట్లు ఒంటెద్దు కాదు. క్ర.సం. 611 పొడుపు కథలా స్ఫురిస్తున్నది. ఈ జానపదుల సామెతలతోపాటు సేకరణకర్త కొన్ని ఆధునిక సామెతల్ని కూడా (క్ర.సం. 867) చేర్చడం జరిగింది. కాని, ఇవి జనం వాడేవిగా లేవు.
మొత్తంగా సేకరణకర్త కృషిని అభినందించాల్సిందే! ఇలాంటి సంకలనాలను ఒకరిద్దరు ఎడిటింగ్ కూడా చేసినట్లైతే, మరింత అర్థవంతంగా ఈ సంకలనం రూపొందేది. భవిష్యత్తులో ఇది జరిగేలా చూడాలి. ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య గీసిన ముఖచిత్రం సందర్భోచితంగా ఉంది. ప్రజల మనోభావాల్ని గుర్తెరగాలంటే ఈ పుస్తకాన్ని చదవాల్సిందే.

-డా.లచ్చయ్య గాండ్ల