పఠనీయం

స్థావర జంగమాత్మకాల వివరణ .. జంగమదేవర (నవల)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
వెల: రూ.200
ప్రతులకు: రచయిత, 1-2-9/104,
దేవీనిలయం అపార్ట్‌మెంట్స్ కొత్తపేట, హైదరాబాద్-35.

** ** *****************

‘సమాజాన్ని అర్థం చేసుకోవటానికి సాహిత్యం దారిదీపంలా ఉపయోగపడాలి’ అని జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి బలంగా విశ్వసిస్తారు. వీరి నాలుగు నవలలు, 2 కథా సంపుటాల్లో ఇదే విస్ఫుటంగా గోచరమవుతుంది. సంస్కృత ఆంధ్ర భాషల్లో ప్రజ్ఞను గడించిన ఈ రచయిత కొన్ని రోజులు దేశమంతటా పర్యటించి ఎన్నో ఆటుపోట్లను చవి చూశారు. తరువాత చిత్తూరు జిల్లా ముష్టూరులో ఒక పాఠశాల నడిపారు. వీరి నవల ‘వలసదేవర’కు ‘ఆటా’ వారి బహుమతి గెలుచుకున్నారు. ప్రస్తుతం ఒక ప్రసార మాధ్యమంలో పని చేస్తున్న మూర్తిగారికి పాఠకులను, శ్రోతలను ఆకట్టుకునే ‘కనికట్టు’ తెలుసు.
ప్రస్తుత నవల ‘జంగమదేవర’ రచయిత యొక్క దేశ పర్యటానుభవాన్ని, స్కూలు నడిపిన అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది. మూర్తిగారు ఈ నవలలో చిత్రించిన విద్యాసాగర్, బాల్యంలో ఇల్లు విడిచి వెళ్లి రైలు ప్రయాణం ద్వారా ఎన్నో ఊళ్లు తిరుగుతాడు. జీవనోపాధికై హోటళ్లలో కప్పులు కడుగుతాడు. సర్వర్‌గా పని చేస్తాడు. ఏది దొరికితే, దాంతో కడుపు నింపుకోవటం, చివరకు అరటి తొక్కతో కూడా కడుపు నింపుకుంటాడు. బండ్ల అరుగు (రైల్వే ప్లాటుఫారం) మీది సిమెంటు బెంచీల మీద పడుకుంటాడు. ముత్తు కణ్ణన్ లాంటి అసాంఘిక శక్తుల చేతివాటానికి బలి అవుతాడు. శారీరకంగా హింసించబడుతాడు. చివరకు చిత్తూరు జిల్లాలోని ముష్టూరు అనే గ్రామంలో బడి స్థాపించి స్థిరత్వం ఏర్పరుచుకుని ఆ ఊరి వారందరికీ ఆదర్శప్రాయుడై నిలుస్తాడు. శ్రీకాకుళం జిల్లా విద్యా శాఖాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో నవల ముగుస్తుంది.
అనుభవం గడించాలంటే, లోకాన్ని పరికించాలంటే, మనిషి ఉన్నచోటే ఉంటే వీలుపడదు. దేశమంతా పర్యటించాలి. అన్ని ప్రదేశాల్ని, అందరు వ్యక్తుల్నీ, అన్ని పరిస్థితుల్నీ స్వయంగా అనుభూతించాలి. ఆ తరువాత ఒక్కచోట స్థిరంగా నిలిచి, సమాజ ఉద్ధరణకు తన వంతు పాత్ర పోషించాలి. ఇదే విషయాన్ని రాయలసీమలో బైరాగులు ‘స్థావర జంగమాత్మకమైన లోకం’ అని పేర్కొంటారట!
నవలలోని విద్యాసాగర్ పాత్ర బాల్యంలో విధి విసిరేసినట్టల్లా వెళ్లడం, రైలు ప్రయాణాలు, హోటల్ ఉద్యోగాలు, తన కంటే పెద్దవారు విద్యాసాగర్‌ని వాడుకునే తీరు, హింసించిన తీరు వివరించటంలో రచయితపై ‘టామ్‌సాయర్’ ‘హకల్ బెరీఫిన్’ (మార్క్‌ట్వైన్ నవలలు)ల ప్రభావం కనిపిస్తుంది.
‘్భరించేది కాని, భరించబడేది కాని భార్య కానేరదు. భార్యంటే మార్గదర్శీ, దీర్ఘదర్శీ, సమదర్శీ కూడ’ (పే.15) ‘సమాజానికి మించిన గురువు లేదు’ (పే.19) రైలు వెళ్లిపోయింది, పట్టాలు మాత్రం అక్కడే ఉన్నాయి (పే.36) లాంటి ఆలోచింపచేసే వాక్యాలు; సముద్రం నీరు ఉప్పగా ఎందుకు ఉంటుందో చెప్పిన తాత్త్విక వివరణ బావుంది.
బండ్ల అరుగు, జనతా పెట్టె, పెట్టెల బండి, చలువ పెట్టె లాంటి తెలుగు పదాలు మొదటవాడినా, ఆ తరువాత ‘స్టేషన్, డోరు, జంక్షన్, ప్లాటుపారం, రైలు.. లాంటి పదాలను వాడటం గమనార్హం. సముద్ర వర్ణనతో మొదలైన నవలను, క్షీరసాగర ప్రసక్తితోనే ముగించటం రచయిత కథాశిల్పానికి ఇచ్చిన ప్రాముఖ్యత.

-కూర చిదంబరం 8639338675