పఠనీయం

ఆత్మ విద్యా దర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాయ- పరతత్త్వపరమైన వివరణ- రచయిత:డాక్టర్ పడవల వెంకట సుబ్బయ్య,
పుటలు:332, వెల:అమూల్యం. ప్రకాశకులు: పరతత్త్వదర్శిని ధార్మిక సంస్థ,
నరసరావుపేట, ప్రతులకు: డా పడవల వెంకట సుబ్బయ్య,
డోర్‌నెం.11-29-2/8, రామిరెడ్డిపేట, నరసరావుపేట, గుంటూరు జిల్లా. చరవాణి- 9440668306.
పరతత్త్వదర్శిని ధార్మిక సంస్థ డా.బీరక విశే్వశ్వరరావు, నెహ్రూనగర్, నందిగామ, కృష్ణా జిల్లా
==================================================================
పురాణయుగకాలంలో ‘ఋభువు’ అనే ఆత్మజ్ఞాని ‘నిదాఘుడు’ అనే ఒక యోగి పుంగవుడికి ఆత్మజ్ఞానం బోధిస్తాడు. ఆ సందర్భంలో వారిమద్య జరిగిన ప్రశ్నోత్తర సంభాషణ ‘ఋభుగీత’ అనే పేరుతో ప్రసిద్ధం. ఋభుగీత శివరహస్యం అనే సంస్కృత ఉద్గ్రంధంలో ప్రవచితం. ఋభు-నిదాఘల ప్రస్తావన విష్ణుపురాణంలో కూడా కనిపిస్తుంది. ఋభుప్రబోధ- ప్రవచనాన్ని పింగళి సూర్య సుందరంగారు, శ్రీ గెంటేల వెంకటరమణ ఇదివరకు తెలుగులో రాశారు.
ఇప్పుడు మళ్లీ ఇటీవల డాక్టర్ పడవల వెంకట సుబ్బయ్యగారు తనదైన శైలిలో విస్తృత వ్యాఖ్యనపూర్వకమైన వివరణతో ‘మాయా- పరతత్త్వ పరమైన వివరణ’ అనే పేరుతో ఋభు - నిదాఘు సంవాదాన్ని తెలుగులో రాశారు.. 332 పుటల ఉద్గ్రంధంగా.
‘‘కనిపించే సృష్టికి మూలం- సృష్టికి ముందు వున్నది శుద్ధ చైతన్యం, అంటే అది ఒక అనిర్వచనీయ అద్భుత శక్తి. అదే పరబ్రహ్మం అన్నా, పరమాత్మ అన్నా, ప్రజ్ఞానం అన్నా, మూలతత్త్వం అన్నా, దాని యొక్క సూక్ష్మాంశ రూపాలే ఈ కనిపించే సకల చరాచర ప్రపంచంలోనివన్నీ. నీలో - నాలో - వెరసి మనలో- అంటే ప్రతి జీవాత్మలో వున్నది ఆ పరమాత్మే- ఆ శుద్ధ చైతన్యమే. అయితే అది గ్రహించలేకపోవటమే- దానికి కారణమే ‘మాయ’.
‘‘మాయ అంటే యా మాసా. వౌలిక సత్యాన్ని తెలుసుకోవద్దు. నీకు అనవసరం’’ అంటూ అడ్డుపడే భ్రమే మాయ. ‘మియతే అనతి ఇతి మాయా’ మితి లేని చైతన్యాన్ని ఒక పరిధిలోకి తెచ్చేదే మాయ అని కూడా చెప్పుకోవచ్చు.
‘‘వ్యాసవిరచిత ‘బ్రహ్మసూత్రాలు’ తెలియజెప్పే సారాంశం ఇదే. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ (ఐతరేయోపనిషత్తు), ‘అహం బ్రహ్మస్మి’ (బృహదారణ్యకోపనిషత్తు), ‘తత్త్వమసి’ (్ఛందోగ్యోపనిషత్తు), అయమాత్మాబ్రహ్మా (మాండూక్యోపనిషత్తు) అన్న నాలుగు ఉపనిషద్వాక్యాలూ ముక్తకంఠంతో ఇదే సత్యాన్ని ఘోషిస్తున్నాయి.
కనుక పరమాత్మ వేరు మనం వేరు అనే మాయలో పడబోకు. ఆ మాయా తమస్సులో ఉండిపోయి సత్కర్మాచరణ మార్గం నుంచి జారిపోకు. ఇదీ ఈ పుస్తకంలోని సారాంశం.
అయితే డాక్టర్ పడవలవారిది వ్యాఖ్యాన గ్రంథం కాబట్టి 144 ఉపశీర్షికలతో సరళ సుందర వ్యావహారిక భాషలో బహు విషయ విశదీకరణలతో, ఉదాహరణలతో ఆసక్తిసృజకంగాను, అభిరుచి ప్రవర్థకంగానూ సాగిపోయింది గ్రంథ రచన.
‘గాడ్’ అని అనబడే ‘జి ఓ డి’ అన్న అక్షరాలు మన భారతీయ తత్త్వచింతనలోని త్రిమూర్తి (ట్రినిటి) భావనకు ఎలా సరిపోతాయో, ఒదిగిపోతాయో చెప్పటం బాగుంది 325వ పుటలో. (జి) జనరేటర్ (సృష్టికర్త), (ఒ) ఆర్గనైజర్ (స్థితి నిర్వాహకుడు), (డి) డెస్ట్రాయర్ (లయకారి) అంటూ.
169 నుంచి 172వ పుట వరకు దుర్గ, నవదుర్గలు, ఆ నవదుర్గల రూపాల ద్వారా మనం పొందే, పొందాల్సిన ఆత్మోన్నతి కాంక్షాస్ఫూర్తి పూర్వక పురోగమనాన్ని గురించి చెప్పిన వ్యాఖ్యానం చాలా బాగుంది.
‘దుఃఖేన గమ్యతి ఇతి దుర్గా’. బహు ప్రయాసలతో అవగాహన పొందదగినది (అర్థం చేసుకోదగ్గది, చేరుకోదగ్గది) దుర్గాదేవి అని అర్థం. అదే శక్తి తత్త్వం. దక్షాధ్వరాంతంలో ఆ ఆదిశక్తి యజ్ఞకుండంలో దూకి తిరిగి హైమవతి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందామత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధ్ధాత్రి- ఇలా వరసగా తొమ్మిది అవతారాలు దాల్చుతుంది. ఆ అవతార మూర్తులే నవ దుర్గలు అంటే (ఈ నవ అవతారమూర్తుల విశిష్ట లక్షణాలు, వృత్తాంతాలు కూడా క్లుప్తంగా చెప్పబడ్డాయి).
‘‘ఆ తల్లి యొక్క ఆ నవరూపాలు జన్మ జన్మాదిగా చైతన్యశక్తిగా జ్ఞానం (సత్)తో కలిసి జ్ఞాన చైతన్యాత్మగా మన వెంటే వస్తున్నదని గుర్తించి, ఆ తత్త్వాన్ని అవగాహన చేసుకొని ఆత్మ స్థాయిలో నిలచిన వారు ముక్తి పొందుతారు’’ అంటూ విడమరిచి చెప్పిన వాఖ్యానాల్లాంటివి ఇందులో చాలా చోట్ల చోటుచేసుకున్నాయి.
ఎన్నో ఉపనిషద్వాక్యాలు, శ్రీసూక్త, పురుష సూక్తాలలోని కొన్ని పంక్తులు, కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని రచించిన ప్రసిద్ధ ‘ఉమా సహస్రం’లోని కొన్ని భాగాలు మొదలైనవి ఇందులో కనిపిస్తాయి ఉద్దేశిత విషయ విశదీకరణ సమర్థకాలుగా అవసరమైన చోటల్లా.
వారాలు, తిథులు, మాసాలు, సంవత్సరాలు-వీటి పేర్లలోని పరతత్త్వ సంబంధపు వివరణలే కాకుండా ‘రాజుకు ఏడుగురు కొడుకులు’ కథలోని తాత్త్విక అంతరార్థం, క్షీరసాగర మథనం, మకర సంక్రాంతి, ఉత్తరద్వార దర్శనం, అయ్యప్ప దీక్ష, పర - అపరశక్తులు మొదలైన పలు అంశాల గురించిన అరుదైన విశేషాలు చాలావాటిని తెలియజేశారు ఆయా ఉపశీర్షికలకింద సుబోధకంగా రచయిత డాక్టర్ వెంకట సుబ్బయ్య. రచయిత ఒక విజ్ఞాన శాస్త్రాంశంలో పట్ట్భద్రుడు కూడా కావటం వల్ల చాలా విషయాలు తార్కికామోదయోగ్యంగా తేటతెల్లం చేశారు.ఆధ్యాత్మిక ధోరణి, దృష్టి కలవారికి ఈ పుస్తకం ఆత్మోన్నతి మార్గదర్శినిగా ఎంతగానో తోడ్పడుతుంది.

-శ్రీపతి పండితారాథ్యుల పార్వతీశం