పఠనీయం

మస్తకానికి పుస్తకపు విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్యాలయము
(పద్య వ్యాస సంపుటి)
పుటలు:144, వెల : రూ.125 లు
ప్రతులకు
నవోదయ బుక్‌హౌస్,
ఆర్యసమాజ్ మందిరం ఎదురుగా
కాచీగూడా చౌరస్తా, హైదరాబాదు-7
విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని బ్రాంచీలు
పద్యాలయం
ఫ్లాట్ నం.401, సాయిరాఘవేంద్ర రెసిడెన్సీ,
స్వరూప్‌నగర్, రోడ్ నెం.401. ఉప్పల్
హైదరాబాద్ 39
*
కనదగు నెవ్వరి రచనను
కని, కమ్మని దే గొలౌననుగాగ తెలిపినతడే
ఘనసంస్కారి యనబఱగు
కనుమతనిని సౌహృదమున కావాసముగన్
అలాంటి సాహితీ సహృదయ సంస్కారంతో ఒక సంకలనంగా రూపొందించబడిన గ్రంథం. ‘పద్యాలయ’ సంపాదకులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య. ‘త్రిజట’ , ‘ఇందూరు కవిరాజు’ మొదలైన గ్రంథాల రచయితగా పండిత కవిగా ఆచార్య భూమయ్య గారు లబ్ధ ప్రతిష్ఠులు.
ఈ గ్రంథంలో ‘సంప్రదాయేశ్వరి’, ‘సర్వవర్ణోప శోభిత’ అనే రెండు శీర్షికలతో రెండు పద్యరచనా విభాగాలు. ‘విమర్శరూపిణి’ అనే శీర్షికతో ఒక సాహితీ వ్యాసాలు విభాగము ఉన్నాయి. మూడు విభాగాలను ఇలా లలితా సహస్రనామాలలోని మూడు నామాలను ఉంచటం. పద్యాలయం అనే గ్రంథ నామానికి సముచితంగా ఉంది.
మొదటి విభాగంలో మొట్టమొదట తెలుగు శతక మహాకవి ‘పాల్కురికి’, బద్దెన, ధూర్జటి, వేమన, రామదాసు, శేషప్పకవి, కాసుల పురుషోత్తమం వంటి కవుల పద్యరత్నాలు కొన్ని చోటు చేసుకొన్నాయి.
‘ఆఁకొన్న కూడె అమృతము..’ లాంటి జీవ జంతుశాస్త్రాంశ నేపధ్యపు పునాది ఉన్న సుమతీ శతకకారుని పద్యం ఎన్నుకోవడం లోని భూమయ్యగారి నిశిత పరిశీలనా దృష్టి ప్రశంసనీయం. శ్రీ ఆంధ్ర నాయక శతకంలోని ‘కన్నవారల మున్ను కారాగృహంబున్’వంటి వ్యాజనిందాస్తుతి ఆలంకారికాకర్షణాత్మక పద్యాలు ఉదహరించటం బాగుంది.
రెండవ విభాగమైన ‘సర్వ వర్ణోపశోభిత’ లో శ్రీయుతులు‘విహారి’, ‘మసన చెన్నప్ప’, ‘రసరాజు’ ‘ఏల్చూరి మురళీధరరావు’, ‘పాలకుర్తి రామమూరి’్త, ‘వూట్ల భద్రయ్య’, ‘డాక్టరు అనుమాండ్ల భూమయ్య’ మొదలైన వారల పద్యాలు మంచి మచ్చులుగా కనిపిస్తాయి.
75,76 పుటలలోని ‘అక్షరములతో నేనిత్యమాడుకొనుచు/ నుండ, నా హృదయమ్ములో నున్న అక్ష/రమ్ము ననుపిల్చె లోనికి రమ్మటంచు;/ ఆటలిక చాలు రమ్మన అమ్మవోలె’ అన్న పద్యంలోని భావగాంభీర్యం ‘అక్షర’ శబ్దపు బహ్వర్థసమన్వయం,‘ ...త్రాడు లేని బొక్కెన నీరు తోడగలదె?’ అనటంలోని అవివక్షిత వాచ్య ధ్వని శిల్పము ఉదాత్తంగా ఉన్నాయి. ఇవి భూమయ్య గారి ‘వేదనామృతం’ లోనివి.
‘పంచభూతాల్లోను నిన్ను ’గాలిస్తుంటాను. వెలుతురు కూడా ‘మధిస్తుంటాను’ విశ్వం యావత్తును కానీ నా జంజాటంలో పడి ఉన్న నాకు నాలో నే నీవున్నావు అనేది మాత్రం తట్టదే’’ అన్న 35వ పేజీలోని ఏల్చూరి మురళీధర రావు పద్యం పాఠకుడి కి నవ్వు తెప్పిస్తూనే జ్ఞానోద్దీపకంగా దీపిస్తోంది.
38 వ పుటలో పాలకుర్తి రామమూర్తిగారి ‘బద్ధకం విజయానికి ప్రథమ శత్రువు’ పద్యాలు సందేశాత్మకాలుగాను, స్ఫూర్తిదాయకాలుగాను ఉన్నాయి. ‘ఎదగంగ నారాట మెదనిండ మొలకెత్తు పృథ్విని జీల్చుచు విత్తనములు’ అంటూ మొదలయ్యే పద్యం వివక్షితాన్యపరవాచ్య ధ్వనితో విలక్షణంగా అమరి, సమాసోక్తి అలంకారచ్ఛాయ అందగించింది.
పద్య కవితావ్యాసాల ‘విమర్శరూపిణి’ విభాగంలో గుంటూరు శేషేంద్ర శర్మ, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, డా. మచ్చహరిదాసు, మొవ్వ వృషాద్రిపతి, విహారి, కుప్పా వేంకట కృష్ణ మూర్తి , గన్నమరాజు గిరిజామనోహరబాబు, ఆచార్య ఎస్వీ రామారావు గారల కొన్ని సాహిత్య వ్యాసాలు ఉన్నాయి. అన్నీ బాగున్నాయి.
మొవ్వ వృషాద్రిపతి‘మనుచరిత్ర - ధ్వని’వ్యాసం మహాద్భుతం సర్వాంగ సుందరం.
123 పుటలో ‘రససిద్ధి అంటే హృదయం ద్రవించిన స్థితి ’అంటూ శ్రీ విహారి ఇచ్చిన నిర్వచనం సూక్ష్మంలో మోక్షంగానే కాకుండా విస్తృతార్థ గంభీరంగాను ఉంది.
వివిధ పద్య గద్యవక్తవ్యాంశాలను ఎన్నిక, ఎంపిక చేయటంలో ఆచార్య భూమయ్య ఒక సమర్థుడైన గురూత్తమునిగా దర్శనమిచ్చారు ఈ సంకలన గ్రంథంలో. పుస్తకం చదవగానే ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని పీరియడ్స్ పాటు అమందానందకర సారస్వతానుభూతిలో తన్మయత చెందినట్టు అనిపిస్తుంది. కనుక ఇది మస్తకానికి విందే కదా మరి.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం