పఠనీయం

సమాజ దర్పణమీ కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింకి చాప కథలు-
రచన: పోట్లూరు సుబ్రహ్మణ్యం
వెల:రూ.100/-
===========================================================
రచయిత శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం రచించిన 14 కథల సంకలనం ఇది. 1988 నుండి 2004 వరకు వీరు రాసిన కథలున్నాయి. నియమ నిబంధనలు ఏమిటో తెలియవు కాని ఈ సంకలనం ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక, సాంస్కృతిక సమితి అమరావతి వారి ప్రచురణగా చెప్పబడింది.
సంకలనంలోని 14 కథలూ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవి. తల్లిదండ్రులు తమ బిడ్డల్ని, తాము తిన్నా తినకున్నా రెక్కల్లో పొదుముకుని పెంచి పెద్ద చేస్తారు. ఆ బిడ్డలు పెరిగి పెద్దయి, తమను పెంచిన తల్లిదండ్రులే తమకు భారంగా భావిస్తారు.
కొడుకు తటస్థంగా ఉన్నా, కోడళ్ళ ప్రోద్భలంతో ఆ తల్లి అనాధ అవుతుంది. చింకి చాపా, పాత గుడ్డల మూట ఆ ముసలి తల్లి ఆస్తి అవుతుంది. ఇక్కడితో కథ ఆగిపోదు. బతికినంతకాలం నెలనెలా ఆ తల్లికి పింఛను ప్రకటించుతారు ప్రభుత్వంవారు. అకస్మాత్తుగా ఆ తల్లి ఆప్తురాలు అవుతుంది. కార్ల్ మార్క్స్ చెప్పిన ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలమీద ఆధారపడ్డాయన్న’ నిజం ఈ కథలో (గుడ్డిదీపం) నిరూపితం అవుతుంది.
గుడ్డిదీపం అనుకున్న ఆ ముసలి తల్లి వెలుగిచ్చే దీపం అవుతుంది. నేటి ఆలోచనలకు అద్దంపట్టే కథ ఇది. కొడుకులు, కోడళ్ళు, మనవలు, ప్రాణమిచ్చే భర్త- అందరూ కళ్లెదుటే ఉప్పెనలో కొట్టుకుపోతారు. సర్వం ఉప్పెనలో ఊడ్చుకుపోగా అనసూయమ్మకు మిగిలింది ఓ చింకి చాప మరియు పాత బట్టల మూట. చివరకు అది కూడా అప్పుడే ఈనిన తల్లికుక్క పరమైతే, పాపం పిచ్చిది అయిన ఆమె ఏం చేయగలదు- తన ఒకప్పటి సంసారాన్ని గుర్తుచేసుకోవటం తప్ప (చింకి చాప). ఒక మహావృక్షం శాఖోపశాలుగా చీలి ఆకాశమంత ఎత్తు ఎదిగినా, దాని తల్లి వేరు మాత్రం అది మొలకెత్తిన చోటే ఉందని, మనుషులు ఎంత ఎత్తు ఎదిగినా, ఉన్నతమైన పదవులు సాధించి, సంపాదించినా, వారి మనస్సులు పుట్టి పెరిగిన చోటే ఉంటాయని చెప్పే తల్లివేరు కథ.
అలాంటిదే మరో కథ ‘డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్’. ఖాదర్ భాషా నలభై ఏళ్ళుగా ఆ బస్సును నడుపుతున్నాడు. బస్సు మసలిదైంది. ఓనర్ వేరెవరికో అమ్మేశాడు. బస్సుతో అనుబంధం పెంచుకున్న ఖాదర్ భాషా జబ్బు పడతాడు. మంచంలోంచి లేవలేడు. కొత్త బస్సు కొన్న ఆ పాత ఓనర్‌కు కొత్త బస్సు అచ్చిరాక మళ్లీ పాత బస్సును వెనక్కి తీసుకుంటాడు.
డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ బస్సుకు మళ్లీ తానే డ్రైవర్‌నవుతానన్న వార్త విని ఖాదర్ భాషాలో జీవం వస్తుంది. నలభై ఏళ్ళు దాటిన బస్సు ఎన్నాళ్లు నడవగలదనే విషయాన్ని పక్కనపెడితే, రచయిత ఖాదర్ భాషా పాత్ర ద్వారా మనుషులు, మనుషులనే కాకుండా బస్సులాంటి వస్తువులమీద కూడా మమకారం మహత్తరమైనదని ప్రబోధిస్తాడు.
లోకులు కాకులు అని వాళ్ళని పట్టించుకోవద్దంటాడు ‘కాకులు అరుస్తున్నాయి’లో. ఊరందరి మురికిని మోసుకుంటూ ఊరవతల పారుతుందా ‘మురుగు కాలువ’. అందరూ అసహ్యించుకునే, ఆ కాలువ ప్రక్కన గుడిసె వేసుకుని, మురుగునీళ్ళతో సేద్యం చేసి పొట్ట పోసుకుంటారా తండ్రీ కూతురులు. కామందు నాయుడు కన్ను ఆ చిన్న కోండ్రమీద పడితే ఆ తండ్రి కూతురుకు ఊరు విడిచిపెట్టడం తప్ప మరో మార్గముండదు. ‘మురుగు కాలువ’కథలోనే కాదు, భౌతిక ప్రపంచంలో కూడా బలహీనుడెప్పుడూ ఓడిపోతాడు. కథలన్నింటా, ఒకే శైలీ, శిల్పం వస్తువు కనిపిస్తుంది.

-కూర చిదంబరం 8639338675