పఠనీయం

అభ్యుదయ భావాల సమాహారం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధం మాట్లాడుతుంది రచన: షెహబాజ్ అహ్మద్‌ఖాన్
పేజీలు:119, వెల:రూ.80/-
ప్రతులకు: అడుగుజాడలు పబ్లికేషన్స్, ఎం.ఎస్.కె.టవర్స్, ఫ్లాట్ నెం.410 హిమాయత్‌నగర్, హైదరాబాద్-29
=====================================================================
ఆద్యంతం అభ్యుదయ భావాలతో కవి షెహబాజ్ అహ్మద్‌ఖాన్ ‘యుద్ధం మాట్లాడుతుంది’ పేరుతో ఓ గ్రంథాన్ని వెలువరించారు. ఈ గ్రంథంలో కవిత్వంతోపాటు ఆలోచనాత్మకమైన వ్యాసాలకు చోటు కల్పించారు. అంధకారం నుండి వెలుగువైపు.. విధ్వంసం నుండి ప్రగతివైపు సమాజాన్ని నడిపించాలన్న సంకల్పంతో కవి తమ అంతరంగంలో సవ్వడి చేసే భావాలకు అక్షరాకృతినిచ్చారు.
కవిత్వం నిండా సామాజిక చైతన్యానికి దోహదపడే అంశాలకు పెద్దపీట వేశారు. పీడకులు, సామ్రాజ్యవాదులు యుద్ధానికి కాలు దువ్వితే... ఆత్మగౌరవమే ఆభరణంగా వున్న ఏ సమాజమూ.. ఏ జాతీ వౌనంగా కూర్చోదని కవి తమ కవిత్వం ద్వారా తేల్చి చెప్పారు. ప్రతి యుద్ధం నుంచే వీరులు.. అమరవీరులు ఉద్భవిస్తారని కవి తమ కవితల ద్వారా చక్కగా ఆవిష్కరించారు. ‘నిన్ను ఓడించి, పీడించి, చలించివేసిన ఫినిక్స్ పక్షివై లేవాలని’ కవి పిలుపునిచ్చారు.
పాఠశాలలు పిల్లల పాలిట ఉద్యానవనాలు కావాలనీ.. వారు పువ్వుల్లా విరబూసి నవ్వులు పంచేలా చూడాలని కవి తమ ఉత్తమ వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. నేడు వేగవంతమైన ప్రపంచంలో.. యాంత్రికమయమైన జీవనంలో.. యంత్రాలతో.. అంతర్జాలంతో మమేకమైన జనం.. క్రమంగా మానవులకుండాల్సిన లక్షణాలకు తిలోదకాలిస్తూ.. మానవులకు ఉండాల్సిన ఉద్వేగాలకు స్వస్తిపలుకుతూ.. యంత్రాలకు అతుక్కుపోయి.. మరమనుషులుగా మారి రోబోలు కన్నా హీనంగా తయారవుతున్నారని ఆధునిక సాంకేతికతవైపు ధ్వజమెత్తారు.
మాటల్లోనే మోసాలుంటాయనీ.. మాటల్లోనే మర్మాలుంటాయనీ.. సమాజ విలువలను నీరుగార్చి.. నిస్సిగ్గుగా నిన్ను లొంగదీసుకోవడానికి మాటలే పత్రికలకెక్కుతాయనీ.. మాటల ముసుగులోని విష పదాలే.. నీకోసం ప్రాధేయపడతాయని విడమరిచి చెప్పిన తీరు బాగుంది. పొట్ట చేత పట్టుకొని.. వలసపోయిన వారు తెల్పిన నిజం ఏమిటంటే.. దూరంగా పోయి బ్రతకడం కన్నా దగ్గరగా వుండి చావడం మిన్న అంటూ ‘నిజమేమిటంటే’ కవితలో నిజాలను నిగ్గుతీశారు.
‘ఎంతిష్టం’ కవిత చిన్నదైనా.. పెద్ద భావాలను మోసుకొచ్చింది. నీకు హక్కుంటే ఎంతిష్టం? మా అమ్మంత ఇష్టం అని.. వాస్తవాలంటే ఎంత మక్కువ? మా నాన్నంత మక్కువ అంటూ ప్రకటించిన భావాలు బాగున్నాయి.
‘చిక్కుముడి’ కవితలో.. ఆశల పల్లకీలోకి చూసిన అగమ్య సందేశం.. అస్పష్ట చిక్కుముడుల ద్వారాలు కనిపిస్తాయని స్పష్టం చేశారు.
‘అతనేం చేస్తాడు’ కవితద్వారా కవి ప్రకటించిన భావాలతో అందరూ ఏకీభవించకపోయినప్పటికీ.. కవి యొక్క అభ్యుదయ భావ పరంపరను చూసి ముక్కున వేలేసుకుంటారు.
‘కవిత రాయడం చాలా సులభం’ కవితలో.. కవి వ్యక్తపరచిన భావాలు బాగున్నాయి. కవిత రాయాలనుకుంటే.. ప్రకృతిని, మట్టిని, వాసనను, ఆకాశాన్ని అస్తిత్వాన్ని అన్నింటికన్నా మానవత్వాన్ని ప్రేమించాలని హితవుపలికారు.
ఉన్నదంతా మనదనుకుంటూనే.. ఏదీ నీది కాదనుకోవాలనీ.. రాత్రిళ్లు సూర్యుడిని.. పగటి నక్షత్రాలను చూసే శక్తిని పొందాలని, సూర్యుడిని సూర్యుడిలా.. వేగుచుక్కల్ని వేగుచుక్కల్లా చూపే శక్తిని నింపుకోవాలని సూచించారు. కవులు అసమానతలను ఎత్తిచూపాలని, సమాజంలో స్వార్థాన్ని ఎండగట్టాలని, రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడాలని సలహా ఇచ్చారు.
అస్తమానం సెల్‌ఫోన్‌కు అతుక్కుపోతున్న తీరుతెన్నులపై ధ్వజమెత్తుతూ.. ‘మరీ ఇంతనా?’ కవితను రూపుదిద్దారు. బంధాలను బంధించి.. మనుషులను విడదీసి నవ్వుకుంటూ సరికొత్తగా.. ఆవిష్కరించుకుంటున్న సాంకేతికత పేరులోంచి నీవు నిష్క్రమించమని సూచించారు.
‘యుద్ధం మాట్లాడుతుంది’ శీర్షికతో రాసిన కవితలోని కవి యొక్క భావాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. ‘ఇదే నాగరికత అంటున్న మనుషులపై.. యుద్ధం యిప్పుడు నాతో మాట్లాడుతుంది’ రాసిన పంక్తులు అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి.
‘ప్రవాహమై..’ కవిత యొక్క ఎత్తుగడ బాగుంది. ‘కంటిని పొడిచి చీకటి రాత్రులకు పగటి వెలుతుర్లకు తేడా తెలపమంటే ఏం చెప్పగలము?’ అని కవితను ప్రారంభించిన తీరు బాగుంది.అలసట మరిచి.. అడుగులు సాగించి.. అలుపెరుగని పోరాట అధ్యయనాలు నిర్మించేది కాగితమనీ... కాగితాలు.. కాగడాలు రెండూ ఎదురించేవేనని.. మనిషి నడకల్ని సడలించేటివేనని ‘కాగితాలు - కాగడాలు’ కవితకు అక్షరాకృతినిచ్చారు.
ఇలా ఈ గ్రంథంలోని కవితా పంక్తులు ఎన్నో ఉదహరించడానికి యోగ్యంగా ఉన్నాయి. ఇక ఇందులో కవిత్వంతోపాటు పొందుపరిచిన వ్యాసాలు ప్రేరణను కలిగించేలా కొలువుదీరాయి.
సమకాలీన సంఘటనలను ప్రగతిశీల భావాలతో ప్రకటించడానికి కవి షెహబాజ్ అహ్మద్ ఖాన్ చేసిన కృషి ప్రశంసనీయం.
అందరూ మెచ్చేవిధంగా ధిక్కార స్వరానికి మచ్చుతునకగా నిలిచే ఈ గ్రంథం సామాజిక చైతన్యానికి కొంత మేరకైనా దోహదపడగలదు.

- దాస్యం సేనాధిపతి, 9440525544