పఠనీయం

తవ్వి పోసిన తాతలనాటి ముచ్చట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సాలగ్రామం’ (ఆత్మకథ)
రచయిత: డా. కపిలవాయిలింగమూర్తి
పుట సంఖ్య: 208, వెల: రూ.150/-లు
ప్రచురణ
హైదరాబాద్ బుక్‌ఫెయిర్
అడుగుజాడలు ప్రచురణలు
ప్రతులకు
అన్ని పుస్తకకేంద్రాలు
*
సాంఘిక చరిత్ర రచన ఒక శ్రమ. స్వీయచరిత్ర రచన ఒక కళ. స్వీయ చరిత్ర రచనలో నిజాలు చెప్పటం, నిజాయితీగా ఉండటం, స్వోత్కర్ష అనిపించకుండా రాయటం - ఈమూడు ఒక ఎతె్తైతే చెప్పేదానిని ఆకర్షణీయంగా, ముచ్చటగా తన ‘ముచ్చట్లు’ చెప్పటం ఒక ఎత్తు. రచయిత రచనా నిపుణత గలవాడైతే ఆ స్వీయచరిత్ర ఒక మంచి నవలగా భాసిస్తుంది.
ఇలాంటి స్వీయచరిత్ర రచనే ‘సాలగ్రామం’ అనే పేరుతో పాలమూరు జిల్లా ప్రముఖ పండిత కవి, చక్రతీర్థ మాహాత్మ్యం’ మొదలైన ప్రఖ్య్రాత గ్రంథాల రచయిత అయిన. డా. కపిలవాయి లింగమూర్తిగారి కలం నుంచి వెలువడింది.
ఇందులో లింగమూర్తిగారి వంశవిశేషాలు , వారి బాల్య, విద్యార్జన దశల ముచ్చట్లు, ఆటలు, అభిరుచులు, వృత్తి, ప్రవృత్తి, వ్యావృత్తి, 1948 నిజాం రాజ్య విముక్తి (పోలీసుచర్య) తాను చేసిన సాహిత్యసేవ మొదలైన అరవైకి పైని అంశాలమీద వారిచ్చిన వివరణ పాఠకునికి అభిరుచి కల్పకంగా సాగిపోతుంది.
105, 106వ పేజీలలోని హైదరాబాద్ సంస్థాన విమోచనపు పోలీసు చర్యరోజు, ఆ మరుసటి మూడు రోజుల గురించి ఉన్న వివరణ చాలా ఉత్కంఠభరితంగాంది. 17.9.1948న హైదరాబాద్ నవాబు భారతసేనాపతి జయంత్ నాథ్ చౌధురీకి లొంగి పోయాడని జనానికి తెలియగానే మొత్తం తెలుగు జనత ఆనందోత్సహాలతో తేలిపోయింది. తెలక పల్లిలో జరీల్ సాహెబ్ అనే పేరుగల ఒక ప్రముఖ వ్యక్తి ‘ఈ పరిణామం మేమూహించిందే. రజాకార్ల చేష్టలు మితిమీరుతున్నాయని మేము చెప్పినా ఆ ముసలివాడు వినిపించుకోకపోయే’’ అన్నాడట. అంతకుముందు రోజు వరకు తెలుగులో మాట్లాడని నిజాం రాజ్యపుపోలీసులు స్వేచ్చగా అనందంగా తనివితీరా బహిరంగంగా తెలుగులో మాట్లాడసాగారట.
1930-40ల మధ్య పాఠశాలల ఆవరణలలో విద్యార్థులు తమతమ స్కూలు మాస్టర్ల మార్గదర్శనము, అజమాయిషీలలో కాయగూరలు, ఆకు కూరలు పండించి, ఫలసాయం పంతుళ్లు, విద్యార్థులు సమానంగాపంచుకునేవాళ్లట.
విశ్వ బ్రాహ్మణ కుటుంబాలలో ఏడవతరగతి పూర్తయ్యేసరికి కృష్ణశతకం, నరసింహాశతకం మొదలైన ప్రసిద్ధ శతకాలే కాకుండా ఆంధ్రనామ సంగ్రహం (తెలుగు పద్య నిఘంటువు), అమరకోశము (సంస్కృత శ్లోక నిఘంటువు) లు కూడా కంఠస్థాలయ్యేవట.
కొందరు స్కూలు పిల్లలు ఇంటిపని (హోం వర్క్) ట్యూషన్స్ సమయాల్లో పఠనశ్రమ తప్పించుకునే ఎత్తులు, జిత్తుల గురిం చాలా ఆసక్తికరంగా హాస్య రసభరితంగాచెప్పాడు రచయిత.
అప్పటి బాలకల ఆటలైన కానుగాకు - కస్తూరాకు, చెట్టమ్మ చెట్టు, కోకోళ్ళెంక, కచ్చకాయలు, బానకట్ట, పింగిరి, గుజగుజరేకులు, పచ్చీసు, బాలుర ఆటలైన చిరుతబిళ్ల, బంతి, హరిపురి, బాలబాలికలు అందరూ కలసి ఆడే ‘తట్లు’ మొదలైన ఆటలను అన్నిటినీ ప్రస్తావించారు కపిలవాయి.
‘‘హరిపురి చీమబదరి - తాలూకోటలో లంకల పురి’’ అనేది అప్పటి పిల్లల కబడీ కూతట. ఆకూత ఎంత జిలుగు తెలుగు నిసర్గసుందరంగా ఉందో లింగమూర్తిగారు చెప్తుంటే ఒక బాల్యానుభూతిని ఇస్తోంది. అప్పటి ఆ ఆటల పేర్లే తెలియదు ఇప్పటి పిల్లలకు. ఎంతసేపు స్మార్ట్ఫోన్లతో కాలక్షేపాలు గేమ్స్ తప్ప.
‘కపిలవాయి’ వారి సాహిత్య జీవనానికి పునాది మొట్ట మొదటిది ‘మనుచరిత్ర’కావ్య పఠనమట. ఆ మాట చదువుతుంటే ఏదో ఒక అనిర్వచనీయమైన ప్రాచీన ముదాత్త సాహిత్యాధ్యయన సంప్రదాయ మధురానుభూతి.
ఈ ‘స్వీయచరిత్ర’ యావత్తు ఎన్నో సాంఘిక, చారిత్రక, సాహిత్య, సంప్రదాయక విషయాల చక్కని సమాహారంగా ఒకే బిగువున చదివింపచేస్తుంది.
పలుచోట్ల పదాల సొగసు, వాక్యాల అర్థగాంభీర్యం కనిపిస్తాయి. 33వ పుటలోని ‘ప్రకృతి విప్లవం’ (కుంభవృష్టి) అనే పదసృష్టి(ష్యజశ్ఘ్ళ), 34 వ ఫుటలో ‘‘చలికాలంలో మా పిల్లలమందరం కోటీశ్వరులం’’(తప్పక కోటు ధరించేవాళ్లం) అనటం లాంటివి మంచి మచ్చులు.
‘వరుగుతో పాటు దాగరకుండా ఎండాల్సిందే’ లాంటి సామెతల సందర్భశుద్ధి సిహిత సమయోచితతా సుందరతలు సాక్షాత్కరిస్తాయి చాల చోట్ల.
తవాయి (ఏదైనా ఒక సాంఘిక, సర్వజన ఉపద్రవం) దిరస్తు (విద్యార్థులు బడికి వెళ్ళేటపుడు ఆరోజుల్లో వేసుకునే దుస్తులు, పెట్టుకొనే టోపి వగైరా) కందిలీలు (సంధ్యాదీపాలు) మగ్దూరు (వీలు, అవకాశము) జంగిడి (గొడ్డమంద) లోతు (మూడు గదుల గృహభావం) వంటి మహబూబ్ నగర్ జిల్లా మాండలికాలు ఈ రచనా హారంలో మెరిసే స్వాతి ముత్యాలు.
ఈ పుస్తకం కేవలం డాక్టర్ కపిలవాయి లింగమూర్తి రాసుకున్న తన చరిత్రం కాదు ఇప్పటి పాలమూరుజిల్లా ప్రజల తాత తాతల నాటి కథలు తవ్విపోసిన ‘ముచ్చట్ల, పురిపాల చరిత్రం.; ఇదొక ప్రాంత నిసర్గ జన జీరవన వివరణాపత్రం.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం