పఠనీయం

జరిగిన కథలు - జనపథ ద్వీపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ పూర్వ పుణ్యమో ఏ దాన బలమో జరిగిన కథలు
రచయిత:కె.ఎ.హరినాథరెడ్డి, పుటలు:218, వెల:రూ.170/-, ప్రతులకు:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,
విజయవాడ- 520 004.
==================================================================
‘‘నీ పాదకమల సేవయు,
నీ పాదార్చకులతోడి నెయ్యమ్ము, నితాం
తాపార భూత దయమును’’- ఈ మూడే తనకు జీవిత పరమార్థాలు అన్నాడు పోతన్న, భగవంతునికి తన ఆత్మనివేదన చేసుకుంటూ. అంతకుముందున్న యావత్పారమార్థిక చింతనా వాఙ్మయం - వేద సారాంశంతోసహా ఇదే చెప్పింది. ఇదే భారతీయ చిరంతన తాత్విక చింతనను త్రికరణశుద్ధిగా ఆచరణలో పెట్టిన మహాత్ములు ద్రవిడ, కర్నాటక సీమల్లో అసంఖ్యాకులు. వారిలో పూసలార్ నాయనార్, కుమరేశన్ చెట్టియార్, పురందరదాసు, కన్నదాసన్ మొదలైనవారు ప్రముఖంగా ప్రాతఃస్మరణీయులు.
అలాంటి మానవ రూప మణిదీపాల మహనీయ జీవిత వృత్తాంతాల వెలుగులను పాఠకలోకానికి చూపిస్తూ ‘ఏ పూర్వ పుణ్యమో ఏ దాన బలమో’ అనే పేరుతో జరిగిన కథల పుస్తకం ఒకటి ఇటీవల ద్వితీయ ప్రచురణకు నోచుకుంది. రచయిత శ్రీ కె.ఎ.హరినాథరెడ్డి.
ఇందులో పైన పేర్కొన్న మహాపురుషుల కథలే గాకుండా సిరిపురం రామస్వామి, నీలకంఠ నాయనార్ మొదలైన మహదాదర్శ జీవనుల కథలు కూడా కలుపుకొని మొత్తం పదకొండు కథలున్నాయి.
ఉదాహరణకు పూసలార్ నాయనార్ కథ. ఇది మహాద్భుతం.
పూసలార్ నాయనార్ అనే శివభక్తుడు తన ‘తిరునిండు ఊర్’ గ్రామంలో శివాలయం కడదామని అందర్నీ చందాలడిగితే ఎవ్వరూ ముందుకు రారు. అపుడు పూసలార్ నాయనార్ తన హృదయంలోనే సదాశివునికి గుడి కట్టుకోగలను అనే భగద్విశ్వాసంతో ఊరిమధ్యలో వున్న ఇప్ప చెట్టు కింద పద్మాసనం వేసుకు కూర్చొని హృదయంలోనే భావనామగ్నుడై ఇటుకమీద ఇటుక పేర్చుకుంటూ పోతాడు. కొంతకాలానికి శివాలయ నిర్మాణం పూర్తికావచ్చింది. శివుడిని తన మనోమందిరంలోకి ఆహ్వానించి కుంభాభిషేకంతో ప్రతిష్ఠ చేయటానికి నిశ్చయించుకున్నాడు. పల్లవరాజైన రెండవ నరసింహ వర్మ అదే రోజున కంచిలో కైలాసనాథార్ ఆలయంలో శివలింగ ప్రతిష్ఠ చేయతలపెట్టాడు. అంతకుముందు రోజు ఆ పరమశివుడు నరసింహ వర్మకు కలలో కనిపించి ‘రేపు శివలింగప్రతిష్ఠ వీలుపడదు. నేను తిరునిండ్ర ఊర్ పూసలార్ నాయనార్ హృదయాలయంలో ప్రతిష్ఠ కాబోతున్నాను’ అన్నాడు.
నరసింహ వర్మకు చెప్పినట్టుగానే నాగభూషణుడు పూసలార్ నాయనార్‌లో ప్రవేశించాడు. నరసింహవర్మ స్వయంగా ఆ దృశ్యాన్ని వీక్షించాడు. వెంటనే అక్కడే హృదయేశ్వరాలయం అనే బ్రహ్మాండమైన గుడిని కట్టించాడు నరసింహవర్మ.
ఇలా ఈ పుస్తకంలోని కథ ప్రతిదీ ఉత్కంఠభరితంగాను, ఉదాత్త సందేశాత్మకంగాను ఉండి పాఠకుడిని పరవశింపజేస్తుంది.
ఋణగ్రహీతలను పీడించి పిప్పి చేస్తూ కర్కశ జీవనాన్ని గడిపే వడ్డీ వ్యాపారి అయిన పురందదాసు వ్యాసరాయస్వామి అనుగ్రహంతో ఎంత గొప్ప కర్నాట భాషా కవీశ్వరుడుగా, ఎంతగా పాడురంగ భక్తాగ్రేసరుడుగా పరిణామం చెందాడో వర్ణించిన కథ చాలా రసవత్తరంగా సాగిపోయింది.
తల్లిదండ్రుల పుణ్య జీవనం తమ పిల్లలకు రక్షా కవచం అనే వాస్తవ సూక్తిని కన్నదాసన్ కథ నిరూపిస్తుంది.
‘మలుపు తిరిగిన జీవితం’ కథ ద్వారా శృంగేరీ పీఠ చంద్రశేఖర్ భారతీయ మహాస్వామివారి అనుగ్రహ మహిమ; కన్నదాసన్ కథలో కనిపించే కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతులవారి దయాపూర్వక ఆశీర్వాద మనస్సు; తన ప్రతి పదంలోను మనిషికి వివేకము, విచక్షణలు ప్రాథమిక ఆవశ్యకతలు అనే వాస్తవం ‘్ఫరెస్ట్ రేంజర్ యొక్క కోపం’ అనే కథలోను ఆవిష్కరింపబడ్డాయి.
దంపతుల అనుబంధ పవిత్రత, ప్రగాఢతలు ‘నీలకంఠ నాయర్’ కథలో పొందికగా ఆవిష్కృతం అయ్యాయి. అన్నదాన మహిమ, ప్రాముఖ్యాలు ‘కుమరేశన్ చెట్టియార్’ వృత్తాంతంలో విశదమవుతాయి. ‘గోధూళివేళ గోరంత దీపం’ కథలో సంధ్యా దీపారాధనా ప్రాధాన్యము, పుణ్యములు సోదాహరణంగా తెలియజేశారు హరినాథరెడ్డి.
భగవంతుడు తన భక్తుల భక్తినిశ్చలతకు పరీక్షగా కొందరు దురుసు స్వభావులను తారసిల్లజేస్తుంటాడు. అలా భగవంతుడు పంపిన ఆటంకవాదులకు క్షేత్రపాపులు అని పేరు. 66వ పుటలోని ఈ పలుకు చాలా విశిష్టంగా ఉంది. అలాగే 198వ పుటలో ‘అసుర సంధ్య’ అనే పదానికి వివరణ ఇస్తూ సూర్యాస్తమయం తరువాత 45 నిమిషాల సమయంపాటు దేవతలు తన్మయత్వంలో ఉంటారు. అపుడు అసురీశక్తులు విజృంభించి జనులకు వికృతాలోచనలను ప్రేరేపిస్తాయి. కనుక ఆ సమయంలో అన్నం తినటంగాని, నిద్రపోవటంగాని శ్రేయస్కరం కాదు అని తెలియజేశారు రచయిత. ఇది సకల జనవేద్యం.
రచనాశైలి సరళతా సుందర శ్రీమతంగా ఉంది. అయితే కొన్నిచోట్ల శబ్దదోషాలు దొర్లాయి.
34, 35వ పుటలలో ‘మనసా వాచా కర్మణా’ అనాలి. ‘కర్మేన’ తప్పు. ‘ఆనందనిలయా ధీసుడు’ తప్పు.. ‘్ధశుడు’ అనాలి (38వ పుట). ‘ద్విగ్వినీకృతము’ తప్పు, ద్విగుణీకృతము అనాలి (65 పుట). ‘పంక్షాక్షరి’ కాదు పంచాక్షరి అనాలి (133వ పుట). ‘ఓం నమఃశివాయ’ అనేది షడక్షరి మంత్రం, పంచాక్షరి కాదు (133వ పుటలోనే). ‘పూర్వీకులు’ కాదు పూర్వికులు అనాలి(198వ పుట).బహుశా ఇవి అన్నీ డిటిపిలోపాలు అయ ఉండవచ్చు. ఇలాంటివి సరిచూసుకొని మరి ముద్రణకు వెళ్లి వుంటే బాగుండేది.
ఈ పుస్తకంలోని జరిగిన కథలు అన్నీ జన ‘పథ దీపాలు’. రచయిత కృతార్థుడు, అభినంద్యుడు.