పఠనీయం

కవిత్వంలో కొత్త మెరుపుదనం - ‘అద్వంద్వం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్వంద్వం కవితలు
రచన- పుప్పాల శ్రీరాం, వెల:100/-, ప్రతులకు:
సాహితీమిత్రులు, 28-10-26, అరండల్‌పేట్, విజయవాడ, ఫోన్: 9392971359, అమెజాన్.ఇన్ మరియు అన్ని పుస్తక కేంద్రాలలో
=============================================================
వచన కవిత్వం సారాన్ని ఆకళింపు చేసుకుని తనదైన విలక్షణ గొంతుకతో విరుచుకుపడుతున్న యువకవి పుప్పాల శ్రీరాం. ఆలోచనా- ఆవేశమూ సమపాళ్ళలో కలబోసుకొని ‘అద్వంద్వం’ కవితా సంపుటికి దారితీశాయి. స్వతహాగా మంచి విమర్శకుడైన ఈ కవికి, కవిత్వ రచన ‘నల్లేరుపై బండి నడకే’! 38 కవితలున్న ఈ సంపుటిలో వస్తు వైవిధ్యంతోపాటు, విషయ విశే్లషణ అంతఃసూత్రంగా కలిగివుంది.
‘నల్ల జెండాలు’ కవితలో
‘‘చేనంతా / చెమట చుక్కలతో స్నానమాడాక / తడిసిన నేల ఒళ్ళంతా / పాటల్లాంటి గింజల్నే నాటింది / పదునెక్కిన సాళ్ళు మొత్తం / గొంతు నొక్కేసిన చేతులూ కాళ్ళే మొలిచింది’’ అంటాడు చాలా భావగర్భితంగా. తిరుగుబాటు ధోరణి పతాక స్థాయికి చేరి నిరసనతో ఒళ్ళంతా కళ్ళు చేస్తాయి. అట్టడుగు పీడిత వర్గాల్లోని ఆర్థిక స్థితిగతుల్లోని పేదరికపు దైన్యం పరిస్థితిని కళ్ళకు కట్టించి సామూహిక చైతన్యాన్ని రెపరెపలాడిస్తాయి.
ఇంకోచోట - ‘వెళ్ళొచ్చాక’ శీర్షికలో నర్మగర్భితనం అంతర్ముఖ దృష్టితో బొమ్మ కట్టిస్తాడు శ్రీరాం.
‘‘కురవడమే వానైతే / కొన్ని పాల చుక్కలు నోటికందేలోపు / ఈ భూమీద / రాళ్ళ చినుకుల్లా రాలిపడ్డట్టున్నాయి / దారంతో బ్రహ్మ జముళ్ళు దాచుకున్న దుఃఖమే / వొళ్ళంతా ముళ్ళుగా గుచ్చుకుంది’’ అంటాడు శ్రీరాం. అనుభూతి ఆవేశపూరితంగా మారితే, వొలికే కవిత్వ సంభాషణ ఈ భాషలోనే ఉంటుంది. సందర్భాన్ని కవిత్వమయం చెయ్యడానికి కావలసిన ముడిసరుకు దృశ్యం అల్లికే. అది పరుసవేది విద్య రూపంలో శ్రీరాంలో దాగివుంది.
‘‘రెక్కలు తెగిన దారి’’ కవితలో బాల్యం పడుతున్న చిత్రవధ వర్ణనాతీత వ్యధగా వ్యక్తం చేస్తాడు కవి.
‘‘వాళ్ళ నడిచే దారంతా / మొక్కల్ని పూలు పూయనీకుండా / రహస్యం దాచినట్టు నేల / మెడ వాల్చేసిన మొగ్గలతో / రణభూమిలా కనిపిస్తుంది’’ అనడంలో- అంతర్లీనంగా దాక్కున్న బీభత్సం.. లోలోపటి తొడిమెలను చిదిమి, ఛిద్రమవుతున్న, సంఘర్షణలకు చిత్రిక పడుతుంది. విద్యావ్యవస్థలోని విద్యార్థి అవస్థలకు సజీవ ప్రతిరూపం ఈ కవిత.
‘‘నేనెక్సూ నువ్వరుూ్య’’లో కుసించిపోతున్న లింగ వివక్షలోని డొల్లతనాన్ని ఆడబతుకు శాపంగా ఎలా రూపాంతరం చెందిందో వివరిస్తుంది.
‘‘తన చుట్టూ తాను తిరక్కుండా / భూగోళం మాత్రం / మర్మాంగాలు తయారవ్వని / పిండం చుట్టూ / మళ్లీ ఆబగా / ప్రదక్షిణం మొదలెడుతుంది’’ అంటూ ముగిస్తుంది. స్ర్తి జీవితం కేంద్రంగా అడుగడుగునా తొంగి చూస్తున్న అసమానతల వేధింపుల్లోని బహుముఖ కోణాల మూలాల్ని అందిపుచ్చుకొని విషాదంతో తడిమింది ఈ కవిత.
‘‘ప్రాణాలొడ్డిన వాడి కల ఆచూకీ / సామూహిక దహనవౌతున్న చోట / తిరుగుబాటు లేని స్వేచ్ఛని పీల్చలేక / సగం కాలిన దేహం / ఊపిరి కడ్డుపడుతోంది’’ అంటాడు ‘ఆచూకీ’ శీర్షికలో ఇంకోచోట శ్రీరాం. నిర్లిప్తత లోంచి కొట్టుకుపోతున్న తిరుగుబాటుతనం ఉనికిని కోల్పోయిన మనిషి ముఖచిత్రాన్ని బతుకుతో బొమ్మగీస్తుంటే, జీవచ్ఛవంగా మిగిలిపోయిన నిర్భాగ్యుడిగా కాలం వెళ్ళదీయలేని నిర్బంధ క్షణాల్ని ఇది గుర్తుచేస్తుంది. ఇలా శ్రీరాం రాసిన ఏ వాక్యాన్ని తడిమినా స్పర్శ యింకిపోయిన చీకటి జీవన సారమే బహిరంగ వాస్తవికతను ప్రతిఘటిస్తూ ప్రతిబింబిస్తుంది.
ఈ దారిలో అక్కడక్కడా కవిత్వం ఉట్టిపడే వెంటాడే వాక్యాలూ మనకు తారసపడతాయి. ‘పొలం కాళ్ళు నగరానికొచ్చాయి’, ‘రంగు వెలసిన కన్నీటి వానలా కురుస్తూ’, ‘గొంతెండిపోయిన లేగదూడ దాహపు పాటను’, ‘పచ్చని ఉనికై ఎర్రగా మండిన మనిషిని’, ‘చీకటి దుప్పట్లో ఉండగా చుట్టేసి’, ‘శిక్ష పడ్డ నడిరోడ్డు / ఎర్రటి ఎండని మోస్తున్నట్టు’, ‘ఈ దారిలో ఇప్పుడెవరైనా ఆకాశాన్ని పరచండి’, ‘ద్రోణాచార్యుడే మనకు మంత్రసాని’, ‘ఒళ్ళంతా పిల్లవాగులా పరిగెడుతుంది’, చెల్లని నాణెం లాంటి పేద దేశం ముఖమీద’, ‘ఒంటరి చీకటిని నిద్రలేపే మిణుగురుతనం’, ‘మళ్ళీ ఇప్పుడో కొత్త కలని నిద్రలేపుతాడేమో’, ‘ఉరి బిగించుకుని విరిగిపడిన నిశ్శబ్దం’, ‘ఆదిమానవుడు రగిల్చిన నిప్పుల కొలిమిలా ఉంది’, ‘సగం నిద్ర కళ్ళతో చలి రాత్రికి / అంటురోగంలా వణుకుతుంది’, ‘గాలి దివిటీల్లాంటి తెరచాపలు / ప్రాణాల్తో బంతాట ఆడతాయి’, ‘నెమలి పించాల్లో దాక్కుని / మట్టివాసన వేస్తున్న సమ్మోహ నృత్యం’, ‘దేహాన్ని ముట్టించుకున్న కాగితం అంచుల్ని / చిప్పిల్లిన కళ్ళతో ముడిచి పడవలు చేయకు’, ‘నీళ్ళే యుద్ధ నౌకలకి దారిచూపే / చూపుడువేళ్ళు’, ‘పవిత్ర గంగా నదుల్లా ప్రవహిస్తున్న శరీరాల్ని’, ‘జింక రూపాన్ని ధరించిన పులిని దాస్తుంది’, ‘చూపు తెగిపోయిన సగం గాజు కళ్ళని’, ‘బండరాళ్ళని కోసిన సెలయేళ్ళ ప్రవాహం’ వంటి వాక్య నిర్మాణాలు నిరాశతో జీవం కోల్పోయిన బతుకుల్లో సరికొత్త ఆశల్ని నింపుతాయి.
సారవంతమైన పదునైన పాదాలతో కవిత్వంలో నిబద్ధతని ప్రాతిపదికగా చేసుకుని కొత్త చూపుతో ముందడుగు వేస్తున్న యువ కవి కిశోరం పుప్పాల శ్రీరాంను సాహితీ లోకంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించే ప్రయత్నం చేద్దాం.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910