పఠనీయం

అలతి అలతి పదాలతో అద్భుత భావాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు:90, వెల:రూ.60/-,
ప్రతులకు: మాయకుంట్ల నారాయణరెడ్డి, ఇం.నెం.2-2-647/129ఎ, ఎస్-1, శరణం అపార్ట్‌మెంట్స్,
శివంరోడ్డు, న్యూనల్లకుంట, హైదరాబాద్. ఫోన్:9989686603.
=============================================================
‘‘ఊహను/ మరింత చిలుకు/ కవిత నవనీతమై/ కమ్మగా పలుకు...’’ అంటూ అలతి అలతి పదాలతో అద్భుతమైన భావాలకు అక్షరూపమిస్తూ.. కవి మాయకుంట్ల నారాయణరెడ్డిగారు ‘నానీల పయనం’ పేరుతో ఓ గ్రంథాన్ని వెలువరించారు. ఆచార్య ఎన్.గోపిగారు ప్రవేశపెట్టిన లఘు కవితా రూపం ‘నానీలు’ ప్రక్రియలో కవి మాయకుంట్ల నారాయణరెడ్డి గారు దీనితో మూడు గ్రంథాలను ప్రకటించి ముచ్చట తీర్చుకున్నారు!
‘నానీ వీచికలు’, ‘వివేక వీచీకలు’ పేర్లతో లోగడ నానీలు ప్రక్రియను సుసంపన్నం చేస్తూ.. గ్రంథాలను వెలువరించిన అనుభవం ఆయనకు వుంది. ప్రస్తుత నానీల పయనం పుస్తకంలో.. పొందుపరిచిన నానీల్లో కవి యొక్క ఉత్తమ వ్యక్తిత్వం.. సామాజిక చింతనం.. సున్నిత మనస్తత్వం ముప్పేట అల్లుకుపోయాయి!
కవిగానే కాకుండా.. రంగస్థల నటునిగా అనుభవాన్ని సొంతం చేసుకున్న కవి రెడ్డిగారు కొన్ని చిత్రాలలో కూడా నటించారు.
ఆలోచనాత్మక భావాలను నానీల్లో నిక్షిప్తంచేసే ప్రయత్నం చేసిన కవి రెడ్డిగారు తమ అనుభవాన్ని రంగరించి.. మనకు అందిస్తున్న నానీల్లో జీవన సత్యాలకు పెద్దపీట వేశారు.
నానీలకోసం ఎంపిక చేసుకున్న కవితా వస్తువుల్లో వైవిధ్యం వుంది.. అభివ్యక్తిలో నవ్యత వుంది.. ఒకింత చమత్కారం.. మరికొంత వ్యంగ్యం.. ఇందలి నానీలకు నిండు శోభను కూర్చాయి..
కన్నీళ్ళకు సైతం కలుపుకొనే గొప్పదనం వర్షపు చినుకుకు ఉంటుంది కనుకనే.. చినుకుతో సావాసం ఇష్టం అంటూ రాసిన నానీ బాగుంది.
‘‘కన్నీళ్ళను కూడా / కలుపుకుంటుంది / చినుకుతో సావాసం / అందుకే ఇష్టం’’అనడం బాగుంది.
‘ఘర్షణ లేనిదే / ఆకర్షణ నిలువదు / అలజడి లేనిదే / ‘అల’ కదలదు’ అంటూ మరో నానీలో వాస్తవాన్ని చక్కగా ఆవిష్కరించారు.
‘మనిషికి మాత్రమే / మాట్లాడే వరం / అందులో నింపకు / నీ కండకావరం’ అంటూ హితవు పలికారు.మనిషిలో మంచి వుంటే / మతాలన్నీ ఒక్కటే.. / కాదంటే / వెతల చీకటేనంటూ తేల్చి చెప్పారు.
పోస్ట్‌మాన్‌ను భలే జూదగాడుగా పేర్కొంటూ రాసిన నానీ అందరినీ ఆకట్టుకుంటుంది.కన్నీరు, పన్నీరు ఒకే సంచిలోంచి పంచుతాడని పోస్ట్‌మాన్‌కు కితాబిచ్చారు.
కవి రెడ్డిగారు సినారెపై తమ గౌరవాన్ని చాటుకుంటూ, సినారె ఉత్తమ వ్యక్తిత్వాన్ని కవిత్వాన్ని ప్రతిబింబిస్తూ రాసిన నానీలు బాగున్నాయి..
సినారె / ఓ విరించి / నిష్క్రమించె/ అక్షరానికి ఆయువును పంచి- అంటూ సినారెకు అక్షరాంజలి ఘటించారు.
రెప్పపాటు జీవితం / తెలిస్తే కనువిప్పు / మూస్తే మాత్రం / పెను ముప్పు- అంటూ కవి తమ తాత్త్వికతను చాటుకున్నారు. జీవితం ఓ గాలిపటమని.. గాలిలోకెగసాక.. సాగదు నీ చేతివాటం అని చెప్పిన తీరు బాగుంది.. మరో నానీలో జీవితం ఓ ఒంటరి ప్రయాణమని... కాలం దారమే దానికాధారం అంటూ రాసిన పద బంధాలు బాగున్నాయి!
ఇలా ఇందులో నిక్షిప్తం చేసిన నానీల్లో పంక్తులెన్నో ఉదహరించడానికి యోగ్యంగా ఉన్నాయి. ‘కించిత్’ స్పందనలేని / కవిత్వం జోరు / వర్తమానంలోనే / సమాధుల్లో చేరు..’ అన్న కవిత్వ సృజన రహస్యం తెలిసిన కవి నారాయణ రెడ్డిగారు, నిత్యం తనచుట్టూ కదలాడే సన్నివేశాలను... సంఘటనలను నానీల్లో బంధించారు.
చిన్ని చిన్ని పదాలతో.. ఆలోచనాత్మక భావాలను పండించారు.. ‘నానీలు’ ప్రక్రియల్లో మూడు గ్రంథాలను వెలువరించి ముచ్చట తీర్చుకున్న కవి నారాయణరెడ్డిగారు పూర్తి స్థాయి వచన కవితా సంపుటితో.. మన ముందుకు రావాలని కోరుకుందాం.. ఆ దిశలో ఆయన అడుగులు వేస్తారని ఆశిద్దాం.

-దాస్యం సేనాధిపతి 9440525544