పఠనీయం

కమనీయ దృశ్యకావ్యమే కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకెళ్ళ నాటికలు
(మొదటి సంపుటం)-
ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ,
వెల:రూ.300/-
ప్రచురణ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత
మరియు సంస్కృతి సమితి,
దుర్గాపురం, విజయవాడ- 520 003
*
ఆకెళ్ళ అనగానే ‘స్వాతిముత్యం’ వంటి జాతీయ ఆవార్డులు పొందిన సినిమాల రచయితగానే ఎందరికో తెలుసు. సినీ రచయిత కాకమునుపే ఆయన కథా రచయితగా రెండు వందలకు పైగా కథలు, నవలా రచయితగా అవార్డులు పొందిన నవలలు రాసినవారు. అంతకన్నా ఎక్కువగా రంగస్థల నాటక రచయితగా విశేష ఖ్యాతిపొందారు. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, పిల్లల నాటకాలు అనేకం రచించి ప్రభుత్వం నుండి పదమూడుసార్లు నంది బహుమతులు పొందేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్నతో సత్కరించింది. యువ రచయితలకు నాటక, సినీ రచనలో మెళకువలు నేర్పగల ఉత్తమ బోధకుడాయన.
ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ ఆయన పూర్తి పేరు. విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆకెళ్ళ నాటకాలు సమగ్రంగా గ్రంథస్థం చేసే బృహత్సంకల్పంతో మొదటి సంపుటం వెలువరించింది. రంగస్థల నటులకు ఇదొక గొప్ప ఉపాయనం. నాటక సంస్థలకు ఒక గొప్ప వరం. ఆయన రచించిన నాటకాలు రంగస్థలంపై ప్రదర్శిస్తూండగా చూడడమంటే జీవితాల్ని కళ్ళముందు కమనీయంగా కట్టించుకోవడమే! ముఖ్యంగా సంభాషణలతో శ్రోతృజన ప్రేక్షకులను రసానంద పరవశులను చేయగల విద్య ఆయన సొంతం. ఈ సంపుటిలో మొత్తం ఎనిమిది నాటకాలున్నాయి. కాకి ఎంగిలి, క్రాస్‌రోడ్స్, ఎయిర్ ఇండియా, ఓం, మూడో పురుషార్థం, అన్నా! జిందాబాద్, ఆరు పిశాచాలు, ఇదొక విషాదం అనే ఎనిమిది నాటకాలూ దేనికదే ఒక విశిష్టతను కలిగింది. పెళ్ళిచూపులనేవి వయసొచ్చిన అమ్మాయిలో ఆశలు రేపి ఆమె మనసును ‘కాకి ఎంగిలి’ చేసిపోవడమే ననిపిస్తారు.
ఆత్మన్యూనతను చెందకుండా అయినవాళ్ళే ఆమెకు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసం కలిగించాలనీ స్ర్తిలు బాగా చదువుకుని, సరైన మగాడు దొరికినప్పుడే పెళ్ళిచేసుకోవాలని ప్రబోధిస్తారు.
ఇక ‘క్రాస్‌రోడ్స్’ నాటకం వివాహానంతరం స్ర్తి ఎలా తాళికట్టినవాడిమీద ఆధారపడిపోతుందో, బ్రతుకు ముళ్ళమాట అయినా సంతానం కలిగితే ఎలా ఆ ఊబినుంచి బయటపడలేదో చిత్రించారు. ‘ఎయిర్ ఇండియా’ నేటి తల్లిదండ్రులకు పిల్లను విదేశీ సంబంధం చేయాలని పెరిగిపోతున్న మోజునూ, ఆ మోజులో ఆడపిల్ల మోసపోతున్న సందర్భాల ఆర్తిని చిత్రించిన నాటకం. సంప్రదాయాలకు- ఆధునికతకు మధ్య నలుగుతూ విలువలకోసం తపిస్తూ ధర్మయుద్ధం చేసిన ఓ కుటుంబం కథ ‘ఓం’ నాటకంగా రూపొందించారు. పశువే గడ్డి తిని స్వచ్ఛమైన పాలిస్తుంటే మనిషి డబ్బుచ్చుకుని మోసం చేయడం దారుణం! ధర్మార్థ కామ మోక్షాల్లో మూడవదైన కామం కట్టలు తెంచుకుంటే కలిగే అనర్థాన్ని ‘మూడో పురుషార్థం’లో దృశ్యమానం చేశారు. అలాగే చీకటి సామ్రాజ్యాధినేతల వికృత రూపాలను ‘అన్నా! జిందాబాద్’ నాటకంలో నేటి నేర సామ్రాజ్య విచ్చలవిడితనాన్ని బలీయంగా చిత్రించారు. ‘ఆరుపిశాచాలు’ అనే నాటకం అరిషడ్వర్గాల పాలయితే జీవితం యొక్క స్థితిని చూపుతుంది. చావయినా బ్రతుకయినా జీవితానికి ఓ అర్థం పరమార్థం యొక్క ఆవశ్యకతను ‘ఇదొక విషాదం’ నాటకం కళ్ళకు కడుతుంది.
శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు, శ్రీ బి.యం.రెడ్డి, వెంకటేశ్వరరావు, శ్రీ గంగోత్రి సాయి వంటి దిగ్ధంతులైన నట దర్శకుల చేతుల్లో పడి ఈ ఆకెళ్ళ నాటకాలు ఈసరికే తెలుగు నాట ప్రేక్షకులను అలరించాయి. ఆకెళ్ళ రచనా ప్రతిభను స్వయంగా చదివి గ్రహించడానికి, పఠనంతోనే దృశ్య సాక్షాత్కారం చెందడానికీ ఉపకరించే ఉత్తమ నాటక సంకలనం ఈ గ్రంథం. ఆకెళ్ళకు అభినందనలు.

-సుధామ