పఠనీయం

కాలానికి నిలిచిన కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సొరంగంలో పులి
కథాసంపుటి
రచన: ఎం.వి.వి.సత్యనారాయణ,
వెల:రూ.300/-,
ప్రతులకు:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్,
విశాలాంధ్ర బుక్‌హౌజ్ మరియు బ్రాంచీలు
*
ప్రతి 15 సంవత్సరాలకూ అప్పటివరకూ వున్న శాస్త్ర విజ్ఞానం రెట్టింపు అవుతుందని అంచనా! శాస్త్ర విజ్ఞానంతోపాటు సాహిత్యం కూడా అదే వేగంతో మారుతుందనుకోవచ్చును.
ఇటువంటి సందర్భంలో ముప్ఫయి అయిదేళ్ళ క్రితం రాసిన కథలు నేటి పాఠకులను ఆకట్టుకోగలుగుతాయా?
కథకులు ఎం.వి.వి.సత్యనారాయణగారి ‘సొరంగంలో పులి’ కథా సంపుటి చదివాక అవును అనే జవాబు ఇవ్వాల్సి వస్తుంది. సంకలనంలోని 40 కథలూ కాలానికి నిలిచిన కథలు. ఎందుకంటే సమాజం ఎంత మారిపోతున్నప్పటికీ, మారిపోకుండా నిలిచినవి మానవ సంబంధాలు; ప్రేమ, కరుణ, ఆకలి లాంటివి ఆనాడైనా ఈనాడైనా అలాగే ఉన్నాయి. మనిషి మనిషి యెడ కనబరిచే భావోద్వేగాలు మారలేదు. అందుకే ఎం.వి.వి.గారి ఈ కథలు చదువుతోంటే పాఠకుడికి ‘పాచి’ వాసన వెయ్యవు. ‘నిర్ణయం’ కథలోని ‘సహజీవనం’ ఇతివృత్తం వారు ఆనాడే ఊహించారు. ముప్ఫయి ఏళ్ళ క్రితం రాసిన అపరాధ పరిశోధక కథ ఇపుడు చదివినా, ‘టెంపో’ తగ్గదు. (క్షణక్షణం ప్రాణభయం). పైపెచ్చూ ‘డిటెక్షన్’ అంతా ప్రొఫెషనల్స్ వాలి, యుగంధర్‌లు చేయరు. ఆఫీసు గుమాస్తా ప్రశాంత్ చేసి సఫలీకృతుడవుతాడు. సినిమాల్లో వేషాలు దొరకాలంటే, ఆడతారలు ఎన్ని అగచాట్లు భరించాలో ‘మీటూ’లు, ‘కాస్టింగ్ కౌచ్’లు ఏ స్థాయికి దిగజారాలో ఆనాడే రచయిత ధైర్యంగా, కథాపరంగా వివరించారు (వెనె్నల రాత్రి). ఏ సంఖ్య అదృష్టాన్ని చేకూర్చుతుందో, ఆ నమ్మకం పర్యవసానమేమిటో ‘రాత్రి ఎనిమిదింటికి’ అనే కథ చెబుతుంది. కొసమెరుపు కథలు రాయటంలో కూడా ఎం.వి.విగారు దిట్ట. భార్య పెట్టెలోని బట్టల మడతల్లో పరిచయస్తుడి ఉంగరం కనిపిస్తుంది. అప్పటినుండి భర్తలో అనుమానం ‘పెనుభూతం’ అవుతుంది. నిజానికి ఆ ఉంగరం ఆ పరిచయస్తుడు అవసరార్థం తీసుకున్న డబ్బుకు తనఖా! భార్య రజనిమీద అనుమానానికి చదువుతోన్న పాఠకుడూ చలించిపోతాడు. కొసమెరుపున నిజం తెలుసుకుని ‘హమ్మయ్య’ అని విశ్వసిస్తూ, మరో కథికు పేజీ తిప్పుతాడు (పెనుభూతం)
సమాజంలో వెలివేయబడింది రాఘవ (వేశ్య). ఆమె జీవితాన్ని ‘కథ’గా చెప్పటం అందరు రచయితలు అనుసరించే పద్ధతే! కాని ‘అంతరంగం’ కథలో విష్ణుమూర్తి ద్వారా ఎం.వి.వి.గారు రాఘవ జీవితం వర్ణించిన తీరు కొత్తగా, ఎవరూ ఊహించని కోణంలో ఆవిష్కరించటం ఎంతో బావుంది.
సంతానం మీది ప్రేమ వాళ్ళ ఆకలి తీర్చాలనే తాపత్రయంలో పిల్లి పులిలా మారి, తమకు అపకారం తలపెట్టే వారి మీదకు దాడికి వెనుకంజ వేయదు. కారణం- ‘ఆకలి ఎదర పులి కూడా నిలువలేదు’. ఆ జనశూన్య రైల్వేస్టేషన్‌లోని కళాసీ, దూరాన వున్న తన పిల్లల ఆకలి తీర్చటానికి పులిని కూడా లెక్కచేయకుండా బయలుదేరటం పాఠకుడిని నిశే్చష్టుడిని చేస్తుంది.
కథలన్నింటా ఎన్నో గొప్ప సూత్రాలు- ‘మనం బ్రతకాలి. జీవులను బతకనివ్వాలి. ఏ జీవి ఎలా బతకాలో అలాగే బతుకుతుంది. ఇలాగే బతకాలని ఎవరూ శాసించలేరు (మా ఊరి చిరుతలు) కాచి వడపోసిన సత్యాలు, మనో వైజ్ఞానిక విశే్లషణలు. పాఠకుడికి గొప్ప అనుభూతులను పంచుతాయి. అందుకే ఇవి కాలానికి నిలిచిన కథలు. గొప్ప కథలు. మళ్లీ మళ్లీ చదువాలనిపించే కథలు.

-కూర చిదంబరం